breaking news
St anns college
-
రుతుక్రమ వ్యర్థాలపై పోరు: హైదరాబాద్‌లో 'పీరియడ్. ప్లానెట్, పవర్, ఎకో ఎడిషన్' సక్సెస్
హైదరాబాద్, జూలై 22, 2025: హైదరాబాద్‌లో సెయింట్ ఆన్స్ కాలేజ్(St. Ann’s College) ఫర్ ఉమెన్‌లో రుతుక్రమ వ్యర్థాలు, అవి మానవ ఆరోగ్యంపై, పర్యావరణంపై చూపే ప్రభావం వంటి అంశాలపై సుదీర్ఘకాలంగా నెలకొన్న నిశ్శబ్దాన్ని ఛేదించే ఉద్దేశంతో నిర్వహించిన కార్యక్రమంలో విద్యార్థినులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమం కేవలం సమాచారం అందించడానికే కాకుండా, తరతరాలుగా మూఢనమ్మకాలు, భయాలతో నిండిన సామాజిక సమస్య గురించి యువతుల్లో స్ఫూర్తిని, అవగాహనను పెంపొందించడం లక్ష్యంగా పెట్టుకుంది. గతంలో బహిరంగంగా చర్చించడానికి సంకోచించిన అనేక విషయాలను ఇప్పుడు నిర్భయంగా చర్చించారు.ఈ కార్యక్రమానికి "పీరియడ్. ప్లానెట్. పవర్. ఎకో ఎడిషన్" అని పేరు పెట్టారు. రుతుక్రమంపై ఉన్న అపోహలను తొలగించి, కీలకమైన వాస్తవాలను తెలియజేయడం దీని లక్ష్యం. ప్రస్తుతం వాడుతున్న సాధారణ శానిటరీ ప్యాడ్లలో చాలా ప్లాస్టిక్ ఉంటుంది. ఒక ప్యాడ్ దాదాపు 4 ప్లాస్టిక్ సంచులతో సమానం. అవి కుళ్ళిపోవడానికి, భూమిలో కలిసిపోవడానికి వందల సంవత్సరాలు పడుతుంది. భారతదేశంలో ఏటా లక్ష టన్నులకు పైగా రుతుక్రమ వ్యర్థాలు పోగుపడుతున్నాయి. అందుకే, పర్యావరణానికి, శరీరానికి సురక్షితమైన ప్రత్యామ్నాయాలు ఇప్పుడు చాలా అవసరం."నో ప్లాస్టిక్ ఆన్ ప్రైవేట్" అనే ఒక ముఖ్యమైన ప్రచారంలో భాగంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ ప్రచారాన్ని పద్మశ్రీ అవార్డు గ్రహీత, ప్రముఖ గైనకాలజిస్ట్ డాక్టర్ మంజుల అనగాని(Manjula Anagani) నడిపిస్తున్నారు. ఈ అంశంపై అవగాహన కల్పించడానికి డాక్టర్ నబత్ లఖాని(Nabat Lakhani) (మహిళల ఆరోగ్యం, రుతుక్రమ అవగాహనపై పని చేస్తున్న మర్హమ్ ఎన్జీవో స్థాపకురాలు), అలాగే 95 మిర్చి హైదరాబాద్ బృందం, రోటరాక్ట్ వంటి సంస్థలు ముందుకొచ్చాయి.ప్లాస్టిక్ ప్యాడ్లు కేవలం భూమిని పాడుచేయడమే కాకుండా, మన శరీరానికి కూడా హాని కలిగిస్తాయి. ఒకసారి వాడి పారేసే ప్యాడ్లలో సింథటిక్ పదార్థాలు, బ్లీచులు, ఇతర హానికర రసాయనాలు వాడతారు. వీటి వల్ల చర్మంపై దద్దుర్లు, దురద, చికాకు కలగవచ్చు. అంతేకాకుండా, ఇవి దీర్ఘకాలంలో మహిళల ఆరోగ్యానికి సంబంధించి ఇతర సమస్యలకూ దారితీయవచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు. వాడిన ప్యాడ్లను సరిగ్గా పారవేయకపోతే, అవి నేల, నీరు, గాలిని నిరంతరం కలుషితం చేస్తూనే ఉంటాయి. పర్యావరణంతో పాటు మన ఆరోగ్యాన్ని కూడా కాపాడుకోవాలంటే ప్లాస్టిక్ రహిత ఉత్పత్తులను ఎంచుకోవడం చాలా అవసరం.ఈ కార్యక్రమంలో వాస్తవాలతో కూడిన సమాచారంతో, ఎలాంటి సంకోచం లేకుండా బహిరంగంగా చర్చించారు. హాస్యాన్ని పంచుతూ విద్యార్థినులను వారు వాడుతున్న రుతుక్రమ ఉత్పత్తుల గురించి మళ్లీ ఆలోచించుకోవాలని ఈ సెషన్లో ప్రోత్సహించారు. దీంతోపాటు, పర్యావరణానికి మేలు చేసే, ఆరోగ్యానికి మంచివైన ప్రత్యామ్నాయ క్లాత్ ప్యాడ్లు, మెన్స్ట్రువల్ కప్పులు, పీరియడ్ ప్యాంటీలు, బయోడిగ్రేడబుల్ ప్యాడ్ల గురించి తెలుసుకుని, వాటిని ఉపయోగించాలని ప్రోత్సహించారు. ఈ విధంగా, రుతుక్రమ ఆరోగ్యం, పర్యావరణం రెండింటికీ మేలు చేసే పద్ధతులకు మద్దతుదారులగా మారాలని విద్యార్థినులను ప్రోత్సహించారు.'ప్లాస్టిక్ ఫ్రీ జులై'లో భాగంగా, 95 మిర్చి హైదరాబాద్ బృందం పర్యావరణానికి మేలు చేసే రుతుక్రమ ఉత్పత్తుల గురించి అవగాహన కల్పించింది. రూపల్ టీమ్ లీడ్‌గా, ఆర్జే గౌరిక, శుభాంగి హోస్ట్‌లుగా వ్యవహరించారు. వీరు బాలీవుడ్ పాటలను పేరడీలుగా మార్చి పాడుతూ, ప్లాస్టిక్ రహిత పీరియడ్ ఉత్పత్తులకు మారాలనే విషయాన్ని నొక్కి చెప్పారు. సెయింట్ ఆన్స్ కాలేజ్ విద్యార్థినులు ఈ కార్యక్రమంలో చాలా ఉత్సాహంగా పాల్గొన్నారు. వారు తమ అభిప్రాయాలను పంచుకున్నారు. పీరియడ్స్ గురించి ఉన్న అపోహలను తొలగించారు. పర్యావరణ స్పృహతో పీరియడ్ ఉత్పత్తులను వాడేవారిలో తాము కూడా భాగమవుతామని ప్రతిజ్ఞ చేశారు. -
ఫస్ట్ క్లాస్ లో పాసైన పీవీ సింధు
డిగ్రీ కళాశాలలో ఘన సన్మానం మెహిదీపట్నం (హైదరాబాద్): ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు డిగ్రీ ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణులైంది. ఈ సందర్భంగా ఆమెను మెహిదీపట్నంలోని సెంట్ఆన్స్ కళాశాల యాజమాన్యం ఘనంగా సన్మానించింది. అదే కళాశాలలో పీవీ సింధు ఇటీవల బీకాం డిగ్రీ పూర్తి చేసింది. ఫలితాల్లో ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణత సాధించడంతో ఆమెను సన్మానించారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ అమృత మాట్లాడుతూ.. ఆటతోపాటు చదువుల్లోనూ సింధు ముందుండేదన్నారు. రానున్న రోజుల్లో మరిన్ని అవార్డులు గెలుచుకోవాలని ఆకాంక్షిస్తున్నట్లు ఆమె తెలిపారు. -
శక్తిమంతమైన మహిళలుగా తీర్చిదిద్దుతున్నాం
ఇంటర్మీడియట్లో తమ కళాశాల విద్యార్థినులు మంచి ఫలితాలు సాధించారని హైదరాబాద్ నగరానికి చెందిన సెయింట్ ఆన్స్ కళాశాల ప్రతినిధులు ఓ ప్రకటనలో తెలిపారు. 1981లో కేవలం అమ్మాయిల కోసం తమ కాలేజి స్థాపించినప్పటి నుంచి వాళ్లకు కేవలం చదువులోనే కాక, అన్ని రంగాల్లో ముందుండేలా, సమాజంలో శక్తిమంతమైన మహిళలుగా ఎదిగేలా శిక్షణ ఇస్తున్నామన్నారు. ఈసారి కూడా ఇంటర్ రెండో సంవత్సరం ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ, సీఈసీ, ఎంఎల్‌హెచ్‌సీ, హెచ్ఈసీ విద్యార్థినులు మంచి ఫలితాలను సాధించారని చెప్పారు. అలాగే, వివిధ విభాగాల్లో అత్యుత్తమ మార్కులు సాధించిన విద్యార్థినుల వివరాలను కూడా తెలిపారు. ఎంపీసీ: తజ్బియా ఫాతిమా - 973; సిమ్రన్ - 969 బైపీసీ: ఆకాంక్షా రాజ్ - 974; అనన్యా కుసుమ - 960 ఎంఈసీ: సంస్కృతీ అగర్వాల్ - 965; రేవతి- 958 సీఈసీ: యాస్మీన్ నాజ్ - 942; హెచ్.శ్రీవాణి- 939 ఎంఎల్‌హెచ్‌సీ: జువేరియా షెరీన్ - 872 హెచ్ఈసీ: సైదా సుకైనా హుస్సేన్- 722 -
సరిత డబుల్ ధమాకా
ఎల్బీ స్టేడియం, న్యూస్‌లైన్: ఇంటర్ జూనియర్ కాలేజి మహిళల టెన్నికాయిట్ టైటిల్‌ను నిరుటి విజేత సెయింట్ ఆన్స్ కాలేజి నిలబెట్టుకుంది. సింగిల్స్, డబుల్స్‌లో ఎం.సరిత (సెయింట్ ఆన్స్) సత్తా చాటింది. హైదరాబాద్ జిల్లా జూనియర్ కాలేజి గేమ్స్ సమాఖ్య ఆధ్వర్యంలో నారాయణగూడలోని కేశవ మెమోరియల్ జూనియర్ కాలేజి మైదానంలో జరిగిన ఫైనల్లో సెయింట్ ఆన్స్ 21-18, 21-19 స్కోరుతో కస్తూర్బా గాంధీ కాలేజిపై నెగ్గింది. సింగిల్స్ విభాగంలో సరిత 21-10, 21-12తో ఎ.హిందూజ (కస్తూర్బా గాంధీ కాలేజి)పై గెలిచింది. డబుల్స్ ఫైనల్లో సరిత, నిఖిత జోడి 21-15తో ఎ.హిందూజ, పి.దీప్తి జోడిపై గెలిచింది. డబుల్స్‌లో మూడో స్థానం సునీత, రచన జోడి (సెయింట్ ఆన్స్ కాలేజి) పొందింది. ముగింపు కార్యక్రమానికి భారత టెన్నికాయిట్ జట్టు కోచ్ ఎన్.సద్గురు ముఖ్య అతిథిగా విచ్చేసి విజేతలకు పతకాలను అందజేశారు. ఈ కార్యక్రమానికి కేశవ మెమోరియల్ జూనియర్ కాలేజి ప్రిన్సిపల్ టి.ఎం.శేఖర్ రావు అధ్యక్షత వహించారు, ఫిజికల్ డెరైక్టర్లు డాక్టర్ ఉమారావు, అన్నామేరీ తదితరులు పాల్గొన్నారు.