breaking news
srr college ground
-
కలిసొచ్చిన కరీంనగర్ నుంచే బీఆర్ఎస్ శంఖారావానికి భారీ కసరత్తు
సాక్షి, హైదరాబాద్: శాసనసభ ఎన్నికల్లో ఎదురైన ఓటమితో నిరాశా నిస్పృహల్లోకి వెళ్లిన పార్టీ యంత్రాంగంలో జోష్ నింపేందుకు బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు సమాయత్తమవుతు న్నారు. శాసనసభ ఎన్నికల అనంతరం తుంటి ఎముక విరగడంతో ఆసుపత్రిలో చేరిన కేసీఆర్ ఇటీవలి కాలంలోనే పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. కేఆర్ఎంబీ పరిధిలోకి కృష్ణా ప్రాజెక్టు లను అప్పగించే ప్రతిపాదనలకు వ్యతిరేకంగా నల్లగొండలో నిర్వహించిన బహిరంగసభకు మాజీ ముఖ్యమంత్రి హోదాలో తొలిసారిగా హాజరైన ఆయన తరువాత తెలంగాణ భవన్లో జరిగిన పార్లమెంటరీ సమావేశాల్లో పాల్గొని పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశారు. ఇదే ఊపులో రానున్న లోక్‌సభ ఎన్నికల్లో మెజారిటీ సీట్లను గెలవడమే లక్ష్యంగా ముందుకెళ్లాలని నిర్ణయించారు. ఇందులో భాగంగానే ఇటీవల పార్టీ కార్యాలయంలో జరిగిన కరీంనగర్, పెద్దపల్లి లోక్‌సభ నియోజకవర్గాల సమావే శంలో కరీంనగర్ వేదికగా భారీ బహిరంగసభకు పిలుపునిచ్చారు. లోక్‌సభ ఎన్నికలకు సమర శంఖారావం పూరిస్తూ ఈనెల 12న కరీంనగర్‌లోని శ్రీ రాజరాజేశ్వర డిగ్రీ కళాశాల ఆవరణలో లక్ష మందితో సభ నిర్వహించాలని నిర్ణయించారు. పార్టీ యంత్రాంగాన్ని సమాయత్తం చేయడమే లక్ష్యంగా... నల్లగొండలో నిర్వహించిన బహిరంగసభ కృష్ణా జలాల అంశంపైనే కాగా, కరీంనగర్ సభను మాత్రం ఎన్నికలకు బీఆర్ఎస్ సిద్ధమనే వాయిస్‌ను జనంలోకి తీసుకెళ్లే ఉద్దేశంతో నిర్వహిస్తున్నారు. 2001లో పార్టీ ఆవిర్భవించిన నాటి నుంచి ఎన్నికల సభలను కరీంనగర్ నుంచే ప్రారంభించడం ఆనవాయితీగా వస్తోంది. కలిసొచ్చిన ఎస్ఆర్ఆర్ కళాశాల మైదానాన్ని ఇందుకు మరోసారి వేదికగా ఎంచుకున్నారు. ఈ సభకు సంబంధించి సన్నాహక సమావేశం శుక్రవారం జరగ్గా, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరై పార్టీ యంత్రాంగంలో జోష్ నింపే ప్రయత్నం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి బీఆర్ఎస్ నా యకులే లక్ష్యంగా కక్ష సాధింపు చర్యలకు దిగుతోందని కరీంనగర్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి గంగుల కమలాకర్ ప్రస్తావించగా, ప్రజలు అన్నీ గమనిస్తు న్నారని, తగిన సమయంలో బుద్ధి చెపుతారని కేటీ ఆర్ వ్యాఖ్యానించారు. కాగా కరీంనగర్లో బీఆర్ ఎస్ కార్పొరేటర్ల అరెస్టులు, నాయకులపై కేసులు నమోదు అంశంపైన కూడా శుక్రవారం నాటి సమా వేశంలో చర్చ జరిగింది. పార్టీ నుంచి వెళ్లాలనుకునే వారికి భరోసా ఇవ్వడం పైనా... బీఆర్ఎస్ అధికారం కోల్పోయిన మూడు నెలల వ్యవధిలోనే రాజకీయాలు వేగంగా మారుతున్నా యి. బీఆర్ఎస్ నుంచి 39 మంది ఎమ్మెల్యేలు గెలిచి నప్పటికీ, కొందరు పక్క చూపులు చూస్తున్నారన్న ప్రచారం జరుగుతోంది. ముగ్గురు సిట్టింగ్ ఎంపీలు వెంకటేశ్ నేత (పెద్దపల్లి), పి.రాములు (నాగర్క ర్నూలు), బీబీ పాటిల్ (జహీరాబాద్) ఇప్పటికే వేరే పార్టీల్లోకి జంప్ చేశారు. పార్లమెంటు ఎన్నికల్లో పోటీ చేసేందుకు కూడా సిట్టింగ్‌లు భయపడు తున్నారని ప్రచారం జరుగుతోంది. వచ్చే ఎన్నికల్లో తాను పోటీ చేయనని చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి పార్టీ అధిష్టానానికి సంకేతాలు ఇవ్వగా, మల్కాజిగిరి నుంచి తమ కుటుంబ సభ్యులెవరూ పోటీలో ఉండరని మాజీ మంత్రి, మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి శుక్రవారం కేటీఆర్‌ను కలిసి చెప్పారు. దీంతో పార్టీ బలంగా ఉందనే సంకేతాలు ఇచ్చేందుకు కరీంనగర్లో భారీ బహిరంగ సభతో సత్తా చాటాలని నిర్ణయించారు. ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్న మాజీ మంత్రి గంగుల కరీంనగర్ ఎస్ఆర్ఆర్ గ్రౌండ్స్‌లో జరిగే సభకు సంబంధించిన ఏర్పాట్లన్నీ మాజీ మంత్రి, స్థానిక ఎమ్మెల్యే గంగుల కమలాకర్ పర్యవేక్షిస్తున్నారు. కేటీఆర్ కూడా శుక్రవారం గ్రౌండ్స్‌కు వెళ్లి పరిశీలించారు. ఏయే నియోజకవర్గాల నుంచి ఎంత మంది జనం వస్తారో లెక్కలు వేసుకున్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాతో పాటు చుట్టుపక్కల జిల్లాల నుంచి లక్ష మందికి పైగా జనాలు ఎస్ఆర్ఆర్ గ్రౌండ్స్‌కు తరలివస్తారని ప్రాథమికంగా నిర్ణయించారు. ఇందుకోసం మాజీ ఎమ్మెల్యేలు, పార్టీ నాయకులకు బాధ్యతలు అప్పగించారు. సభను విజయవంతం చేసి బీఆర్ఎస్ సత్తాను మరోసారి చాటుతామని ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ‘సాక్షి’కి చెప్పారు. -
నేడే శంఖారావం
తెలంగాణ వికాసమే నినాదం కలిసొచ్చిన కరీంనగర్ నుంచే శ్రీకారం భారీ ఏర్పాట్లు చేసిన టీఆర్ఎస్ లక్ష మంది జనసమీకరణ ఎస్సారార్ కళాశాల మైదానం వేదిక సాయంత్రం 5 గంటలకు జరగనున్న ఈ సభకు కేసీఆర్ హైదరాబాద్ నుంచి హెలిక్యాప్టర్ ద్వారా చేరుకోనున్నారు. కలెక్టరేట్లోని హెలిప్యాడ్‌లో దిగనున్నారు. అక్కడినుంచి ఎస్సారార్ కళాశాల వరకు భారీ ఊరేగింపుగా తీసుకెళ్లేందుకు నాయకులు సన్నాహాలు చేస్తున్నారు. కరీంనగర్ సిటీ, న్యూస్‌లైన్ : కలిసొచ్చిన కరీంనగర్ నుంచి టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మరోసారి ఎన్నికల శంఖారావాన్ని పూరిస్తున్నారు. తెలంగాణ తెచ్చింది తామేనని, వికాసం కూడా తమతోనే సాధ్యమనే ప్రధాన అస్త్రాన్ని టీఆర్ఎస్ ఈ ఎన్నికల్లో సంధిస్తోంది. తెలంగాణ రాష్ట్రం ఎలా ఉండాలనే విషయాన్ని ఆదివారం నగరంలోని ఎస్సారార్ కళాశాల మైదానంలో జరిగే బహిరంగ సభలో కేసీఆర్ సాక్షాత్కరింపజేయనున్నారు. తెలంగాణ ఇచ్చిన పార్టీగా కాంగ్రెస్, సహకరించిన పార్టీగా బీజేపీ ఎన్నికల రంగంలోకి దిగగా.. ఆ రెండు పార్టీలతో తలపడాలంటే తెలంగాణ రాష్ట్రం తీసుకురావడమే కాదు... వచ్చిన రాష్ట్రాన్ని తీర్చిదిద్దడం కూడా తమతోనే సాధ్యమనే నినాదాన్ని కేసీఆర్ ఎత్తుకున్నారు. ఈ సరికొత్త వాదాన్ని ప్రజల్లోకి బలంగా పంపించేందుకు కేసీఆర్ కరీంనగర్లో జరగనున్న బహిరంగ సభను వినియోగించుకోనున్నారు. సార్వత్రిక ఎన్నికల్లో ఇది తొలి బహిరంగ సభ కావడంతో, ఈ సభను ఎట్టి పరిస్థిత్లోనూ భారీ స్థాయిలో నిర్వహించాలనే యోచనలో పార్టీ ఉంది. కనీసం లక్ష మందికి తగ్గకుండా జనసమీకరణ చేసి, తెలంగాణ ప్రజలు తమ వెంటే ఉన్నారనే సంకేతాన్ని ఇవ్వాలని గులాబీ బాస్ ఉబలాటపడుతున్నారు. ఆ దిశగా జిల్లా వ్యాప్తంగా నియోజకవర్గాల వారీగా లక్ష్యాలు నిర్ధేశించి, జనసమీకరణ చేపడుతున్నారు. కరీంనగర్ నియోజకవర్గం నుంచి 30 వేలు, సమీపంలోని చొప్పదండి, పెద్దపల్లి, వేములవాడ, సిరిసిల్ల, మానకొండూరు నుంచి అధిక సంఖ్యలో, దూరంగా ఉన్న రామగుండం, మంథని, హుస్నాబాద్, హుజూరాబాద్, కోరుట్ల, జగిత్యాల, ధర్మపురి నుంచి కాస్త తక్కువగా జనాలను తరలించేందుకు ఇప్పటికే స్థానిక నాయకత్వానికి లక్ష్యాలు నిర్ధేశించారు. సెంటిమెంట్ టీఆర్ఎస్ ఆవిర్భావం నుంచి తనకు అన్ని విధాలా కలిసొచ్చిన కరీంనగర్ నుంచే తెలంగాణ వికాసం నినాదంతో మరో ఉద్యమానికి కేసీఆర్ శ్రీకారం చుట్టనున్నారు. 2001లో సింహగర్జన పేరుతో ఇదే ఎస్ఆర్ఆర్ కళాశాల మైదానంలో నిర్వహించిన టీఆర్ఎస్ ఆవిర్భావ సభ అనూహ్య విజయం సాధించింది. ఆ సభ అందించిన స్ఫూర్తితో కేసీఆర్ పుష్కరకాలంగా ఉద్యమాన్ని సజీవంగా కొనసాగిస్తూ వచ్చారు. ఆ సభతోపాటు టీఆర్ఎస్, తెలంగాణ ఉద్యమానికి కీలక మలుపులకు కరీంనగర్ జిల్లా వేదిక అయింది. 2004లో కరీంనగర్ నుంచే కేసీఆర్ ఎంపీగా పోటీ చేసి విజయం సాధించారు. ఆ తరువాత 2006లో జరిగిన తొలి ఉప ఎన్నికలో 2 లక్షల రికార్డు మెజార్టీతో విజయం సాధించి, తెలంగాణ ఉద్యమానికి ఊపిరిలూదారు. ఆ సమయంలోనే ప్రజలకిచ్చిన మాట మేరకు తీగలగుట్టపల్లిలో ఇల్లు కట్టుకున్నారు. 2008లో మరోసారి ఉప ఎన్నికలో కరీంనగర్ నుంచే విజయం సాధించారు. ఉద్యమాన్ని మలుపు తిప్పిన సకలజనుల సమ్మె సన్నాహక సభను కూడా కేసీఆర్ కరీంనగర్‌లోనే నిర్వహించారు. 2009లో తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఆమరణ నిరాహార దీక్షకు ముందు అచ్చొచ్చిన కరీంనగర్‌లోని తెలంగాణ భవన్‌లోనే బస చేశారు. ఇక్కడి నుంచి దీక్షాస్థలికి వెళుతున్న ఆయనను అల్గునూరులో అరెస్ట్ చేశారు. ఇలా తెలంగాణ ఉద్యమంలో కీలక ఘట్టాలకు వేదిక అయిన కరీంనగర్‌ను కేసీఆర్ సెంటిమెంట్‌గా భావిస్తారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనంతరం, వస్తున్న ఎన్నికల్లో విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనే గట్టి ప్రయత్నంలో ఉన్న ఆయన తెలంగాణ వికాసం నినాదంతో చేపట్టనున్న ఉద్యమానికి కరీంనగర్ సెంటిమెంట్‌ను ఎంచుకున్నారు. పార్కింగ్ ఏర్పాట్లు సభకు వచ్చే వాహనాల కోసం రూట్ల వారీగా పార్కింగ్ ఏర్పాట్లు చేశారు. జగిత్యాల నుంచి వచ్చే వాహనాలు ఈద్గా ముందు స్థలంలో పార్కింగ్ చేయాలి. వేములవాడ, సిరిసిల్ల నుంచి వచ్చే వాహనాలు చింతకుంట బైపాస్ మీదుగా వచ్చి విద్యానగర్ వాటర్‌ట్యాంక్ వెనకాల ఉన్న స్థలంలో నిలపాలి.హైదరాబాద్, వరంగల్ నుంచి వచ్చే వాహనాలు ఆర్ట్స్ కళాశాల మైదానం లేదా వరలక్ష్మి గార్డెన్స్ పక్క స్థలంలో పార్కింగ్ చేయాలి. పెద్దపల్లి, చొప్పదండి వైపు నుంచి వచ్చే వాహనాలు ఆదర్శనగర్ మీదుగా వరలక్ష్మి గార్డెన్స్ సమీపంలోని మైదానంలో నిలపాలి.