దర్శకుడు టి. కృష్ణది ఒక చరిత్ర! - దాసరి
‘ఎన్టీఆర్‌ను నటుడిగా పరిచయం చేసిన నిర్మాత సి. కృష్ణవేణి అన్న సంగతి కూడా మర్చిపోయి, వేరెవరి పేరో చెప్పే జనం వచ్చారు. ఇవాళ చరిత్ర కాలగర్భంలో కలిసిపోతోంది. ఇలాంటి పరిస్థితుల్లో అభ్యుదయ చిత్రాలతో చరిత్ర సృష్టించిన దర్శకుడు స్వర్గీయ టి. కృష్ణపై పుస్తకం తీసుకురావడం అభినందనీయం’’ అని సీనియర్ దర్శకుడు దాసరి నారాయణరావు వ్యాఖ్యానించారు. 45 ఏళ్ళ పైగా సినీజర్నలిజంలో కృషి చేస్తున్న సీనియర్ జర్నలిస్టు పసుపులేటి రామారావు రాసిన ‘వెండితెర అరుణకిరణం టి. కృష్ణ’ పుస్తకాన్ని ఆవిష్కరిస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. మూడున్నరేళ్ళుగా తాను రాస్తున్న ఆత్మకథ ఎన్నో చేదు నిజాలతో మహా మహా వాళ్ళ అసలు చరిత్రతో ఉంటుందని దాసరి ఉప్పందించారు.
మూడేళ్ళు... 7 సినిమాలు... 30 ఏళ్ళయినా చిరంజీవి!
కేవలం 3 ఏళ్ళ 3 నెలల్లో ‘నేటి భారతం’, ‘దేశంలో దొంగలుపడ్డారు’, ‘వందేమాతరం’, ‘ప్రతిఘటన’ లాంటి 7 ఆణిముత్యాలు తీసి, మరణించిన 30 ఏళ్ళ తర్వాత ఇప్పటికీ చెప్పుకొనేలా చిరంజీవి కావడం టి. కృష్ణ గొప్పతనమని ఈ సభలో పాల్గొన్న సినీ ప్రముఖులందరూ నివాళులర్పించారు. టి. కృష్ణ గురువైన ‘ప్రజానాట్యమండలి’ నల్లూరి వెంకటేశ్వర్లు సహా సభలో పాల్గొన్న వారంతా కృష్ణతో అనుబంధాన్ని ఆర్ద్రంగా పంచుకొని, పసుపులేటిని అభినందించారు.
ఇప్పటికీ హీరో గోపీచంద్ మొబైల్లో...
3 గంటల పైగా హాలు నిండా జనంతో, ఆత్మీయంగా సాగిన ఈ వేడుకతో టి. కృష్ణ కుమారుడైన హీరో గోపీచంద్ కదిలిపోయి, కన్నీటిని ఆపుకొంటూ మాట్లాడారు. ‘‘‘అర్ధరాత్రి స్వతంత్రం’లో నాన్న నటించిన పాట, సీన్ ఇప్పటికీ నా మొబైల్లో ఉన్నాయి. నటనలో అంతటి తీవ్రతను సాధించాలని, రోజూ వాటిని చూస్తుంటా’’ అన్నారు. ‘టి.కృష్ణ మెమోరియల్ ఫిలిమ్స్’ పెట్టి, గోపీచంద్‌ను తెరకు పరిచయం చేసిన సీనియర్ నిర్మాత ఎం. నాగేశ్వరరావుతో ‘నేటి భారతం’ లాంటి సినిమా చేయాలని సభాముఖంగా గోపీచంద్ వద్ద నారాయణమూర్తి మాట తీసుకోవడం అందర్నీ కదిలించింది.