breaking news
study wide T-JAC
-
కేసీఆర్ అపాయింట్మెంట్ ఇవ్వలేదు: కోదండరామ్
హైదరాబాద్ : ప్రజల పక్షానే తెలంగాణ జేఏసీ ఉంటుందని ఆ సంస్థ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరామ్ స్పష్టం చేశారు. తెలంగాణ ఐక్య కార్యాచరణ కమిటీ (టీజేఏసీ) బుధవారమిక్కడ సమావేశమై విస్తృతస్థాయిలో చర్చ జరిపింది. సమావేశం అనంతరం కోదండరామ్ మీడియా సమావేశంలో మాట్లాడారు. 'జేఏసీని గ్రామస్థాయి నుంచి బలోపేతం చేస్తాం. దాడుల జరిగినా వెనకడుగు వేసేది లేదు. వ్యవసాయం, కులవృత్తులు, ఓపెన్ కాస్ట్ సమస్యలపై పోరాడుతాం. ఓపెన్ కాస్ట్లకు వ్యతిరేకంగా నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్‌ను ఆశ్రయిస్తాం. నిజాం షుగర్స్ సహా మూతపడ్డ కంపెనీలను తెరిపించాలి. యూనివర్శిటీల సమస్యలపై త్వరలో ఉస్మానియా వర్శిటీలో సెమినార్ పెడతాం. విద్యాసంస్థలపై పోలీసులతో దాడి చేయించడం సరికాదు. మల్లన్న సాగర్ నిర్వాసితులకు అండగా త్వరలో గజ్వేల్‌లో సదస్సు నిర్వహిస్తాం. 2013 భూ సేకరణ చట్టం ప్రకారం పరిహారం చెల్లించాలి. మిషన్ భగీరథ సహా అన్ని కాంట్రాక్ట్‌ల డీపీఆర్‌లను వెబ్ సైట్లో పెట్టాలి. న్యాయమూర్తుల పోరాటానికి సంపూర్ణ మద్దతు. ప్రజా సంక్షేమమే టీజేఏసీ లక్ష్యం. నేను నలుగురికి చెప్పే స్థాయిలో ఉన్న...ఎవరితోనో చెప్పించుకునే స్థితిలో లేను. రెండుసార్లు కేసీఆర్ అపాయింట్మెంట్ కోరినా ఇవ్వలేదు. ఉద్యోగుల జీవితాలు బాగుపడ్డట్టే..ప్రజల జీవితాలు కూడా బాగుపడాలి. నాపై విమర్శలు చేసినవారిలా నాకు ఆ భాష రాదు.' అని కోదండరామ్ వ్యాఖ్యానించారు. -
తెలంగాణ జేఏసీ స్టీరింగ్ కమిటీ భేటీ
హైదరాబాద్ : తెలంగాణ ఐక్య కార్యాచరణ కమిటీ (టీజే ఏసీ) రాష్ట్ర స్టీరింగ్ కమిటీ సమావేశం బుధవారమిక్కడ ప్రారంభమైంది. టీజేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం అధ్యక్షతన హైదరాబాద్‌లోని జేఏసీ కార్యాలయంలో సమావేశం ఆరంభమైంది. టీఆర్ఎస్ ప్రభుత్వంపై కోదండరాం వ్యాఖ్యలు, ఆయనపై మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు ఎదురు దాడి నేపథ్యంలో స్టీరింగ్ కమిటీ సమావేశమైంది. కాగా తెలంగాణ ఏర్పాటై రెండేళ్లవుతున్న నేపథ్యంలో ప్రజల ఆకాంక్షలు, ఆచరణ, ప్రభుత్వ వైఫల్యాలపై లోతుగా అధ్యయనం చేయాలని టీజేఏసీ భావిస్తోంది. ప్రభుత్వ వైఫల్యాలపై అనుసరించాల్సిన వ్యూహంతో పాటు కోదండరాంపై టీఆర్ఎస్ నేతల విమర్శలను ఇందులో ప్రధానంగా చర్చించనుంది. ఈ సమావేశం అనంతరం కోదండరామ్ మీడియాతో మాట్లాడనున్నారు. -
ఎక్కడేం జరుగుతోంది?
♦ రెండేళ్ల పాలనపై టీజేఏసీ విస్తృత అధ్యయనం ♦ కాంట్రాక్టుల కేటాయింపు నుంచి పదవుల దాకా.. ♦ విద్యుత్‌పై ప్రత్యేక దృష్టి.. నిపుణులతో సదస్సులకు యోచన ♦ నేడు జేఏసీ స్టీరింగ్ కమిటీ భేటీ సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఏర్పాటై రెండేళ్లవుతున్న నేపథ్యంలో ప్రజల ఆకాంక్షలు, ఆచరణ, ప్రభుత్వ వైఫల్యాలపై లోతుగా అధ్యయనం చేయాలని టీజేఏసీ భావిస్తోంది. తెలంగాణ ఏర్పాటుకు ముందు ప్రజల ఆకాంక్షలు, రాష్ట్రం ఏర్పాటైన రెండేళ్ల తర్వాత వాస్తవ పరిస్థితులపై అంశాల వారీగా అధ్యయనం చేసే బాధ్యతలను ఆయా రంగాల నిపుణులకు అప్పగించింది. రాష్ట్ర ఏర్పాటుకు ప్రధాన ప్రాతిపదికలుగా నిలిచిన నీళ్లు, నియామకాలు, నిధులు అంశాలనే పునాదిగా చేసుకుని జేఏసీ అధ్యయనం చేస్తోంది. సాగునీటి ప్రాజెక్టుల టెండర్లు, వాటర్‌గ్రిడ్ టెండర్లు, దక్కించుకున్న కంపెనీలు, ఆ కంపెనీల యాజమాన్యాలు వంటి వాటిపైనా ఇప్పటికే స్థూలంగా అధ్యయనం చేసింది. టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత కొనుగోలు చేసిన పోలీసు వాహనాలు, సరఫరా చేసిన కంపెనీలు ఏ ప్రాంతానికి చెందినవనే దానిపైనా అధ్యయనం జరిగింది. పాఠ్యపుస్తకాలను సరఫరా చేసిన కంపెనీల యాజమాన్యాలు, తెలంగాణ ఏర్పాటుకు ముందు, తర్వాత పరిస్థితులపైనా అధ్యయనం జరిగింది. జీహెచ్ఎంసీలో ఇటీవల పంపిణీ చేసిన చెత్త డబ్బాలను తయారు చేసిన కంపెనీ, ధరలు, అవి ఏ ప్రాంతానికి చెందిన కంపెనీలనే అంశాలను పరిశీలించింది. అంచనాల తయారీ, ప్రామాణికాలు, టెండర్ల అర్హతలకు ప్రాతిపదిక, పారదర్శకత, కాంట్రాక్టు దక్కించుకున్న కంపెనీలు, వాటి యాజమాన్యాలు, తెలంగాణ ప్రాంతానికి దక్కిన పనులు వంటివాటిపై లోతుగా చేసిన అధ్యయనంలో నివ్వెరపోయే వాస్తవాలు వెల్లడైనట్టుగా జేఏసీ కీలక నాయకుడొకరు పేర్కొన్నారు. వీటితో పాటు ఇప్పటిదాకా టీఆర్ఎస్ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలపై అధ్యయనం జరుగుతోంది. దళితులకు మూడెకరాల భూమి, ఇప్పటిదాకా ఎంతమందికి భూమి దక్కింది, ఎన్ని ఎకరాలను పంపిణీ చేసిందనే విషయంపై ఒక దళిత ప్రొఫెసర్‌కు బాధ్యతలను అప్పగించారు. కేజీ టు పీజీ, ఉద్యోగ నియామకాలు, రైతు రుణమాఫీ, వ్యవసాయ అనుబంధ సమస్యలపైనా అధ్యయనం చేసే బాధ్యతలను విద్యా, రైతు సంఘాల నేతలకు అప్పగించారు. ఇలాంటి ప్రధానమైన హామీలు, అమలు, తెలంగాణేతర సంస్థల పెత్తనాన్ని కొనసాగించే రంగాల్లోనూ లోతుగా అధ్యయనం జరుగుతోంది. విద్యుత్ ఒప్పందాలను చర్చకు తెద్దాం.. రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా చేపట్టిన విద్యుత్ ప్రాజెక్టులపై జేఏసీ ప్రత్యేక అధ్యయనం చేస్తోంది. ఈ ప్రాజెక్టుల వల్ల ప్రజలపై పెను భారం పడే ప్రమాద ం ఉందని, దీనిపై నిపుణులతో ప్రత్యేక సెమినార్లు ఏర్పాటు చేయాలని భావిస్తోంది. ఇది వరకే జేఏసీ తరఫున విద్యుత్ ఒప్పందాలపై రాష్ట్ర ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేసింది. లోపభూయిష్టంగా ఉన్న ఒప్పందాలను చర్చకు తీసుకురావాలని నిర్ణయించింది. ముఖ్యంగా విద్యుత్ ఒప్పందాల వల్ల కలిగే నష్టాలను ప్రజానీకానికి అర్థమయ్యేలా వివరించాలనుకుంటోంది. అందుకు అనుగుణంగా మణుగూరు పవర్‌ప్లాంట్ వల్ల కలిగే నష్టాలపై ఒక ప్రెజెంటేషన్ తయారు చేస్తోంది. ఈ ప్రాజెక్టులో ఉపయోగించిన యంత్రాల వల్ల పర్యావరణానికి తీవ్ర ముప్పు వాటిల్లడంతో పాటు భారీ ఖర్చుతో కూడుకున్నది జేఏసీ భావిస్తోంది. తద్వారా ఒక్క మణుగూరు ద్వారానే ప్రజానీకంపై రానున్న 20 ఏళ్లలో రూ.10 వేల కోట్ల భారం పడే అవకాశం ఉందని అంచనాకు వచ్చింది. అలాగే ఛత్తీస్‌గఢ్ విద్యుత్ ఒప్పందంతో ఖజానాపై రూ.900 కోట్ల భారం పడుతుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. దామరచర్ల విద్యుత్ ప్రాజెక్టు వల్ల రూ.6 వేల కోట్ల భారంతో పాటు తీవ్రమైన కాలుష్యం వెదజల్లే ప్రమాదముందని జేఏసీ భావిస్తోంది. ఇలా విద్యుత్ రంగానికి సంబంధించి దాదాపు 32 అంశాలను కూలంకషంగా చర్చించి ప్రజల్లోకి తీసుకెళ్లాలని జేఏసీ నిర్ణయించింది. నేడు జేఏసీ సమావేశం తెలంగాణ జేఏసీ స్టీరింగ్ కమిటీ సమావేశం బుధవారం హైదరాబాద్‌లో జరగనుంది. టీఆర్ఎస్ ప్రభుత్వంపై కోదండరాం వ్యాఖ్యలు, ఆయనపై మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు ఎదురు దాడి నేపథ్యంలో స్టీరింగ్ కమిటీ సమావేశం కానుంది. ప్రభుత్వ వైఫల్యాలపై అనుసరించాల్సిన వ్యూ హంతో పాటు కోదండరాంపై టీఆర్ఎస్ నేతల విమర్శలను ఇందులో ప్రధానంగా చర్చించే అవకాశం ఉందని జేఏసీ నేతలు వెల్లడించారు.