breaking news
Solo woman
-
ఈ ఐదు రాష్ట్రాలలోనే వీళ్లు ఎక్కువ..
సామాజిక కోణంలో చేసే నివేదికలు ఆప్రాంత, రాష్ట్ర, దేశంలోని జనాభా మనుగడ ఏ స్థాయిలో ఉందో సూచిస్తాయి. దీనిలో భాగంగానే శాంపిల్ రిజిస్ట్రేషన్ సిస్టమ్ సర్వే ఇటీవల కొన్ని ఆసక్తికర విషయాలను వెల్లడించింది.దేశవ్యాప్తంగా 5.4 శాతం మంది మహిళలు వితంతువులు, విడాకులు తీసుకున్నవారు, విడిపోయినవారు ఉన్నారు. రాష్ట్రాలవారీగా చూస్తే పెద్ద రాష్ట్రాలలో ఒకటైన తమిళనాడు 11.6 శాతం వాటాతో అగ్రస్థానంలో నిలిచింది. ఇది జాతీయ సగటు కంటే రెట్టింపుకు పైగా ఉంది. కేరళలో 10.4 శాతం ఉండగా దాని తర్వాతి స్థానంలో కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు వరుసగా 8.6 శాతం, 8.0 శాతం, 7.6 శాతం వాటాలను నమోదు చేశాయి. ఈ ఐదు దక్షిణాది రాష్ట్రాలు కలిసి జాతీయ స్థాయిలో మొదటి ఏడు స్థానాలలో ఐదింటిని ఆక్రమించాయి. బిహార్లో అత్యల్పంగా 2శాతంతో దక్షిణాది రాష్ట్రాలకు పూర్తి భిన్నంగా ఉంది.దేశంలో ఈ ఐదు రాష్ట్రాలలోనే వితంతువులు, ఒంటరి, వృద్ధ మహిళా జనాభా అధికంగా ఉండటానికి గల కారణాలను ఎస్ఆర్ఎస్ శోధించింది. దక్షిణాది రాష్ట్రాలలో మహిళలు ఆలస్యంగా వివాహాలు చేసుకోవడం, స్వతంత్రంగా జీవించడం, పనిచేసే వయస్సులో పురుషుల మరణాలు అధికంగా ఉండటం గమనించింది.ఇదే విషయంలో జాతీయ స్థాయిలో పురుషుల జాబితా చూస్తే.. భార్యను కోల్పోయిన, విడాకులు తీసుకున్న లేదా విడిపోయినవారి సగటు శాతం 1.6 ఉంది. కర్ణాటకలో 1.4 శాతం, తెలంగాణలో 1.6 శాతం నమోదు కాగా, తమిళనాడు 2.9 శాతంతో అత్యధికంగా ఉంది. అయినప్పటికీ మహిళలతో పోలిస్తే పురుషులలో ఈ శాతం చాలా తక్కువ. తమిళనాడులో జీవిత భాగస్వామి లేకుండా జీవిస్తున్న స్త్రీ, పురుషుల వాటాల మధ్య వ్యత్యాసం 8.7 శాతం పాయింట్లు కాగా, కేరళలో ఈ అంతరం 8.6 శాతం పాయింట్లుగా నమోదైంది. ఐదు దక్షిణాది రాష్ట్రాలన్నింటిలోనూ ఈ వ్యత్యాసం 3.8 శాతం పాయింట్లతో జాతీయ సగటును మించిపోయింది. -
ఒంటరి మహిళల ఆర్థిక భృతికి రూ.222 కోట్లు
బీఆర్వో విడుదల చేసిన ప్రభుత్వం సాక్షి, హైదరాబాద్: ఒంటరి మహిళల ఆర్థిక భృతి పథకానికి రూ.222 కోట్ల బడ్జెట్ను కేటాయిస్తూ ప్రభుత్వం మంగళవారం బడ్జెట్ రిలీజ్ ఆర్డర్(బీఆర్వో)ను విడుదల చేసింది. ఈ ఆర్థిక సంవత్సరంలో సుమారు రూ.296 కోట్లు అవసరమని సెర్ప్ అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపగా, తొమ్మిది నెలల(ఏప్రిల్ నుంచి డిసెంబర్ వరకు) మొత్తానికి ఒకేసారి బీఆర్వోను జారీచేసింది. ఏప్రిల్, మే నెలలకు సంబంధించిన ఆర్థికభృతి మొత్తాన్ని రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం రోజు(జూన్ 2)న అందించాలని ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. కాగా, ఒంటరి మహిళల ఆర్థికభృతి నిమిత్తం రాష్ట్రవ్యాప్తంగా 36,643 దరఖాస్తులు అందినట్లు సెర్ప్ అధికారులు తెలిపారు. ఇందులో పట్టణాల నుంచి 4,390 దరఖాస్తులు రాగా, గ్రామాల నుంచి 32,253 మంది మహిళలు దరఖాస్తులను సమర్పించారు. ఇప్పటివరకు అత్యధికంగా నిజామాబాద్ జిల్లా నుంచి 3,500 దరఖాస్తులు అందినట్లు అధికారులు పేర్కొన్నారు.


