breaking news
STAMPS REVINUE
-
‘ఆదాయ పెంపు’పై ప్రభుత్వం తర్జనభర్జన
సాక్షి, హైదరాబాద్: గతేడాది బడ్జెట్‌తో పోలిస్తే తాజా బడ్జెట్లో ప్రభుత్వం స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ ఆదాయాన్ని రెట్టింపుకన్నా ఎక్కువ చేసి చూపించడటంతో ఆ శాఖకు ఉన్న ఆదాయ మార్గాలు ఏమిటన్న దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. రాబడులు పెంచుకునేందుకు భూముల మార్కెట్ విలువల సవరణతో లేదా స్టాంపు డ్యూటీ పెంపు లేదా రెండు ప్రతిపాదనలను అమలు చేయడం తప్పనిసరి కానుందనే చర్చ ఆ శాఖలో జరుగుతోంది. తెలంగాణ ఏర్పడినప్పటి నుంచి రాష్ట్రంలోని భూముల మార్కెట్ విలువలను సవరించకపోవడం, స్టాంపు డ్యూటీని పెంచకపోవడంతో ఇప్పుడు ఈ రెండింటిలో ఒకదాన్ని లేదా రెండింటినీ అమల్లోకి తెచ్చే యోచనలో ప్రభుత్వం ఉందని తెలుస్తోంది. నేటికీ 2013 విలువలతోనే.. రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల్లో రెండేళ్లకోసారి, పట్టణ ప్రాంతాల్లో ఏటా భూముల మార్కెట్ విలువలను సవరించడం ఆనవాయితీగా వస్తోంది. ఈ లెక్కన రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి గ్రామీణ ప్రాంతాల్లో ఏడుసార్లు, పట్టణ ప్రాంతాల్లో కనీసం మూడు దఫాలు మార్కెట్ విలువల సవరణ జరగాల్సి ఉంది. సవరణలు జరిగిన ఏడాది ఆగస్టు 1 నుంచి ఆ విలువలు అమల్లోకి వచ్చేవి. కానీ ఇప్పటివరకు ఒక్కసారి కూడా ఈ ప్రక్రియ జరగలేదు. 2013లో జరిగిన సవరణల విలువల ఆధారంగానే ఇప్పటికీ రిజిస్ట్రేషన్ల రుసుము వసూలు చేస్తున్నారు. ఇందులో స్టాంపు డ్యూటీ కింద 6 శాతం వసూలు చేస్తున్నారు. ఈ స్టాంపు డ్యూటీని కూడా రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి పెంచలేదు. దీంతో ఈ రెండు ప్రతిపాదనలపై రాష్ట్ర ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగానే ఈసారి బడ్జెట్ ప్రతిపాదనలను రూ.6 వేల కోట్ల నుంచి రూ.12,500 కోట్లకు పెంచారని సమాచారం. విశ్వసనీయ సమాచారం ప్రకారం స్టాంపు డ్యూటీ మన పొరుగు రాష్ట్రాల్లో 7 శాతం వరకు ఉంది. దీనికి సమానంగా ఇక్కడ కూడా స్టాంపు డ్యూటీని పెంచే ఆలోచన సీఎం కేసీఆర్ మదిలో ఉందనే చర్చ రిజిస్ట్రేషన్ల శాఖ వర్గాల్లో జరుగుతోంది. దీంతోపాటు మార్కెట్ విలువల సవరణ తప్పనిసరిగా ఉంటుందని, ప్రాంతాన్ని బట్టి ఈ విలువలు 50 శాతం నుంచి 200 శాతం వరకు పెంచుతారని సమాచారం. అయితే కేవలం స్టాంపు డ్యూటీ పెంచితే మాత్రం 6 శాతం నుంచి 10 శాతానికి పెంచినా ఆశ్చర్యం లేదన్న చర్చ కూడా నడుస్తోంది. మొత్తంమీద ప్రభుత్వం ఆశించిన మేర వచ్చే ఏడాదికి రెట్టింపు ఆదాయం రావాలంటే మార్కెట్ విలువల సవరణ, స్టాంపు డ్యూటీల పెంపు అనివార్యమని ఆ శాఖ అధికారులు చెబుతున్నారు. సవరణే... ఉత్తమం.. అయితే స్టాంపు డ్యూటీ పెంపు సాధారణ ప్రజానీకంపై ప్రత్యక్ష ప్రభావం చూపుతుందని స్టాంపుల శాఖ వర్గాలు చెబుతున్నాయి. కరోనా నేపథ్యంలో ప్రజలపై భారం పడకుండా ఉండేందుకు కర్ణాటకలో ఉన్న 5 శాతం ఉన్న స్టాంపు డ్యూటీని 3 శాతానికి తగ్గించారు. మహారాష్ట్రలో కూడా స్టాంపు డ్యూటీ తగ్గించారని అధికారుల ద్వారా తెలుస్తోంది. స్టాంపు డ్యూటీ పెంచితే రుణాలు తీసుకొని ప్లాట్లు, ఫ్లాట్లు కొనుక్కొనే వారిపై అదనపు భారం పడుతుందని, స్టాంపు డ్యూటీ పెంపు కేవలం రియల్ ఎస్టేట్ వ్యాపారులకే ఉపకరిస్తుందనే అభిప్రాయాలు కూడా వినిపిస్తున్నాయి. మార్కెట్ విలువలను సవరించాల్సిన అనివార్యత ఉంది కాబట్టి ఈ విలువలను అవసరమైతే 300 శాతం పెంచినా ప్రజానీకంపై ప్రత్యక్ష భారం ఉండదని, తద్వారా భూముల బహిరంగ విలువలు కూడా తగ్గే అవకాశం ఉందనే వాదనలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం మార్కెట్ విలువల సవరణ వైపే మొగ్గుచూపడం ద్వారా ప్రజలపై భారం మోపకుండా ఆదాయం పెంచుకోవచ్చని రిజిస్ట్రేషన్ల శాఖ ఉన్నతాధికారులు ప్రతిపాదిస్తున్నట్లు సమాచారం. -
జోరుగా బ్లాక్ దందా
l మూడు నెలలుగా రెవెన్యూ స్టాంపుల కొరత l సరఫరా చేయని ప్రభుత్వం l రూపాయి స్టాంప్ ఐదు రూపాయలకు అమ్మకాలు జనగామ : రూపాయి రెవెన్యూ స్టాంపు.. ఐదు పలుకుతుంది.. ప్రైవేట్‌లో జోరుగా అమ్మకాలు జరుగుతుంటే.. పోస్టాఫీసులో మాత్రం లేవనే సమాధానం వినిపిస్తుంది. జనగామ సబ్ డివిజన్లో మూడు నెలలుగా రెవెన్యూ స్టాంపుల కొరత కలవరపెడుతుంది. జనగామ నియోజక వర్గంతో పాటు లింగాలఘణపురం, రఘునాథపల్లి పరిధిలోని 15 సబ్ పోస్టాఫీసుల్లో రెవెన్యూ స్టాంపుల కొరత ఏర్పడింది. ప్రైవేట్ మార్కెట్లో మాత్రం విచ్చలవిడిగా అమ్మకాలు చేస్తున్నారు. ఒక్క రూపాయి స్టాంపును ఏకంగా ఐదు రూపాయలకు విక్రయిస్తూ నిలువు దోపిడీ చేస్తున్నారు. పోస్టాఫీసులకు మూడు నెలలుగా లేని సరఫరా.. ప్రైవేట్ మార్కెట్లో ఎలా దొరుకుతున్నాయనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బ్యాంకు లో రుణాలు, ఉద్యోగులు, ప్రైవేట్ ఫైనాన్స్‌లు, ఎల్ఐసీ, చిట్‌ఫండ్స్ ఇలా అనేక రకాల వాటికి రెవెన్యూ స్టాంపులు తప్పనిసరి. సబ్ డివిజన్ పరిధిలో కొంతమంది ఏజెంట్ల కనుసన్నలల్లో కొనసాగుతున్న రెవెన్యూ స్టాంపుల బ్లాక్ దందాపై పోస్టల్ శాఖ ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరం ఉందని ప్రజలు అభిప్రాయ పడుతున్నారు. మూడు నెలలుగా కొరత ఉంది మూడు నెలలుగా రెవెన్యూ స్టాంపుల కొరత ఏర్పడింది. హైదరాబాద్ సర్కిల్ స్టాంపు డిపో నుంచి రావాల్సి ఉన్నాయి. జనగామతో కలుపుకుని 15 మండలాల పరిధిలో ప్రతి నెల రూ.30వేల రెవెన్యూ స్టాంపుల అమ్మకాలు ఉంటాయి. పదిహేను రోజుల క్రితమే ఇండెంట్ కూడా పంపించాం. ప్రైవేట్ మార్కెట్లో అధిక ధరలకు అమ్ముతున్నారనే విషయం దృష్టికి రాలేదు. –సాంబశివుడు,పోస్టుమాస్టర్, జనగామ హెడ్ ఆఫీస్ రెవెన్యూ స్టాంపు రూ.5కు అమ్ముతున్నారు పోస్టాఫీసులో రెవెన్యూ స్టాంపులు లేకపోవడంతో ప్రైవేట్‌లో ఐదు రూపాయలకు విక్రయిస్తున్నారు. మూడు నెలలుగా ఫోస్టాఫీసులకే సరఫరా లేని పరిస్థితులో ప్రైవేట్‌లో లక్షల్లో రెవెన్యూ స్టాంపులు ఎలా దొరుకుతున్నాయి. దీనిపై పోస్టల్ శాఖ ఉన్నతాధికారులు విచారణ చేపట్టాలి. –కాసుల శ్రీనివాస్, జిరాక్స్ సెంటర్ యజమాని