breaking news
sriramulanayudu
-
హుదూద్ అలజడి
పునరావాసాలకు మత్స్యకార్ల ససేమిరా ప్రత్యేక బలగాలు మోహరింపు యలమంచిలి : తీర ప్రాంత గ్రామాల్లో హుదూద్ కల్లోలం రేపుతోంది. ఈ పెను తుపాను పెద్ద ఎత్తున విరుచుకుపడుతుందన్న హెచ్చరికలతో అచ్యుతాపురం, రాంబిల్లి మండలాల్లో తీరం చిగురుటాకులా వణికిపోతోంది. మరోవైపు తుపానును ఎదుర్కొనేందుకు అధికార యంత్రాంగం ముందస్తు చర్యలకుపక్రమించింది. తీరానికి అనుకుని ఉన్న కుటుంబాలను పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు. తమకు జీవనాధారమైన బోట్లు, వలలు వదిలి రావడానికి మత్స్యకారులు ససేమిరా అంటున్నారు. దీంతో వారికి నచ్చజెప్పేందుకు పోలీసులు, అధికారులు నానా తంటాలు పడాల్సి వస్తోంది. పూడిమడక పంచాయతీలో కడపాలెం, జాలారిపాలెం, కొండపాలెం, పూడిమడక ప్రజలను తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. తీరం దాటే సమయంలో బలమైన గాలులు వీచే అవకాశం ఉండటంతో ప్రజలు సముద్రతీరంలో ఉండొద్దన్న హెచ్చరికలు అధికారులు చేస్తున్నారు. పూడిమడక మేజర్ పంచాయతీలో పూరిగుడిసెల్లో ఉంటున్న 3,500 మందిని జెడ్పీ హైస్కూలకు తరలిస్తున్నారు. శనివారం మధ్యాహ్నం వారికి భోజనం పెట్టారు. నర్సీపట్నం ఏఎస్పీ బి.సత్యఏసుబాబు, యలమంచిలి సీఐ హెచ్.మల్లేశ్వరరావు ఆధ్వర్యంలో 50 మంది సభ్యుల జాతీయ విపత్తు నివారణ సంస్థ బృందం, 30 మంది సభ్యుల రాష్ట్ర విపత్తు నివారణ సంస్థ బృందాలతో పాటు ప్రత్యేక పోలీసు బలగాలు, నలుగురు సీఐలు, ముగ్గురు ఎస్ఐలు, సర్కిల్ పరిధిలో పోలీసు సిబ్బంది పునరావాస ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. ఉపాధి హామీ పథకం పీడీ శ్రీరాములనాయుడు, ఏపీడీ గోవిందరావు, అచ్యుతాపురం తహశీల్దార్ కె.వి.వి.శివ, ప్రభుత్వ శాఖల సిబ్బంది పూడిమడక చేరుకున్నారు. తుపానును ఎదుర్కొనేందుకు సర్వసన్నద్ధంగా ఉన్నామని ముందస్తు చర్యలు తీసుకుని నష్టతీవ్రతను తగ్గించగలమన్న ఆశాభావాన్ని ఉపాధి హామీ పీడీ శ్రీరాములనాయుడు విలేకరులకు చెప్పారు. అచ్యుతాపురంలో.. అచ్యుతాపురం మండలంలోనూ అలలు ఐదు అడుగుల ఎత్తుకు ఎగసి పడుతున్నాయి. అధికారుల హెచ్చరికలతో మత్స్యకారులు తమ పడవల్ని, వలలను భద్రపర్చుకున్నారు. పూడిమడకలో జట్టీ లేకపోవడంతో చెట్లకు తాళ్లతో కట్టి పడవలను తీరం వద్ద ఉంచారు. ఇంజన్లు, వలలను ఇళ్లకు తరలించారు. ఏఎస్పీ సత్యఏసుబాబు పరిస్థితిని సమీక్షించారు. ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సహాయక చర్యలు ప్రారంభించారు. తీరం వెంబడి 100 ఇళ్లను ఖాళీచేయించారు. అత్యవసర సేవలకోసం ప్రత్యేక బలగాలు ప్రశాంతి పాలిటెక్నిక్ కాలేజీలో బస చేశారు. 15 బస్సులను తీరం వద్ద ఉంచారు. ఎమ్మెల్యే పంచకర్ల రమేష్‌బాబు తదితరులు పరిస్థితిని సమీక్షించారు. పాయకరావుపేట మండలంలో.. పాయకరావుపేట : హూదూద్ తుపాను ప్రభావంతో పాయకరావుపేట మండలంలో సముద్రంలో అలల తాకిడి, ఈదురుగాలులు ఎక్కువయ్యాయి. కోఆర్డినేటింగ్ ఆఫీసర్ పి.చిన్నయ్య, ఎంపీడీవో సంతోసం, తహశీల్దార్ సుమతీబాయి, రెవెన్యూ, పోలీస్, మెరైన్ శాఖల అధికారులు తీర ప్రాంతగ్రామాల్లో పరిస్థితి సమీక్షించారు. పెంటకోట, వెంకటనగరం. గజపతినగరం, పాల్మన్‌పేట, రాజయ్యపేట, గజపతినగరం, రాజవరం కొర్లయ్యపేట, కుమారపురం, తీర ప్రాంతాల్లో పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారు. మత్స్యకారులు బోట్లను సురక్షిత ప్రాంతాలకు చేర్చారు. పెంటకోట, వెంకటనగరం ప్రాంతం నుంచి అద్దరిపేట వరకూ తీర ప్రాంతంలో ఒడ్డు మీటరు ఎత్తున కోతకు గురయింది. గజపతినగరం పునరావాస కేంద్రాన్ని ఐజీ అతుల్‌సింగ్, ఎస్పీ కె.ప్రవీణ్ పరిశీలించారు. అప్రమత్తంగా ఉండాలని అధికారులను ఆదేశించారు. పాయకరావుపేట ఎమ్మెల్యే అనిత గజపతినగరం, వెంకటనగరం, పాల్మన్‌పేట తీరప్రాంత గ్రామలను సందర్శించారు. రేవుపోలవరంలో... ఎస్.రాయవరం : హుదూద్ తీవ్రతతో రేవుపోలవరం తీరంలో శనివారం సుమారు 150 మీటర్ల ముందుకు వచ్చింది. సాధారణ స్థాయి కంటే సముద్రం ముందుకురావడంతో స్థానికుల్లో ఆందోళన నెలకొంది. తుఫాన్ తీరాన్ని తాకకముందే అలల తీవ్రత ఇలా ఉంటే తాకాక మరెంత ప్రమాదస్థాయిలో ఉంటుందోనని భయపడుతున్నారు. పోలీస్ ప్రత్యేక బలగాలు, ఎస్ఐ కె.శ్రీనివాసరావు తీరం పరిసరాలను సమీక్షిస్తూ ఉన్నతాధికారులకు సమాచారాన్ని చేరవేశారు. అలాగే బంగారమ్మపాలెం లో గ్రామస్తులకు ఉదయం అల్పాహారం, భోజన సదుపాయం కల్పించారు. మండల పరిషత్ కార్యాలయంలో ఎమ్మెల్సీ డీవీ సూర్యనారాయణరాజు, ఎంపీపీ యేజర్ల పెరుమాళ్లరాజు తుఫాన్ సహకచర్యలు సమీక్షించారు. తీరంలో హదూద్ వణుకు.. రాంబిల్లి : హుదూద్ పెనుతుపాన్ తరుముకొస్తుండటంతో తీర ప్రాంత ప్రజలు భయంతో వణికిపోతున్నారు. సముద్రం సుమారు 60 అడుగులు ముందుకు చొచ్చుకొని రావడంతో రాంబిల్లి, కొత్తపట్నం తీరం కోతకు గురైంది. సముద్రం అల్లకల్లోలంగా మారింది. జిల్లాలో అధికంగా తీర ప్రాంత గ్రామాలు రాంబిల్లి మండలంలో ఉన్నాయి. వీటిలో కొత్తపట్నం, వాడనర్సాపురం, లోవపాలెం, రాంబిల్లి శివారు వాడపాలెం, గజిరెడ్డిపాలెం, లోవపాలెం, వెంకయ్యపాలెం, సీతపాలెం తీర ప్రాంతలున్నాయి. ఈ గ్రామాల్లో ఎవరూ ఉండరాదని అధికారులు హెచ్చరించారు. శనివారం ఈ గ్రామాలకు చెందిన సుమారు 900 మందిని రాంబిల్లి ఉన్నత పాఠశాల, క స్తూర్బా పాఠశాల, వెంక య్యపాలెం తుపాన్ షెల్టర్‌లోని పునరావాస కేంద్రాలకు తరలించిన ట్టు ప్రత్యేకాధికారి పి. కోటేశ్వరరావు తెలిపారు. మండలంలో 40 మంది ఎన్డీఆర్ఎఫ్ బృందం రంగంలోకి దిగింది. ఎమ్మెల్యే పంచకర్ల రమేష్‌బాబు, ఆర్డీవో వసంతరాయుడు కొత్తపట్నం తీర ప్రాంతాన్ని పరిశీలించారు. మత్స్యకారులను సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలని సూచించారు. గంగపుత్రుల బిక్కుబిక్కు నక్కపల్లి : హదూద్ తుపాను హెచ్చరికలతో గంగపుత్రులు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. పాయకరావుపేట నియోజకవర్గంలోని తీర గ్రామాల్లో పలుచోట్ల సముద్రం 100 మీటర్లకు పైగా ముందుకు చొచ్చుకువచ్చింది. అలలు 20-30 అడుగుల వరకు ఎగసిపడుతున్నాయి. గ్రామాలకు సమీపం వరకూ తెప్పలను తెచ్చుకోవడానికి తిప్పలు పడుతున్నారు. నియోజక వర్గంలో దాదాపు 14 మత్య్సకార గ్రామాల్లో 20వేల మంది మత్య్సకారులు సముద్రతీరం వెంబడి ఉన్న గ్రామాల్లో నివసిస్తున్నట్టు గుర్తించారు. వీరిలో ఐదు వేల మందిని పునరావాస కేంద్రాలకు తరలించాలని నిర్ణయించారు. 14 చోట్ల ప్రత్యేక శిబిరాలు ఏర్పాటు చేసారు. నక్కపల్లి మండలంలో 2017 మందికి గాను వెయ్యి మందిని తరలించి తర లించి వారికి ఆహార పదార్థాలు సరఫరా చేస్తున్నారు. మండలప్రత్యేకాధికారి శివప్రసాద్ పర్యవేక్షణలోతహశీల్దార్, ఎంపిడీవో, సీఐ గఫూర్, ఇతర అధికారులు పరిస్థితిని సమీక్షిస్తున్నారు. నక్కపల్లి తహశీల్దార్ కార్యాలయంలోకంట్రోలురూం ఏర్పాటు చేసారు. మన్యంలోనూ హుదూద్ భయం! పాడేరు : హుదూద్ తుపాను టెన్షన్ మన్యంలోనూ నెలకొంది. శనివారం వేకువజాము నుంచే వాతావరణం ఒక్కసారిగా మారింది. తేలికపాటి జల్లులతోపాటు ఈదురుగాలులు కూడా వీయడంతో గిరిజనులు ఆందోళన చెందుతున్నారు. సముద్ర మట్టానికి సుమారు 3 వేల అడుగుల ఎత్తులో ఉన్న పాడేరు ఘాట్, వనుగుపల్లి, డల్లాపల్లి, మోదాపల్లి ప్రాంతాల్లో ఈదురుగాలులు ఉధృతంగా వీచాయి. దీంతో గిరిజనులు చలిగాలులతో ఇబ్బందులు పడ్డారు. ప్రస్తుతం ఖరీఫ్ వరిపంట గింజదశలో ఉండగా తుపానుతో తీవ్రంగా పంటను నష్టపోతామనే భయం గిరి రైతులను వెంటాడుతోంది. అలాగే రాజ్మా, ఇతర కాయగూరల సాగుదారులు కూడా తుపాను సమాచారంతో బెంగగా ఉన్నారు. రెవెన్యూ యంత్రాంగాన్ని అప్రమత్తం చేశామని సబ్‌కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ తెలిపారు. అన్ని మండల తహశీల్దార్ కార్యాలయంలో కంట్రోల్ రూం ఏర్పాటు చేశామన్నారు. తుపానుతో ఎలాంటి నష్టం వాటిల్లినా సకాలంలో కంట్రోల్ రూంకు సమాచారం ఇవ్వాలని మన్యం వాసులను కోరారు. -
ఉపాధి పనులకు రూ. 430 కోట్లు
జిల్లాలో 29 వేల కుటుంబాలకు 100రోజుల పని 20 నర్సరీల్లో టేకు దుంపల పెంపకం 220 మంది ఫీల్డ్ అసిస్టెంట్లకు షోకాజ్ నోటీసులు డ్వామా పీడీ శ్రీరాములనాయుడు బుచ్చన్నపాలెం(మాకవరపాలెం) : ఈ ఏడాది ఉపాధి పథకంలో వివిధ పనులు చేపట్టేందుకు రూ. 430 కోట్లు కేటాయించామని డ్వామా ప్రాజెక్టు డెరైక్టర్ శ్రీరాములనాయుడు తెలిపారు. వీటిలో ఇప్పటివరకు రూ.198 కోట్లు ఖర్చు చేశామన్నారు. మండలంలోని పాపాయ్యపాలెం పంచాయతీ శివారు బుచ్చన్నపాలెంలో ఏర్పాటు చేసిన టేకు నర్సరీని ఆయన శుక్రవారం తనిఖీ చేశారు. ఈ నర్సరీలో టేకు దుంపల పెంపకానికి వేసిన బెడ్లను పరిశీలించారు. పెంపకానికి సంబంధించి ఎన్ని పని దినాలు కేటాయించారు, ఎంతమంది కూలీలు పనులు చేస్తున్నారనే విషయాలను సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. కూలీలకు వేతనాలు పంపిణీ చేయాలని, మస్తర్లను సక్రమంగా నిర్వహించాలని ఆదేశించారు. 220 మంది ఫీల్డ్ అసిస్టెంట్లకు షోకాజ్ నోటీసులు జిల్లాలో 1010 మంది ఫీల్డ్ అసిస్టెంట్లు ఉండగా 220 మందికి షోకాజ్ నోటీసులు ఇచ్చామన్నారు. వీరంతా లక్షా యలు చేరుకోకపోవడం, సోషల్ ఆడిట్లో రికవరీల జాబితాలో ఉండడంతో వీరిని తొలగించాల్సిందిగా ఆదేశాలు అందాయన్నారు. వారు ఇచ్చే వివరణలను పరిశీలించి తొలగిస్తామన్నారు. ఈ ఏడాది జిల్లావ్యాప్తంగా ఇప్పటివరకు 29 వేల కుటుంబాల వారికి వందరోజులు పని కల్పించామన్నారు. ఈ విషయంలో రాష్ట్రంలో విశాఖ జిల్లా ప్రథమ స్థానంలో ఉందన్నారు. మరో 60 వేల కుటుం బాల వారు 75 రోజులు పని పూర్తి చేసుకున్నారన్నారు. జిల్లాలో 20 టేకు నర్సరీలు రైతులకు మొక్కలు పంపిణీ చేసేందుకు జిల్లాలో 20 టేకు నర్సరీలు ఏర్పాటు చేశామన్నారు. వీటిలో రెండువేల బెడ్లను తయారు చేసి 15 లక్షల టేకు దుంపలను పెంచుతున్నామన్నారు. ఈ ఏడాది ఇప్పటివరకు 10లక్షల టేకు మొక్కలు పంపిణీ చేశామన్నారు. ఇంకా ఐదు లక్షల మొక్కలు అవసరం కాగా అటవీశాఖ వద్ద నాలుగు లక్షలు, విశాఖలో ఒక లక్ష టేకు మొక్కలను కొనుగోలు చేస్తున్నట్టు వివరించారు. ప్రస్తుతం నీరు నిల్వ ఉండే పనులకు ప్రాధాన్యం ఇస్తున్నామన్నారు. చెక్‌డ్యాంలు, చెరువుల్లో సాగునీటి మదుములకు ఉపాధి హామీలో మరమ్మతులు చేస్తామని తెలిపారు. ఇప్పటికే ఇలాంటివి 520 వరకు పనులు గుర్తించామన్నారు. అక్టోబర్ వరకు ఈ పనులు చేపడతామన్నారు. ఇక నుంచి ప్రతి పనికి సంబంధించిన ఫొటో, నిధుల వ్యయం వివరాలను గూగుల్ మ్యాప్‌లో అప్లోడ్ చేస్తున్నామని, ఎవరైనా ఈ పనులను ఆన్లైన్లో చూసుకోవచ్చన్నారు. అదనపు పీడీ ఆనందరావు, ఏపీడీ శ్రీనివాస్‌కుమార్, ఏపీవో చిన్నారావు, బూరుగుపాలెం సర్పంచ్ రుత్తల సత్యనారాయణ, సిబ్బంది పాల్గొన్నారు. రూ. 200కోట్లతో నీటి నిల్వ పనులు నర్సీపట్నం రూరల్ : రూ. 200 కోట్లతో నీటి నిల్వ పను లు చేపట్టనున్నట్టు ఉపాధి హామీ పథకం ప్రాజెక్టు డెరైక్టర్ శ్రీరాములనాయుడు పేర్కొన్నారు. స్థానిక మండల పరిషత్ సమావేశ మందిరంలో క్లస్టర్ అధికారులు, సిబ్బంది, వన సేవకులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ ఏడాది అటవీ ప్రాంతం దిగువన కందకాల ఏర్పాటు, నీటి నిల్వకుంటల నిర్మాణానికి ప్రాధాన్యత ఇస్తున్నట్టు చెప్పారు. 1995 తరువాత నిర్మాణం చేసిన చెక్‌డ్యాంలు, నీటి నిల్వ కుంటల పరిస్థితిని అంచనా వేయిస్తున్నట్టు చెప్పారు. వీటికి పూర్తిస్థాయిలో మరమ్మతులు చేపడుతున్నట్టు వివరించారు. ఈ ఏడాది 3,800 ఎకరాల్లో ఉద్యాన పంటలను అభివృద్ధి చేసినట్టు చెప్పారు. ఏపీడీలు ఆనందరావు, శ్రీనివాసరావు పాల్గొన్నారు.