breaking news
telangana peasant movement celebrations
-
తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో కీలకపాత్ర
ఖమ్మం: తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో తిరుమలాయపాలెం మండలంలోని పిండిప్రోలు కీలకపాత్ర పోషించింది. పుచ్చలపల్లి సుందరయ్య, మంచికంటి రాంకిషన్‌రావు, దేవులపల్లి వెంకటేశ్వరరావు, చండ్ర రాజేశ్వరరావు, భీంరెడ్డి నర్సింహారెడ్డి, మల్లు స్వరాజ్యం, రాయల వెంకటనారాయణ వంటి నేతలెందరో ఇక్కడే అనేక సమావేశాలు నిర్వహించి పోరాటాలకు రూపకల్పన చేశారు. దున్నే వాడిదే భూమి అనే నినాదంతో లక్షలాది ఎకరాలను పేదలకు పంచారు. ఈ గ్రామానికి చెందిన రాయల వెంకటనారాయణ దళ కమాండర్‌గా పనిచేయగా... పులి రామయ్య, రాయల జగ్గయ్య, రాంబాయమ్మ, పద్మనాభుల పుల్లయ్య, దొడ్డా జానకిరామయ్య, దొండేటి నారయ్య, కమ్మకోమటి రంగయ్య, కమ్మకోమటి వీరయ్య, దొడ్డా సీతారాములు, పప్పుల భద్రయ్య తదితరులు తెలంగాణ సాయుధ పోరాటంలో పాల్గొని అమరులయ్యారు. అమరుల త్యాగాలకు గుర్తుగా స్థూపం నిర్మించగా, రాయల వెంకటనారాయణ, పద్మనాభుల పుల్లయ్య పేరిట స్మారక భవనాలు కూడా ఏర్పాటయ్యాయి. ఒకే చితిపై ఏడుగురి దహనం బోనకల్: కట్టుబానిసల్లా పని చేయించుకుని పట్టెడన్నం కూడా పెట్టని నైజాం నవా బులు, భూస్వాములను తుపాకీ పట్టి తరిమికొట్టిన తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట యోధులకు బోనకల్ పురిటిగడ్డగా నిలుస్తుంది. బోనకల్ మండలం చిరునోములకు చెందిన రావెళ్ల జానకీరామయ్య ఆంధ్ర మహాసభ జిల్లా అధ్యక్షుడిగా పనిచేశారు. ఆయన నాయకత్వంలో గోవిందాపురం, లక్ష్మీపురం, తూటికుంట్ల, ముష్టికుంట్ల, పెద్దబీరవల్లి, సీతానగరం, రాయన్నపేటకు చెందిన పలువురు పోరాటంలో పాల్గొన్నారు. లక్ష్మీపురానికి చెందిన మల్లెల వెంకటేశ్వర్లును దళ కమాండర్‌గా, గోవిందాపురానికి చెందిన తమ్మారపు గోవింద్, చుండూరు నర్సింహారావు, జొన్నలగడ్డ రామయ్యను ప్రజానాయకులుగా నియమించుకుని యువకులకు శిక్షణ ఇస్తూ పోరాడారు. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటాన్ని అంతమొందించేందుకు నైజాం నవాబు, రజాకార్లు ఉద్యమకారులపై దాడులు చేసినా పోరాటం ఆపలేదు. దీంతో యోధుల సమాచారం చెప్పాలని ఆళ్లపాడుకు చెందిన యలమందల చంద్రయ్య, మందా అచ్చయ్య, వల్లాపురానికి చెందిన గొర్రెముచ్చుల హజరయ్య, మద్ది రాములు, మడుపల్లి వీరస్వామి, సామినేని గోపయ్య, రేపల్లెవాడకు చెందిన తమ్మినేని బుచ్చయ్యను రేపల్లెవాడ శివార్లలో కాల్చిచంపారు. ఆ తర్వాత గోవిందాపురం ఊరిబయట మంగలి గుట్టపై ఒకే చితిపై దహనం చేశారు. అయినా యోధులు పోరాడి స్వాతంత్య్రం సాధించుకోగా.. వారి త్యాగాలను స్థానికులు గుర్తుచేసుకుంటారు. -
సమస్యల పరిష్కారానికి ప్రభుత్వంపై ఒత్తిడి: సీపీఐ
వచ్చేనెల 11-17 తేదీల్లో తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వారోత్సవాలు సాక్షి, హైదరాబాద్: ప్రజాసమస్యల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని సీపీఐ నిర్ణయించింది. సెప్టెంబర్ 11 నుంచి 17 వరకు తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వారోత్సవాలను నిర్వహించనుంది. డిసెంబర్ 26న పార్టీ 90వ వ్యవస్థాపక దినోత్సవాన్ని నిర్వహించాలని తీర్మానించింది. రెండు రోజుల రాష్ట్ర కౌన్సిల్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. సోమవారం మఖ్దూంభవన్‌లో జరిగిన ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సమావేశంలో పలు నిర్ణయాలు తీసుకున్నారు. వచ్చే నెల 2న జరగనున్న దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో అన్ని కార్మిక సంఘాలతో కలసి పాల్గొనాలని నిర్ణయించింది. ఎస్సీలతోపాటు గిరిజనులకు 3ఎకరాల భూపంపిణీ చేయాలని, పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేయాలని డిమాండ్ చేసింది. సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ మాట్లాడుతూ.. పదవిని కాపాడుకోవడానికే ఏపీ సీఎం చంద్రబాబు పాకులాడుతున్నారని ధ్వజమెత్తారు. నిధులు లేవంటూనే రూ.5 కోట్లు పెట్టి తన కోసం బస్సు కొనుగోలు చేశారని, అడుక్కునేవాడు పంచభక్ష పరమాన్నాలు తిన్నట్లుగా బాబు తీరుందని ఎద్దేవా చేశారు. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల సమస్యలను పరిష్కరించకుండా ముఖ్యమంత్రులు చంద్రబాబు, కేసీఆర్‌లను కేంద్ర ప్రభుత్వం తన చెప్పుచేతల్లో పెట్టుకునేందుకు ప్రయత్నిస్తోందన్నారు. ఉద్యోగుల విభజన, నీళ్లు, విద్య వంటి ముఖ్యమైన సమస్యలను పరిష్కరించకుండా తాత్సారం చే స్తోందని విమర్శించారు. తెలంగాణ సీఎం కేసీఆర్ అహంకారపూరిత వైఖరి పరాకాష్టకు చేరిందని నారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. చరిత్రలో ప్రజలు అహంకారాన్ని సహించలేదన్నారు. మాజీ సీఎం ఎన్టీరామారావు విషయంలో ఇది నిరూపితమైందన్నారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి మాట్లాడుతూ రాబోయే రోజుల్లో ప్రజాసమస్యల పరిష్కారానికి ఉద్యమాలను ముమ్మరం చేస్తామన్నారు. కార్మికులు జీతాలు పెంచాలని, పేదలు ఇళ్లు కూల్చొద్దని, మహిళలు చీప్‌లిక్కర్ వద్దని, రైతులు, కూలీలు సమస్యలు పరిష్కరించాలని ఆందోళనలు చేస్తున్నా ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవ హరిస్తోందని విమర్శించారు.