breaking news
st development act
-
15 శాఖలు.. పైసా ముట్టలేదు
సాక్షి, హైదరాబాద్: గిరిజనాభివృద్ధిని కొన్ని సర్కారీ విభాగాలు నిర్లక్ష్యం చేస్తున్నాయి. ఎస్టీల అభ్యున్నతి కోసం రాష్ట్ర ప్రభుత్వం అధికమొత్తంలో నిధులు కేటాయించి భారీ లక్ష్యాల్ని నిర్దేశించినప్పటికీ, వాటి అమలును పట్టించుకోవడం లేదు. దీంతో గిరిజనుల పురోగతి అంతంతమాత్రంగానే ఉంటోంది. గిరిజనుల కోసం అమల్లో ఉన్న ఉప ప్రణాళికను రద్దుచేసిన రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా 2017–18 నుంచి గిరిజన ప్రత్యేక అభివృద్ధి నిధి (ఎస్టీ ఎస్డీఎఫ్)ని అమల్లోకి తెచ్చింది. ఇందులో భాగంగా ఈ ఏడాది రూ.8,165.87 కోట్లు కేటాయించింది. 42 శాఖల ద్వారా ఈ నిధులు వినియోగించేలా లక్ష్యాలు నిర్దేశించింది. పక్కా ప్రణాళిక, కఠిన నిబంధనలతో ఎస్టీ ఎస్డీఎఫ్ అమల్లోకి తెచ్చినప్పటికీ కొన్ని ప్రభుత్వ శాఖలు ఈ నిధిపై నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తున్నాయి. కేటా యించిన నిధులనుంచి పైసా ఖర్చు చేయకపో వడంతో గిరిజన అభివృద్ధి మంద గించింది. ప్రస్తుత వార్షిక సంవత్సరం మూడో త్రైమాసికం ముగుస్తుండగా ఎస్టీ ఎస్డీఎఫ్ కింద కేవలం రూ.3,624.95 కోట్లు మాత్రమే ఖర్చు చేసినట్లు ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయి. ఈ ఏడాది లక్ష్యంలో కేవలం 44.39 శాతమే పురోగతి సాధించడం గమనార్హం. పైసా ముట్టని 15 శాఖలు.. ఎస్టీ ప్రత్యేక అభివృద్ధి పథకం కింద ప్రాధాన్యత ఉన్న ప్రతి విభాగాన్ని ప్రభుత్వం భాగస్వామ్యం చేసింది. ఈ క్రమంలో 42 శాఖలను నిర్దేశిస్తూ నిధులు కేటాయించింది. అయితే నిర్దేశించిన శాఖల్లో 15 విభాగాలు పైసా కూడా ఖర్చు చేయలేదు. పంచాయతీరాజ్ (హెచ్ఓడీ), ఈఎన్సీ బిల్డింగ్ అండ్ సీఆర్ఎఫ్, పబ్లిక్ హెల్త్ ఫ్యామిలీ వెల్ఫేర్, రిలీఫ్, టీఎస్ఐడీసీ, ఎంప్లాయ్మెంట్ అండ్ ట్రైనింగ్, హోమ్, హెల్త్ మెడికల్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ (సెక్రటరీ), మార్కెటింగ్, లేబర్, గ్రౌండ్ వాటర్, మైనర్ ఇరిగేషన్, ఫారెస్ట్ విభాగాలు కేటాయించిన నిధులను పైసా కూడా ఖర్చు చేయనట్లు ప్రభుత్వ నివేదికలు చెబుతున్నాయి. ఈ శాఖలకు సుమారు రూ.160 కోట్లు కేటాయించినా.. నిధులు ఖర్చు చేసినట్లు ప్రభుత్వానికి గణాంకాలు సమర్పించలేదు. నూరు శాతం కష్టమే... కొత్తగా అమల్లోకి వచ్చిన ఎస్టీ ఎస్డీఎఫ్ కింద కేటా యించిన మొత్తాన్ని నూరు శాతం ఖర్చు చేయాలని ప్రభుత్వం మార్గదర్శకాల్లో స్పష్టం చేసింది. ఏదేనీ సందర్భంలో పూర్తిస్థాయిలో నిధులు ఖర్చుకాకపోతే వాటిని వచ్చే ఏడాదికి వాడుకునే వెసులుబాటు ఉంది. ఈ ఏడాది కేటాయించిన మొత్తంలో ఇప్పటి వరకు 44.39 శాతం మాత్రమే ఖర్చు చేశారు. మరో మూడు నెలల్లో వార్షిక సంవత్సరం ముగియనుంది. అయితే మూడు నెలల్లో పూర్తిస్థాయి నిధులు ఖర్చు చేస్తాయా అనే అంశంపై సందిగ్ధత నెలకొంది. -
ఎస్టీల అభివృద్ధికి సలహాలివ్వండి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఎస్టీల అభివృద్ధికి చేపట్టాల్సిన కార్యక్రమాలు, ప్రవేశ పెట్టాల్సిన పథకాలు, తీసుకోవాల్సిన చర్యలను సూచించాలని ఎస్టీ ప్రజా ప్రతినిధులను ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు కోరారు. ఎస్టీలంతా ఐక్యంగా ఉండి ప్రభుత్వ పథకాలతో లబ్ధి పొందాలని, పేదరికాన్ని తరిమి కొట్టడానికి సమైక్యంగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. సమస్యలుంటే పరిష్కరించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని.. సమస్యలు, ఇబ్బందులను సర్కారు దృష్టికి తీసుకురావాలని కోరారు. ‘రాష్ట్రంలో 30 లక్షల మందికి పైగా ఎస్టీలున్నారు. వారి అభివృద్ధి, సంక్షేమానికి ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తోంది. ఎన్నో ఏళ్లుగా డిమాండ్ చేస్తున్న ప్రత్యేక గ్రామ పంచాయతీల కోరిక ను నెరవేరుస్తోంది. ప్రత్యేక ప్రగతి నిధి తీసుకొచ్చింది. ఎస్టీ రెసిడెన్షియల్ పాఠశాలలు నెలకొల్పింది. ప్రభుత్వ సంకల్పాన్ని ఎస్టీలు అర్థం చేసుకోవాలి’ అని సీఎం అన్నారు. శుక్రవారం ప్రగతి భవన్లో ఎస్టీ ప్రజా ప్రతినిధులతో సీఎం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ‘ఎస్టీలకు ఇంకా కొన్ని సమస్యలున్నాయి. కొన్ని ఎస్టీ ఆవాస ప్రాంతాల్లో త్రీఫేజ్ కరెంటు రావడం లేదు. కొన్నింటికి కరెంటే లేదు. కొన్ని ప్రాంతాల్లో రోడ్లు, బస్సు సౌకర్యం లేదు. ఆర్ఓఎఫ్ఆర్ పట్టాలను గుర్తించే విషయం లో సమస్యలున్నాయి. పోడు భూముల్లో వ్యవసాయం చేసుకునే వారికి ప్రభుత్వ సాయం విషయంలో చిక్కులున్నాయి. రెవెన్యూ, అటవీ భూముల లెక్కలు తేలక అక్కడక్కడ గిరిజనులు ఇబ్బంది పడుతున్నారు. 1/70 చట్టం అమలు విషయంలో కొన్ని ఇబ్బందులున్నాయి. ఎస్టీ ధ్రువీకరణ పత్రాల సమస్యలున్నాయి. స్వయం ఉపాధి పథకాలకు బ్యాంకులు సహకరించటం లేదు. ఇందిరమ్మ ఇళ్ల బిల్లుల చెల్లింపులు కొన్ని చోట్ల జరగాల్సి ఉంది. అన్ని సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపిస్తాం’ అని సీఎం స్పష్టం చేశారు. ఏం చేస్తే బాగుంటుంది? ఎస్టీలు ఎదుర్కొంటున్న సమస్య లేంటి, వాటికున్న పరిష్కార మార్గాలేంటి, ఎస్టీలకు ఇంకా ఏం చేస్తే బాగుంటుంది, ఎలాంటి పథకాలు ప్రవేశ పెట్టాలి లాంటి అంశాలపై ఎస్టీ ప్రజాప్రతినిధులు ప్రభుత్వానికి సూచనలు ఇవ్వాలని సీఎం కోరారు. ఓట్ల కోసం కాక ఎస్టీల్లో నిజమైన మార్పు కోసం పనిచేద్దాం అని పిలుపు నిచ్చారు. ఎస్టీ ప్రజాప్రతినిధులంతా శనివారం సమావేశం నిర్వహించుకుని సరైన ప్రతిపాదనలతో ప్రగతి భవన్ రావాలని కోరారు. మరోసారి సమావేశమై ఎస్టీల కోసం తీసుకోవాల్సిన చర్యలపై స్పష్టతకు రావాలని నిర్ణయించారు. -
ఈ చట్టం బడుగులకు భరోసా
కొత్త కోణం తెలంగాణ సీఎం కేసీఆర్ చొరవతో రూపొందిన ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక అభివృద్ధి నిధి చట్టం, సబ్‌ప్లాన్‌కు కాలదోషం పట్టడం వల్ల నెలకొన్న అనిశ్చితిని, అభద్రతను తొలగించి భరోసా నిచ్చింది. కొత్త చట్టం దళిత, ఆదివాసీల సంక్షేమాన్ని వారి చట్టపరమైన హక్కును చేసింది. నిధుల దారి మళ్లింపునకు దారులను మూసేసింది. సబ్‌ప్లాన్‌లోని అసంబద్ధమైన పదేళ్ల కాల పరిమితిని తొలగించింది. అమలు తీరుపై అత్యంత పారదర్శక, ప్రజాస్వామిక సమీక్షకు హామీనిచ్చింది. చట్టం రూపకల్పన నుంచి అడుగడుగునా ప్రభుత్వ చిత్తశుద్ధి కనిపిస్తుంది. ‘‘ఏదైనా గ్రామానికి వెళ్లి ఇక్కడ అత్యంత పేదరికంలో మగ్గుతున్న వారెవ్వ రయ్యా అని అడిగితే, అనాదిగా అణచివేతకు గురౌతున్న దళితులేనని చెప్పక తప్పదు. అంతేకాదు, తరతరాలుగా మిగతా సామాజిక వర్గాలు, కులాలకన్నా అత్యంత వివక్షకు, అవమానాలకు, అణచివేతకు గురవుతున్నది కూడా వీరే నని అందరం అంగీకరిస్తాం. అటువంటి వర్గాల కోసం ఈ సమాజం ప్రత్యేక మైన శ్రద్ధ వహించాలి. ప్రభుత్వం మీద ఈ బాధ్యత మరింత ఎక్కువగా ఉంటుందనేది మర్చిపోకూడదు’’. ఇది ఎస్సీ, ఎస్టీ స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ (ప్రత్యేక అభివృద్ధి నిధి) బిల్లుపై తెలంగాణ శాసనసభలో ముఖ్య మంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు అన్న మాటలివి. గతంలో అమలులో ఉన్న ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ స్థానంలో ఈ బిల్లును తెలంగాణ ప్రభుత్వం శాసన సభలో ప్రవేశపెట్టింది. ఒకరోజు చర్చ అనంతరం మార్చి 24న శాసనసభ దానిని ఏకగ్రీవంగా ఆమోదించింది. ప్రణాళికా సంఘం స్థానంలో ఏర్పాటు చేసిన నీతి ఆయోగ్ సిఫారసులకు అనుగుణంగా బడ్జెట్లోని ప్రణాళిక, ప్రణా ళికేతర పద్దుల విభజనను కేంద్రం రద్దు చేసింది. రెవెన్యూ (రాబడి), క్యాపి టల్ (పెట్టుబడి) అనే స్థూల విభజనను మాత్రమే బడ్జెట్లో పొందుపర్చారు. దీంతో 2012లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఆమోదం పొందిన సబ్‌ప్లాన్ చట్టం ఉనికిలో లేకుండా పోయింది. అయితే కేంద్రంగానీ, ఆంధ్రప్రదేశ్ ప్రభు త్వంగానీ, ఏపీని అనుసరించి సబ్‌ప్లాన్ చట్టం చేసిన కర్ణాటక ప్రభుత్వం కానీ ఈ విషయంలో మౌనంగానే ఉండిపోయాయి. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీ ఆర్ సబ్‌ప్లాన్ చట్టం లేని లోటును తీర్చడానికి ఈ ప్రత్యేక నిధి చట్టం రూపకల్పనకు పూనుకున్నారు. చట్టం తీసుకురావడానికి నెల రోజుల ముందు నుంచి దానిపై విస్త్రుతంగా చర్చలు జరిపారు. విశిష్టం ఎస్టీ, ఎస్టీ ప్రత్యేక అభివృద్ధి నిధి చట్టం ఈ చట్టం రూపకల్పనలో రెండు ముఖ్యమైన విషయాలున్నాయి. అందులో మొదటిది సబ్‌ప్లాన్ స్థానంలో ఎస్సీ, ఎస్టీల ప్రత్యేక అభివృద్ధి నిధి చట్టాన్ని తీసుకురావడం. ఈ కొత్త చట్టాన్ని తీసుకురాకుంటే ఎస్సీ, ఎస్టీల అభివృద్ధికి కేటాయించే నిధులకు చట్టబద్ధత ఉండదు. కాబట్టి ఆ విషయంలో అనిశ్చితి, అభద్రత నెలకొనేవి. ఎస్సీ, ఎస్టీలు తమ సంక్షేమాభివృద్ధి కోసం పాలకుల దయాదాక్షిణ్యాలపై ఆధారపడక తప్పని పరిస్థితి ఏర్పడేది. ప్రభు త్వాలు ఎస్టీ, ఎస్సీ సంక్షేమ పథకాలు ఇక వారి హక్కుగా ఉండేవి కావు కాబట్టి వాటిని అమలు చేయకపోతే న్యాయ పోరాటం చేయడానికి అవకాశం ఉండేది కాదు. ఎస్సీ, ఎస్టీల కోసం కేటాయించిన నిధులను అందుకు ఖర్చు చేయక పోతే న్యాయస్థానాలను ఆశ్రయించే అవకాశమూ లేకుండేది. చట్టం ప్రజలకు ప్రశ్నించే హక్కునిస్తుంది. ఆ హక్కు వారికో భరోసానిస్తుంది. పైగా ప్రత్యేక అభివృద్ధి నిధి చట్టం అమలు ప్రభుత్వ బాధ్యతగా మారుతుంది. సబ్‌ప్లాన్ చట్టాన్ని తీసుకువచ్చేటప్పుడు అందులోకి కొన్ని అవాంఛనీయ అంశాలు కూడా చొరబడ్డాయి. ఆ చట్టం తేవడమే ప్రధాన లక్ష్యం కావడంతో ఉద్యమకారులు, ప్రతిపక్షాలు పట్టువిడుపుల ధోరణిని అవలంబించక తప్ప లేదు. వాటిలో ఒకటి సబ్ ప్లాన్ చట్టానికి పదేళ్ల కాల పరిమితిని విధించడం. ఇది చాలా మందిలో అవిశ్వాసాన్ని, పదేళ్ల తరువాత ఆ చట్టం ఉండదేమోననే భయాన్ని కలిగించింది. నాడు ప్రతిపక్ష పార్టీగా ఉన్న తెలంగాణ రాష్ట్ర సమితి సభలో ఈ కాల పరిమితిని తొలగించాలంటూ సవరణను ప్రవేశపెట్టింది. కానీ సభ ఆమోదం పొందలేకపోయింది. నేటి కొత్త చట్టం ఆ పదేళ్ల కాల పరిమితిని తొలగించడాన్ని పెద్ద మార్పుగా భావించాలి. రెండో ముఖ్యాంశం నిధుల వినియోగానికి సంబంధించినది. సబ్‌ప్లాన్ చట్టాన్ని తెచ్చేటప్పుడు... ఒక ఏడాది ఖర్చు కాని నిధులను మరుసటి ఏడాది బడ్జెట్లో కలపాలని టీఆర్ఎస్తో పాటూ ప్రతిపక్ష పార్టీలన్నీ చేసిన ప్రతిపాదన కూడా వీగిపోయింది. నూతన చట్టంలో ఆ అంశాన్ని సైతం చేర్చారు. కాబట్టి నిధుల దారి మళ్లింపునకు అడ్డుకట్టపడుతుంది. ఈ ఏడాది కేటాయించిన నిధులు ఖర్చుగాక మిగిలిపోతే, అవి మరుసటి ఏడాది ఎస్సీ, ఎస్టీలకు కేటాయించిన బడ్జెట్‌కు జమ అవుతాయి. దీని వల్ల నిధుల వినియోగం పెరుగుతుంది, అధికారయంత్రాంగపు నిర్లక్ష్య ధోరణి తగ్గుతుంది. మూడో అంశం ప్రతి మూడు నెలలకు ఒకసారి ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక అభివృద్ధి ని«ధి కేటాయింపులు, ఖర్చులు వివరాలను శాఖలు, పథకాల వారీగా శాసనసభ ముందుంచాలనే నిబంధన చాలా ముఖ్యమైనది. వాటిని పారదర్శకంగా ప్రజల ముందుంచాలనే ఆలోచనను మార్గదర్శక సూత్రాల్లో చేర్చనున్నారు. దీనివల్ల ఎస్సీ, ఎస్టీ, ఎస్డీఎఫ్ అమలు తీరుపై ప్రజల తనిఖీ సాధ్యం అవు తుంది. ఆ పథకాల వల్ల లబ్ధిదారులకు ఏ మేరకు ప్రయోజనం కలుగుతు న్నదో అందరికీ తెలిసే అవకాశం ఉంటుంది. ఈ చట్టంలోని నాలుగో ముఖ్య మైన అంశం చట్టం అమలు పర్యవేక్షణకు ఒక ప్రత్యేక కమిటీ ఏర్పాటు. ప్రభుత్వంలో భాగమైన నోడల్ ఏజెన్సీలు, ముఖ్యమంత్రి అధ్యక్షతన ఉండే స్టేట్ కౌన్సిల్‌తో పాటూ ఈ కమిటీ స్వతంత్రంగా పనిచేస్తుంది. అది ప్రత్యేక అభివృద్ధి నిధి చట్టం అమలును నిష్పక్షపాతంగా పర్యవేక్షిస్తుంది. అమలులోని లోపాలను ఎత్తిచూపుతూ మరింత సమర్థవంతంగా అది అమలు కావడానికి తీసుకోవాల్సిన చర్యలను ప్రభుత్వానికి సూచిస్తుంది. ప్రజాస్వామిక పద్ధతిలో సంక్షేమ పథకాలు ఈ చట్టం ప్రధాన ఉద్దేశ్యం దళితులు, ఆదివాసీల జీవన స్థాయిని, ఆర్థిక, సామాజిక ప్రగతిని మిగతా సమాజంతో సమానంగా వృద్ధి చేయడం. ఇంత వరకు వివిధ రంగాల్లో ముఖ్యంగా విద్య, ఆరోగ్యం, ఉపాధి రంగాల్లో ఎంతో వెనుకబడి ఉన్న ఈ వర్గాలను సమాజంలో తల ఎత్తుకొని నిలబడేలా చేసేం దుకు ఈ చట్టం ఉపయోగపడుతుంది. చట్టం పీఠికలోనే ఈ లక్ష్యాన్ని పొందు పరచారు. సమాజంలోని ఇతర వర్గాలతో సమానంగా ఎదుగుతూనే రెండో వైపు షెడ్యూల్డ్ కులాల్లో తెగల్లో ఇంకా అభివృద్ధికి నోచుకోని కులాలను, తెగలను గుర్తించి, వారి అభివృద్ధికి ప్రత్యేక శ్రద్ధ చూపాలని కూడా ఈ చట్టం నిర్దేశిస్తున్నది. చట్టంలోని చాప్టర్ – 2 సెక్షన్ 6 లో పేర్కొన్నట్టుగా షెడ్యూల్డ్ కులాలు, తెగల్లోని వారి వారి అవసరాల రీత్యా ప్రత్యేక పథకాలను రూపొం దించాలి. వివిధ కులాలు, తెగల మధ్య అసమానతల తొలగింపుకు ఈక్విటీ పాటించాలని ఈ చాప్టర్ పేర్కొంది. అయితే దీనర్థం అన్ని కులాలకు సమాన అవకాశాలు అని మాత్రమే అర్థం చేసుకోకూడదు. ఎవరైతే సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడి ఉన్నారో, అవకాశాలను అందుకోలేకపోతున్నారో వారి పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలని దాని ఉద్దేశ్యం. అందుకు గాను ప్రత్యేక పథకా లను తయారుచేయాలని కూడా ఈ చట్టం చాలా నిర్దిష్టంగా పేర్కొంటున్నది. అదేవిధంగా ముఖ్యమంత్రి అధ్యక్షతన ఉండే స్టేట్ కౌన్సిల్లో ఎస్సీ, ఎస్టీ శాసనసభ, శాసన మండలి, పార్లమెంటు సభ్యులు ప్రతినిధులుగా ఉంటారు. దీని వల్ల కార్యక్రమాల రూపకల్పన, బడ్జెట్ కేటాయింపులు, నిధుల విడుద లలో ప్రజాస్వామ్య విధానం అమలు జరుగుతుంది. అంతేకాకుండా ఏఏ పథకాలు, కార్యక్రమాలైతే దళిత, ఆదివాసీ అభి వృద్ధికి ప్రత్యక్షంగా దోహదం చేస్తాయో వాటిని మాత్రమే ఈ ప్రత్యేక నిధి కింద రూపొందించాలని చట్టంలోని చాప్టర్ –2 సెక్షన్ 5 నిర్దేశించింది. పథకా లను రూపొందించడం వాటికి నిధులు కేటాయించడం, వాటి అమలును పర్యవేక్షించడం లాంటి పనులను రాష్ట్ర షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖా మంత్రి, గిరిజన సంక్షేమ శాఖా మంత్రి అధ్యక్షతన ఏర్పడే నోడల్ ఏజెన్సీలే చూసుకుంటాయి. ఒకవేళ ఏ శాఖలోనైనా నిధులు ఖర్చుకాకపోతే వాటిని వెనక్కి తీసుకొని, అవసరం ఉన్న మరొక కార్యక్రమానికి వినియోగించే అధి కారం నోడల్ ఏజెన్సీకి ఉంటుంది. చాప్టర్ –5 సెక్షన్ 20 సబ్‌సెక్షన్–సి ఈ అధికారాన్ని నోడల్ ఏజెన్సీలకు అప్పజెప్పింది. అదే విధంగా చాప్టర్–5 సెక్షన్ 20 సబ్ సెక్షన్ హెచ్ ప్రకారం ఎస్సీ, ఎస్టీ ఎస్డీఎఫ్ కింద ఖర్చుచేసే నిధుల వివరాలను ప్రజా పర్యవేక్షణకు (సోషల్ ఆడిట్) అందుబాటులో ఉంచు తారు. రాష్ట్ర స్థాయిలో ఉన్నట్టే జిల్లా స్థాయిలో కూడా జిల్లా కలెక్టర్ అధ్యక్షతన పర్యవేక్షణ కమిటీలుంటాయి. ఆయా జిల్లాలకు చెందిన ఎస్సీ, ఎస్టీ ఎమ్మె ల్యేలు, ఎమ్మెల్సీలు, పార్లమెంటు సభ్యులు దీనిలో సభ్యులుగా ఉంటారు. ప్లాన్, నాన్–ప్లాన్ పద్దులు ఇక లేనందున తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యే కంగా రూపొందించిన ప్రగతి పద్దు నుంచి జనాభా దామాషా ప్రకారం ఎస్సీ, ఎస్టీ ఎస్డీఎఫ్ నిధుల కేటాయింపులు చేస్తారు. ప్రగతి పద్దు అంటే ప్రజల ప్రత్యక్ష అభివృద్ధికి రూపొందించిన పథకాలు, కార్యక్రమాలుగా పేర్కొన్నారు. చిత్తశుద్ధి ప్రశంసనీయం, అయినా... చట్టం రూపకల్పన నుంచి నిధుల కేటాయింపుల వరకు ప్రభుత్వం చాలా చిత్తశుద్ధితో కృషి చేసిందనడం నిస్సందేహం. పథకాల రూపకల్పన, నిధుల వినియోగం నేడు చాలా ముఖ్యాంశం. ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం కొన్ని ప్రత్యేకమైన కార్యక్రమాలను అమలు చేస్తున్నది. దళితులకు మూడెక రాల భూమి, కల్యాణ లక్ష్మి, విదేశీ విద్యకు ఆర్థిక సహకారం, రెసిడెన్షియల్ విద్యాలయాల సంఖ్య భారీ పెంపుదల ఇందులో ముఖ్యమైనవి. అందులో దళితులకు మూడెకరాల భూమి కీలకమైనది. కానీ ఇప్పటి వరకు వదివేల ఎకరాల భూమిని మాత్రమే పంపిణీ చేశారు. భూమి అమ్మే వాళ్లు ముందుకు రాకపోవడమే ఇందుకు కారణమని చెప్తున్నారు. అది నిజమే అయినా, ఎమ్మె ల్యేలు, ఎంపీలు, అధికారులు ఈ విషయంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టడం లేదనేది వాస్తవం. దీన్ని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం ఒక టాస్క్ ఫోర్స్‌ను ఏర్పాటు చేయడం ఉత్తమమని పరిశీలకుల భావన. ప్రభుత్వాలు అమలు చేస్తున్న కార్యక్రమాలుగానీ, చట్టాలు గానీ, ప్రజలకు చేరువ కావాలంటే పౌరసమాజం జాగృతం కావాలి. ముఖ్యంగా దళిత సమాజం ఈ ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక అభివృద్ధి చట్టాన్ని అవగాహన చేసు కొని, తద్వారా లబ్ధిపొందే ప్రయత్నం చేయాలి. దళిత సంఘాలు, సంస్థలు విద్యావేత్తలు ఇటువైపుగా ద్టృష్టిసారించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. - మల్లెపల్లి లక్ష్మయ్య వ్యాసకర్త సామాజిక విశ్లేషకులు ‘ మొబైల్ : 97055 66213