breaking news
st lands
-
'భూ వివాదాలను నెలాఖరులోపు పరిష్కరించాలి'
- ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ కారెం శివాజీ కర్నూలు సిటీ: ఎస్సీ, ఎస్టీల భూ వివాదలపై వచ్చిన ఫిర్యాదులను ఈ నెల 31లోపు పరిష్కరించాలని ఎస్టీ, ఎస్టీ కమిషన్ చెర్మన్ కారెం శివాజీ అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఆయన స్థానిక జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో రెవెన్యూ, పోలీసు, విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సభ్యులతో సమీక్ష నిర్వహించారు. మొదట జిల్లాలో భూ వివాద సమస్యలు ఎదుర్కొంటున్న వారి నుంచి అర్జీలు స్వీకరించారు. అనంతరం మాట్లాడుతూ భూ దురాక్రమణల పట్ల రెవెన్యూ అధికారులు నిర్లక్ష్యం చేస్తే సహించేది లేదన్నారు. కారణాలు చూపకుండా ఫిర్యాదు వచ్చిన వెంటనే నిర్దేశించిన గడువులోపు పరిష్కారం చూపాలన్నారు. వివాదాస్పద భూముల్లో ఇతరులకు పట్టాలు ఇస్తే చర్యలు తప్పవన్నారు. జేసీ కోర్టులో ఇలాంటి వివాదాలకు పరిష్కారం చూపి బాధితులకు న్యాయం చేకూర్చాలన్నారు. ఓర్వకల్లు మండలంలో సాగు చేసుకుంటున్న భూములపై విచారణ చేసి న్యాం చేయాలన్నారు. జిల్లాలోని ప్రతి గ్రామంలో ఎస్సీ, ఎస్టీలకు ప్రత్యేకంగా శ్మశాన వాటికలు ఏర్పాటు చేసేందుకు అవసరమైన భూములను సేకరించాలన్నారు. ఇందుకు ప్రత్యేక డ్రైవ్ నిర్వహించాలన్నారు. వివాదాలపై ఫిర్యాదులు వస్తే ఆ కాపీతో పాటు పరిష్కారాన్ని నివేదిక రూపంలో కమిషన్‌కు పంపాలన్నారు. ప్రత్యేక కౌంటర్లలో 188 ఫిర్యాదులు జిల్లాలో ఎస్సీ, ఎస్టీ భూముల వివాదాలపై ఫిర్యాదులు ఇచ్చేందుకు ఈ నెల 1 నుంచి 10 తేది వరకు ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేశామని జేసీ హరికిరణ్ తెలిపారు. ఈ కేంద్రాలకు మొత్తం 188 ఫిర్యాదులు రాగా, ఇప్పటికే 60 పరిష్కరించామన్నారు. అధికారులు ప్రజా సాధికార సర్వేలో ఉండడం వల్ల మిగిలినవి పెండింగ్‌లో ఉన్నాయని, ప్రతి నెల 4వ సోమవారం ప్రత్యేకంగా ఎస్సీ, ఎస్టీ భూముల వివాదాలపై విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సమావేశం ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. గత 17 నెలల కాలంలో ఈ సమావేశాలకు 950 ఫిర్యాదులు రాగా 856 అర్జీలు పరిష్కారం అయ్యాయన్నారు. వివిధ ప్రజా సంఘాల నాయకులు కమిషన్ చైర్మెన్ కారెం శివాజీకి వినతులు ఇచ్చారు. సమావేశంలో ఏఎస్పీ చంద్రశేఖర్ రెడ్డి, డీఆర్ఓ గంగాధర్ గౌడు, ఆయా శాఖల జిల్లా అధికారులు, ఆర్డీఓలు, తహశీల్దార్లు తదితరులు పాల్గొన్నారు. -
ఎస్సీ,ఎస్టీల భూములు ఆక్రమిస్తే అట్రాసిటీ కేసులు
ఒంగోలు కలెక్టరేట్, న్యూస్‌లైన్ : ‘నిరుపేద ఎస్సీ,ఎస్టీలకు ప్రభుత్వం భూమి ఇచ్చింది. వారిని ఆ భూమిలోకి అడుగు పెట్టనీయకుండా ఇతర వర్గాలు అడ్డుకుంటే వెంటనే స్పందించాలి. హక్కుదారులైన ఎస్సీ,ఎస్టీలకు ఆ భూమిని అప్పగించాల్సిన బాధ్యత అధికారులపై ఉంది. అడ్డుకోకుండా చూస్తూ ఉంటే మనం ఉండి ఉపయోగం లేదు’ అని డీఎస్పీలు, ఇతర అధికారులతో కలెక్టర్ జీఎస్ఆర్కేఆర్ విజయకుమార్ అన్నారు. ఎస్సీ,ఎస్టీలకు పంపిణీ చేసిన భూముల్లోకి వారిని రానీయకుండా ఎవరు అడ్డుకున్నా అట్రాసిటీ కేసు నమోదు చేయాలని డీఎస్పీలను ఆదేశించారు. ఎస్సీ,ఎస్టీల పేరుతో బోగస్ పట్టాలు ఎక్కడైనా పొందితే పదిహేను రోజుల్లో నివేదిక అందించాలని రెవెన్యూ అధికారులను ఆదేశించారు. శనివారం ఉదయం స్థానిక సీపీఓ కాన్ఫరెన్స్ హాలులో నిర్వహించిన జిలా స్థాయి నిఘా మరియు పర్యవేక్షణ కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు.‘ఎస్సీ,ఎస్టీలు ఇతర వర్గాల చేతుల్లో దెబ్బతిని మన వద్దకు వస్తే ముందుగా బాధితుని పక్షానే సంబంధిత డీఎస్పీ ఉండాలన్నారు. అన్యాయం జరిగినట్లు తేలితే తప్పకుండా న్యాయం చేయాలి. ఆ కేసు ఫాల్స్ అని తేలితే వదిలేయాలి’ అని సూచించారు. ఎస్సీ,ఎస్టీలకు సంబంధించిన ఆస్తులను కాపాడాల్సిన బాధ్యత పోలీసు, రెవెన్యూ అధికారులపై ఉందని కలెక్టర్ స్పష్టం చేశారు. వాట్ ఈజి దిస్ నాన్సెన్స్ ‘జిల్లా స్థాయి నిఘా మరియు పర్యవేక్షణ కమిటీ సమావేశం జరిగి ఆరు నెలలైంది. ఆరు నెలల తర్వాత కూడా విచారణకు సంబంధించిన సమాచారం లేదు. సమావేశం జరిగిన ఆరు నెలల తరువాత నోటీసు ఇచ్చానని చెబుతున్నావు. వాట్ ఈజ్ దిస్ నాన్సెన్స్’ అంటూ మార్కాపురం డీఎస్పీపై తీవ్ర స్థాయిలో కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మార్కాపురం మండలం గజ్జెలకొండలో తిరుమల ఆటో మొబైల్స్ ఫైనాన్స్ నిర్వాహకులు ఎస్సీ వ్యక్తిపై దాడి చేస్తే ఇంతవరకూ ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంపై మార్కాపురం డీఎస్పీని నిలదీశారు. కేసును పరిశీలిస్తున్నానని ఆయన సమాధానం చెప్పడంపై కలెక్టర్ మండిపడ్డారు. కల్చరల్ ప్రోగ్రాం చూసేందుకు వచ్చామా? ‘ఆరునెలల క్రితం జరిగిన జిల్లా స్థాయి నిఘా మరియు పర్యవేక్షణ కమిటీ సమావేశంలో ప్రస్తావించిన అంశాన్ని మూడు నెలల్లో నివేదించాలని ఆదేశించాను. ఆరు నెలల తరువాత జరుగుతున్న సమావేశానికి ప్రాథమిక సమాచారం కూడా లేకుండా వచ్చారు. ఒకరి మొహం ఒకరు చూసుకుంటున్నారు. మనం కల్చరల్ ప్రోగ్రాం చూసేందుకు వచ్చామా’ అని ఒంగోలు ఆర్డీఓ ఎంఎస్ మురళి, ఒంగోలు తహసీల్దార్ మూడమంచు వెంకటేశ్వర్లుపై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒంగోలు మండలం ముక్తినూతలపాడులో 6 ఎకరాల ప్రభుత్వ భూమిలో 2 ఎకరాలు గతంలో ఎస్సీలకు శ్మశాన వాటిక కింద కేటాయించారని, ఆ భూమిని అక్కడ ఉండే ఓ వ్యక్తి తనదంటూ ముందుకు రావడంపై గత సమావేశంలో సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేసిన నేపథ్యంలో విచారించి పూర్తి స్థాయి నివేదికలతో రావాలని ఆదేశిస్తే సమాచారం లేకుండా ఎందుకు వచ్చారని వారిని నిలదీశారు. భారతం చదివేందుకు కాదు పిలిచింది భారతం,రామయణం చదివేందుకు కాదు ఇక్కడికి పిలిచిందని సాంఘిక సంక్షేమశాఖ డిప్యూటీ డైరక్టెర్ సరస్వతిపై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆమె డిపార్ట్మెంట్కు చెందిన కొందరు అధికారులు సమావేశానికి గైర్హాహాజరు కావడంపై కలెక్టర్ నిలదీశారు. విచారించకుండానే ఫాల్స్ అంటున్నారు: ఆండ్ర మాల్యాద్రి ఎస్సీ,ఎస్టీలు దాడులకు గురైన సమయంలో సంబంధిత డీఎస్పీలు పూర్తిస్థాయిలో విచారించకుండానే కేసు ఫాల్స్ అంటున్నారని కమిటీ సభ్యుడు ఆండ్ర మాల్యాద్రి ఆరోపించారు. డీఎస్పీ స్థాయి అధికారి విచారణ జరపకుండా కింది స్థాయిలో వచ్చే రిపోర్టును ఆధారం చేసుకుంటున్నారన్నారు. కొన్ని సమయాల్లో రాజకీయ ఒత్తిళ్లు వస్తుండటంతో కేసులు నీరుగారుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కొన్ని కేసులను ఆయన ప్రస్తావించారు. కలెక్టర్ జోక్యం చేసుకుని కేసు ఫాల్స్ అనుకున్నప్పుడు అన్యాయం జరిగి ఉంటుందా.. అన్న కోణంలో మరోసారి పరిశీలించాలని డీఎస్సీలను ఆదేశించారు. డీఎఫ్‌ఓకు షోకాజ్ నోటీసు జిల్లా స్థాయి నిఘా కమిటీ సమావేశానికి గైర్హాజరైన డీఎఫ్‌ఓకు షోకాజు నోటీసు జారీ చేయాలని కలెక్టర్ ఆదేశించారు. కీలకమైన ఈ సమావేశానికి ఆయన గైర్హాజర్ కావడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కమిటీ సభ్యుడు పేరం సత్యం మాట్లాడుతూ గిద్దలూరు పరిధిలోని 870 ఎరుకల కుటుంబాల వారు అటవీ ప్రాంతంలోకి వెళ్లి కర్రలు కొట్టుకొని జీవనం సాగిస్తున్నారని, అటవీశాఖ అధికారులు వారిని అడ్డుకుంటున్నారని సమావేశం దృష్టికి తీసుకొచ్చారు. ఎఫ్డీఓ వచ్చారా అని కలెక్టర్ మరోమారు ప్రస్తావించారు. ఆయన రాలేదని చెప్పడంతో షోకాజ్ నోటీసు ఇవ్వాలని ఆదేశించారు. ఈ సమావేశానికి ప్రజాప్రతినిధులు హాజరు కాకపోవడం గమనార్హం. సమావేశంలో ఎస్పీ ప్రమోద్‌కుమార్, జాయింట్ కలెక్టర్ యాకూబ్ నాయక్, జిల్లా రెవెన్యూ అధికారి గంగాధర్‌గౌడ్, కమిటీ సభ్యులు బిళ్లా చెన్నయ్య, పేరం ప్రభాకర్‌తోపాటు ఆర్డీఓలు, డీఎస్పీలు పాల్గొన్నారు.