breaking news
Taj Mahal Palace Hotel
-
ఆరేళ్లైనా మానని గాయం!
దేశ ఆర్థిక రాజధాని ముంబై మహానగరంలో ముష్కర మూకలు మారణహోమం సాగించి ఆరేళ్లు గడిచింది. పది మంది పాకిస్థాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు మూడు రోజుల పాటు సృష్టించిన నరమేధంలో విదేశీయులతో సహా 166 మంది బలైపోయారు. 300 మంది క్షతగాత్రులయ్యారు. అరేబియా మహాసముద్రం మీదుగా ముంబైలోకి చొచ్చుకొచ్చిన నరరూప రాక్షసులు విధ్వంస రచనకు పాల్పడ్డారు. వాణిజ్య రాజధానిని వాల్లకాడులా మార్చారు. లియోపోల్డ్ కేఫ్, తాజ్‌మహల్ ప్యాలెస్ హోటల్, ట్రైడెంట్ ఒబెరాయ్, నారిమాన్ హౌస్, ఛత్రపతి శివాజీ టెర్మినస్, కామా ఆస్పత్రుల్లో మారణకాండ సాగించారు. 50 గంటల సుదీర్ఘ పోరాటం తర్వాత ఉగ్రవాదులను భారత భద్రతా బలగాలు మట్టుబెట్టాయి. సజీవంగా పట్టుబడిన ఉగ్రవాది అజ్మల్ కసబ్ ను దాదాపు నాలుగేళ్ల పాటు విచారించి 2012 నవంబర్ 21న ఉరితీశారు. ముంబై ముట్టడి జరిగి ఆరేళ్లు గడిచినప్పటికీ ఆ భయానక దృశ్యాలు జాతిజనులకు ఇప్పటికీ వెంటాడుతూనే ఉన్నాయి. దాడుల క్రమం * 2008, నవంబర్ 26వ తేదీ సాయంత్రం అరేబియా మహాసముద్రం మీదుగా ముంబైలోకి కొలాబా తీరంలో చేరుకున్న ఉగ్రవాదులు * తర్వాత మూడు బృందాలుగా విడిపోయి తమ తమ లక్ష్యాల దిశగా అడుగులు వేశారు. * ఉగ్రవాదులు అబ్దుల్ రెహమాన్, అబూ అలీ, అబూ సోహెబ్‌లు కొలాబాలోని లియోపోల్డ్ కేఫ్ వైపు వెళ్లారు. * అబ్దుల్ రెహమాన్ చోటా, ఫహదుల్లాలు ట్రైడెంట్ ఒబెరాయ్ వైపు వెళ్లారు. * నాసిర్ అబూ ఉమర్, బాబర్ ఇమ్రాన్ అలియాస్ అబూ ఆకాశలు నారిమాన్ హౌస్ వైపు వెళ్లారు. * స్మాయిల్ ఖాన్, అబూ ఇస్మాయిల్, అజ్మల్ ఆమిర్ కసబ్‌లు ఛత్రపతి శివాజీ టెర్మినస్, కామా ఆస్పత్రి దిశగా ముందుకుసాగారు. * ఛత్రపతి శివాజీ టెర్మినస్, హోటల్ తాజ్‌మహల్ ప్యాలెస్, హోటల్ ట్రైడెంట్, నారిమాన్ హౌస్, లియోపోల్డ్ కేఫ్, కామా ఆస్పత్రి, వాడిబందర్ తదితర ప్రాంతాల్లో నరమేధం సృష్టించిన ఉగ్రవాదులు * ఉగ్రవాదుల కాల్పుల్లో మహారాష్ట్ర ఏటీఎస్ చీఫ్ హేమంత్ కర్కరే సహా పలువురు పోలీసులు, పౌరులు మృతి * 50 గంటల సుదీర్ఘ పోరాటం తర్వాత భారత భద్రతా బలగాల చేతిలో 9 మంది ఉగ్రవాదుల హతం * నవంబర్ 27వ తేదీ తెల్లవారుజామున గిర్గావ్ చౌపాటీ వద్ద అజ్మల్ కసబ్ అరెస్ట్ * ముఖ్యమంత్రి విలాస్‌రావ్ దేశ్‌ముఖ్ తో కలిసి సంఘటనా స్థలాన్ని సందర్శించిన దర్శకుడు రాంగోపాల్ వర్మ * ముంబై ముట్టడికి వహిస్తూ ముఖ్యమంత్రి విలాస్‌రావ్ దేశ్‌ముఖ్, హోంమంత్రి ఆర్ఆర్ పాటిల్ రాజీనామా * నాలుగేళ్ల న్యాయవిచారణ తర్వాత 2012 నవంబర్ 21న పూణెలోని ఎరవాడ జైల్లో అజ్మల్ కసబ్ కు ఉరిశిక్ష అమలు ముంబై ముట్టడి ఫోటోలు కోసం ఇక్కడ చూడండి -
తాజ్‌మహల్ హోటల్‌పై బ్రిటన్ కోర్టులో దావా
లండన్: భారత వాణిజ్య రాజధాని ముంబైలోని తాజ్‌మహల్ ప్యాలెస్ హోటల్‌పై బ్రిటన్ కోర్టులో దావా దాఖలయింది. 26/11 ముంబై దాడిలో బాధితుడయిన బ్రిటన్ పౌరుడు విల్ పికె(33) ఈ దావా వేశారు. యాజమాన్యం నుంచి తగిన పరిహారం ఇప్పించాలని కోరారు. దీనిపై బ్రిటన్ హైకోర్టు విచారణ ప్రారంభించింది. భద్రతా దళాల ముందస్తు హెచ్చరికలు పట్టించుకోకుండా హోటల్ యాజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహరించినందువల్లే ఉగ్రవాదులు దాడి చేయగలిగారని ఫిర్యాదీ ఆరోపించారు. టాటా గ్రూపుకు చెందిన తాజ్‌మహల్ ప్యాలెస్ హోటల్లో భ్రదత సవ్యంగా లేదని పేర్కొన్నారు. హోటల్లో కేవలం ఒక్క మెటల్ డిటెక్టర్ మాత్రమే ఉందని తెలిపారు. 2008, నవంబర్ 26న ముంబైలో ఉగ్రవాదులు సాగించిన మారణహోమంలో 166 మంది మృతి చెందారు. దాడి సమయంలో విల్ తన స్నేహితురాలు కెలీ డోలితో కలిసి తాజ్‌మహల్ ప్యాలెస్ హోటల్లో ఉన్నారు. ఉగ్రవాదుల దాడి నుంచి వారు ప్రాణాలతో తప్పించుకున్నారు. హోటల్స్‌లో అతిథుల భద్రత గాల్లో దీపంగీ మారిందని విల్ ఆవేదన వ్యక్తం చేశారు. భద్రత విషయంలో హోటల్ యాజమాన్యాలు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని ఆయన ఆకాంక్షించారు.