అగ్రస్థానంలోకి దూసుకొస్తాం
                  
	ఎరిక్సన్  ఇంటర్వ్యూ
	డానిష్ స్టార్ మిడ్‌ఫీల్డర్ క్రిస్టియన్  ఎరిక్సన్ . ఇంగ్లీష్ ప్రీమియర్ లీగ్‌లో టాటెన్ హామ్ హాట్స్పర్కు ప్రాతినిధ్యం వహిస్తున్న ఈ సాకర్ స్టార్... ఈ సీజన్ ట్టు విజయాల్లో కీలకపాత్ర పోషించాడు. అజేయమైన చెల్సీకి బ్రేకులేసిన టాటెన్ హామ్ ఇప్పుడు తదుపరి పోరులో మాంచెస్టర్ సిటీతో సమరానికి సై అంటోంది. ఈ నేపథ్యంలో ఎరిక్సన్  తమ జట్టు విశేషాల్ని ఇలా చెప్పుకొచ్చాడు.
	
	జోరుమీదున్న చెల్సీకి షాకిచ్చారు. ఇప్పుడు ఇదే ఉత్సాహంతో మాంచెస్టర్ సిటీని ఓడిస్తారా?
	మేం ప్రతి మ్యాచ్‌లో బాగా ఆడుతున్నాం. దీంతో మా ఆత్మవిశ్వాసం కూడా పెరుగుతోంది. చెల్సీపై ఫలితం చెప్పుకోదగింది. కానీ ఇక్కడితో ఆగం. తదుపరి మ్యాచ్‌లో 4–0తో గెలవాలనే లక్ష్యంతో ఉన్నాం. కాబట్టి మా జోరు కొనసాగిస్తాం.
	
	టాటెన్ హామ్ టైటిల్ అవకాశాలెలా ఉన్నాయి?
	ఇప్పుడే చెబితే తొందరపాటవుతుంది. ఈ సీజన్ లో ఇంకా ఆడాల్సింది ఎంతో ఉంది. అయితే మా ప్రయాణం సానుకూలంగా సాగుతోందని చెప్పగలను. మా వాళ్లంతా ఫామ్‌లో ఉన్నారు. పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలోకి చేరే సత్తా మా జట్టుకు వుంది.
	
	అయితే త్వరలో చెల్సీని అధిగమిస్తారా? వారిపై గెలిచిన మీరు టైటిల్ రేసులో ఉన్నారనే అనుకుంటున్నారా?
	అధిగమిస్తామనే ఆశిస్తున్నా. కానీ వారు బాగా ఆడుతున్నారు. ఎట్టకేలకు ఈ సీజన్ లో మా జోరుతో వారి జైత్రయాత్రకు బ్రేకులేశాం. దీంతో ఎవరైనా సరే చెల్సీని ఓడించేయొచ్చని మిగతా జట్లు తెలుసుకునేలా చేశాం. వారి మైండ్‌సెట్‌ను మార్చాం. ఇప్పటికైతే మేం మెరుగైన స్థానంలోనే ఉన్నాం. ఇలాగే మా పోరాటాన్ని కొనసాగిస్తాం.
	
	ఆరు గోల్స్ చేసిన మీరు వ్యక్తిగతంగా మీ ఫామ్‌పై సంతృప్తితో ఉన్నారా?
	నిజానికి నేను మరిన్ని గోల్స్ చేయాల్సింది. అయితే మిగతా వాళ్లూ గోల్స్ చేయడానికి సహాయ పాత్ర పోషించినందుకు సంతోషంగానే ఉంది. మా జట్టు విజయాలకు సమష్టిగా కష్టపడినందుకు సంతృప్తిగా ఉంది.