సాహిత్యం ద్వారా సామాజిక చైతన్యం
ఆదాయ పన్ను శాఖ జాయింట్ కమిషనర్ సత్యానందం
విజయవాడ (గాంధీనగర్) :
సమాజంలోని సమస్యలను సాహిత్యం, కవితలు, రచనల ద్వారా వెలుగులోకి తీసుకొచ్చి ప్రజలను చైతన్యపరచాలని ఆదాయ పన్ను శాఖ జాయింట్ కమిషనర్ టి.సత్యానందం చెప్పారు. వృద్ధుల దినోత్సవాన్ని పురస్కరించుకుని స్వాతంత్య్ర సమరయోధుల భవనంలో సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యాన గురువారం వృద్ధుల సమస్యలపై కవితా గోష్టి నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సత్యానందం మాట్లాడుతూ వృద్ధులు తమ జీవితానుభవాలను నేటి తరాలకు అందించి స్ఫూర్తిగా నిలవాలని కోరారు. జీవన వికాసానికి కవితలు దోహదపడతాయన్నారు. ఎక్స్రే సాహితీ, సాహిత్య సంస్థ అధ్యక్షుడు కొల్లూరి, ప్రముఖ రచయిత కాటూరి త్రివిక్రమ్ మాట్లాడుతూ వృద్ధుల విషయంలో బంధువులే రాబంధులుగా మారుతున్నారని ఆందోళన వ్యక్తంచేశారు. విలువలు అంతరించిపోతున్నాయని పేర్కొన్నారు. వృద్ధుల సంక్షేమ సంఘ కార్యదర్శి మోతుకూరి వెంకటేశ్వరరావు, సింహాద్రి వాణి, కె.రవికిరణ్, మీనాకుమారి, గోవిందరాజులు, గురుప్రసాద్ పాల్గొన్నారు.