‘ఆదాయ పెంపు’పై ప్రభుత్వం తర్జనభర్జన

Government debates Revenue hike - Sakshi

రిజిస్ట్రేషన్లు... రెండు ఆప్షన్లు

రిజిస్ట్రేషన్ల ఆదాయం పెంపునకు ప్రభుత్వ యోచనలో రెండు మార్గాలు

మార్కెట్‌ విలువలను సవరిస్తారా?

లేక స్టాంపు డ్యూటీ పెంచుతారా?

పొరుగు రాష్ట్రాల్లో స్టాంపు డ్యూటీ మన కంటే ఎక్కువే

కరోనా దెబ్బకు తగ్గించిన కర్ణాటక, మహారాష్ట్ర

రాష్ట్రంలో ప్రస్తుతం 6 శాతం స్టాంపు డ్యూటీ వసూలు

దానిని 7% వరకు పెంచే యోచన?

భూముల మార్కెట్‌ విలువలు సవరిస్తే 50-200% వరకు పెంపు?

విలువల సవరణే ఉత్తమమంటున్న రిజిస్ట్రేషన్ల వర్గాలు

సాక్షి, హైదరాబాద్‌: గతేడాది బడ్జెట్‌తో పోలిస్తే తాజా బడ్జెట్‌లో ప్రభుత్వం స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ ఆదాయాన్ని రెట్టింపుకన్నా ఎక్కువ చేసి చూపించడటంతో ఆ శాఖకు ఉన్న ఆదాయ మార్గాలు ఏమిటన్న దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. రాబడులు పెంచుకునేందుకు భూముల మార్కెట్‌ విలువల సవరణతో లేదా స్టాంపు డ్యూటీ పెంపు లేదా రెండు ప్రతిపాదనలను అమలు చేయడం తప్పనిసరి కానుందనే చర్చ ఆ శాఖలో జరుగుతోంది. తెలంగాణ ఏర్పడినప్పటి నుంచి రాష్ట్రంలోని భూముల మార్కెట్‌ విలువలను సవరించకపోవడం, స్టాంపు డ్యూటీని పెంచకపోవడంతో ఇప్పుడు ఈ రెండింటిలో ఒకదాన్ని లేదా రెండింటినీ అమల్లోకి తెచ్చే యోచనలో ప్రభుత్వం ఉందని తెలుస్తోంది.

నేటికీ 2013 విలువలతోనే..
రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల్లో రెండేళ్లకోసారి, పట్టణ ప్రాంతాల్లో ఏటా భూముల మార్కెట్‌ విలువలను సవరించడం ఆనవాయితీగా వస్తోంది. ఈ లెక్కన రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి గ్రామీణ ప్రాంతాల్లో ఏడుసార్లు, పట్టణ ప్రాంతాల్లో కనీసం మూడు దఫాలు మార్కెట్‌ విలువల సవరణ జరగాల్సి ఉంది. సవరణలు జరిగిన ఏడాది ఆగస్టు 1 నుంచి ఆ విలువలు అమల్లోకి వచ్చేవి. కానీ ఇప్పటివరకు ఒక్కసారి కూడా ఈ ప్రక్రియ జరగలేదు. 2013లో జరిగిన సవరణల విలువల ఆధారంగానే ఇప్పటికీ రిజిస్ట్రేషన్ల రుసుము వసూలు చేస్తున్నారు. ఇందులో స్టాంపు డ్యూటీ కింద 6 శాతం వసూలు చేస్తున్నారు. ఈ స్టాంపు డ్యూటీని కూడా రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి పెంచలేదు. దీంతో ఈ రెండు ప్రతిపాదనలపై రాష్ట్ర ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది.

అందులో భాగంగానే ఈసారి బడ్జెట్‌ ప్రతిపాదనలను రూ.6 వేల కోట్ల నుంచి రూ.12,500 కోట్లకు పెంచారని సమాచారం. విశ్వసనీయ సమాచారం ప్రకారం స్టాంపు డ్యూటీ మన పొరుగు రాష్ట్రాల్లో 7 శాతం వరకు ఉంది. దీనికి సమానంగా ఇక్కడ కూడా స్టాంపు డ్యూటీని పెంచే ఆలోచన సీఎం కేసీఆర్‌ మదిలో ఉందనే చర్చ రిజిస్ట్రేషన్ల శాఖ వర్గాల్లో జరుగుతోంది. దీంతోపాటు మార్కెట్‌ విలువల సవరణ తప్పనిసరిగా ఉంటుందని, ప్రాంతాన్ని బట్టి ఈ విలువలు 50 శాతం నుంచి 200 శాతం వరకు పెంచుతారని సమాచారం. అయితే కేవలం స్టాంపు డ్యూటీ పెంచితే మాత్రం 6 శాతం నుంచి 10 శాతానికి పెంచినా ఆశ్చర్యం లేదన్న చర్చ కూడా నడుస్తోంది. మొత్తంమీద ప్రభుత్వం ఆశించిన మేర వచ్చే ఏడాదికి రెట్టింపు ఆదాయం రావాలంటే మార్కెట్‌ విలువల సవరణ, స్టాంపు డ్యూటీల పెంపు అనివార్యమని ఆ శాఖ అధికారులు చెబుతున్నారు.

సవరణే... ఉత్తమం..
అయితే స్టాంపు డ్యూటీ పెంపు సాధారణ ప్రజానీకంపై ప్రత్యక్ష ప్రభావం చూపుతుందని స్టాంపుల శాఖ వర్గాలు చెబుతున్నాయి. కరోనా నేపథ్యంలో ప్రజలపై భారం పడకుండా ఉండేందుకు కర్ణాటకలో ఉన్న 5 శాతం ఉన్న స్టాంపు డ్యూటీని 3 శాతానికి తగ్గించారు. మహారాష్ట్రలో కూడా స్టాంపు డ్యూటీ తగ్గించారని అధికారుల ద్వారా తెలుస్తోంది. స్టాంపు డ్యూటీ పెంచితే రుణాలు తీసుకొని ప్లాట్లు, ఫ్లాట్లు కొనుక్కొనే వారిపై అదనపు భారం పడుతుందని, స్టాంపు డ్యూటీ పెంపు కేవలం రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులకే ఉపకరిస్తుందనే అభిప్రాయాలు కూడా వినిపిస్తున్నాయి. మార్కెట్‌ విలువలను సవరించాల్సిన అనివార్యత ఉంది కాబట్టి ఈ విలువలను అవసరమైతే 300 శాతం పెంచినా ప్రజానీకంపై ప్రత్యక్ష భారం ఉండదని, తద్వారా భూముల బహిరంగ విలువలు కూడా తగ్గే అవకాశం ఉందనే వాదనలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం మార్కెట్‌ విలువల సవరణ వైపే మొగ్గుచూపడం ద్వారా ప్రజలపై భారం మోపకుండా ఆదాయం పెంచుకోవచ్చని రిజిస్ట్రేషన్ల శాఖ ఉన్నతాధికారులు ప్రతిపాదిస్తున్నట్లు సమాచారం.   

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top