breaking news
Telugu Association of Greater Orlando
-
తెలుగు అసోసియేషన్ ఆఫ్ గ్రేటర్ ఓర్లాండో (టాగో) ఉగాది సంబరాలు
తెలుగు అసోసియేషన్ ఆఫ్ గ్రేటర్ ఓర్లాండో (టాగో) వారు నిర్వహించిన 2024 ఉగాది వేడుకలలో ప్రముఖ ఆకర్షణగా నిలిచింది "జయంత విజయం" పద్యనాటకం. ఓర్లాండో ప్రవాసాంధ్రులను మంత్రముగ్ధులను చేసింది. మహాభారతంలో అత్యంత కీలకమైన విరాటపర్వం ఘట్టాన్ని కేంద్రీకరించుకుని నాటి, నేటి తరాలను అలరించే విధంగా రూపొందించారు. ఈ రంగస్థల దృశ్యకావ్యం, భారతీయ పురాణాలు, ఇతిహాసాల ధార్మికత్వాన్ని చాటి చెప్పేలా ప్రేక్షకులను అలరించింది. తటవర్తి గురుకులం వారి పద్యకల్పద్రుమంలో భాగంగా, తటవర్తి కళ్యాణ చక్రవర్తి రచించిన ఈ నాటకం, తిక్కన విరాటపర్వంలో పద్యాలను సులభమైన తెలుగు నేపథ్యంతో మేళవించి, సుమారు వేయి మందికి పైగా హాజరైన ప్రేక్షకులను విస్మయులయ్యేలా చేసింది. అత్యంత సందోహ సంతోష సంబరంగా వెలసిన "క్రోధి" నామ సంవత్సర ఉగాది వేడుకలలోప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఓర్లాండో తెలుగు సంఘం అద్యక్షుడు కిశోర్ దోరణాల సమన్వయంతో, చెరుకూరి మధుగారి దర్శకత్వ పర్యవేక్షణలో రూపొందిన ఈ నాటకంలో వెంకట శ్రీనివాస్ పులి, దీకొండ జయశ్రీ, నిడమర్తి కృష్ణ, యఱ్ఱాప్రగడ శాయి ప్రభాకర్, కసిరెడ్డి ఇంద్రసేన, శీలం గోపాల్, నిడమర్తి అరుణ, ఏనపల్లి మహేందర్, దివాకర్ల పవన్ కుమార్ మరియు దివాకర్ల ప్రసూన ముఖ్య పాత్రధారులు కాగా, శ్రీధర్ ఆత్రేయ అందించిన నేపధ్య సంగీతం RJ మామ మహేష్ కర్టెన్ రైజర్ వాయిస్ ఓవర్ ప్రత్యక్ష ఆకర్షణగా నిలిచాయి. -
ప్రవాస పద్యకవి తటవర్తి శ్రీకళ్యాణ చక్రవర్తి
తెలుగు భాషా సౌందర్యం అవగతమయ్యేది ఛందస్సుకి అనుగుణంగా యతిప్రాసలతో విరాజిల్లే పద్య సంపదతోటి. చక్కని పదాలను కూర్చి, గణాలకు సరిపడాపేర్చి, యతి ప్రాసలతో తీర్చిపద్యం వ్రాయటం ఆషామాషీ వ్యవహారం కాదు. అందులోనూ ఆంగ్లమాధ్యమంలోనే చిన్నతనం నుంచి విద్యను అభ్యసించి, తెలుగు పాఠ్యాంశమేలేని ఇంజనీరింగ్ విద్యలో పట్టభద్రుడై, పొద్దున్నలేస్తే ఆంగ్లంతోనే కుస్తీపడే సాఫ్ట్వేర్ ఇంజినీర్ ఉద్యోగం చేస్తున్న కూడా తటవర్తి శ్రీకళ్యాణచక్రవర్తి పద్యాలు అల్లడంలో దిట్ట. అమెరికాలో ఫ్లోరిడాలోని ఓర్లాండోలో నివసిస్తున్నతటవర్తి శ్రీకళ్యాణచక్రవర్తి మనస్సుకు హత్తుకునేలా సద్యఃస్ఫురణతో పద్యాలు వ్రాసే విద్యకూడా ఎంతోచక్కగా అబ్బింది. ఓర్లాండో తెలుగు వారు ఈ యువ కవిని ఆత్మీయంగా అక్కున చేర్చుకుని ప్రోత్సహించటం బంగారానికి మెరుగుఅద్దినట్టయ్యింది. అందుకు ఉదాహరణే 'సరదశ(త)కం' అనే పద్యద్విశతి. కేవలం మూడే నెలల్లో, పెన్ను పేపరు మీద పెట్టకుండా అప్పటికప్పుడు వాట్స్ఆప్ చర్చల్లో ప్రతిస్పందిస్తూ వ్రాసిన పద్యాలే 200 పైచిలుకురావటం గమనార్హం. అవన్నీ ఓర్లాండో మహానగర తెలుగుసంఘం అచ్చు కూడా వేయించింది. తటవర్తి శ్రీకళ్యాణచక్రవర్తి వృత్తిరీత్యా ఒరాకిల్‌లో సీనియర్ సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్నా, ప్రవృత్తి రీత్యా మధురమైనపద్యాలు అల్లే పద్యకవి. ఇంజనీరింగ్ చేస్తున్నప్పుడే 'చక్రి పలుకు' అని ఆట వెలది శతకం వ్రాశారు. ఇప్పటి వరకు వెయ్యి పైచిలుకు పద్యాలు వ్రాసిన సాఫ్ట్వేర్ ప్రోగ్రామర్. టాగో ఉగాది వేడుకల సందర్భంగా 'సరదాగా ఒక సాయంత్రం' అనే సాహిత్య ప్రధాన కార్యక్రమాన్ని ఆరంభించారు. ఆసాహితీచర్చలే 'సరదా శ(త)కం' అనే పద్యద్విశతికి స్ఫూర్తి. సామాజిక, రాజకీయసమకాలీన అంశాలతోపాటూ, భక్తి వైరాగ్యభావాలు, భార్యాభర్తల సరదాకబుర్లు, దేశభక్తి ప్రధానపద్యాలు, సమస్యాపూరణలు, దత్త పదులు, పదికన్నా ఎక్కువ పాదాలు ఉండే మాలికలు, శాక పాకాల మీద దండకాలు ఇలా ఎన్నోఎన్నో విషయాల మీదా బ్రహ్మాండమైన పద్యాలు ఆపుస్తకంలో ఉన్నాయి. టాగో పూర్వాధ్యక్షులు, తెలుగు భాషాభిమానులు అయిన శాయి ప్రభాకర్ యెర్రాప్రగడ, మధుచెరుకూరి, సాంబశివ మంగళంపల్లిలు ఈ కార్యక్రమాన్ని రూపొందించారు. అపర్ణ ధూళిపాళ, రాం ప్రసాద్ నిట్టా, శ్రవణ్ లిజల, నరోత్తంలు ఈ 'సరదాశ(త)కం' పుస్తకావిష్కరణ చేశారు. ఆరెంజ్ కౌంటీ ప్రాపర్టీ అప్రైసర్ రిక్సింగ్, శ్రీకళ్యాణ చక్రవర్తిని శాలువతో సత్కరించారు. టాగో ప్రస్తుత అధ్యక్షులు రమేష్ ఐలా అధ్యక్షతన ఈ పుస్తక ఆవిష్కరణ కార్యక్రమం కన్నుల పండువగా జరిగింది.