breaking news
telugutammullu
-
తమ్ముళ్లే స్మగ్లర్లు
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: కంచే చేను మేస్తుందన్న చందంగా ఎర్రచందనం అక్రమరవాణాలో అధికారపార్టీ నేతలే కీలక పాత్ర పోషిస్తున్నారు. అందులో జిల్లాకు చెందిన ఓ ఎమ్మెల్యే.. మరో జెడ్పీటీసీ సభ్యుడు ముఖ్యపాత్ర పోషిస్తుంటే.. వీరికి ఓ గ్రామం గ్రామమే ఎర్రచందనం స్మగ్లింగ్‌కు సహకరిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. చిత్తూరు జిల్లాలో శేషాచలం, వైఎస్సార్ కడప జిల్లాలో లంకమల, ప్రకాశంలో నల్లమల, నెల్లూరు జిల్లాలో వెలుగొండ అటవీ ప్రాంతాల్లో ఎర్రచందనం చెట్లు ఉన్నాయి. అత్యంత విలువైన ఎర్రచందనం సంపదకు అంతర్జాతీయ మార్కెట్లో మంచి డిమాండ్ ఉండటంతో తెలుగుతమ్ముళ్లు వాటిపై దృష్టిపెట్టారు. అధికార బలంతో కొందరు పోలీసులు, మరి కొందరు అటవీ, ఇంకొందరు చెక్‌పోస్టు అధికారులను బెదిరించి దారిలోకి తెచ్చుకున్నట్లు సమాచారం. వారి సహకారంతో ఎర్ర బంగారాన్ని కొల్లగొడుతున్నారు. ఎర్రచందనం అక్రమరవాణే లక్ష్యంగా తమ్ముళ్లు, తమిళనాడుకు చెందిన కొందరు స్మగ్లర్లు బరితెగించారు. చిత్తూరు, వైఎస్సార్ కడప జిల్లాలో పోలీసులు, అటవీశాఖ అధికారులు నిరంతరం కూంబింగ్ నిర్వహిస్తుండటంతో స్మగ్లర్లు రూటు మార్చారు. నెల్లూరు జిల్లా నుంచి ఎర్రచందనం దుంగలను తరలించాలని నిర్ణయించారు. అందులో భాగంగా ఇటీవలకాలంలో నెల్లూరు జిల్లా మీదుగా ఎర్రచందనం అక్రమరవాణా అధికమైందని అధికార వర్గాలు అభిప్రాయం వ్యక్తం చేశారు. వీరికి జిల్లాలోని అధికారపార్టీకి చెందిన ఓ ఎమ్మెల్యే, మరో జెడ్పీటీసీ సభ్యుడు, సర్పంచ్‌లు కొందరు సహకరిస్తున్నట్లు తెలిసింది. స్మగ్లర్లకు సహకరించటంతో పాటు జిల్లాపరిధిలోని వెంకటగిరి, రాపూరు, సోమశిల, సీతారామపురం, ఉదయగిరి అటవీ ప్రాంతాల్లో వేలాది ఎకరాల్లో ఎర్రచందనం చెట్లను నరకటం ప్రారంభించారు. విచ్చలవిడిగా నరికిన ఎర్రచందనం దుంగలను రహస్య ప్రదేశాల్లో దాచి ఉంచినట్లు అధికారవర్గాలు వెల్లడించాయి. అలా దాచి ఉంచిన ఎర్రబంగారాన్ని సరిహద్దులు దాటించేందుకు స్మగ్లర్లు పక్కా ప్రణాళికలు రూపొందించినట్లు విశ్వసనీయ సమాచారం. అధికార బలంతో అక్రమరవాణా టీడీపీ అధికారంలోకి వచ్చీరాగానే కొందరు ఎర్రచందనం అక్రమరవాణాపై దృష్టిసారించి నట్లు తెలుస్తోంది. ఓ గ్రామం మొత్తం ఎర్రచందనం అక్రమరవాణాపైనే ఆధారపడి ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. వీరంతా టీడీపీకి చెందిన ఓ ఎమ్మెల్యే కనుసన్నల్లో నడుచుకుంటారని వెల్లడించారు. ఇతర జిల్లాల నుంచి ఇక్కడ డంప్ చేసిన దుంగలతో పాటు వీరు నరికి దాచి ఉంచిన ఎర్రందనం దుంగలను కలిపి అధికార బలంతో సరిహద్దులు దాటిస్తున్నారని ప్రచారం జరుగుతోంది. అక్రమ రవాణాలో అధికారపార్టీ ఎమ్మెల్యేకు భారీ ఎత్తున ముడుపులు అందుతున్నట్లు అటవీశాఖలో పనిచేసే ఓ అధికారి స్పష్టం చేశారు. ఎవరికీ అనుమానం రాకుండా ఉండేం దుకు అడపాదడపా ఎర్రచందనం దుంగలను పట్టుకుని కేసులు నమోదు చేస్తున్నారని సమాచారం. మరో ముఖ్యమైన విషయమేమిటంటే.. కొద్దిరోజుల క్రితం ఎమ్మెల్యేనే ఎర్రచందనం దుంగలను తన వాహనంలో ఉంచుకుని అనుకున్న స్థావరానికి చేర్చారనే ఆరోపణలు ఉన్నాయి. అలా పలుమార్లు ఎమ్మెల్యేనే తాను ప్రయాణించే కారులోనే ఎర్రచందనం దుంగలను తరలించినట్లు ఓ అటవీ అధికారి వెల్లడిం చటం గమనార్హం. ఎమ్మెల్యే ఎర్రచందనం స్మగ్లింగ్ వ్యవహారం సీఎం వద్దకు కూడా చేరింది. దీనిపై ఆయన ఇంటెలిజెన్స్ రిపోర్టు తెప్పించుకున్నట్లు తెలిసింది. ఈ విషయం తెలుసుకున్న ఆ ఎమ్మెల్యే గుట్టుచప్పుడు కాకుండా జాగ్రత్త పడుతున్నారు. అరెస్టులైనా బయటకు వస్తారు.. రెండు నెలల క్రితం ఎమ్మెల్యే అనుచరులైన ఇద్దరు ప్రధాన స్మగ్లర్లను పోలీసులు అరెస్టు చేశారు. వారిని ఎమ్మెల్యే తన అధికార బలం ఉపయోగించి బయటకు రప్పించారు. ప్రస్తుతం వారు అడవుల్లోనే ఉంటూ స్మగ్లింగ్ పనిలో ఉన్నట్లు సమాచారం. అదేవిధంగా ఎమ్మెల్యే అనుచరుడైన జెడ్పీటీసీ సభ్యుడు ఒకరు తడ పరిధిలోని ఓ మెడికల్ షాపు యజమానికి ఎర్రచందనం సరఫరా చేస్తానని ఒప్పందం కుదుర్చుకున్నారు. ఆ మేరకు కొంత మొత్తాన్ని కూడా తీసుకున్నట్లు తెలిసింది. ఎమ్మెల్యే నియోజకవర్గంలో మొత్తం 374 మంది ఎర్రచందనం స్మగ్లర్లు ఉన్నట్లు పోలీసుల అంచనా. ఆ మేరకు వారిపై కేసులు కూడా నమోదు చేసినట్లు పోలీసు వర్గాలు చెబుతున్నాయి. -
షేమ్.. షేమ్..!
సాక్షి ప్రతినిధి, కడప: ప్రజాప్రతినిధులచే ప్రభుత్వ పథకాలను అమలు చేయడం ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓ భాగం. తద్భిన్నంగా తెలుగుతమ్ముళ్లు నడుచుకుంటున్నారు. రాజ్యాంగ నిబంధనలను తుంగలో తొక్కేయడంలో ముందు వరసలో నిలుస్తున్నారు. నిలవరించాల్సిన అధికార యంత్రాంగం వారికి వత్తాసుగా నిలుస్తోంది. ప్రజల చేత ఎన్నికైన నాయకులను కాదని పచ్చచొక్కాదారులకు పెద్దపీట వేస్తోంది. జన్మభూమి-మాఊరు ప్రభుత్వ కార్యక్రమం అయినప్పటికీ తెలుగుదేశం పార్టీ బహిరంగసభలా వేదిక కన్పిస్తోంది. గ్రామంలో సర్పంచ్, వార్డులో కౌన్సిలర్, డివిజన్లో కార్పొరేటర్ మొదటి పౌరుడు. ఆవిషయం అటు ప్రజలకు, ఇటు అధికారులకు తెలిసిందే. స్థానిక ప్రజాప్రతినిధి నేతృత్వంలోనే ప్రభుత్వ కార్యక్రమం నిర్వహించాల్సి ఉంది. జిల్లా యంత్రాంగానికి ఇవేవీ పట్టడం లేదు. అధికారపార్టీ నేతల మెప్పుకోసం పనిచేస్తే చాలన్నట్లుగా మసులుకుంటోంది. ‘జన్మభూమి- మాఊరు’ ప్రభుత్వ కార్యక్రమాన్ని తెలుగుదేశం పార్టీ సభలా నిర్వహిస్తోంది. తెలుగుదేశం పార్టీ నేతలను వేధికలపైకి ఎక్కించి స్థానిక ప్రజాప్రతినిధుల్ని విస్మరిస్తున్నారు. అదేవిధంగా మంత్రులు పర్యటిస్తే ఎమ్మెల్యేలను సైతం దూరం పెడుతున్నారు. కార్పొరేటర్ నుంచి ఎమ్మెల్యే దాకా.... జన్మభూమిలో కార్పొరేటర్ నుంచి ఎమ్మెల్యే దాకా యంత్రాంగం వివక్షత ప్రదర్శిస్తోంది. జిల్లా కేంద్రమైన కడప గడపలో ఈ దోరణి అధికంగా కన్పిస్తోంది. 1వ డివిజన్లో స్థానిక కార్పోరేటర్‌ను విస్మరించి తెలుగుదేశం పార్టీ నేతలు స్టేజీపై తిష్ట వేశారు. అదే పరిస్థితి పలు డివిజన్లలో కన్పించింది. ప్రజాప్రతినిధులచే కార్యక్రమం నిర్వహించాల్సి ఉంది. అవేవీ పాటించకుండా తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది.. పింఛన్ల పంపిణీకి తామే అర్హులమని ఆపార్టీ నేతలు భావిస్తున్నారని పలువురు పేర్కొంటున్నారు. కార్పొరేటర్లు ఎమ్మెల్యేని కాదని తెలుగుతమ్ముళ్లు పింఛ న్లు పంపిణీ చేస్తున్నారు. రాజ్యాంగ పదవుల్లో ఉన్నవారు సైతం... ఆశ్రీత పక్షపాతానికి తావు లేకుండా రాజ్యాంగాన్ని పరిరక్షిస్తామంటూ ప్రమాణ స్వీకారం చేసిన మంత్రులు సైతం తద్భిన్నంగా వ్యవహరిస్తున్నారు. రాజ్యాంగ విలువలను కాపాడకుండా వివక్షత ప్రదర్శిస్తున్నారు. మంత్రి హోదాలో ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారు. ప్రభుత్వ కార్యక్రమంలో పాల్గొనే మంత్రి స్థానిక ఎమ్మెల్యేకు ఏమాత్రం సమాచారం లేకుండా జన్మభూమి నిర్వహిస్తున్నారు. ఇందుకు రాయచోటి జన్మభూమి కార్యక్రమం నిదర్శనంగా నిలుస్తోంది. ఎమ్మెల్యే శ్రీకాంత్‌రెడ్డికి సమాచారం లేకుండానే అధికారిక కార్యక్రమాన్ని నిర్వహించడంపై ఆయన తీవ్రస్థాయిలో ప్రభుత్వ తీరుపై ధ్వజమెత్తారు. జన్మభూమి-మాఊరు ప్రభుత్వ కార్యక్రమంగా గుర్తించాలని, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, ఎమ్మెలేలు, ఎంపీలకు సమాచారం లేకుండా నిర్వహించరాదని వివరించారు. రాజ్యాంగ విలువలకు అధికారం యంత్రాంగం తిలోదాలు ఇవ్వకుండా కట్టడి చేయాల్సిన బాధ్యత పాలకపక్షంపై ఎంతైనా ఉందని విశ్లేషకులు పేర్కొంటున్నారు.