breaking news
in the state
-
కొత్త రేషన్ కార్డులు నేటి నుంచి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో నిరుపేదల కడుపు నింపే నూతన రేషన్ కార్డుల జారీకి సోమవారం నుంచి ప్రభుత్వం శ్రీకారం చుట్టనుంది. రాష్ట్రవ్యాప్తంగా అర్హులైన 3.09 లక్షల మంది లబ్ధిదారులకు ప్రభుత్వం కొత్త కార్డులు అందజేయనుంది. భూపాలపల్లి జిల్లా నుంచి ఈ కార్యక్రమాన్ని పౌర సరఫరాల మంత్రి గంగుల కమలాకర్ లాంఛనంగా ప్రారంభించనున్నారు. అనంతరం రాష్ట్రవ్యాప్తంగా మంత్రులు, స్థానిక ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతోపాటు వివిధ స్థాయిల్లోని ప్రజాప్రతినిధులు ప్రతీ మండల కేంద్రంగా లబ్ధిదారులకు రేషన్ కార్డులు అందిస్తారని మంత్రి గంగుల కమలాకర్ ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా ఒక్క పెండింగ్ అప్లికేషన్ లేకుండా అన్నింటిని పరిశీలించి కార్డులు జారీ చేశామన్నారు. ఈ 3.09 లక్షల కార్డుల ద్వారా 8,65,430 మంది లబ్ధిదారులు నూతనంగా ప్రతీ నెల 6 కిలోల బియ్యాన్ని పొందనున్నట్లు చెప్పారు. ఇందుకుగానూ నెలకు 5,200 మెట్రిక్ టన్నులతో ఏడాదికి 62,400 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని ఇప్పటికే ఉన్న కోటాకు అదనంగా పౌరసరఫరాల శాఖ అందించనున్నట్లు తెలిపారు. దీనికోసం ఏటా ప్రభుత్వం రూ.168 కోట్లు అదనంగా వెచ్చించనుందన్నారు. ఇప్పటికే ఉన్న 87.41 లక్షల కార్డులకు కొత్తవి జత కావడంతో వాటి సంఖ్య 90.50 లక్షలకు చేరనుండగా, మొత్తం లబ్ధిదారులు 2.88 కోట్లు ఉంటారని చెప్పారు. బియ్యం పంపిణీకి ఏటా ప్రభుత్వం రూ.2,766 కోట్లు వెచ్చిస్తోందని వివరించారు. -
రాష్ట్రంలో తుగ్లక్ పాలన
టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి నర్సిరెడ్డి టేకుమట్లలో నిరాహార దీక్షల విరమణ చిట్యాల : రాష్ట్రంలో తుగ్లక్ పాలన కొనసాగుతోందని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి నన్నూరి నర్సిరెడ్డి అన్నారు. మండలంలోని టేకుమట్ల గ్రామంలో టీడీపీ మండల అధ్యక్షుడు పులి తిరుపతిరెడ్డి ఆధ్వర్యంలో 24రోజుల పాటు చేపట్టిన రిలే నిరాహార దీక్షల ముగింపు కార్యక్రమం ఆదివారం జరిగింది. ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ రాష్ట్రంలో కుటుంబపాలన అవినీతితో సాగుతోందన్నారు. సీఎం కేసీఆర్ ఉద్యోగులను, కార్మికులను, కర్షకులను, జర్నలిస్టులను అణచివేస్తున్నాడని ధ్వజమెత్తారు. ప్రజాస్వామ్యబద్ధంగా టేకుమట్ల మండలాన్ని శాస్త్రీయంగా చేయాలని డిమాండ్ చేశారు. మిషన్ కాకతీయ, వాటర్‌గ్రిడ్, బతుకమ్మ కార్యక్రమాల్లో అవినీతి రాజ్యమేలుతోందన్నారు. వరద తాకిడితో ప్రజలు ఆందోళన చెందుతుంటే సీఎం, మంత్రులు ఇళ్లకే పరిమితమయ్యారని, ఒక అన్నం పొట్లం కూడా బాధితులకు అందజేయలేదని ధ్వజమెత్తారు. స్పీకర్ బెదిరింపులకు భయపడం భూపాలపల్లి నియోజకవర్గంలో స్పీకర్, తన తనయులతో టీడీపీ నాయకులను, కార్యకర్తలను బెదిరింపులకు గురిచేయడం మానుకోవాలని టీడీపీ జిల్లా అధ్యక్షుడు గండ్ర సత్యనారాయణరావు, మాజీ ఎమ్మెల్యే ధనసరి సీతక్క అన్నారు. ప్రజాస్వామ్యంలో ప్రజల పక్షాన నిలిచి పోరాటం చేస్తుంటే పోలీసులతో, రెవెన్యూ అధికారులతో దాడులు చేయించడం సిగ్గుచేటన్నా రు. అవినీతి కుబేరులు ఎవరనేది ప్రజలు గమనిస్తున్నారని పేర్కొన్నారు. టేకుమట్ల వంతెన నిర్మాణం ఎందుకు నిలిచిందో స్పీకర్ సమాధానం చెప్పాలన్నారు. స్పీకర్ ఇచ్చిన హామీతో దీక్షలను విరమింపజేస్తున్నామని, మండలం ప్రకటించకపోతే అక్టోబర్ 3 తర్వాత మళ్లీ ఉద్యమిస్తామన్నారు.