breaking news
t narasapuram
-
నిండా ముంచిన నిమ్మ
సాక్షి, టి.నరసాపురం(పశ్చిమగోదావరి): ఒకప్పుడు కాసుల వర్షం కురిపించిన నిమ్మ ఇప్పుడు రైతుకు కన్నీళ్లు తెప్పిస్తోంది. మూడేళ్లుగా నిమ్మ రైతులు నష్టాలతో విలవిలలాడుతున్నారు. ఒకప్పుడు ఎకరానికి రూ. లక్ష నుంచి రూ. 2 లక్షల వరకు ఆదాయం పొందిన నిమ్మ రైతుకు నేడు సాగుఖర్చులు కూడా రాని పరిస్థితి.. కోత ఖర్చులు కూడా రావడం లేదని నిమ్మ రైతు వాపోతున్నాడు. కిలో కనీసం రూ. 25 ఉంటేనే లాభం కరోనా దెబ్బతో మూడేళ్లుగా నిమ్మ రైతుకు మార్కెట్లో సరైన ధర లభించడం లేదు. కిలో నిమ్మ ధర రూ. 4 నుంచి రూ. 5 ఉందంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. సగటున కిలో రూ. 25 నుంచి రూ. 30 ఉంటేనే రైతుకు లాభం. ఈ నేపథ్యంలో నిమ్మ పంటను కొనసాగించాలా.. తొలగించాలా అన్నది తేల్చుకోలేని సందిగ్ధంలో రైతులున్నారు. నిమ్మపై విసుగెత్తిన రైతు పామాయిల్ వైపు మొగ్గుతున్నాడు. నిమ్మ సేద్యానికి ఎకరానికి ఎరువులు, తీత, పాదులు చేయడం, ఎరువుల ఖర్చు, నీటి తడులు, కూలీల ఖర్చు వంటివి కలిపి ఎకరానికి రూ.50 వేల వరకు ఖర్చవుతోంది. నాటురకం నిమ్మ, బాలాజీ నిమ్మ, పెట్లూరి నిమ్మలు సేద్యంలో ఉన్నాయి. ఎకరానికి రూ.40 వేల నుంచి రూ. 50 వేలకు కౌలు చెల్లించాలి. ఈ పరిస్థితుల్లో నిమ్మకు ధరలేక కౌలు చెల్లించలేక మధ్యలోనే వదిలేస్తున్నారు. చదవండి: (పరమ పవిత్రం మల్లన్న దివ్య పరిమళ ‘విభూది’) ఏటా 1.93 లక్షల టన్నుల పంట పశ్చిమ గోదావరి జిల్లాలో 9 వేల హెక్టార్లలో నిమ్మ పంట సాగుచేస్తున్నారు. ఏటా 1.93 లక్షల మెట్రిక్ టన్నుల పంట ఉత్పత్తవుతోంది. ఈ పంటంతా జిల్లాలోని ఏలూరు, గోపన్నపాలెం, జంగారెడ్డిగూడెం, ద్వారకాతిరుమల, యాదవోలులోని నిమ్మ మార్కెట్ల ద్వారా ఇతర రాష్ట్రాలకు ఎగుమతవుతోంది. నిమ్మకు ధరలేకపోతే చెట్టుకు కాయను అలాగే వదిలేసే పరిస్థితిలేదు. కాయ కోయకపోయినా రైతు నష్టపోతాడు. దీంతో విధిగా కాయను బయటకు చేర్చాల్సి వస్తోంది. నిమ్మపండును కోయకుండా వదిలేస్తే చెట్ల కిందే రాలి నిమ్మ అక్కడే కుళ్లిపోతుంది. అందులోని సిట్రిక్ యాసిడ్ ప్రభావంతో చెట్టు చనిపోతుంది. దాంతో చెట్టును కాపాడుకోవడానికి నిమ్మకాను కూలీలతో ఏరించి బయట పారబోయాల్సి వస్తోంది. నిమ్మ కిలో రూ. 7 నుంచి రూ. 10 ఉంటే కనీసం కాయ కోసిన ఖర్చు, ఎగుమతి, దిగుమతి ఖర్చు, రవాణా ఖర్చులు వస్తాయి. నిమ్మకు ఏటా రెండు నుంచి మూడు నెలలే డిమాండ్ ఉంటుంది. కరోనా దెబ్బకు ఆ డిమాండ్ కూడా పడిపోయింది. సాగు ఖర్చులు రావడం లేదు గత మూడు సంవత్సరాలుగా నిమ్మ సాగు చేస్తున్న రైతులందరూ ధర లేక నష్టపోతున్నాం. సేద్యం ఖర్చులు కూడా రావడం లేదు. ఏడాదిలో ఎక్కువ కాలం కిలో నిమ్మ రూ.10 లోపే ఉంటోంది. రెండు రోజుల క్రితం నిమ్మ కిలో రూ.4 నుంచి రూ. 5 ధర పలికింది. 50 కిలోల బస్తా కోతకు, రవాణాకు, ఎగుమతి, దిగుమతులకు రూ.350 ఖర్చు అవుతోంది. ఎక్కువసార్లు ఆ ధర కూడా రావడం లేదు. – కాల్నీడి సత్యనారాయణ, నిమ్మరైతు, శ్రీరామవరం కూలీలతో పారబోయిస్తున్నాం నిమ్మకు మార్కెట్ ధర సరిగా లేకపోవడంతో ఏటా నష్టపోతున్నాం. ఎకరానికి రూ. 50 వేల వరకు పెట్టుబడి అవుతోంది. పెట్టుబడి, కోత ఖర్చులు కూడా తిరిగి రావడం లేదు. నిమ్మను చెట్ల కింద వదిలేస్తే చెట్లు చనిపోతాయని కూలీలతో ఏరించి బయట పారబోయాల్సి వస్తోంది. – జబ్బా నాగరాజు, నిమ్మ రైతు, శ్రీరామవరం అనుబంధ పరిశ్రమలతో డిమాండ్ పెంచొచ్చు నిమ్మ అనుబంధ పరిశ్రమలు నెలకొల్పడం ద్వారా డిమాండ్ పెంచుకోవచ్చు. రైతు ఉత్పత్తిదారుల సంఘాల ద్వారా ఎంఎన్సీ కంపెనీలకు సరఫరా చేయడం ద్వారా లాభాలు పొందవచ్చు. – ఎ.దుర్గేష్, ఏడీ, ఉద్యాన శాఖ -
భార్యపై అనుమానంతో..
సాక్షి, పశ్చిమ గోదావరి: ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్తే అనుమానంతో భార్యను హతమార్చిన ఘటన టి.నరసాపురం మండలం మెట్టగూడెంలో జరిగింది. ఈ సంఘటనతో ఒక్కసారిగా మెట్టగూడెం ఉలిక్కిపడింది. వివరాలిలా ఉన్నాయి.. మెట్టగూడానికి చెందిన కోడూరి జీవనజ్యోతి (27)ను ఆమె భర్త మణికంఠ స్వామి టెలిఫోన్ ఛానల్ రాడ్డుతో తలపై కొట్టి హతమార్చాడు. బుధవారం రాత్రి పొద్దుపోయిన తరువాత జీవనజ్యోతి తలపై రాడ్డుతో కొట్టి హతమార్చిన మణికంఠస్వామి జంగారెడ్డిగూడెం పోలీస్‌స్టేషన్‌కు రాత్రి 12.30 గంటల ప్రాంతంలో వెళ్లి లొంగిపోయాడు. జంగారెడ్డిగూడెం పోలీస్‌స్టేషన్ నుంచి రాత్రి 2 గంటల ప్రాంతంలో మృతురాలి సోదరుడు నంద్యాల వరప్రసాద్‌కు ఫోన్ వచ్చింది. మీ బావ మీ అక్కను తలపై కొట్టాడు ఆమె పరిస్థితి ఎలా ఉందో చూసి చెప్పమని పోలీసులు వరప్రసాద్‌కు సమాచారం ఇచ్చారు. దాంతో వరప్రసాద్ చెల్లెలు నివాసం ఉండే ఇంటికి వెళ్లి చూడగా, జ్యోతి రక్తపు మడుగులో పడి ఉంది. వెంటనే 108 వాహనానికి సమాచారం ఇవ్వడంతో వారు వచ్చి జ్యోతి మృతిచెందిందని నిర్ధారించారు. మండలంలోని మధ్యాహ్నపువారిగూడెం గ్రామానికి చెందిన కోడూరి మణికంఠస్వామి టి.నరసాపురం మండలం మెట్టగూడెంకు చెందిన నంద్యాల వెంకటేశ్వరరావు కుమార్తె జీవనజ్యోతిని ఆరేళ్ల క్రితం ప్రేమించి కులాంతర వివాహం చేసుకున్నాడు. వీరికి ఇద్దరు మగపిల్లలు. భార్యభర్తలు ఇద్దరూ తరచూ గొడవలు పడుతూ ఉండేవా రని, తన చెల్లెల్ని బావ మణికంఠ స్వామి కొట్టి చంపాడని మృతురాలి సోదరుడు వరప్రసాద్ ఇచ్చిన ఫిర్యాదుతో టి.నరసాపురం హెచ్‌సీ పి.మహేశ్వరరావు కేసు నమోదుచేశారు. చింతలపూడి సీఐ పి.రాజేష్ ఘటనా స్థలాన్ని పరి శీలించి కేసును దర్యాప్తు చేస్తున్నారు. శవపంచనామాలో డిప్యూటీ తహసీల్దార్ ఎస్కే షకీలున్నీసా పాల్గొన్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం చింతలపూడి తరలించారు. -
నాయనమ్మకు బాలికచే అంత్యక్రియలు
టి.నరసాపురం : ఎవరైనా మరణిస్తే కుమారుడు తలకొరివి పెట్టడం హిందూ సంప్రదాయం. వారసులు ఎవరూ లేకపోవడంతో నాయనమ్ మృతదేహానికి మనుమరాలే అంత్యక్రియలు నిర్వహించిన ఘటన పశ్చిమగోదావరి జిల్లా టి.నరసాపురం మండలం బందంచర్ల గ్రామంలో శుక్రవారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. గ్రామానికి చెందిన వీరంకి వెంకాయమ్మ (48) అనారోగ్యంతో గురువారం మృతి చెందింది. వెంకాయమ్మ భర్త గతంలోనే చనిపోయారు. ఈమెకు ఒక కుమారుడు, ఒక కుమార్తె ఉండగా, కుమారుడు మధు 2002లో ప్రమాదంలో మృతిచెందాడు. అప్పటికి అతని భార్య రాధ గర్భిణి. తండ్రి మరణానంతరం జన్మించిన కుమార్తెకు హిమశ్రీగా నామకరణం చేశారు. హిమశ్రీ, ఆమె తల్లి రాధ బొర్రంపాలెంలో అమ్మమ్మ ఇంటివద్ద ఉంటున్నారు. హిమశ్రీ అదే గ్రామంలో 9వ తరగతి చదువుతోంది. బాలిక నాయనమ్మ వెంకాయమ్మ శుక్రవారం మరణించగా, వారసులెవరూ లేకపోవడంతో ఆమె మనుమరాలు హిమశ్రీ ముందుకొచ్చి అంత్యక్రియలు జరిపించింది.