breaking news
Subash kapoor
-
రాత్రులు నిద్రపట్టేది కాదు
‘‘ఒక వ్యక్తి తప్పు చేశాడా? లేదా అని నిర్ధారణ కాకముందే తుది నిర్ణయానికి రాకూడదు. తప్పొప్పులు తేలే వరకూ ఒక వ్యక్తి పని కోల్పోవడమే కాకుండా ఏ పని దొరక్కుండా ఖాళీగా ఉండాలా? నా నిర్ణయం ఒకరికి జీవనోపాధి కోల్పోయేలా చేసింది అనే ఆలోచన నాకు చాలా రాత్రులు నిద్రపట్టకుండా చేసింది’’ అని ఆమిర్ ఖాన్ అన్నారు. సంగీత దర్శకుడు గుల్షన్ కుమార్ జీవితం ఆధారంగా ‘మొఘల్’ అనే చిత్రం తెరకెక్కనుంది. ఆమిర్ ఖాన్ టైటిల్ రోల్ పోషించడంతో పాటు నిర్మాణంలోనూ భాగస్వామిగా ఉన్నారు. సుభాష్ కపూర్ దర్శకుడు. అయితే ‘మీటూ’ ఉద్యమంలో భాగంగా సుభాష్ కపూర్‌ౖపై వేధింపుల ఆరోపణలు (గీతికా త్యాగీ ఆరోపించారు) రావడంతో ‘మొఘల్’ నుంచి ఆమిర్ తప్పుకున్నారు. ఇప్పుడు మళ్లీ ఆ ప్రాజెక్ట్‌లో భాగమైనట్టు ప్రకటించారు. ‘‘గతంలో నేను తీసుకున్న నిర్ణయం ఆ సమయానికి సరైనది అనిపించింది. ఇప్పుడు మరోలా అనిపిస్తోంది. నా మనస్సాక్షిని నమ్మి వెళ్తున్నాను. కొందరికి ఈ నిర్ణయం కరెక్ట్‌గా అనిపించకపోవచ్చు. మొన్న మే నెలలో ‘ఐఎఫ్‌టీడీఏ’ (ఇండియన్ ఫిల్మ్ అండ్ టీవీ డైరెక్టర్స్ అసోసియేషన్) నుంచి నాకో లేఖ వచ్చింది. ‘సుభాష్ కపూర్ కేస్ ప్రస్తుతం కోర్ట్‌లో నడుస్తోంది. అప్పుడే అతను దోషి అని ఓ నిర్ణయానికి రావడం సరైనది కాదు. మీ ఆలోచనను మరోసారి సమీక్షించుకోండి’ అన్నది దాని సారాంశం. సుభాష్‌తో పని చేసిన కొందరు మహిళా అసిస్టెంట్ డైరెక్టర్స్, కాస్ట్యూమ్ డిపార్ట్‌మెంట్‌వాళ్లతో నేను, నా భార్య కిరణ్ తన తీరు గురించి మాట్లాడి తెలుసుకున్నాం. వాళ్లు తన గురించి మంచిగా మాట్లాడారు. ఈ విషయాన్ని పరిగణనలోకి తీసుకొని తనెప్పుడూ స్త్రీలతో తప్పుగా ప్రవర్తించి ఉండడు అని చెప్పదలచుకోలేదు. అయినా తన మీద వచ్చిన ఆరోపణలు పని ప్రదేశంలో జరిగినవి కావు. అందుకే ఈ సినిమాలో మళ్లీ భాగమయ్యాను’’ అని ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు ఆమిర్ ఖాన్. ఆమిర్ నన్ను సంప్రదించలేదు: గీతికా 2014లో సుభాష్ కపూర్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలు చేశారు నటి గీతికా త్యాగీ. ఆమిర్ తీసుకున్న తాజా నిర్ణయం గురించి త్యాగీ మాట్లాడుతూ – ‘‘గత ఏడాది ఆమిర్ తీసుకున్న నిర్ణయం (సినిమా నుంచి తప్పుకోవడం) అభినందించదగ్గది. కానీ ఇప్పుడు సుభాష్ గురించి ఆరా తీసినప్పుడు ఆమిర్ ఖాన్‌గారు నన్ను సంప్రదించలేదు. సంప్రదించే ప్రయత్నం చేశారని నా వరకూ రాలేదు. మీరు (ఆమిర్) అంత జాలి చూపించాలనుకున్నప్పుడు రెండువైపుల కథను పరిగణనలోకి తీసుకోవాలి. ఇప్పుడు ఆమిర్ మార్చుకున్న నిర్ణయం వల్ల వేధింపుల గురించి మాట్లాడటానికి ఎవరు ముందుకు వస్తారు? ఆరోపణలు చేసిన తర్వాత నేను కోల్పోయిన పని, పడ్డ బాధ ఎవరికి తెలుసు? మన రూల్స్ మగవాళ్లను కాపాడేందుకు మాత్రమే ఉన్నాయి. అయినప్పటికీ పోరాటాన్ని ఆపను’’ అన్నారు. ‘‘ఒక అమ్మాయి వేధింపులకు గురైనప్పుడు బాలీవుడ్లో ఒక్కరికీ నిద్రపట్టని రాత్రులు ఉండవు ఎందుకో? (ఆమిర్ కామెంట్‌ను ఉద్దేశించి). సుభాష్‌కి మళ్లీ పని కల్పించినప్పుడు బాధితురాలిని ఎవ్వరూ పట్టించుకోరు ఎందుకో? బాలీవుడ్లో వేధించినవారికి సానుభూతి దొరుకుతుంది కానీ అమ్మాయిలకు మాత్రం ఎప్పుడూ దొరకదేంటో.. అర్థం కావడంలేదు’’ అంటూ వ్యంగ్య ధోరణిలో తనుశ్రీ దత్తా విమర్శనాస్త్రాలు సంధించారు. గీతికా త్యాగీ , తనుశ్రీ దత్తా -
మార్పుకి ముందడుగు
‘మీటూ’ అంటూ అన్ని సినీ ఇండస్ట్రీల నుంచి స్త్రీలు తమకు జరిగిన వైధింపుల గురించి బయటకు వచ్చి చెబుతున్నారు. వారి ధైర్యానికి మద్దతు లభిస్తోంది. ఆరోపణలు ఎదుర్కొంటున్న వాళ్లతో ఇకపై కలసి పని చేయబోమని పలువురు స్వచ్ఛందంగా ప్రకటిస్తున్నారు. వికాస్ బాల్‌పై వచ్చిన ఆరోపణల కారణంగా ఆయనతో చేయబోయే ప్రాజెక్ట్ నుంచి వికాస్‌ని తప్పిస్తున్నాం అని అమేజాన్ సంస్థ పేర్కొంది. అలాగే ‘స్టాండప్ కామెడీ’ టీమ్ ఏఐబీ మీద వచ్చిన ఆరోపణల వల్ల హాట్‌స్టార్ తమతో వాళ్ల కాంట్రాక్ట్‌ను రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది. తాజాగా ఈ లిస్ట్‌లోకి బాలీవుడ్ సూపర్ స్టార్ ఆమిర్ ఖాన్ కూడా తోడయ్యారు. ‘థగ్స్ ఆఫ్ హిందోస్తాన్’ సినిమా తర్వాత దర్శకుడు సుభాష్ కపూర్‌తో కలసి ఆమిర్ ఓ సినిమా చేయాల్సి ఉంది. తాజాగా అతని మీద లైంగిక వేధింపుల ఆరోపణలు వినిపించే సరికి ఆ ప్రాజెక్ట్ నుంచి తప్పుకుంటున్నట్టు ఆమిర్ ప్రకటించారు. ఈ విషయాన్ని ట్వీటర్ ద్వారా పేర్కొన్నారు. ఆ సారాంశం ఏంటంటే... ‘‘క్రియేటివ్ ఫీల్డ్‌లో ఉంటూ సామాజిక సమస్యలకు పరిష్కారం వెతకడానికి నటులుగా మేం ప్రయత్నిస్తుంటాం. మా నిర్మాణ సంస్థలో లైంగిక వేధింపులను అస్సలు సహించకూడదనే పాలసీ ఉంది. అంతే సమానంగా తప్పుడు ఆరోపణలను కూడా ప్రోత్సహించం. మేం త్వరలో మొదలుపెట్టబోయే ఓ ప్రాజెక్ట్‌లో ఓ వ్యక్తిపై లైంగిక వేధింపుల ఆరోపణలు ఉన్నాయి అని మాకు తెలిసింది. కేసు లీగల్‌గా నడుస్తున్నందు వలన ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకోవాలనుకుంటున్నాం. పాత తప్పులన్నీ సరిచూసుకొని మార్పువైపు అడుగు వేయడానికి ఇదో ముందడుగు. చాలా ఏళ్లుగా స్త్రీలు లైంగికంగా దోచుకోబడుతున్నారు. ఇది ఆగాలి’’ అని ఆమిర్ భార్య కిరణ్ రావ్, ఆమిర్ పేర్కొన్నారు. ‘ఓ వ్యక్తి’ అని ఆయన పేర్కొన్నది సుభాష్ కపూర్ గురించే అని బాలీవుడ్ టాక్. -
సినీ నటిపై లైంగిక వేధింపుల కేసులో దర్శకుడు అరెస్ట్
ముంబై: సినీ నటిపై లైంగిక వేధింపుల కేసులో బాలీవుడ్ దర్శకుడు సుభాష్ కపూర్‌ను సోమవారం ముంబై పోలీసులు అరెస్ట్ చేశారు. సుభాష్ అతని సహచరుడు ధనీష్ రాజా 2012 మేలో ముంబై శివారు వెర్సొవాలోని తన నివాసానికి వచ్చి తనతో అసభ్యంగా ప్రవర్తించారని పేర్కొంటూ సినీ నటి గీతికా త్యాగి గత ఏప్రిల్‌లో పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన ప్రతిష్టను దెబ్బ తీసేందుకు సుభాష్ ప్రయత్నించాడని కూడా ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ కేసుకు సంబంధించి సోమవారం సుభాష్ కపూర్‌ను అరెస్ట్ చేసి అంధేరి కోర్టులో హాజరుపరిచినట్టు అసిస్టెంట్ పోలీస్ కమిషనర్ సమాధాన్ ధనేదర్ వెల్లడించారు. కాగా, ధనేష్ రాజా పరారీలో ఉన్నాడని ఆయన తెలిపారు. సుభాష్ కపూర్ జాలీ ఎల్ఎల్బీ సినిమాకు దర్శకత్వం వహించగా.. త్యాగి ఆత్మ, వాట్ ద ఫిష్, వన్ బై టు వంటి సినిమాల్లో నటించారు.