విమాన ప్రమాదానికి గురైన జట్టుకే టైటిల్
ఆసిన్సియన్: ఇటీవల కొలంబియాలో విమాన ప్రమాదానికి గురైన బ్రెజిల్ ఫుట్ బాల్ క్లబ్ జట్టుకు కోపా సుడామెరికన్ టైటిల్ అప్పగించేందుకు దక్షిణ అమెరికా ఫుట్బాల్ సమాఖ్య అంగీకరించింది. దాంతో పాటు ఆ జట్టుకు రెండు మిలియన్లు యూఎస్ డాలర్ల ప్రైజ్ మనీని కూడా ఇవ్వనున్నారు. ప్రత్యర్థి జట్టు అట్లెటికో విజ్ఞప్తి మేరకు ఆ టైటిల్ను వారికి ఇవ్వడానికి అంగీకరించిన విషయాన్ని దక్షిణ అమెరికా ఫుట్ బాల్ సమాఖ్య తాజాగా స్పష్టం చేసింది. ఈ విషయాన్ని తాజాగా వెల్లడించిన దక్షిణా అమెరికా ఫుట్ బాల్ సమాఖ్య.. ఈ లీగ్ ఫెయిర్ ప్లే అవార్డును అట్లాటికో జట్టుకు ఇవ్వాలని నిర్ణయించినట్లు పేర్కొంది.
గత కొన్నిరోజుల క్రితం బ్రెజిల్ కు చెందిన చాపీకోయెన్స్ జట్టు ప్రయాణిస్తున్న విమానం కుప్పకూలి పలువురు ఆటగాళ్లు ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. అయితే ఈ జట్టు మెడిల్లిన్ లో జరిగే తొలి అంచె ఫైనల్కు వెళుతున్న సమయంలో ప్రమాదం చోటు చేసుకుంది. తొలి ఫైనల్లో కొలంబియన్ క్లబ్ జట్టు అట్లెటికో జట్టుతో చాపీకోయెన్స్ ఆడాల్సి ఉంది.
ఈ ప్రమాదంలో దాదాపు 71 మంది ప్రయాణికులు అసువులు బాసిన సంగతి తెలిసిందే. ఇందులో 19 ఫుట్ బాల్ ఆటగాళ్లు ప్రాణాలు కోల్పోగా, అతికొద్ది మంది మాత్రమే గాయాలతో బయటపడ్డారు.