breaking news
Tax Dept
-
రూ.5లక్షల పాతనోట్ల డిపాజిట్లపై వీరికి నో వెరిఫికేషన్
న్యూడిల్లీ: ఆదాయ పన్ను శాఖ సీనియర్ సిటిజన్ ఖాతాదారులకు గుడ్ న్యూస్ చెప్పింది. డీమానిటైజేషన్ తరువాత కాలంలో 70 ఏళ్లపైబడిన వారు చేసిన రూ.5లక్షల వరకు పాత నోట్ల డిపాజిట్లపై ఎలాంటి పరిశీలన చేపట్టబోమని ఐటీ శాఖ ప్రకటించింది. అయితే రూ.2. 5 లక్షలకు మించిన ఇతర వ్యక్తిగత డిపాజిట్లపై విచారణ లేదా పరిశీలన ఎప్పటిలాగానే కొనసాగుతుందని స్పష్టం చేసింది. నోట్ల రద్దు తరువాత 70సం.రాల వయసు పైబడిన వారు చేసిన డిపాజిట్లపై వెరిఫికేషన్ చేపట్టబోమని బుధవారం వెల్లడించింది. దీనిపై ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరంలేదని హామీ ఇచ్చింది. నవంబర్ 8 -డిసెంబర్ 30, 2016 మధ్య కాలంలోని డిపాజిట్ల ధృవీకరణకు చాలా స్పష్టమైన మార్గాలను చేపట్టామని అయితే రద్దయిన నోట్లను డిపాజిట్ చేసిన ప్రతి ఒక్కర్నీ ఇబ్బంది పెట్టబోమని స్పష్టంచేసింది. కేవలం పరిశీలన మాత్రమే చేయనున్నట్టు సీనియర్ ఆర్థిక మంత్రిత్వశాఖ అధికారి ఒకరు తెలిపారు. అలాగే 70 సం.రాల లోపు వ్యక్తులు రూ. 2.5 నుంచి రూ. 5 లక్షలవరకు చేసిన డిపాజిట్లపై ఆదాయ పన్నుశాఖ వెబ్ సైట్ లో ఆదాయ ఆధార వివరాలను నమోదు చేస్తే సరిపోతుందన్నారు. అక్కడితో వెరిఫికేషన్ పూర్తవుతుందని పేర్కొన్నారు. ఒకవేళ డిపాజిటర్ ఈ వివరాలను సమర్పించకపోయినా..లేదా ఆదాయ వివరాలతో సరిపోలకపోయినా, అనుమానాస్పదంగా అనిపించినా ఐటీ శాఖ తదుపరి ఇ వెరిఫికేషన్ కు పేర్కొన్నారు. దీనికి మించి ఎలాంటి విచారణ థర్డ్ పార్టీ వెరిఫికేషన్ ఉండబోదని స్పష్టం చేవారు. కాగా అనుమానాస్పద ఖాతాల పరిశీలనకు, నల్లధనం ఏరివేతకు గాను ‘ఆపరేషన్ క్లీన్ మనీ’ కార్యక్రమాన్ని ఆదాయపన్ను శాఖ చేపట్టిన విషయం తెలిసిందే. పెద్ద నోట్ల రద్దు తర్వాత రూ.5 లక్షలకు మించి నగదు జమ అయిన 18 లక్షల మందిని వివరాలు కోరుతూ ఎస్ఎంఎస్లు, ఈ మెయిల్స్‌ను ఆదాయపన్ను శాఖ పంపింది. వీరిలో 6 లక్షల మంది ఈ ఫైలింగ్ పోర్టల్ ద్వారా బదులిచ్చారు. డీమోనిటైజేషన్ తర్వాత భారీ మొత్తాల్లో నగదు జమ అయిన ఖాతాల పరిశీలన సందర్భంగా పన్ను చెల్లింపుదారుల పట్ల గౌరవంగా ప్రవర్తించాలని కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు ఆదేశించింన సంగతి తెలిసిందే. -
ఐటీ రిటర్న్స్ దాఖలు చేయలేదో..ఇక అంతే
పన్ను ఎగవేతదారులపై కొరడా ఝుళిపించిన ఆదాయపు పన్ను శాఖ, ఐటీ రిటర్న్స్ దాఖలు చేయనివారిపై కూడా సీరియస్ గా స్పందించింది. దీనిపై సంబంధిత అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఇన్ కమ్ ట్యాక్స్ రిటర్న్స్ నాన్-ఫైలర్స్ పై అధికమొత్తంలో జరిమానా, విచారణలకైనా వెనుకాడవద్దని ఆఫీసర్లకు ఆదాయపు పన్ను విభాగం ఆదేశించింది. సెక్షన్ 271ఎఫ్ కింద పెనాల్టీ, 276సీసీ కింద ప్రాసిక్యూషన్ ను అమలు చేయబోతున్నట్టు వెల్లడించింది. ఆస్తిపాస్తులను నమోదుచేయని నాన్-ఫైలర్స్ ఎక్కువగా పెరిగిపోతుండటంతో ఆదాయపు పన్ను విభాగం ఈ చర్యలకు ఉపక్రమించింది. 2014లో 22.09లక్షలుగా ఉన్న నాన్-ఫైలర్స్, 2015లో 58.95లక్షలకు పెరిగారని గణాంకాల్లో తెలిసింది. తాజా పన్ను అధికారుల కాన్ఫరెన్స్ లో ఆదాయపు పన్ను శాఖ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. ఆస్తిపాస్తుల వివరాలు తెలపని వారి కోసం నాన్-ఫైలర్స్ మానిటరింగ్ సిస్టమ్(ఎన్‌ఎమ్‌ఎస్)ను అమలు చేయబోతున్నట్టు పేర్కొంది. ఈ ప్రాజెక్టు ద్వారా నాన్ ఫైలర్స్ గుర్తించవచ్చని తెలిపింది. 271సీసీ సెక్షన్ ప్రకారం నేరం రుజువైతే మూడు నెలల నుంచి ఏడేళ్ల వరకు కఠిన కారాగార శిక్షతో పాటు ఫైన్ విధించే అవకాశముంది. అలాగే 271ఎఫ్ కింద పెనాల్టీగా రూ.1000 నుంచి రూ.5000గా విధించనుంది. దీనికి సంబంధించి మరిన్ని మార్గదర్శకాలను ఐటీ శాఖ విడుదల చేసింది.