breaking news
Telangana writer
-
బతుకును గానం చేసిన కవి
‘మాయమై పోతున్నడమ్మా మనిషి’... అని మనిషి కోసం వెతుకులాడినా ‘కొమ్మ చెక్కితే బొమ్మరా అది కొలిచి మొక్కితే అమ్మరా’... అని ప్రకృతిని ఆరాధించినా ‘జయజయహే తెలంగాణ’ అని తెలంగాణ తల్లికి జ్యోతలు అర్పించినా అందెశ్రీకే సాధ్యం. జనజీవన గాథలను పాటగా మలచిన అమర కవి అందెశ్రీకి నివాళి...పాటల మాగాణంగా వాసికెక్కిన తెలంగాణలో ఒక దిక్కార గొంతుక అందెశ్రీ. అక్షరాలు రాని దశ నుండి ఒక రాష్ట్రానికి రాష్ట్రగీతం అందించే దశకు ఎదిగిన కవి ఆయన. తెలంగాణ నేలన వందలాదిమంది పాటకవులు ఉన్నారు. అందరూ తమ తమ సృజనస్థాయుల్లో కృషి చేశారు. కాని వారిలో అందెశ్రీ తనదైన శైలితో కోట్లాది హృదయాలను గెలుచుకున్నాడు. చదవడం, రాయడం రాకముందే పాటలు అల్లి పాడడం మొదలు పెట్టిన ఆయనది జానపదుల శైలి. ఆ శైలినే మొదట కొనసాగించాడు. తర్వాత తనకు తెలిసిన జీవితాన్ని పాటల్లోకి ఒంపుతూ వెళ్లాడు. అట్లా ఆయన పాటల నిండా తనదైన ముద్ర పరుచుకుని ఉంది.అందెశ్రీ పాటల్లో సామాజిక సమస్యల మీద రాసిన పాటలది సగపాలు. తెలంగాణ ఉద్యమం మీద రాసిన పాటలది సగపాలు. సామాజిక సమస్యల మీద అందెశ్రీ రచించిన పాటల్లో పల్లెతనం ఆవహించుకుని ఉంటుంది. పల్లె బతుకును పాటగా అల్లడం ద్వారా ఆయన ఈ మట్టి మీద, మనుషుల మీద తనకున్న ఎడతెగని ప్రేమ, మమకారాన్ని అక్షరాల్లో చూపిస్తాడు. పూర్వ వరంగల్ జిల్లా మద్దూరు మండలం రేబర్తిలో జన్మించిన అందెశ్రీకి పల్లెను పట్టుకోవడంలో తనదైన దృష్టి ఉంది. తెలంగాణ పల్లెల్లో ఉండే మానవ సంబంధాలను అర్థం చేసుకుని తనకున్న దళిత జీవిత అస్తిత్వం నుండి వాటిని పాటలుగా మలిచాడు. తాను రాసిన ‘సూడా సక్కాని తల్లి, సుక్కల్లో జాబిల్లి’ పాటలో పల్లెల్లో కులవృత్తుల భాగస్వామ్యాన్ని గానం చేశాడు. సబ్బండ కులాలు ఎట్లా గ్రామ స్వరాజ్యంలో పాలుపంచుకుంటాయో వర్ణించాడు. చేతివృత్తులకు శిరస్సు వంచి నమస్కరించాడు. అలాంటి చేతి వృత్తులు గ్లోబలైజేషన్ నేపథ్యంలో విధ్వంసానికి గురైనప్పుడు ఆయనే ‘కొమ్మ చెక్కితే బొమ్మరా...అది కొలిచి మొక్కితే అమ్మరా...’ అంటూ ధిక్కారాన్ని పలికించాడు. అంతర్జాతీయ కుట్రలను ఎండగట్టాడు. ‘భాష మీద దాడి చేసిరిబతుకు మీద దాడి చేసిరి తరతరాలుగా భరతజాతిని బహువిధాలుగ బాధపెడితిరిఎవరి నమ్మకాలు వారివిఎక్కిరించే హక్కులెకడివి?అగ్గికి చెదలెట్ల పడుతది?నిగ్గదీసి అడుగుతున్నా’అంటూ నిలదీశాడు. తెలంగాణ గ్రామాల్లో ఉండే వెనుకబడిన కులాల జీవనం మీద కూడా అందెశ్రీ పాటలు రాశాడు. ‘తలమీద సుట్టా బట్టాఆ పైనా పండ్లా తట్టాపండ్లు పండ్లోయనిపల్లెంత తిరుగుకుంటూబజార్ల కూసోనమ్మిబతుకెళ్ల దీసుకున్నా’అంటూ ‘తెనుగోల్ల ఎల్లమ్మ’ బతుకును పాటల్లో అద్భుతంగా చిత్రించాడు అందెశ్రీ. ఇక మాదిగల సాంస్కృతిక జీవనంలో భాగమైన డప్పు పాత్రను అత్యద్భుతంగా వర్ణించాడు. ‘మాదిగయ్యల మేథ నుండి పురుడు పోసుకున్నదిమానవ జాతులను ఎపుడూ మేలుకొలుపుతుంటది’ అంటూ డప్పు ఇప్పటికీ గ్రామాల్లో పోషించే పాత్రను గొప్పగా ఆవిష్కరించాడు. డప్పు మీద అందెశ్రీ రాసిన ఈ పాట అత్యంత తాత్విక గాఢతను కలిగి ఉంది. ‘ఊరిలో ఏ సావుకైనా ముందే ఉంటానంటది... ఏడుపెందుకు లోకమందున ఎవరు బతుకుతరంటది’ అంటాడాయన ఆ పాటలో తెలంగాణ ఉద్యమంలో అందెశ్రీ రాసిన ఏ పాటకు ఆ పాటే ప్రత్యేకమైంది. ‘సూడు తెలంగాణ సుక్కనీరు లేనిదానా’అంటూ తెలంగాణ అరవయేండ్ల దు:ఖానికి గొంతుకను ఇచ్చి మోసినవాడు అందెశ్రీ. అలాగే ఉద్యమ కాలంలో ‘జై బోలో తెలంగాణ...’ అంటూ తాను రాసిన పాట తెలంగాణ ప్రజానీకాన్ని ఉర్రూత లూగించింది. అందెశ్రీ రాసిన తెలంగాణ పాటల్లో తలమానికమైంది ‘జయజయహే తెలంగాణ...’ పాట. ఈ పాట తెలంగాణ ఉద్యమ కాలంలోనే ప్రజలే దీనిని రాష్ట్ర గీతంగా భావించారు. స్కూళ్లు, ఆఫీసుల్లో ఈ పాటను పాడుకుని దినచర్యను ్రపారంభించారు. అట్లా తెలంగాణ వచ్చిన పదేళ్ల తరువాత అధికారికంగా ఇదే గీతాన్ని రాష్ట్ర గీతంగా తెలంగాణ సర్కార్ ప్రకటించింది. ఈ పాట నుండి తెలం గాణ ఆత్మగౌరవాన్ని ఎలుగెత్తి చాటాడు అందెశ్రీ. ముఖ్యంగా ఇందులో వాడిన భాష పండిత భాష. బాగా చదువుకున్న పండితుల కంటే తాను ఏ మాత్రం తక్కువకాదని నిరూపించుకునేలా ఈ పాటలో పద ప్రయోగాలు చేశాడు.అటు పల్లె పాటలైనా, ఇటు పండిత పాటలైన మెప్పించి, ఒప్పించగలిగే శక్తి ఆయన పాటలకే ఉందంటే అతిశయోక్తి కాదు. అందెశ్రీ రచించిన పాటల్లో ఎక్కువగా పాపులర్ అయిన పాటల్లో ఒకటి ‘మాయమై పోతున్నడమ్మా... మనిషన్నవాడు’ పాట. ఈ పాటలో అందెశ్రీ ఆధునిక కాలంలో మృగ్యమై పోతున్న మానవ విలువల మీద ఒక హెచ్చరిక లాంటి స్వరాన్ని వినిపించాడు. తాను జీవించిన కాలాన్ని పాటతో వెలిగించిన ఈ పాటల ప్రజాకవి, ధిక్కారమే తన చిరునామాగా జీవించాడు. పాట ఉన్నంత కాలం అందెశ్రీకి మరణం లేదు. – డా. పసునూరి రవీందర్,తెలంగాణ భాష సాంస్కృతిక శాఖ సలహామండలి సభ్యులు -
అక్షరాలు దిద్దలేదు.. బడికి వెళ్ళలేదు.. అందెశ్రీ గొప్పతనం ఇదే..
-
కాళోజీ అడుగుజాడల్లో ఎన్నీల ముచ్చట్లు
కరీంనగర్ కల్చరల్, న్యూస్‌లైన్ : వరంగల్‌లో కాళోజీ మిత్రమండలి ఆధ్వర్యంలో జరిగిన విధంగా ప్రతీ పౌర్ణమి వెన్నెల రోజు ఎన్నీల ముచ్చట్లు జరుపుకోవాలని రచయిత బండారి అంకయ్య అన్నారు. బుధవారం కరీంనగర్లో రచయిత అన్నవరం దేవేందర్ ఇంట్లో ఎన్నీల ముచ్చట్ల పేరిట సాహితీవేత్తల మాటా ముచ్చట్లు జరిగాయి. ప్రత్యేక అతిథిగా పాల్గొన్న అంకయ్య ముచ్చటిస్తూ ప్రతీ పౌర్ణమి రోజు సాహితీవేత్త ఇంటి ఆరుబయట వెన్నెల్లో కవులు, రచయితలు సాహితీవేత్తలు ఒక చోట చేరి మాటామంతీ, మంచీచెడ్డ బాగోగులు ముచ్చటించుకోవాలన్నారు. అఖిల భారత తెలంగాణ రచయితల వేదిక అధ్యక్షుడు నలిమెల భాస్కర్ మాట్లాడుతూ కవులందరూ ఒక చోట చేరి ముచ్చటించుకుంటే రచనల్లో సృజనాత్మకత పెరుగుతుందన్నారు. అన్నవరం దేవేందర్ మాట్లాడుతూ వెన్నెల హాయి ప్రకృతిని మరచిపోతున్న తరుణంలో ఆ ప్రకృతి వెన్నెల్లో లీనమై ఆ వెన్నెలను ఆస్వాదిస్తూ ముచ్చటిస్తే ఎన్నో కొత్త విషయాలు ఆవిష్కృతమవుతాయని చెప్పారు. ముచ్చట్లలో తేరావే జిల్లా అధ్యక్షుడు గాజోజు నాగభూషణం, కేఎస్ అనంతాచార్య, అన్నవరం శ్రీనివాస్, తిరుపతి, రమేశ్, అడువాల సుజాత, అన్నవరం సుజాత, మహిపాల్, పల్లం రమేశ్‌తోపాటు కవులు, రచయితలు పాల్గొన్నారు.


