breaking news
star comedian
-
తెలుగులో తొలి స్టార్ కమెడియన్.. అనాథలా స్టేషన్లో శవం!
కమెడియన్ అనగానే బ్రహ్మానందం, సునీల్, వెన్నెల కిషోర్, అలీ.. ఇలా చాలామంది గుర్తొస్తారు.. అంతకు ముందు తరం అనగానే రేలంగి, రమణారెడ్డి, రాజబాబు గుర్తొస్తారు. కానీ వీళ్లందరి కన్నా ముందు వెండితెరపై నవ్వుల మాగాణిని పండించిన వ్యక్తి ఒకరున్నారు.. ఆయనే కస్తూరి శివరావు. తెలుగు సినీరంగంలో తొలి స్టార్ కమెడియన్‌గా కీర్తి గడించారు. నటుడిగా లెక్కపెట్టలేనంత డబ్బు సంపాదించారు. అదే రీతిలో దుబారా చేశారు. చివరకు కటిక పేదరికంలో ఒక అనామకుడిగా మరణించారు. ఆయన గురించి నేటి ప్రత్యేక కథనం.. స్టార్ కమెడియన్‌గా సాగిన ప్రస్థానం శివరావు 1913లో కాకినాడలో జన్మించారు. తండ్రి ఉపాధ్యాయుడు. తనయుడికేమో చదువు తప్ప అన్నింటా ఆసక్తే! శివరావు పద్యాలు, పాటలు పాడుతూ నాటక రంగంలో అడుగుపెట్టారు. అతడి కామెడీ మెచ్చి సినిమా ఛాన్సులు వచ్చాయి. 1939లో 'వరవిక్రయం'తో సినిమాలో ఎంట్రీ ఇచ్చారు. 'స్వర్గసీమ' మూవీతో జనాలకు దగ్గరయ్యారు. బాలరాజు, గుణసుందరి కథ, లైలా మజ్ను, శ్రీ లక్ష్మమ్మ కథ, స్వప్న సుందరి.. అన్నీ సూపర్ హిట్ చిత్రాలే! పేరుకు పేరు.. డబ్బుకు డబ్బు. కస్తూరి పన్నీటితో స్నానం చేసేవారు. అప్పట్లో ఖరీదైన బ్యూక్ కారు కొని అందులో దర్జాగా తిరిగేవారు. స్క్రీన్‌పై ఆయన కనిపిస్తే ప్రేక్షకుల ముఖాల్లో తమకు తెలియకుండానే చిరునవ్వు వచ్చేది. ఈ క్రేజ్‌ను క్యాష్ చేసుకోవాలనుకున్న హీరోలు, నిర్మాతలు.. శివరావు తమ సినిమాలో ఉండాల్సిందేనని మంకు పట్టు పట్టేవారు. తనకు లక్ష రూపాయల పారితోషికం ఇవ్వడానికి కూడా వెనుకాడేవారు కాదంటే ఆయనకు ఎంత డిమాండ్ ఉందో ఊహించుకోవచ్చు. కార్లలో తిరిగిన కమెడియన్ సైకిల్ తొక్కే స్థాయికి ఏ ఆర్టిస్టూ కంటతడి పెట్టకూడదని ఈయన బలంగా నమ్మేవారు. జేబులో నోట్ల కట్టలు పెట్టుకుని తిరుగుతూ అడిగినవారికల్లా సాయం చేసేవారు. భూ, ధన.. దాన దర్మాలు చేశారు. కానీ పరిస్థితులు ఎప్పుడూ ఒకేలా ఉండవు కదా.. సినిమా నిర్మించాలన్న ఆలోచనే ఆయన పాలిట శాపంగా మారింది. పరమానందయ్య శిష్యులు మూవీతో భారీ స్థాయిలో నష్టాలు, కష్టాలు అన్నీ చూశాడు. సైకిల్ తొక్కేచోట బ్యూక్ కార్లలో తిరిగిన శివరావు తిరిగి అదే పాత సైకిల్ తొక్కుకునే స్థాయికి పడిపోయారు. ఇల్లు, కారు, ఆస్తులు అన్నీ పోయాయి. ఒకప్పుడు కోట్ల ఆస్తులు అనుభవించిన శివరావుకి ఎవరినైనా అవకాశాలు అడగాలంటే నామోషీ! దీనికి తోడు తాగుడు అలవాటు కాస్తా వ్యసనమైపోయింది. అవకాశాలు తగ్గిపోవడంతో మళ్లీ నాటకరంగాన్ని నమ్ముకున్నారు. అయితే ఆయన మీద అభిమానంతో ఎన్టీ రామారావు కొన్ని సినిమాల్లో అవకాశాలు కల్పించారు. పొట్టకూటి కోసం నాటకానికి.. అదే చివరిది! కానీ షూటింగ్స్‌కు సైతం తాగివస్తుండటంతో తర్వాత ఛాన్సులు రావడమే గగనమైపోయింది. రాజకీయ కుట్రలకు బలైపోయి మరింత వెనకబడిపోయారు. తర్వాత శివరావు ఆరోగ్యం పూర్తిగా దెబ్బతింది. ఆకలితో చావడం ఇష్టం లేక ఒంట్లో శక్తి లేకపోయినా నాటకాలు వేసేందుకు వెళ్లేవారు. అసలే బక్కప్రాణి.. పోషకాహారం లేక మరింత చిక్కి శల్యమైపోయాడు. చివరిసారిగా 1966లో తెనాలిలో ఓ నాటకంలో వేషం వేయడానికి వెళ్లారు. నాటకం ముగిశాక స్టేషన్‌కు చేరుకుని ఓ బల్ల మీద పడుకున్నాడు, తెల్లవారినా చలనం లేదు. ఎవరిదో అనాథ శవం అనుకున్నారంతా! కానీ ఓ ప్రయాణికుడు.. ఆయనను క్షుణ్ణంగా చూసి శివరావు అని గుర్తుపట్టాడు. ఈ విషయం ఆనోటా ఈనోటా స్టేజీ కళాకారుడు వెంకట్రామయ్యకు తెలిసింది. శివరావు దుస్థితి చూసి కన్నీటిపర్యంతమయ్యాడు. మూడు రోజుల తర్వాత ఇంటికి చేరిన మృతదేహం ఆయన మృతదేహాన్ని స్వస్థలానికి పంపించేందుకు కారు మాట్లాడేందుకు ప్రయత్నించాడు. కానీ శవాన్ని తీసుకెళ్తే తన కారు మరెవరూ ఎక్కరని వాదించాడో కారు డ్రైవర్. దీంతో డిక్కీలో ఆయన మృతదేహాన్ని పెట్టారు. ఎన్నో అవాంతరాల మధ్య మూడు రోజుల తర్వాత కానీ ఆయన మృతదేహం ఇంటికి చేరకపోవడం విషాదం. స్టార్డమ్ లేదనో ఏమో కానీ చాలామంది తారలు ఆయన చివరి చూపుకు సైతం రాకపోవడం శోచనీయం. ఆఖరికి పాడె మోసేందుకు నలుగురు మనుషులకు డబ్బులిచ్చి పిలిపించడం అత్యంత దయనీయమైన విషయం! 'మొదటి రోజుల్లో మద్రాసులో సైకిలు తొక్కుతూ తిరిగేవాడిని. తర్వాత కార్లమీద తిరిగాను. ఇప్పుడు మళ్ళీ సైకిలు మీదనే తిరుగుతున్నాను. ఒకప్పుడు మా ఇంటి పేరైన కస్తూరి వాసనే నిత్యం గుప్పుమనేది. ఇప్పుడు ఇంటిపేరు కస్తూరి వారు - ఇంట్లో మాత్రం గబ్బిలాల కంపు' అని తన దుస్థితి మీద తానే జోకులు వేసుకునేవారు కస్తూరి శివరావు. చదవండి: యంగ్ హీరోకు బ్రేకప్ చెప్పేసిన సీనియర్ హీరోయిన్! -
వెన్నెల కిశోర్ పెళ్లి మళ్లీ ఆగిపోయింది.!
టాలీవుడ్ స్టార్ కమెడియన్ వెన్నెల కిశోర్ పెళ్లి నాలుగోసారీ ఆగిపోయింది. ఈ విషయాన్ని తనే స్వయంగా ప్రకటించాడు. పెళ్లి కొడుకు డ్రెస్‌లో తను దిగిన ఫోటోతో పాటు ఈ వారంలో నా నాలుగో పెళ్లి కూడా ఆగిపోయింది అంటూ కామెంట్ చేశాడు. అయితే ఈ పెళ్లిళ్లన్నినిజంగా కాదులెండి... సినిమాలోనే.. ప్రస్తుతం తాను నటిస్తున్న సినిమాల్లో కూడా పెళ్లిళ్ల సీజన్ నడుస్తుందంటూ చమత్కరించాడు. తెలుగులో రెగ్యులర్ కమర్షియల్ సినిమాకు ఓ పక్కా ఫార్మాట్ ఉంది. హీరో పెళ్లి చేసుకోవాలి అనుకునే అమ్మాయికి వేరే వ్యక్తితో పెళ్లి సెట్ అవ్వటం, ఆ పెళ్లి పీటల మీద వరకు వచ్చాక, హీరో వీరోచితంగా పోరాడి ఆ పెళ్లి ఆపేసి హీరోయిన్ను దక్కించుకోవటం తెలుగు సినిమాల్లో కామన్‌గా కనిపిస్తోంది. ఇప్పుడు అలాంటి రోల్స్ వరుసగా చేస్తున్న వెన్నెల కిశోర్ వరుసగా పెళ్లిళ్లు చెడగొట్టేసుకుంటున్నాడు. అలా ఈ వారం తాను నటించిన నాలుగు పెళ్లి సీన్లను గుర్తు చేసుకుంటూ అభిమానులకు ఫన్నీ ట్రీట్ ఇచ్చాడు. Wedding season in movies too i guess..my fourth wedding this week and all were halted..#weddingcrashers pic.twitter.com/RCFy3COprq — vennela kishore (@vennelakishore) January 20, 2016 -
స్పూఫ్లోనే కాదు బాహుబలిలో కూడా..?
ప్రస్తుతం టాలీవుడ్లో స్టార్ కమెడియన్ ఎవరంటే వెంటనే గుర్తొచ్చే పేరు 30 ఇయర్స్ పృథ్వి. దాదాపు ప్రతి సినిమాలో లీడ్ కమెడియన్‌గా కనిపిస్తున్న పృథ్వి, వరుసగా సూపర్ హిట్ సినిమాల స్పూఫ్‌లతో అదరగొడుతున్నాడు. తాజాగా సౌఖ్యం సినిమాలో బాహుబలి స్పూఫ్లో కనిపించిన పృథ్వి, ఇప్పుడో గోల్డెన్ ఛాన్స్ కొట్టేశాడు. సూపర్ స్టార్లు కూడా చిన్న క్యారెక్టర్ దొరికినా చాలు అని ఫీల్ అవుతున్న బాహుబలి 2లో నటించే అవకాశం సొంతం చేసుకున్నాడట. ప్రస్తుతం బాహుబలి 2 షూటింగ్లో పృథ్వి పాల్గొంటున్నాడన్న వార్త ఇప్పుడు టాలీవుడ్లో హాట్ టాపిక్‌గా మారింది. తొలి భాగంలో పెద్దగా కామెడీ మీద దృష్టిపెట్టని రాజమౌళి, ఈ భాగంలో ఆ లోటు తీర్చాలని భావిస్తున్నాడు. అందుకే భారీ యాక్షన్ ఎపిసోడ్స్‌తో పాటు కామెడీని కూడా పండించే ప్రయత్నం చేస్తున్నాడట. ఇప్పటికే ప్రభాస్ షూటింగ్ లో పాల్గొంటుండగా అనుష్క, రానా ఫిబ్రవరి నుంచి షూటింగ్లో పాల్గొంటారు.