breaking news
Tanishq showroom
-
రూ.4 కోట్ల నగల దోపిడీ వెనుక అసలు కథ..
గాజియాబాద్: యూపీలోని గాజియాబాద్ తనిష్క్ షోరూమ్ చోరీ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. దుకాణంలో పనిచేస్తోన్న వ్యక్తే.. తన ప్రియురాలితో కలిసి ఈ చోరీకి ప్లాన్ చేసినట్లు పోలీసులు తేల్చారు. పెళ్లి కోసం ఆ వ్యక్తి.. గర్ల్‌ఫ్రెండ్‌తో కలిసి రూ.4కోట్ల విలువైన నగలు ఎత్తుకెళ్లాడు. ఈ చోరీ కేసులో ముగ్గురు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారుతనిష్క్ ఉద్యోగి నితిన్ వర్మ (23), అతని ప్రియురాలు కాజల్ వర్మ (22), అతని తండ్రి సంజయ్ వర్మ (52). జూన్ 12న రాజ్ నగర్ డిస్ట్రిక్ట్ సెంటర్లోని తనిష్క్ షోరూమ్ నుండి రూ. 4 కోట్లకు పైగా విలువైన నగలను దొంగిలించినట్లు పోలీసులు నిర్థారించారు. పెళ్లి ఖర్చుల కోసమే ఈ దొంగతనానికి పాల్పడినట్లు పోలీసుల విచారణలో తేలింది.నితిన్ ఆ షోరూమ్‌లో చేరి కేవలం నెల పదిహేను రోజులు మాత్రమే అయింది.. కానీ ఈ కొద్ది సమయంలోనే అతను స్టోర్ భద్రతా ఏర్పాట్లు, అత్యంత విలువైన నగలు ఎక్కడ ఉంచుతారనే విషయాలను తెలుసుకున్నాడు. ఘటనకు ఒక రోజు ముందే కాజల్‌తో తన పెళ్లి నిశ్చయమైందని చెబుతూ స్టోర్ సిబ్బందికి పార్టీ ఇచ్చాడు. ఆ వేడుకలో షోరూమ్ తాళాలు తన వద్దే ఉంచుకునే క్యాషియర్ గౌతమ్ రాజ్‌తో ఎక్కువగా మద్యం తాగిపించాడు. అనంతరం అతన్ని ఇంటి దగ్గర దింపుతానని చెప్పి.. అతని బ్యాగ్ నుండి షోరూమ్ మెయిన్ ఎంట్రన్స్ తాళాన్ని దొంగిలించాడు.మరుసటి రోజు ఉదయం 7 గంటల ప్రాంతంలో నితిన్ తన అనుచరుడితో కలిసి షోరూమ్‌కు వచ్చాడు. వారు దొంగిలించిన తాళంతో షట్టర్ తెరిచి.. ఎలాంటి అనుమానం రాకుండా లోపలికి వెళ్లడం సీసీటివి ఫుటేజీలో రికార్డయింది. డీసీపీ ధవళ్ జైస్వాల్ మాట్లాడుతూ.. ఈ దొంగతనం పూర్తి చేయడానికి కేవలం 25 నిమిషాలు పట్టింది. వారు గ్రౌండ్, సెకండ్, థర్డ్ ఫ్లోర్లను వదిలేసి.. బంగారం, వజ్రాలు, విలువైన రత్నాలు పొదిగిన నగలు ఉన్న ఫస్ట్ ఫ్లోర్‌ను టార్గెట్ చేశారు. నితిన్ లోపలికి వెళ్లినప్పుడు ఓ అనుచరుడు బయట నిలబడి నిఘా ఉంచాడని పోలీసులు తెలిపారు. వారు సుమారు రూ. 4 కోట్ల విలువైన నగలను సర్దుకుని, ఎవరికీ దొరక్కుండా దూరంగా పార్క్ చేసిన వాహనంలో పరారయ్యారు.ఈ దర్యాప్తులో షోరూమ్‌లోని తీవ్రమైన భద్రతా లోపాలు కూడా బయటపడ్డాయి. రూ.50 కోట్లకు పైగా విలువైన నగలు ఉన్నప్పటికీ.. అక్కడ ఎలాంటి అలారం సిస్టమ్ లేదు. రాత్రి వేళల్లో కేవలం ఒకే ఒక్క సెక్యూరిటీ గార్డును నియమించారు. అతను కూడా ఉదయం 7 గంటలకే డ్యూటీ నుంచి వెళ్లిపోయాడు. సీసీటీవీ విజువల్స్‌ను కంపెనీ హెడ్ ఆఫీస్ నుండి నిరంతరం పర్యవేక్షించాల్సి ఉన్నప్పటికీ.. నిందితులు 25 నిమిషాలకు పైగా లోపలే ఉన్నా ఈ చొరబాటును ఎవరూ గమనించలేకపోయారు.నితిన్, కాజల్ కలిసి ఈ దొంగతనానికి ప్లాన్ చేయగా.. దొంగిలించిన నగలను అమ్మడంలో సంజయ్ వర్మ సహాయం చేశాడు. తమకు వైద్య ఖర్చుల కోసం డబ్బు కావాలని అబద్ధాలు చెప్పి నిందితులు కొన్ని నగలను తక్కువ ధరలకే విక్రయించారు. ప్రస్తుతం అధికారులు రూ. 3.1 కోట్ల విలువైన దాదాపు 2 కిలోల బంగారు నగలు, రూ. 6.5 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. -
నయా.. నేరగాళ్లు..!
* ‘ఈజీ మనీ’ కోసం నేరబాట పడుతున్న యువత * 2013లో చిక్కిన వారిలో అత్యధికులు కొత్తవారే.. * 2.8 లక్షల మందిలో 2.4 లక్షల మంది మొదటిసారి అరెస్టు * బాలబాలికల్లోనూ కనిపిస్తున్న నేరప్రవృత్తి సాక్షి, హైదరాబాద్: ఆనంద్, కిరణ్.. సాధారణ యువకులు.. డబ్బు కోసం పక్కదారి పట్టారు. పక్కా స్కెచ్ వేసి హైదరాబాద్‌లోని తనిష్క్ షోరూంలో రూ. 5.97 కోట్ల బంగారం చోరీ చేసి, జనవరిలో అరెస్టు అయ్యారు. పది చోరీలు చేసి మార్చిలో వనస్థలిపురం పోలీసులకు పట్టుబడిన ఇద్దరు దొంగల వయస్సు 17 ఏళ్లలోపే. చిన్న వయస్సులోనే వారు దొంగలుగా మారి, పలు చోట్ల లూటీ చేశారు. టాలీవుడ్లో ఆయనో అసిస్టెంట్ డెరైక్టర్.. కానీ, జల్సాల కోసం దొంగగా మారాడు. ఏప్రిల్‌లో మాదాపూర్ పోలీసులు అతన్ని పట్టుకోవడంతో గుట్టు రట్టయ్యింది. వీరంతా.. తేలిగ్గా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో నేరబాట పట్టినవారే. గతేడాది ఉమ్మడి రాష్ట్రంలో వివిధ నేరాల కింద 2,81,437 మందిని పోలీసులు అరెస్టు చేయగా, అందులో 87.4 శాతం.. అంటే 2,45,916 మందికి ఎలాంటి నేరచరిత్ర లేదు. కొత్తగా దొంగతనాలు చేస్తూ వీరంతా పట్టుపడ్డారు. ఇటీవల విడుదలైన నేషనల్ క్రైం రికార్డ్స్ బ్యూరో(ఎన్సీఆర్బీ) గణాంకాలు ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. కొత్త నేరగాళ్ల సంఖ్యలో ఉమ్మడి రాష్ర్టం దేశంలోనే ఐదో స్థానంలో ఉండడం గమనార్హం. ఈ నయా నేరగాళ్లు పాల్పడుతున్న నేరాల్లో స్నాచింగ్‌లు, వాహన దొంగతనాలు, చోరీలతో పాటు సైబర్ నేరాలూ అధికంగానే ఉంటున్నాయని పోలీసులు చెప్తున్నారు. మారిన జీవన విధానం, సాంకేతిక విప్లవం కారణంగా గడిచిన కొన్నేళ్లుగా ఇలాంటి నేరగాళ్ల సంఖ్య నానాటికీ పెరుగుతోందని అధికారుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. విలాసాలకు బానిసలుగా మారుతున్న ఉన్నత విద్యావంతులు, పెద్ద కుటుంబాలకు చెందిన వారు కూడా నేరాలను వృత్తిగా ఎంచుకుంటున్నారు. సొత్తు సంబంధ నేరాలకు పాల్పడి ఏటా పోలీసులకు చిక్కుతున్న వారిలో 70 శాతానికి పైగా కొత్త వారు ఉండటం దీనికి నిదర్శనం. దారితప్పుతున్న బాల్యం... 2013 సంవత్సరంలో ఉమ్మడి రాష్ర్టంలో మొత్తం 3,133 మంది మైనర్లు వివిధ నేరాల్లో పోలీసులకు చిక్కారు. వీరిలో నిరక్షరాస్యులు, ప్రాథమిక విద్య దశలోని వారే ఎక్కువగా ఉన్నారు. పూర్తిస్థాయిలో బాలల కన్నా, యవ్వనంలో అడుగుపెడుతున్న వారే ఎక్కువగా నేరబాట పడుతున్నారు. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, అనాథలు, సంరక్షకుల వద్ద ఉన్న వారి కంటే తల్లిదండ్రులతో కలసి ఉంటూ నేరాలు చేసిన వారి సంఖ్య ఎక్కువగా ఉండటం. సరైన అజమాయిషీ లేకపోవడం, ప్రేమానురాగాలు చూపకపోవడమే దీనికి కారణమని పోలీసులు చెబుతున్నారు.


