student organisations
-
ముందస్తు అడ్మిషన్లపై ఆగ్రహం
- ఆర్ఐఓ కార్యాలయం ఎదుట విద్యార్థి సంఘాల ఆందోళన - ఆయా కళాశాలలపై చర్యలకు డిమాండ్ అనంతపురం ఎడ్యుకేషన్ : వచ్చే విద్యా సంవత్సరానికి సంబంధించి కొన్ని కార్పొరేట్ కళాశాలలు అప్పుడే అడ్మిషన్లు చేస్తున్నాయంటూ ఆగ్రహించిన విద్యార్థి సంఘాల నాయకులు దీన్ని నిరసిస్తూ మంగళవారం ఆర్ఐఓ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు. కార్యాలయానికి గేటు వేసి అక్కడే బైఠాయించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కార్పొరేట్ కళాశాలల వారు ఏకంగా పీఆర్వోలను నియమించి వారిని ఇంటింటికీ పంపి విద్యార్థుల వివరాలు సేకరిస్తున్నారని తెలిపారు. వారు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నా అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని మండిపడ్డారు. కరువు జిల్లాలో విద్యార్థుల తల్లిదండ్రులకు లేనిపోని ఆశలు కల్పించి ఫీజుల రూపంలో వారిని దోచుకుంటున్నారని విచారం వ్యక్తం చేశారు. ఆకర్షణీయమైన పేర్లు పెట్టి వేలాది రూపాయలు వసూలు చేస్తున్నారని, ఈ విషయం అధికారులకు తెలిసినా పట్టించుకోవడం లేదని ఆవేదన చెందారు. అధికారులు స్పందించకుంటే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్ విద్యార్థి విభాగం నాయకులు పరుశురాం, మారుతీప్రకాష్, లోకేష్, ఏఐఎస్ఎఫ్ నాయకులు జాన్సన్, మనోహర్, సంతోష్ తదితరులు పాల్గొన్నారు. ముందస్తు అడ్మిషన్లు చేయకూడదు : ఆర్ఐఓ ఎవరూ ముందస్తు అడ్మిషన్లు చేయకూడదని, జిల్లాలోని ప్రైవేట్ జూనియర్ కళాశాలలు నిబంధనలు పాటించకపోతే చర్యలు తప్పవని ఆర్ఐఓ వెంకటేశులు హెచ్చరించారు. వచ్చే విద్యా సంవత్సరానికి ముందస్తు అడ్మిషన్లు చేస్తున్నట్లు విద్యార్థి సంఘాలు ఆందోళనకు దిగిన నేపథ్యంలో ఆయన ఈ విధంగా స్పందించారు. అడ్మిషన్ దరఖాస్తుకు ప్రభుత్వం నిర్ణయించిన రుసుము మాత్రమే వసూలు చేయాలని, ట్యూషన్ ఫీజు ఎంత వసూలు చేస్తున్నారో కళాశాల నోటీస్ బోర్డులో ఉంచాలని ఆదేశించారు. ప్రతి జూనియర్ కళాశాలకు మంజూరు చేసిన గ్రూపులను మాత్రమే కళాశాల అప్లికేషన్లో ముద్రించాలన్నారు. సెలవు దినాల్లో కళాశాలలు నడపరాదని, ప్రతి తరగతి గదిలోనూ పరిమితికి మించి విద్యార్థులు ఉండకూడదని హెచ్చరించారు. ప్రతి కళాశాలకు ఫైర్ సేఫ్టీ సర్టిఫికెట్ తప్పనిసరిగా ఉండాలన్నారు. -
ప్రత్యేక హోదాపై విద్యార్థి సంఘాల ఆందోళన
విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రనికి ప్రత్యేక హోదా, రైల్వే జోన్ కెటాయించకపోవడాన్ని నిరసిస్తూ రాజ్యసభ సభ్యుడు సుబ్బిరామిరెడ్డి నివాసం వద్ద శనివారం ప్రజా విద్యార్థి సంఘాలు ఆందోళన నిర్వహించాయి. కేంద్రంపై వత్తిడి తీసుకురావాలని విద్యార్థి సంఘాల నేతలు సుబ్బిరామిరెడ్డికి వినతి పత్రం సమర్పించాయి. ఈ సందర్భంగా సుబ్బిరామిరెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రానికి ప్రత్యేక హోదా, రైల్వే జోన్ కెటాయించకుండా కేంద్రం తీవ్ర అన్యాయం చేస్తోందన్నారు. సేకరించిన కోటి సంతకాలతో ఈ నెల 14న ఏపీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి సారథ్యంలో రాష్ట్రపతి, ప్రధానిని కలుస్తామని తెలిపారు. -
కార్పొరేట్ విద్యా వ్యాపారాలపై కన్నెర్ర
'సాక్షి' కథనంతో కదలిన విద్యార్థి సంఘాలు అనంతపురం (గుంతకల్లు): విద్యా వ్యాపారానికి డోర్లు తెరిచిన కార్పొరేట్, ప్రైవేట్ విద్యాసంస్థలపై విద్యార్థి సంఘాలు కన్నెర్ర చేశాయి. శుక్రవారం 'సాక్షి' దినపత్రికలో 'ఫీజులుం' విద్యా వ్యాపారినికి డోర్లు తెరిచిన స్కూళ్లు' అనే శీర్షికన ప్రచురితమైన కథనానికి ఎఐఎస్ఎఫ్, ఎస్ఎఫ్ఐ నాయకులు స్పందించారు. అక్రమ డొనేషన్లు, విచ్చలవిడిగా ఫీజుల వసూలు చేస్తూ విద్యార్థుల తల్లిదండ్రులను నిలువుదోపిడీ చేయడాన్ని నిరసిస్తూ వారు శ్రీచైతన్య-2, భాష్యం, విజ్ఞాన్ స్కూళ్ల వద్ద ధర్నా నిర్వహించారు. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా అడ్మిషన్లు నిర్వహిస్తున్న ఆయా పాఠశాలల యాజమాన్యాలతో వాదనకు దిగారు. ఆయా స్కూళ్ల ఫ్లెక్సీలను చించేశారు. అనంతపురం పట్టణం ధర్మవరం గేట్ వద్దనున్న విజ్ఞాన్ స్కూల్ భవనంలో అనధికారికంగా నిర్వహిస్తున్న విఘ్నేశ్ బుక్స్‌కౌంటర్ సీజ్ చేయాలని బైఠాయించారు. మండల విద్యాధికారి కుళ్లాయప్ప విజ్ఞాన్ స్కూల్ వద్దకి చేరుకుని అక్రమంగా రప్పించి విఘ్నేశ్ బుక్‌స్టాల్‌ను సీజ్ చేయించారు. కార్పొరేట్, ప్రైవేట్ యాజమాన్యలతో కుమ్మక్కయ్యారని ఎంఈఓ పై విద్యార్థి నాయకులు మండిపడ్డారు. ప్రభుత్వానికి, విద్యాధికారులకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఆందోళన కార్యక్రమాన్ని ఉద్దేశించి ఎఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు రామాంజినేయులు, ఎస్ఎఫ్ఐ డివిజన్ అధ్యక్ష, కార్యదర్శులు బాసిద్, రమేష్‌లు మాట్లాడుతూ ఈ నెల 15వ తేదీన పాఠశాలలు తెరవాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసినా వాటిని ఖాతరు చేయకుండా స్కూళ్లను తెరిచి అక్రమంగా అడ్మిషన్లను నిర్వహించడమేంటని ప్రశ్నించారు. ప్రభుత్వ నిబంధనలకు విరుద్దంగా ప్రవేట్ పాఠశాలల్లోనే బుక్స్‌స్టాల్స్‌ను నిర్వహించడమే కాకుండా అత్యధిక ధరలను నిర్ణయించి పుస్తకాలను అమ్మే అధికారం ఎవరిచ్చారని నిలదీశారు. ఎల్కేజీ నుంచి 10వ తరగతి వరకు చేరే విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి ముక్కుపిండి వేలకు వేలు డొనేషన్లు, వివిధ రకాల ఫీజులను వసూలు చేస్తున్నా విద్యాధికారులు మామూళ్ల మత్తులో జోగుతున్నారని వారు దుయ్యబట్టారు. ఈ సమస్యలను పరిష్కరించకపోతే ఉద్యమాలను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. రూ.1 లక్షకు పైగా విలువ చేసే పుస్తకాలు కలిగిన విఘ్నేశ్ బుక్స్ కౌంటర్‌ను ఎంఈఓ సీజ్ చేశారు. వన్‌టౌన్ ఎస్ఐ నగేష్‌బాబు పోలీసుల జోక్యంతో విద్యార్థి నాయకులు ఆందోళన విరమించారు. కాగా భాష్యం స్కూల్ యాజమాన్యం ఫిర్యాదు మేరకు ఆ స్కూల్లో ఫర్నిచర్ ధ్వంసం చేసిన పలువురు విద్యార్థి నాయకులపై టూటౌన్ పోలీసులు కేసు నమోదు చేసినట్లు తెలిసింది.