breaking news
temple name change
-
శబరిమల ఆలయం పేరు మారింది!
-
శబరిమల ఆలయం పేరు మారింది!
దేశ విదేశాల నుంచి ప్రతియేటా లక్షలాది సంఖ్యలో భక్తులు సందర్శించుకునే అయ్యప్ప ఆలయం పేరు మారింది. ఇన్నాళ్లూ శబరిమల శ్రీ ధర్మ శస్త ఆలయం అని ఉన్న ఈ పేరును.. శబరిమల శ్రీ అయ్యప్పస్వామి ఆలయం అని మారుస్తున్నారు. ఈ విషయాన్ని ఆలయ అధికారులు సోమవారం ప్రకటించారు. ఆలయం పేరు మార్పుపై పాలక మండలి అయిన ట్రావన్కోర్ దేవస్వోం బోర్డు ఉత్తర్వులు కూడా వెలువరించింది. అధికారిక రికార్డులలో ఈ ఆలయం పేరు ఇన్నాళ్లూ శబరిమల శ్రీ ధర్మ శస్త ఆలయం అనే ఉండేది. అక్టోబర్ 5వ తేదీన జరిగిన బోర్డు సమావేశంలో ఆలయం పేరు మార్చాలన్న నిర్ణయం తీసుకున్నట్లు బోర్డు అధికారులు తెలిపారు. దేవస్వోం బోర్డు పరిధిలో చాలా ధర్మశస్త ఆలయాలు ఉన్నాయని, కానీ అయ్యప్పస్వామికి ప్రపంచంలో ఉన్న ఏకైక ఆలయం శబరిమల మాత్రమేనని, అందుకే ఈ ఆలయాన్ని ఆయన పేరుమీద పెట్టాలని నిర్ణయించామని బోర్డు అధికారులు చెప్పారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలతో పాటు కేరళ, తమిళనాడు, కర్ణాటక లాంటి దక్షిణాది రాష్ట్రాల నుంచి, ఇంకా దేశ విదేశాల నుంచి కూడా లక్షలాది మంది భక్తులు ఈ ఆలయాన్ని సందర్శించుకుంటారు. సంక్రాంతి సమయంలో జరిగే జ్యోతి దర్శనానికి అయితే భక్తులు వెల్లువెత్తుతారు.