breaking news
suspends 33 leaders
-
కొరడా
సాక్షి, చెన్నై : లోక్సభ ఎన్నికల్లో డీఎంకే డిపాజిట్లు గల్లంతైన విషయం తెలిసిందే. అన్ని స్థానాల్లోను ఘోర పరాజయం ఎదురు కావడం, కొన్ని నియోజకవర్గాల్లో మూడో స్థానంలోకి పార్టీ పడిపోవడం అధినేత కరుణానిధిని డైలమాలో పడేశాయి. ఓటింగ్ శాతం గణనీయంగా తగ్గడం ఆందోళనలో పడేసింది. ఈ ఎన్నికల్లో పార్టీ నాయకులు అభ్యర్థులకు వ్యతిరేకంగా వ్యవహరించారన్న ఆరోపణలు వచ్చాయి. దీంతో ఆరుగురితో కూడిన ప్రత్యేక కమిటీని రంగంలోకి దించిన కరుణానిధి ఆ కమిటీ ఇచ్చిన నివేదికను సమగ్రంగా పరిశీలించారు. ఆయా నియోజకవర్గాల్లోని అభ్యర్థుల నుంచి నివేదికను రప్పించుకున్నారు. కమిటీ నివేదిక, అభ్యర్థుల నుంచి వచ్చిన నివేదికలను పరిశీలించిన కరుణానిధి పార్టీ నాయకులపై కొరడా ఝుళిపించేం దుకు రెడీ అయ్యారు. క్రమ శిక్షణ చర్య : ఒకే సమయంలో 33 మంది నాయకులపై క్రమ శిక్షణ చర్య తీసుకుంటూ శనివారం సంచలన ప్రకటన చేశారు. పార్టీ ఎంపీ కేపీ రామలింగం, కేంద్ర మాజీ మంత్రి ఎస్ఎస్ పళని మాణిక్యంతో పాటు 33 మందిపై తాత్కాలికంగా వేటు వేశారు. తంజావూరు, ధర్మపురి, తిరుచ్చి, కోయంబత్తూరు జిల్లాల పరిధుల్లోని నాయకులకు క్రమ శిక్షణ వేటులో హెచ్చరిక సంకేతం పంపించారు. ఐదు జిల్లాల కార్యదర్శులను, ఇన్చార్జ్లను, 8 మంది నగర కార్యదర్శులు, మరి కొన్ని పంచాయతీ యూనియన్ల కార్యదర్శులను తాత్కాలికంగా పార్టీ నుంచి బహిష్కరించారు. వారం గడువు : 33 మందిని తాత్కాలికంగా బహిష్కరించిన కరుణానిధి, వారిని శాశ్వతంగా ఎందుకు పార్టీ నుంచి బహిష్కరించ కూడదో చెప్పాలంటూ వివరణ కోరడం విశేషం. వారంలోపు ఆయా నాయకులు ఇచ్చే వివరణ మేరకు శాశ్వత ఉద్వాసన పర్వం ఆరంభం కానున్నది. పూర్తి స్థాయి ప్రక్షాళన తథ్యమని అన్నా అరివాళయం ప్రత్యేక ప్రకటనను విడుదల చేయడం గమనార్హం. -
డీఎంకే నుంచి 33 మందికి ఉద్వాసన
చెన్నై : డీఎంకే నుంచి 33 మంది నాయకులకు తాత్కాలికంగా ఉద్వాసన పలుకుతూ ఆ పార్టీ అధినేత ఎం కరుణానిధి నిర్ణయించారు. తమిళనాడులో జరిగిన లోక్సభ ఎన్నికల్లో డీఎంకే డిపాజిట్లు గల్లంతయ్యాయి. పార్టీ పలు చోట్ల మూడో స్థానానికి దిగజారిపోవడం, ఓటింగ్ శాతం గణనీయంగా తగ్గడాన్ని కరుణానిధి తీవ్రంగా పరిగణించారు. పార్టీలో పూర్తి స్థాయి ప్రక్షాళన లక్ష్యంగా ఓ కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీ గత వారం కరుణానిధికి తన నివేదికను సమర్పించింది. దీని ఆధారంగా పార్టీ నాయకులపై కొరడా ఝుళిపించే పనిలో కరుణానిధి పడ్డారు. శనివారం పార్టీకి చెందిన ఐదు జిల్లాల కార్యదర్శులతో పాటుగా కొన్ని నగర, పంచాయతీ యూనియన్ల కార్యదర్శులు ఇన్చార్జ్లు మొత్తం 33 మందిని తాత్కాలికంగా పార్టీ నుంచి బహిష్కరిస్తున్నట్లు ప్రకటించారు. వారంలోపు వివరణ ఇవ్వాలని, దాని ఆధారంగా శాశ్వత వేటు ఉంటుందన్న సంకేతాన్ని ఇచ్చారు. బహిష్కరణ వేటు పడ్డ వారిలో కేంద్ర మాజీ మంత్రి ఎస్ఎస్ పళని మాణిక్యం, ఎంపీ కేపి రామలింగం ఉన్నారు. పార్టీకి వ్యతిరేకంగా వ్యవహరించినందుకు గాను తన పెద్దకుమారుడు అళగిరిని ఇప్పటికే కరుణానిధి బహిష్కరించిన విషయం తెలిసిందే.