breaking news
suryanarayana swamy
-
9 నిమిషాలు.. అద్భుత దర్శనం
అరసవల్లి, న్యూస్‌లైన్ : అరసవల్లి సూర్యనారాయణస్వామివారి మూలవిరాట్టును మూడో రోజు మంగళవారం ఉదయం భానుడి లేలేత కిరణాలు అభిషేకించాయి. ఈ అద్భుత దృశ్యం 9 నిమిషాల పాటు భక్తులకు కనువిందు చేసింది. ఇంద్ర పుష్కరిణి మీదుగా గాలి గోపురంలోంచి ఆలయ ఆవరణలోకి ప్రవేశించిన సూర్యకిరణాలు తొలుత ధ్వజస్తంభాన్ని తాకాయి. అనంతరం గర్భగుడిలోకి ప్రవేశించి 6.23 గంటల నుంచి 6.31 గంటల వరకు ఆదిత్యుడి మూలవిరాట్టును స్పృశించాయి. ఈ సమయంలో స్వామి బంగారు ఛాయలో దర్శనమిచ్చి భక్తులను సమ్మోహన పరిచారు. అపురూపమైన కిరణ దర్శనం కోసం భక్తులు తెల్లవారుజామున నాలుగు గంటలకే ఆలయం వద్దకు చేరుకున్నారు. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన రెండు క్యూలైన్ల ద్వారా ఉదయం 6 గంటలకు భక్తులను లోపలికి అనుమతించారు. మంగళవారంతో కిరణ దర్శనం ముగిసింది. తొలి రోజు ఆదివారం వాతావరణం అనుకూలించక ఈ దర్శనం లభ్యం కాలేదు. అంతా సానుకూలంగా ఉండటంతో రెండో రోజు సోమవారం లభ్యమైంది. కాగా సోమవారం సాయంత్రం వర్షం పడడంతో కిరణ దర్శనం లభ్యం కాదని అనుకున్నప్పటికీ మంగళవారం ఉదయానికి వాతావరణం అనుకూలించటంతో సూర్యకిరణాలు స్వామివారిని తాకాయి. దాదాపు 2600 మంది భక్తులు కిరణ దర్శనం చేసుకున్నారు. మళ్లీ అక్టోబర్ 1,2,3 తేదీల్లో కిరణ దర్శనం లభ్యమవుతుందని ప్రధానార్చకుడు ఇప్పిలి శంకరశర్మ తెలిపారు. ఆదిత్యుడిని దర్శించుకున్న విశాఖ రూరల్ ఎస్పీ కిరణ స్పర్శ సమయంలో సూర్యనారాయణస్వామివారిని విశాఖపట్నం రూరల్ ఎస్పీ దుగ్గల్ దర్శించుకున్నారు. అనంతరం స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ అర్చకులు స్వామివారి ప్రసాదాన్ని అందజేశారు. -
అద్భుతం.. ఆదిత్యుడి కిరణ దర్శనం
అరసవల్లి, న్యూస్‌లైన్ : ఆరోగ్యప్రదాత అరసవల్లి శ్రీసూర్యనారాయణస్వామివారి ఆలయంలో బుధవారం ఉదయం అద్భుత దృశ్యం ఆవిష్కృతమైంది. స్వామివారి మూలవిరాట్టును లేలేత సూర్యకిరణాలు స్పర్శించాయి. ఉదయం 6:04 నుండి 6:09 వరకు ఐదు నిమిషాలపాటు స్వామివారు బంగారు ఛాయలో భక్తులకు దర్శనమిచ్చారు. ఈ అద్భుత దృశ్యాన్ని వీక్షించేందుకు తెల్లవారుజామున 3 గంటల నుంచే భక్తులు వెల్లువెత్తారు. దీంతో కిరణ దర్శనం కోసం ఏర్పాటు చేసిన రెండు క్యూలైన్లు కిటకిటలాడాయి. దర్శనం లభ్యం కాదేమోనన్న ఆందోళనతో భక్తులు క్యూలైన్ల బారికేడ్ల మీదనుంచి దాటుకెళ్లడంతో స్వల్ప తోపులాట చోటు చేసుకుంది. ధ్వజస్తంభం వద్ద రద్దీ పెరిగి స్వల్ప ఉద్రిక్తత నెలకొంది. ఒకటే ఉత్కంఠ తొలిరోజు మంగళవారం మబ్బుల కారణంగా ఆదిత్యుని కిరణ దర్శనం లభించకపోవటంతో నిరాశ చెందిన భక్తులు, బుధవారం తెల్లవారుజామునే ఆలయం వద్దకు చేరుకున్నారు. ఉదయం 5.40 గంటల వరకు వర్షం పడటంతో రెండోరోజూ నిరాశ తప్పదనుకున్నారు. అయితే 6 గంటల సమయంలో భానుడు ప్రత్యక్షమవటంతో ఉత్కంఠకు లోనయ్యారు. ఐదు నిమిషాలపాటు కిరణదర్శనం లభ్యమవటంతో ఆనందపరవశులయ్యారు. కాగా.. వందలాదిమంది తరలివచ్చినా 150 మందికి మాత్రమే కిరణ దర్శన భాగ్యం లభించింది. ఈ సంద ర్భంగా ఆదిత్యుడిని అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. గురువారంతో కిరణ దర్శనం ముగుస్తుందని ప్రధానార్చకుడు ఇప్పిలి శంకరశర్మ తెలిపారు. అంతా ఆందోళన చెందాం.. ఉదయం చిన్నపాటి వర్షం పడడంతో ఆదిత్యుని కిరణ దర్శనం లభించదేమోనని అంతా ఆందోళన చెందాం. కానీ మబ్బులను దాటుకుంటూ సూర్యుడి లేలేత కిరణాలు స్వామివారి మూలవిరాట్టును తాకాయి. ఈ దృశ్యం ఓ అద్భుతం. భక్తులంతా ఎంతో సంతోషం వ్యక్తం చేశారు. -డబ్బీరు వాసు, ఆలయ పాలకమండలి సభ్యుడు కిరణాభిషేకం అద్భుతం ఆదిత్యుని కిరణాభిషేక దర్శనం నిజంగా అద్భుతం. ఏటా రెండుసార్లు మాత్రమే ఈ దర్శన భాగ్యం భక్తులకు లభిస్తుంది. మూలవిరాట్టును సూర్య కిర ణాలు తాకటం ఆలయ నిర్మాణ కౌశల్యానికి ప్రత్యక్ష నిదర్శనం. ఎక్కువమందికి ఈ దర్శన భాగ్యం లభించేలా ఏర్పాట్లు చేశాం. -పసగాడ రామకృష్ణ, ఆలయ పాలకమండలి సభ్యుడు