breaking news
Telangana state appointed day
-
ఎన్నాళ్లో వేచిన ఉదయం..
సాక్షి, హైదరాబాద్ : దశాబ్దాల ఎదురుచూపులు ఫలించే తరుణం.. ఏళ్ల తరబడి సాగిన సుదీర్ఘ పోరాటానికి చరమగీతం పాడే సమయం.. కోట్లాదిమంది స్వప్నం సాకారమయ్యే క్షణం.. తెలంగాణ 29వ రాష్ట్రంగా అవతరిస్తున్న వేళ.. అంబరమంటే సంబరానికి తెర లేవనుంది.. ఆ అపురూప దృశ్యాన్ని ‘నభూతో.. నభవిష్యతి’ అన్న రీతిలో జరుపుకోవడానికి నగరం సంసిద్ధమవుతోంది. ఎక్కడ చూసినా విద్యుల్లతలు.. వెలుగుజిలుగులు.. భారీ హోర్డింగులు.. ఎత్తై కటౌట్లు.. రంగుల హంగులు.. ఉత్సవ వేదిక లు.. డీజేలు.. బాజాలు.. వెరసి పండగ వాతావరణం ప్రతిబింబించేలా సిటీని తీర్చిదిద్దేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.ర్యాలీలు, ధూంధాంలు, ఉత్సవాలు, జెండా ఆవిష్కరణలు చేపట్టేందుకు వివిధ సంఘాలు సిద్ధమవుతుండగా.. ఆవిర్భావ దినాన్ని మధురస్మృతిగా పదిల పరుచుకునేందుకు వివాహాల వంటి శుభకార్యాలు ఆ రోజే చేసుకునే హడావుడిలో కొందరు తలమునకలై ఉన్నారు. వెరసి తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం వైభవంగా నిర్వహించేందుకు భారీ కసరత్తు జరుగుతోంది. ‘గ్రేటర్’ ఏర్పాట్లు పార్టీలకతీతంగా తెలంగాణ వాసులంతా ఉత్సవాల్లో భాగస్వాములవుతుండగా, హైదరాబాద్ మహానగరపాలక సంస్థ(జీహెచ్ఎంసీ) సైతం ఉత్సవ ఏర్పాట్లలో ఉత్సాహంగా పాలుపంచుకుంటోంది. ట్యాంక్‌బండ్, నెక్లెస్‌రోడ్డు, పీపుల్స్‌ప్లాజా, గన్‌పార్కు, పరేడ్ గ్రౌండ్.. ఇలా ఉత్సవాలకు వేదికలు కానున్న పలు ప్రాంతాల వద్ద విస్తృతమైన ఏర్పాట్లు చేస్తోంది. వివిధ మార్గాల్లో రహదారులను తీర్చిదిద్దడంతోపాటు, పచ్చదనం పెంపు, డివైడర్లకు రంగులు తదితర కార్యక్రమాల్లో నిమగ్నమైంది. ఆదివారం రాత్రి నుంచి వారం పాటు ఉత్సవాలు నిర్వహించనుంది. పలు ప్రాంతాలు విద్యుద్దీప కాంతులతో వెలుగుపూలు విరజిమ్మనున్నాయి. జీహెచ్ఎంసీలోని సెల్ఫ్‌హెల్ప్ గ్రూప్ మహిళలు సైతం ఈ వేడుకల్లో భాగస్వాములవుతున్నారు. జీహెచ్ఎంసీలోని వివిధ విభాగాల అధికారులకు ఆయా బాధ్యతలు అప్పగించారు. వీరు రహదారులు, పారిశుధ్యం, పచ్చదనం, వీధిదీపాలు, వేదికల ఏర్పాటు తదితర కార్యక్రమాల్లో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. ఆహారపొట్లాలు, మంచినీటి సరఫరా వంటి కార్యక్రమాలకూ ఏర్పాట్లు చేస్తున్నారు. జీహెచ్ఎంసీ కార్యాలయాల్లో అవతరణ ఉత్సవాలు నిర్వహించనున్నారు. తెలుగుతల్లి జంక్షన్, అబిడ్స్ జీపీఓ, రాజ్‌భవన్ రోడ్డు, సీఎం క్యాంపు కార్యాలయం, బంజారాహిల్స్ చెక్‌పోస్టు, ట్యాంక్‌బండ్, సికింద్రాబాద్ క్లాక్‌టవర్, శిల్పారామం, చార్మినార్, అసెంబ్లీ, సచివాలయం, పరేడ్‌గ్రౌండ్ ఇంకా.. ఇంకా పలు ప్రాంతాలు విద్యుల్లతలతో వెలుగులు పంచనున్నాయి. జీహెచ్ఎంసీ కమిషనర్ సోమేశ్‌కుమార్ సీనియర్ అధికారులతో కలిసి శనివారం రాత్రి నందినగర్, బంజారాహిల్స్, గన్‌పార్క్, లేక్‌వ్యూ గెస్ట్‌హౌస్, హైదరాబాద్ పబ్లిక్‌స్కూల్ తదితర ప్రాంతాల్లో రహదారులు.. వీధిదీపాల ఏర్పాట్లు తదితర పనుల్ని తనిఖీ చేశారు. సంబంధిత అధికారులకు తగు సూచనలు జారీ చేశారు. వివిధ జేఏసీల ఆధ్వర్యంలోనూ... వివిధ జేఏసీల ఆధ్వర్యంలోనూ గ్రేటర్‌లోని వివిధ ప్రాంతాల్లో పలు కార్యక్రమాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఆదివారం అర్ధరాత్రి నుంచి గ్రేటర్‌లోని వివిధ ప్రాంతాల్లో జెండా ఆవిష్కరణలు, ధూంధాంలు, బతుకమ్మలు, గాల్లోకి బెలూన్లు, బాణసంచా వెలుగులు ఇతరత్రా కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఫైర్డీలర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పీపుల్స్‌ప్లాజాలో కనీవినీ ఎరుగని రీతిలో వెలుగుపూల బాణసంచా కాల్చనున్నారు. సోమవారం కేసీఆర్ ముఖ్యమంత్రిగా ప్రమా ణం చేశాక నగరంలోని దాదాపు 50 ప్రాంతాల్లోనూ బాణసంచా కాల్చేందుకు ఏర్పా ట్లు చేశారు. కూకట్‌పల్లిలో బతుకమ్మలు, బెలూన్లు.. బాణసంచా తదితర కార్యక్రమాలు నిర్వహించనున్నారు. వరదల నుంచి ఎందరినో కాపాడిన ఉస్మానియా ఆస్పత్రిలోని చింతచెట్టు వద్ద సోమవారం ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. మధురస్మృతిగా మల్చుకునే ప్రయత్నంలో.. ఇవన్నీ ఒక ఎత్తు కాగా.. తెలంగాణ ఆవిర్భావ ఉత్సవాన్ని మరపురాని మధురస్మృతిగా మిగుల్చుకునేందుకు కొందరు నిశ్చితార్ధాలు చేసుకుంటుండగా, మరికొందరు పెళ్లిళ్లకు సిద్ధమయ్యారు. ప్రసవ సమయం దగ్గర పడిన మహిళలు కొందరు జూన్ రెండో తేదీన శిశువులకు జన్మనిచ్చేందుకు ముహూర్తాలు ఖరారు చేసుకున్నారు. ఇలా అన్ని వర్గాలవారు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉత్సవాన్ని మరచిపోని జ్ఞాపకంగా పదిల పరచుకునేందుకు, ఘనంగా నిర్వహించుకునేందుకు సంసిద్ధులై ఉన్నారు. ఆనంద ఘడియల్ని ఆస్వాదించేందుకు ఆత్రంగా ఎదురు చూస్తున్నారు. -
అదిరేలా సంబురాలు
దశాబ్దాల స్వప్నం సాకారమవుతున్న వేళ సంబరాలు అంబరాన్నంటనున్నాయి. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు అట్టహాసంగా.. ఆనందోత్సాహాలతో జరుపుకొనేందుకు అన్ని రాజకీయ పార్టీలు, టీజేఏసీ, ఉద్యోగ సంఘాల నాయకులు సన్నాహాలకు శ్రీకారం చుట్టారు. ఆదివారం రాత్రి నుంచే వేడుకల నిర్వహణకు సన్నద్ధమవుతున్నారు. ఊరూరా.. వాడవాడనా నూతన రాష్ట్ర అవతరణ వేడుకల కోసం అన్నివర్గాల ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఉరుమే ఉత్సాహం.. కొత్త పునరుత్తేజంతో స్వరాష్ట్రానికి స్వాగతం పలకనున్నారు. తాండూరు, న్యూస్‌లైన్ : తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకల ఏర్పాట్లపై తాండూరు నియోజకవర్గంలోని అన్ని ప్రభుత్వ శాఖల ఉద్యోగులు దృష్టి సారించారు. కోట్లాదిమంది తెలంగాణ ప్రజల అరవై ఏళ్ల కల సోమవారం సాకారం కానుంది. ఈ క్రమంలో వేడుకల నిర్వహణకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దాంతో ప్రభుత్వ శాఖలన్నీ తమ కార్యాయాలను అందంగా ముస్తాబు చేయాలని నిర్ణయించాయి. ఇందులో భాగంగా కార్యాలయాలను రంగురంగుల విద్యుద్దీపాలతో అలంకరించనున్నారు. సోమవారం నుంచి వారం రోజుల పాటు ప్రతి శాఖ ఆధ్వర్యంలో సంబురాలు జరుపుకోవడానికి సన్నాహాలు చేసుకుంటున్నారు. తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పనిచేసిన వారితో పాటు విద్యార్థి నాయకులు, కళాకారులు, ఉద్యోగులు, కార్మికులు, జర్నలిస్టులతో సమావేశాలు ఏర్పాటు చేయనున్నారు. అలాగే తెలంగాణ సంప్రదాయం ఉట్టిపడేలా ఆటపాటలతో ధూంధాం కార్యక్రమాలు నిర్వహించాలని ఆయా శాఖల ఉద్యోగులు నిర్ణయించారు. తెలంగాణ పోరాట యోధులు, స్వాతంత్య్ర సమరయోధులను సన్మానించనున్నారు. మహిళలతో ప్రత్యేక కార్యక్రమాలు, ఆటల పోటీలు తదితర కార్యక్రమాలతో వారం రోజులపాటు సంబురాలను ఘనంగా నిర్వహించేందుకు ఉద్యోగులు సన్నాహాలు చేస్తున్నారు.అన్ని శాఖలు కలిసి ఒకసారి సంబురాలు నిర్వహించాలని, ఇందులో ఆయా శాఖల అధికారులందరినీ భాగస్వామ్యం చేయాలని ఉద్యోగులు నిర్ణయించారు. సంబురాలకు తెలంగాణ రాష్ట్ర, జిల్లా స్థాయి నేతలతో పాటు కళాకారులను ఆహ్వానించాలని ఉద్యోగులు యోచిస్తున్నారు. నేటి అర్ధరాత్రి నుంచే తెలంగాణ ఆవిర్భావ సంబరాలు దోమ: తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆదివారం రాత్రి 12గంటలకు పరిగిలోని అమరవీరుల చౌరస్తాలో తెలంగాణ సంబరాలు నిర్వహించనున్నట్లు జిల్లా గెజిటెడ్ అధికారుల సంఘం ప్రధాన కార్యదర్శి హరిశ్చంద్ర, విద్యావంతుల వేదిక జిల్లా ఉపాధ్యక్షుడు నాగేశ్వర్ పేర్కొన్నారు. ఇందులో భాగంగా రాత్రి 12గంటల నుంచి తెల్లవారుజాము వరకు పలు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నామన్నారు. సంబరాలకు నియోజకవర్గ పరిధిలోని అన్ని మండలాలకు చెందిన ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు, తెలంగాణ జేఏసీ నాయకులు, ప్రజలు పెద్ద సంఖ్యలో తరలిరావాలని వారు కోరారు. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో.. తాండూరు రూరల్: ‘తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం’ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సోమవారం సంబరాలు నిర్వహిస్తున్నట్లు ఆ పార్టీ పట్టణ కమిటీ అధ్యక్షుడు నయీం (అప్పు) శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. పట్టణంలోని పార్టీ కార్యాలయంలో ఈ కార్యక్రమం ఉంటుందన్నారు. నియోజకవర్గంలోని కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, పార్టీకి చెందిన మున్సిపల్ కౌన్సిలర్లు, జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, సర్పంచ్‌లు హాజరు కావాలని కోరారు. మార్వాడీ యువమంచ్ ఆధ్వర్యంలో ... తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మార్వాడీ యువమంచ్ ఆధ్వర్యంలో సోమవారం ఉదయం 10 గంటలకు బాలాజీ మందిర్‌లో ‘రక్తదాన శిబిరం’ నిర్వహిస్తున్నట్లు తాండూరు శాఖ అధ్యక్షుడు మహేష్‌కుమార్ సార్థా, కార్యదర్శి కుంజ్ బిహారిసింగ్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. తెలంగాణవాదులు, విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొని రక్తదానం చేసి ప్రాణదాతలుగా నిలవాలని వారు కోరారు.