breaking news
tamil nadu assembly elections 2016
-
ఎన్నికలకు ముందు చిక్కుల్లో డీఎంకే!
ఆ పార్టీ అభ్యర్థి వద్ద రెండుకోట్ల సీజ్! చెన్నై: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు కొద్దిరోజుల ముందే ప్రతిపక్ష డీఎంకే పార్టీ చిక్కుల్లో పడింది. ఆ పార్టీ అభ్యర్థి వద్ద, అతని కొడుకు వద్ద ఏకంగా రూ. 2 కోట్లను ఐటీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అరవకురిచి నియోజకవర్గం డీఎంకే అభ్యర్థి కేసీ పళనిచామీ, అతని కేసీపీ శివరామన్ ఇళ్లు, కార్యాలయాలపై పక్కా సమాచారంతో ఆదాయం పన్ను అధికారులు బుధవారం దాడులు నిర్వహించారు. ముందుస్తు సమాచారంతో నిర్వహించిన ఈ దాడుల్లో రూ. 2 కోట్లు లభించాయని, దీంతో ఈ డబ్బు ఎక్కడిది? ఎన్నికల్లో పంచడానికి ఉపయోగిస్తున్నారా? అన్నదానిపై విచారణ జరుపుతున్నట్టు ఎన్నికల అధికారి తెలిపారు. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఐటీ, ఎన్నికల అధికారులు దాడులు ముమ్మరం చేశారు. తమిళనాడులో మంగళవారం వేర్వేరు చోట్ల జరిపిన ఈ దాడుల్లో ఫ్లయింగ్‌స్క్వాడ్ అధికారులు రూ.4.39 కోట్ల నగదు, 28 కిలోల వెండిని స్వాధీనం చేసుకున్నారు. -
'నాకున్న ఆస్తి నా ఇద్దరు భార్యలే'
చెన్నై: తనకున్న ఆస్తి తన ఇద్దరు భార్యలేనని తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, డీఎంకే అధినేత ఎం. కరుణానిధి అన్నారు. తిరువరూర్ అసెంబ్లీ స్థానానికి పోటీ చేస్తున్న ఆయన సోమవారం నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా ఎన్నికల సంఘానికి తన ఆస్తులకు సంబంధించిన వివరాలను సమర్పించారు. తనకు స్థిరాస్తులు, వ్యవసాయ భూములు లేవని ఆయన పేర్కొన్నారు. తనకున్న ఆస్తి ఇద్దరు భార్యలు దయాళు అమ్మాళ్, రాజాత్తి అమ్మాళ్లు మాత్రమేనని తెలిపారు. తన భార్యల ఆస్తుల విలువ రూ.62.99 కోట్లని చెప్పారు. రెండో భార్య రాజాత్తి అమ్మాళ్కు రూ.11.94 కోట్ల అప్పున్నట్లు పేర్కొన్నారు. 2014-15లో తన ఆదాయం రూ. 1.21 కోట్లు మాత్రమేనని, తన చేతిలో ప్రస్తుతం రూ .50 వేలు ఉన్నాయని అఫిడవిట్ లో పేర్కొన్నారు. అయితే తన చరాస్తులు అన్ని కలిపి రూ.13.42 కోట్లుగా చూపించారు. 92 ఏళ్ల కరుణానిధి తిరువరూర్ నుంచి రెండోసారి పోటీ చేస్తున్నారు. తన భార్యల ఆస్తుల విలువ రూ.41.13 కోట్లుగా 2011 ఎన్నికల్లో చూపించారు. -
వైగోకి కోపం.. ఇంటర్వ్యూ నుంచి అవుట్
చెన్నై: ప్రజా సంక్షేమ కూటమి(పీడబ్ల్యూఎఫ్) సమన్వయకర్త, ఎండీఎంకే ప్రధాన కార్యదర్శి వైగోకు కోపం వచ్చింది. న్యూస్ చానల్ ఇంటర్వ్యూలో అడిగిన ప్రశ్నకు కోపం రావడంతో మైక్ తీసేసి బయటకు వెళ్లిపోయారు. పాలిమర్ టీవీ ఛానల్ ప్రతినిధి వైగోతో ఇంటర్వ్యూ చేస్తూ... ప్రజా సంక్షేమ కూటమిని అన్నాడీఎంకే బీ టీమ్ గా పిలవొచ్చా? అధికార పార్టీ నుంచి ఈ కూటమికి రూ.1500 కోట్లు ఇచ్చారనే ప్రచారం జరుగుతోంది కదా? అని ప్రశ్నించారు. దీంతో కోపం తెచ్చుకున్న ఆయన 'నేను ఈ ఇంటర్వ్యూ రద్దు చేసుకుంటున్నాన'ని కాలర్ మైకును తీసేసి వెళ్లిపోయారు. మైకు తొలగించేముందు తన ప్రశ్న పూర్తిగా వినాలని పాలిమర్ టీవీ ఛానల్ ప్రతినిధి కోరినా ఆయన వినిపించుకోలేదు. కాగా, తమ పార్టీపై నిరాధార ఆరోపణలు చేశారంటూ వైగోకు డీఎంకే అధినేత కరుణానిధి శనివారం నోటీసులు పంపారు. తమ కూటమిలో చేరితే రూ.500 కోట్లు, 80 సీట్లు ఇస్తామని విజయకాంత్‌తో డీఎంకే బేరసారాలు ఆడిందని వైగో ఆరోపించిన నేపథ్యంలో నోటీసులు ఇచ్చారు. డీఎంకే లాగానే బీజేపీ సైతం డీఎండీకేతో బేరసారాలు ఆడిందని వైగో చేసిన వ్యాఖ్యలపై బీజేపీ మండిపడింది. వైగో ఆరోపణలు సత్యదూరమని కేంద్ర మంత్రి పొన్‌రాధాకృష్ణన్ కొట్టిపారేశారు. -
నాదంటే నాదంటున్న నగ్మా, కుష్బు
కాంగ్రెస్‌లో కుమ్ములాట ముగిసిన దరఖాస్తుల పర్వం చెన్నై: డీఎంకేతో కూటమి ఖరారైందే అదనుగా ఒకే స్థానం కోసం కాంగ్రెస్ పార్టీలో అప్పుడే కుమ్ములాట మొదలైంది. చెన్నై నగరం మైలాపూర్ అసెంబ్లీ నియోజకవర్గం నాకంటే నాకంటూ మహిళా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి నగ్మా, కాంగ్రెస్ అధికార ప్రతినిధి కుష్బు కుమ్ములాటకు సిద్ధమైనట్లు విశ్వసనీయ సమాచారం. ఈ ఇద్దరూ వెండితెర వేలుపులే కావడం విచిత్రం. చెన్నై మైలాపూర్ నియోజకవర్గాన్ని కూటమి పార్టీల కేటాయించడం డీఎంకేలో అనాదిగా వస్తున్న ఆనవాయితీ. 2001 అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే-బీజేపీ కూటమిగా ఏర్పడగా బీజేపీ అభ్యర్థి కేఎన్ లక్ష్మణన్ మైలాపూర్ స్థానం నుంచి గెలుపొందారు. 2011 అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే, కాంగ్రెస్, పీఎంకే పొత్తులో మైలాపూర్‌ను కాంగ్రెస్‌కే కేటాయించారు. అయితే ఈ స్థానం నుంచి పోటీచేసిన కాంగ్రెస్ అగ్రనేత తంగబాలు పరాజయం పాలయ్యారు. తాజాగా కాంగ్రెస్, డీఎంకేల మధ్య పొత్తును ఇటీవలే గులాంనబీ ఆజాద్ ఖరారు చేయడంతో రెండు పార్టీల నేతలు సీట్ల వెతుకులాటలో పడ్డారు. డీఎంకే సిద్ధాంతం ప్రకారం మైలాపూర్ స్థానం కాంగ్రెస్‌కేనని తేలిపోవడంతో ఇద్దరు నటీమణులు కన్నేశారు. నటి కుష్బు ఇల్లు ఇదే నియోజకవర్గ పరిధిలోని శాంతోమ్‌లో ఉంది. తాను నివాసం ఉంటున్న ప్రాం తం, ఇటీవల చెన్నైని వరదలు ముంచెత్తినపుడు సొంత ఖర్చుతో బాధితులకు సాయం చేయడం వంటి అనుకూలమైన అంశాలు ఉన్నందున కుష్బు కోరుతున్నారు. మైలాపూర్ నుండి కుష్బు పోటీచే సినట్లయితే గెలుపు ఖాయమని ఆమె అనుచరులు సైతం ఆశిస్తున్నారు. అంతేగాక మయిలై అశోక్ అనే కుష్బు అభిమాని ఆమె పేరున కాంగ్రెస్‌కు దరఖాస్తు కూడా దాఖలు చేసి ఉన్నా రు. అలాగే నటి నగ్మా సైతం తన లెక్కలు తాను చెబుతున్నారు. నగ్మా సోదరి జ్యోతిక మైలాపూర్ నియోజవర్గం పరిధిలోని బీసెంట్ నగర్లో కాపురం ఉంటున్నారు. చెన్నైకి వచ్చినపుడల్లా సోదరి ఇంటిలోనే ఆమె ఉంటారు. ఈ కారణాన్ని చూపి మైలాపూర్ కోసం నగ్మా కూడా పట్టుదలతో ఉన్నారు. మైలాపూర్ నుంచి పోటీకి అనుమతివ్వాల్సిందిగా జాతీయ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు షోబా ఓజాను నగ్మా కోరారు. అయితే ఆమె ఇందుకు తిరస్కరించినట్లు సమాచారం. ఈ విషయాన్ని సోనియా, రాహూల్ వద్దకు తీసుకెళ్లి ఒప్పించాలని నగ్మా ప్రయత్నాల్లో ఉన్నారు. మైలాపూర్ స్థానం కోసం పార్టీ పదవికి రాజీనామా చేసేందుకు సైతం నగ్మా సిద్ధమయ్యారు. పార్టీ పరంగా చూసుకుంటే కుష్బు కంటే నగ్మా సీనియర్ నేత. ఒకే స్థానానికి ఇద్దరు మహిళా నేతలు, పైగా ఇద్దరూ వెండితెరను ఏలి ప్రజాబాహుళ్యంలో ప్రచారం ఉన్నవారు కావడంతో రాష్ట్ర కాంగ్రెస్ తలనొప్పిగా మారింది. సత్యమూర్తి భవన్లో సందడి: మైలాపూర్ స్థానానికి పోటీపడుతున్న నగ్మా, కుష్బులు బుధవారం సత్యమూర్తి భవన్లో తమ తమ వర్గంతో సందడి చేశారు. వీరిద్దరితోపాటు టీఎన్‌సీసీ అధ్యక్షులు ఈవీకేఎస్ ఇళంగోవన్ కూడా ఉండి కార్యకర్తల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. కాంగ్రెస్ టిక్కెట్‌పై అసెంబ్లీకి పోటీచేయగోరు అభ్యర్థుల నుంచి దరఖాస్తులు స్వీకరించే కార్యక్రమం ఈనెల 10వ తేదీ నుంచి సత్యమూర్తి భవన్లో సాగుతోంది. డీఎంకే, కాంగ్రెస్‌ల మధ్య పొత్తు కుదరగానే దరఖాస్తు చేసేవారి సంఖ్య పెరిగింది. దీంతో ఈనెల 15వ తేదీతో ముగిసిన గడువును బుధవారం (17వ తేదీ)వరకు పొడిగించారు. ఈ లెక్కన బుధవారం చివరి రోజు కావడంతో పెద్ద సంఖ్య లో కాంగ్రెస్ కార్యకర్తలు సత్యమూర్తి భవన్‌కు చేరుకుని తమ దరఖాస్తులను అందజేశారు. దీంతో దరఖాస్తుల పర్వం ముగిసింది. డీఎంకే అభ్యర్థుల గెలుపుకోసం ప్రచారం చేస్తానని ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో నగ్మా ప్రకటించారు. రెండు అవినీతి పార్టీలు ఏకమయ్యాయంటూ డీఎంకే, కాంగ్రెస్ కూటమిపై డీఎండీకే అధినేత విజయకాంత్ సతీమణి ప్రేమలత విమర్శలు గుప్పించారు. అయితే డీఎండీకే తమ కూటిమిలో చేరుతుందని ఇళంగోవన్ విశ్వాసం వెలిబుచ్చారు. ప్రేమలత వ్యాఖ్యలు పరిగణలోకి తీసుకోం, ఎందుకంటే పార్టీ అధినేత విజయకాంత్ మాత్రమే, ఆయన మాతో వస్తారని నమ్మకం ఉందన్నారు.