తమ్మారెడ్డి కృష్ణమూర్తి కన్నుమూత
హైదరాబాద్ : ప్రముఖ సినీ నిర్మాత తమ్మారెడ్డి గోపాల కృష్ణమూర్తి (94) సోమవారం హైదరాబాద్‌లో కన్నుమూశారు. నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ...కృష్ణమూర్తి కుమారుడు. సినీ రంగంలో తనకంటూ ఒక ప్రత్యేక ముద్ర కలిగిన కృష్ణమూర్తి 2007లో రఘుపతి వెంకయ్య అవార్డు అందుకున్నారు. బంగారుగాజులు, దత్తపుత్రుడు, లక్షాధికారి, జమిందార్ వంటి పలు విజయవంతమైన చిత్రాలను ఆయన నిర్మించారు. తెలుగు, తమిళంలలో సుప్రసిద్ధ నటీనటులతో పదమూడు చిత్రాలు తీశారు.
కృష్ణమూర్తి కృష్ణా జిల్లా గుడివాడ తాలూకా, చినపాలమర్రులో 1920 అక్టోబరు నాలుగో తేదీన జన్మించాడు. సారథి సంస్థ లో చీఫ్ ఎగ్జిక్యూటివ్‌గా, జనరల్ మేనేజర్‌గా ఎన్నో చిత్రాల నిర్మాణాల్లో పాలుపంచుకున్నారు. హైదరాబాద్‌లో 'సారథి స్టూడియో' ఏర్పాటుకు కృష్ణమూర్తి కృషి చేశారు. ఆయనే దానికి తొలి జనరల్ మేనేజరు. 1962 లో తానే సొంతంగా సినిమాలు తీయాలనే ఉద్దేశంతో రవీంద్ర ఆర్ట్ పిక్చర్స్ ప్రారంభించాడు. గోరా ప్రభావంతో స్వాతంత్ర్య పోరాటంతో పాల్గొన్న కృష్ణమూర్తి ప్రజానాట్య మండలిలో కూడా చురుగ్గా పనిచేశారు. కృష్ణమూర్తి మృతి పట్ల తెలుగు చిత్ర పరిశ్రమ సంతాపం తెలిపింది.