breaking news
st cell
-
ఏజెన్సీలో ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేయాలి
బుట్టాయగూడెం: ఏజెన్సీ ప్రాంతాల్లోని ఉపాధ్యాయ పోస్టులను స్థానికంగా అర్హులైన గిరిజనులతోనే భర్తీ చేయాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎస్టీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే తెల్లం బాలరాజు కోరారు. సోమవారం బాలరాజు ఆధ్వర్యంలో గిరిజన ఎమ్మెల్యేలు పుష్పశ్రీవాణి, కళావతి, గిద్దా ఈశ్వరి, ఏపీ ఆదివాసీ టీచర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు జలగం రాంబాబు, ఆ సంఘ ప్రధాన కార్యదర్శి కణితి శేఖర్, ప్రతినిధులు సరియం నాగేశ్వరావుతో కూడిన బృందం గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శి సెక్రటరీ ఆదిత్యనా«థ్ దాస్‌ను కలిసి ఉపాధ్యాయ పోస్టుల భర్తీ కోరుతూ వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా బాలరాజు మాట్లాడుతూ రాష్ట్రంలోని ఉభయ గోదావరి, విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో ఆదివాసీ గిరిజనులు నివసిస్తున్న ప్రాంతాలను భారత ప్రభుత్వం రాజ్యాంగబద్ధంగా గుర్తించి ఏజెన్సీ ప్రాంతంగా ప్రకటించిందన్నారు. దీని ప్రకారం ప్రభుత్వ ఉద్యోగ నియామకాలు ఏజెన్సీ ప్రాంతం, మైదాన ప్రాంతం వారికి వేర్వేరుగా చేపట్టనున్నట్టు చెప్పారు. జీవో నెంబర్ 5,2 ప్రకారం రూల్ ఆఫ్ రిజర్వేషన్లో భాగంగా రిక్రూట్మెంట్తో పాటు ప్రమోషన్లో నియామక రోస్టర్ పాయింట్ ప్రకారం ఎస్సీ, ఎస్టీ ఉద్యోగులకు రిజర్వేషన్లు వర్తింపజేయాలన్నారు. ఎస్టీ అభ్యర్థులతో భర్తీ చేసినప్పుడు ప్రమోషన్లు కూడా వారితోనే పూర్తి చేయాలని గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శి స్పష్టమైన హామీ ఇచ్చారన్నారు. సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని ఆదిత్యనాథ్ తెలిపినట్టు ఉపాధ్యాయ సంఘం నాయకులు జలగం రాంబాబు పేర్కొన్నారు. -
కాంగ్రెస్ ఎస్టీ సెల్ జిల్లా కార్యదర్శిగా రాజునాయక్
వరంగల్ : కాంగ్రెస్ పార్టీ ఎస్టీ సెల్ జిల్లా కార్యదర్శిగా ఆత్మకూరు మండలం కటాక్షపూర్ గ్రామానికి చెందిన అజ్మీరా రాజునాయక్ నియమితులయ్యారు. ఈ మేరకు జిల్లా అధ్యక్షుడు నవీన్‌నాయక్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సందర్భంగా రాజునాయక్ మాట్లాడుతూ తన నియామకానికి సహకరించిన పరకాల నియోజకవర్గ ఇన్చార్జి ఇనుగాల వెంకట్రాంరెడ్డి, డీసీసీ అధ్యక్షుడు నాయిని రాజేందర్‌రెడ్డి, జెడ్పీటీసీ లేతాకుల సంజీవరెడ్డి, మండల అధ్యక్షుడు రాజేశ్వర్‌రావుకు కృతజ్ఞతలు తెలిపారు. -
ప్రజలతో మమేకమై విధులు నిర్వర్తించాలి
ఒంగోలు క్రైం: జిల్లాలో ఉన్న సబ్ డివిజనల్ పోలీస్ అధికారులు (డీఎస్పీ) ప్రజలతో మమేకమై స్నేహపూరిత వాతావరణంతో విధులు నిర్వర్తించాలి. సంఘటనలు జరిగిన వెంటనే కిందిస్థాయి సిబ్బందిని సంబంధిత ప్రాంతాల్లోకి పంపి కేసులను లోతైన అధ్యయనం చేయాలని గుంటూరు రేంజ్ పోలీస్ ఐ.జి. ఎన్.సంజయ్ జిల్లా పోలీస్ అధికారులను ఆదేశించారు. మంగళవారం ఒంగోలు వచ్చిన ఆయన స్థానిక ఎస్పీ ఛాంబర్లో ఎస్పీ చిరువోలు శ్రీకాంత్‌తో కలిసి జిల్లాలోని డీఎస్పీలతో సమీక్ష నిర్వహించారు. ఐదు సబ్‌డివిజన్ డీఎస్పీలతోపాటు ఎస్బి, డిసిఆర్బి, ఎస్సీ, ఎస్టీ సెల్, ట్రాఫిక్, మహిళా పీఎస్, సీసీఎస్ డీఎస్పీలతో సమీక్ష నిర్వహించారు. ఐ.జి.గా బాధ్యతలు తీసుకున్న తర్వాత రెండోసారి జిల్లాకు వచ్చిన ఆయన పోలీస్స్టేషన్ల వారీగా కేసులకు సంబంధించిన వివరాలను డీఎస్పీలను అడిగి తెలుసుకున్నారు. జిల్లాలో అన్ని డీఎస్పీ స్థానాలు భర్తీ అయ్యాయని, కందుకూరు, మార్కాపురానికి డెరైక్టు డీఎస్పీలు బాధ్యతలు తీసుకున్నారని, ప్రొబేషనరీ ఐపీఎస్ బిఆర్ వరుణ్ జిల్లాలో విధులు నిర్వర్తిస్తున్నారని పేర్కొన్నారు. ప్రాధాన్యత కలిగిన కేసులను డీఎస్పీలు స్వయంగా పర్యవేక్షించాలన్నారు. పోలీస్ అధికారులు ప్రజల్లో ఎక్కువగా తిరిగితే పోలీసులంటే జనంలో ఉండే భయం పోతుందన్నారు. సంఘటన జరిగిన తర్వాత పోలీసులు చివరిలో వస్తారన్న నానుడికి చమరగీతం పాడాలని ఐజి పిలుపునిచ్చారు. సీసీఎస్ పోలీస్‌స్టేషన్‌కు స్వతంత్ర ప్రతిపత్తి ఇచ్చే విషయమై విలేకర్లు అడిగినప్పుడు ఈ విషయమై ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపామన్నారు. అనుమానాస్పద (సెక్షన్ 174) కేసుల విషయంలో దర్యాప్తు పురోగతి మందకొడిగా సాగుతోందని ఐజి దృష్టికి తీసుకెళ్ళినప్పుడు అలాంటి కేసులపై ప్రత్యేక దృష్టి సారించమని ఎస్పీ శ్రీకాంత్‌ను ఆదేశించారు. పాత నేరస్తులు అనుమానాస్పద మృతి కేసుల విషయంలో ఫింగర్‌ప్రింట్స్, డేటాబేస్, కనుపాపల గుర్తింపు లాంటి సాంకేతిక అంశాలపై దృష్టి సారిస్తున్నట్లు పేర్కొన్నారు. ఒంగోలు నగరంలో ట్రాఫిక్ జంక్షన్లను పెంచే ఆలోచనలో ఉన్నామన్నారు. జాతీయ రహదారిపై ప్రమాదాలను నివారించేందుకు ప్రత్యేక కార్యాచరణను రూపొందిస్తున్నట్లు వివరించారు. ఎస్పీ శ్రీకాంత్ మాట్లాడుతూ ఇప్పటికే తాలూకా పోలీస్‌స్టేషన్‌ను రెండుగా చేసేందుకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపామని జిల్లాకు చెందిన మంత్రి, ప్రజాప్రతినిధులు సీఎం దృష్టికి తీసుకెళ్ళి విభజన విషయమై ప్రత్యేక చర్యలు తీసుకుంటే తప్ప త్వరగా వీలుపడదన్నారు. అనంతరం జిల్లా పోలీస్ కార్యాలయం సెక్షన్ సూపరింటెండెంట్లు, సిబ్బందితో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ప్రొబెషనరీ ఐపిఎస్ అధికారి బిఆర్ వరుణ్, ఒంగోలు డీఎస్పీ గుంటుపల్లి శ్రీనివాసరావు, సీసీఎస్ డీఎస్పీ కేశన వెంకటేశ్వరరావు, మహిళా పోలీస్‌స్టేషన్ డీఎస్పీ లక్ష్మినారాయణ, ఎస్సీ ఎస్టీ సెల్ డీఎస్పీలు కె. వెంకటరత్నం, మార్కాపురం ఓఎస్డి సమైజాన్‌రావు, ట్రాఫిక్ డీఎస్పీ జె.రాంబాబుతోపాటు పలువురు డీఎస్పీలు పాల్గొన్నారు.