breaking news
State Intelligence
-
ఆన్లైన్లో పాక్ యువతితో ప్రేమ.. ప్రియుడి కోసం సరిహద్దులు దాటి!
సాక్షి, హైదరాబాద్: సౌదీలో ఉంటున్న హైదరాబాద్ అబ్బాయి, పాకిస్తాన్‌కు చెందిన అమ్మాయి ‘ఆన్లైన్’లో ప్రేమించుకున్నారు. వీరి పెళ్లికి అమ్మాయి తల్లిదండ్రులు ససేమిరా అన్నారు. దీంతో అతడు, ఆమెను నేపాల్ మీదుగా హైదరాబాద్‌కు తీసుకొచ్చి పెళ్లి చేసుకోవాలనుకున్నాడు. తన ప్రేయసిని నేపాల్ నుంచి హైదరాబాద్‌కు తీసుకొచ్చే బాధ్యతని తన సోదరుడికి అప్పగించాడు. ఇక్కడే కథ అడ్డం తిరిగింది. సరిహద్దు దాటుతూ సశస్త్ర సీమా బల్ (ఎస్ఎస్బీ)కు మంగళవారం చిక్కారు. పాక్ యువతిని, అహ్మద్ సోదరునితోపాటు వారికి సహకరించిన నేపాల్ వ్యక్తినీ పోలీసులు విచారిస్తున్నారు. పోలీసులు తెలిపిన ప్రకారం.. సినిమా కథను తలపిస్తున్న ప్రేమకథ వివరాలిలా ఉన్నాయి. ప్రేమగా మారిన ‘సోషల్’పరిచయం... పాతబస్తీలోని బహదూర్‌పురాకు చెందిన అహ్మద్ కొన్నేళ్లుగా సౌదీ అరేబియాలోని ఓ హోటల్లో పని చేస్తున్నాడు. ఇతడికి పాకిస్తాన్‌లోని ఫైసలాబాద్‌కు చెందిన ఖాదిజా నూర్ సోషల్‌మీడియాలో పరిచ యమైంది. చాటింగ్, వాయిస్, వీడియోకాల్స్‌తో ఈ ఆన్లైన్ పరిచయం కాస్తా ప్రేమగా మారింది. ఇద్దరూ పెళ్లి చేసుకోవాలనుకున్నారు. అదే విషయాన్ని నూర్ తన తల్లిదండ్రులకు చెప్పింది. అయితే భారతీయుడికిచ్చి పెళ్లి చేయడానికి వాళ్లు ఒప్పుకోలేదు. నూర్ ద్వారా విషయం తెలుసుకున్న అహ్మద్, ఆమెను పెళ్లి చేసుకోవడానికి అనువైన మార్గాల కోసం అన్వేషించాడు. ముందుగా ఆమెను హైదరాబాద్ పంపి, తరువాత తానూ వచ్చి పెళ్లి చేసుకోవాలి అనుకున్నాడు. సౌదీలో అహ్మద్ పని చేస్తున్న హోటల్లోనే కొందరు నేపాలీలు పని చేస్తున్నారు. ఏళ్లుగా కలిసుండటంతో వీరి మధ్య స్నేహం ఏర్పడింది. నేపాల్ వరకు సోదరుడిని పంపి... నూర్‌ను తమ దేశం మీదుగా హైదరాబాద్ పంపుదామంటూ నేపాలీలు అహ్మద్‌కు సలహా ఇచ్చారు. అక్కడ వారికి సహాయం చేయడానికి జీవన్ అనే నేపాలీని ఏర్పాటు చేశారు. దీంతో అహ్మద్ తన సోదరుడు మహ్మద్‌ను రంగంలోకి దింపాడు. నూర్కోసం ఆర్జూ బాగ్దాదియా పేరుతో నకిలీ ఆధార్ కార్డు తయారు చేయించాడు. దీన్ని తీసుకుని మహ్మద్ గత వారం నేపాల్ చేరుకున్నాడు. నూర్ దుబాయ్ మీదుగా నేపాల్ వచ్చింది. నేపాలీ జీవన్తోసహా ముగ్గురూ ఇండో–నేపాల్ సరిహద్దు బిహార్‌లోని సీతమ్రాహీ జిల్లా బిట్టామోర్ బోర్డర్ ఔట్‌పోస్టుకు మంగళవారం చేరుకున్నారు. తెల్లవారుజామున అక్కడ నుంచి భారత్‌లోకి ప్రవేశిస్తూ ఎస్ఎస్బీ బలగాల కళ్లల్లో పడ్డారు. నూర్ వద్ద హైదరాబాద్‌కు చెందిన మహిళగా ఆధార్ కార్డు, పాకిస్తాన్ పాస్‌పోర్టు, ఫైసలాబాద్‌లోని జీసీ ఉమెన్ యూనివర్సిటీలో సైకాలజీ చదువుతున్నట్లు గుర్తింపుకార్డు, పాక్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ జారీ చేసిన కోవిడ్ వ్యాక్సినేషన్ సర్టిఫికెట్లు లభించాయి. దీంతో అధికారులకు అనుమానం వచ్చింది. పలు కోణాల్లో సాగుతున్న విచారణ గూఢచర్యం కోసం వస్తుందేమోనని అనుమానించిన పోలీసులు.. ముగ్గురినీ అదుపులోకి తీసుకుని విచారించగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో ఎస్ఎస్బీ అ«ధికారులు సీతమ్రాహీ పోలీసులకు ముగ్గురినీ అప్పగించారు. సీతమ్రాహీ ఎస్పీ హరికిషోర్ రాయ్ ‘సాక్షి’తో ఫోన్లో మాట్లాడుతూ... ‘నూర్ సైకాలజీ స్టూడెంట్. జూలై 29న ఇస్లామాబాద్‌లోని నేపాల్ ఎంబసీకి వెళ్లి నెల రోజులకు టూరిస్ట్ వీసా తీసుకుంది. దీని ద్వారానే దుబాయ్ మీదుగా కాఠ్మాండు చేరుకుంది. ఈమె అరెస్టుకు సంబంధించి పాక్ ఎంబసీకి సమాచారం ఇచ్చాం’అని తెలిపారు. ఈ వ్యవహారంపై సమాచారం అందుకున్న రాష్ట్ర నిఘా వర్గాలు అప్రమత్తమయ్యాయి. హైదరాబాద్ పోలీసులతో కలిసి అహ్మద్, మహ్మద్‌లకు సంబంధించిన వివరాలు ఆరా తీస్తున్నాయి. స్వాతంత్య్ర దినోత్సవం సమీపిస్తున్న నేపథ్యంలో... ఈ పరిణామాన్ని సీరియస్‌గా తీసుకుని అన్ని కోణాల్లో విశ్లేషిస్తున్నాయి. నూర్, మహ్మద్, జీవన్లను విచారించడానికి ఓ బృందం బిహార్ బయలుదేరి వెళ్లింది. -
రాష్ట్ర ఇంటెలిజెన్స్‌కు రాజ్‌నాథ్ అభినందనలు
సాక్షి, హైదరాబాద్: ఉత్తరప్రదేశ్ లక్నోలో జరిగిన ఐసిస్ టెర్రరిస్ట్ సైఫుల్లా ఎన్కౌంటర్లో రాష్ట్ర ఇంటెలిజెన్స్ పోలీస్ కీలక పాత్ర పోషించింది. రెండు నెలల నుంచి ఐసిస్ కూర్సన్ మాడ్యుల్‌ని రాష్ట్ర కౌంటర్ ఇంటెలిజెన్స్ సెల్ పోలీసులు ట్రాక్ చేస్తున్నారు. లక్నో–భూపాల్ ఉజ్జయిని ప్యాసింజర్ రైలులో పేలుడు అనంతరం కూర్సన్ మాడ్యుల్ ఉగ్రవాదులు బస్ ఎక్కి పారిపోయినట్లు కౌంటర్ సెల్ పోలీసులు గుర్తించారు. ఉత్తరప్రదేశ్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ (ఏటీఎస్)కు ఈ సమాచారాన్ని రాష్ట్ర ఇంటెలిజెన్స్ ఇవ్వడంతో వారు ఆపరేషన్ కూర్సన్ ప్రారంభించారు. ఈ ఆపరేషన్‌లో ఉగ్రవాది సైఫుల్లా మృతి చెందగా.. మిగతా ఇద్దరు ఫైజాన్, ఇమ్రాన్‌ను ఏటీఎస్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కీలక సమాచారం ఇచ్చి భారీ ఉగ్రముప్పు నుంచి కాపాడిన రాష్ట్ర పోలీస్ శాఖను కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ బుధవారం అభినందించారు. ఈ మేరకు డీజీపీ అనురాగ్ శర్మకు కేంద్ర హోంశాఖ మంత్రి ఫోన్ చేసి అభినందనలు తెలిపారు. -
కేసీఆర్‌ను కలిసిన ఇంటెలిజెన్స్ ఐజీ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ఇంటెలిజెన్స్ ఐజీ శివధర్‌రెడ్డి శుక్రవారం మధ్యాహ్నం టీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌ను కలిశారు. తెలంగాణ తొలిముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టబోతున్న కేసీఆర్‌కు ఆయన అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా కేసీఆర్ నూతనంగా ఏర్పడబోయే తెలంగాణ రాష్ట్రంలో ఇంటెలిజెన్స్ విభాగం పనితీరుపై పలు విషయాలను అడిగి తెలుసుకున్నారు. శివధర్‌రెడ్డితో పాటు ఇంటెలిజెన్స్ శాఖకు చెందిన ఉన్నతాధికారులు కూడా కేసీఆర్‌ను కలిశారు. కొనసాగుతున్న అభినందనలు: కేసీఆర్‌కు అభినందనల వెల్లువ కొనసాగుతోంది. బంజారాహిల్స్‌లోని ఆయన నివాసం టీఆర్ఎస్ నాయకులు, తెలంగాణ ఉద్యమకారులు, ఉద్యోగ సంఘాల నేతలు, జిల్లాల నుంచి వచ్చిన ప్రజలతో జనసంద్రాన్ని తలపిస్తోంది. శుక్రవారం పలు న్యూస్ చానళ్ల సీఈఓలు, అప్పా డెరైక్టర్ మాలకొండయ్య, సైబరాబాద్ పోలీసు కమిషనర్, పలు జోన్ల డీసీపీలు, పరిశ్రమల యజమానులు, వివిధ కార్పొరేట్ ఆసుపత్రుల యజమానులు కేసీఆర్‌ను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. రిటైర్డ్ పోలీసు అధికారుల సంఘం నాయకులు, మౌళిక పెట్టుబడుల శాఖ కార్యదర్శి కృష్ణబాబు, వికలాంగుల సంఘం నేతలు, బాలల పరిరక్షణ కమిషన్ ప్రతినిధులు, ఫ్యాప్సీ సభ్యులు కేసీఆర్‌ను కలిసి శుభాకాంక్షలు తెలిపారు.