జర్నలిస్టు, టీచర్లను హతమార్చిన అల్కాయిదా
సనా: యెమెన్లో బందీలుగా పట్టుకున్న అమెరికన్ ఫొటో జర్నలిస్టు లూక్ సోమర్స్, దక్షిణాఫ్రికా టీచర్ పీరీ కోర్కీలను అల్కాయిదా ఉగ్రవాదులు హతమార్చారని శనివారం అధికారులు వెల్లడించారు. సోమర్స్ను చంపేస్తామంటూ ఉగ్రవాదులు గురువారం ఓ వీడియోను విడుదల చేశారు.
దీంతో అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా ఆదేశాల మేరకు బందీలను రక్షించేందుకు భద్రతా బలగాలు ఆపరేషన్ చేపట్టగా, అది విఫలం కావడంతో బందీలిద్దరినీ ఉగ్రవాదులు కాల్చిచంపారు. అయితే, వీరిలో పీరీ కోర్కీ ఉగ్రవాదుల చెర నుంచి ఆదివారం విడుదలై దక్షిణాఫ్రికాకు వెళ్లాల్సి ఉండగా, ఈ దారుణం చోటుచేసుకుందని అధికారిక వర్గాలు తెలిపాయి.