breaking news
sri ramakrishnamission
-
మనసు, మాట, చేత ఒకటి కావాలి
‘మనసులో ఉన్న భావనే మాటగా వెలువడాలి. మాటలు చేతలు కావాలి. ఇది మహాత్ముల లక్షణ’మని వక్తలు ఉద్బోధించారు. శ్రీరామకృష్ణ మిషన్, వివేకానంద ఇనిస్టిట్యూట్ ఆఫ్ హ్యూమన్ ఎక్స్‌లెన్స్ ఆధ్వర్యంలో శుక్రవారం శ్రీరామకృష్ణమఠంలో సోదరి నివేదిత 150వ జయంత్యుత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. రాజమహేంద్రవరం కల్చరల్: ‘మనసులో ఉన్న భావనే మాటగా వెలువడాలి. మాటలు చేతలు కావాలి. ఇది మహాత్ముల లక్షణ’మని నన్నయ విశ్వవిద్యాలయం ఉపకులపతి ముర్రు ముత్యాలునాయుడు అన్నారు. శ్రీరామకృష్ణ మిషన్, వివేకానంద ఇనిస్టిట్యూట్ ఆఫ్ హ్యూమన్ ఎక్స్‌లెన్స్ ఆధ్వర్యంలో శుక్రవారం శ్రీరామకృష్ణమఠంలో సోదరి నివేదిత 150వ జయంత్యుత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి,. ముఖ్య అతిథిగా ముత్యాలు నాయుడు మాట్లాడుతూ ఈ దేశానికి రామకృష్ణ పరమహంస, వివేకానందుల గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదని, కానీ సోదరి నివేదిత గురించి తెలియనివారు చాలామంది ఉండవచ్చని అన్నారు. చికాగో వెళ్ళేటప్పుడు వివేకానందునికి బోస్టన్ నగరంలో నివసిస్తున్న ఒక మహిళ పరిచయమై, తన విజిటింగ్ కార్డును ఇచ్చిందన్నారు. చికాగో ప్రపంచ మత సమ్మేళన సభలు మూడు నెలలు వాయిదా పడి, తెచ్చుకున్న ధనం అయిపోవడంతో వివేకానందుడు ఆ మహిళ ఇంటికి వెళ్ళి కొంతకాలం బస చేశారని చెప్పారు. అక్కడికి వచ్చిన అమెరికన్ ప్రొఫెసర్ ఒకరు వివేకానందుని వాగ్ధాటికి అచ్చెరువొంది ‘ఈ దేశంలో ప్రొఫెసర్లందరూ కలసినా వివేకానందునికి సాటి రా’రని అన్నారు. లండన్‌లో సోదరి నివేదిత వివేకానందుని ప్రసంగానికి ముగ్ధురాలై అన్ని మతాలూ ఒకే దారిచూపుతాయని గ్రహించిందని, వివేకానందుని పిలుపుమేరకు ఈ గడ్డపై కాలు మోపిందని వివరించారు. మహాత్మునికి, సోదరి నివేదితకు పోలికలు ఉన్నాయని, గోపాలకృష్ణ గోఖలే మహాత్ముని స్వాతంత్య్ర పోరాటంలో పాల్గొనవలసిందిగా ఆహ్వానించగా వివేకానందుడు నివేదితను ఈ గడ్డపై సామాజిక సేవ చేయవలసిందిగా పిలుపునిచ్చారన్నారు. నివేదిత, కాటన్, బ్రౌన్ ఈ దేశానికి ఎనలేని సేవలు చేశారన్నారు. గ్లోబల్ హాస్పిటల్స్ సలహాదారుడు డాక్టర్ కె.ఎస్.రత్నాకర్ మాట్లాడుతూ విద్యావ్యవస్థను భ్రష్టు పట్టిస్తే సమాజం నాశనమవుతుందన్నారు. యువత పే, ప్రాస్పెక్ట్స్, ప్రమోషన్ అనే మూడు అంశాలపై మాత్రమే దృష్టి సారించరాదన్నారు. సభకు అధ్యక్షత వహించిన రామకృష్ణ మిషన్, బేలూరు ప్రధాన కార్యదర్శి స్వామి అభిరామానందజీ మాట్లాడుతూ మన దేశంలో యువకులు, మానవవనరుల సంఖ్య ఇతర దేశాలకన్నా ఎక్కువన్నారు. విద్య అంటే కేవలం ఎక్కువ మార్కులు తెచ్చుకోవడం మాత్రమే కాదని, వ్యక్తిత్వ వికాసం మెరుగుపరుచుకోవాలని సూచించారు. నగరాధ్యక్షుడు స్వామి కపాలీశానంద స్వాగత వచనాలు పలికారు. విజయవాడ రామకృష్ణ మిషన్‌కు చెందిన స్వామి శేవ్యానందజీ, విశాఖపట్టణం మిషన్‌కు చెందిన గుణేశానందజీ తదితరులు పాల్గొన్నారు. ముఖ్య అతిథి ముత్యాలునాయుడిని నిర్వాహకులు సత్కరించారు. స్వామి హరికృపానందజీ వందనసమర్పణ చేశారు. ఉత్సవాలు శని, ఆదివారాల్లో కొనసాగుతాయి. -
దేశాన్ని అగ్రగామిగా నిలపాలి
కడప కల్చరల్ : భారత దేశాన్ని ప్రపంచ పటంలో అగ్రగామిగా నిలుపాలని కర్నూలు రేంజ్ డీఐజీ బీవీ రమణకుమార్ పిలుపునిచ్చారు. శుక్రవారం స్థానిక రిమ్స్ వద్దగల శ్రీ రామకృష్ణ మిషన్‌లో సిస్టర్ నివేదిక 150వ జయంతి ఉత్సవాలను పురస్కరించుకుని ఉపాధ్యాయులకు ప్రత్యేక శిక్షణా తరగతులను ఆయన ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ జీవితంలో ఎదురయ్యే అన్ని సమస్యలను ఆత్మ విశ్వాసంతో ఎదుర్కొనెలా తీర్చిదిద్దాలని ఉపాధ్యాయులకు సూచించారు. మిషన్ కార్యదర్శి స్వామి సుకృతానంద మాట్లాడుతూ మన దేశ సంస్కృతి సంప్రదాయాలు, సృజనాత్మకత కలిసిన విద్య ఉత్తమమైనదన్నారు. విద్యార్థుల్లో మన సంస్కృతి , సంప్రదాయాల పట్ల అవగాహన కల్పించాల్సిన బాధ్యత ఉందన్నారు. అలాగే వారిలోని సజనాత్మకశక్తిని పెంచాల్సిన అవసరం కూడా ఉందన్నారు. విశిష్ఠ అతిథిగా హాజరైన విశాఖపట్టణం రామకృష్ణమఠం ప్రతినిధి స్వామి గణేషానందజీ మాట్లాడుతూ నేటి ఉపాధ్యాయులు విద్యార్థులను సంస్కృతి సంప్రదాయాల రక్షకులుగా మార్చాలని, వారి వ్యక్తిత్వ నిర్మాణంలో కీలకపాత్ర పోషించాలని సూచించారు. గౌరవ అతిథి డాక్టర్ ఎంసీ దాస్ మాట్లాడుతూ విద్యార్థులే తమ ఆస్తి అని గర్వంగా చాటుకునే స్థితిని ఉపాధ్యాయులు సాధించాలన్నారు. స్వామి అచింత్యానంద పర్యవేక్షణలో జరిగిన ఈ కార్యక్రమానికి జిల్లా నలుమూలల నుంచి పలువురు ఉపాధ్యాయులు హాజరయ్యారు. శని, ఆది వారాల్లో కూడా ఈ శిబిరం కొనసాగనుంది.