breaking news
small merchants
-
అధిక వడ్డీ.. అయినా తప్పదాయె..!
సాక్షి సిటీబ్యూరో: లాక్డౌన్ కరోనా ప్రభావంతో గత కొన్ని నెలలుగా ఫుట్‌పాత్ వ్యాపారులు పాటు ఇతర చిరు వ్యాపారులు పూర్తి స్థాయిలో నష్టాల్లో కూరుకుపోయారు. లాక్డౌన్ తొలగింపుతో ప్రస్తుతం ఫుట్‌పాత్, చిరు వ్యాపారాలు కాస్త పుంజుకుంటున్నాయి. నాలుగు నెలల పాటు వ్యాపారాలు లేక ఆదాయం కోల్పోయిన వ్యాపారులు తమ చేతిలో ఉన్న కొద్దిపాటి డబ్బును కుటుంబ పోషణకు ఖర్చు చేసేశారు. ఇప్పుడు తిరిగి వ్యాపారం చేయడానికి చేతిలో చిల్లిగవ్వ లేకపోవడంతో పెట్టుబడుల కోసం వడ్డీ వ్యాపారుల (పైవేట్ ఫైనాన్సర్స్)ను ఆశ్రయిస్తున్నారు. ఎక్కువ వడ్డీ అయినా సరే విధి లేని పరిస్థితిలో అప్పు తీసుకుంటున్నారు. లక్షకు రూ.10 వేలు మినహాయించుకొని... పాతబస్తీ నయాపూల్‌కు చెందిన నజీర్ అనే ఓ వ్యాపారి లాక్డౌన్, కరోనా కారణంగా నాలుగు నెలలుగా వ్యాపారం లేక ఆర్థికంగా చాలా నష్టపోయాడు. ఇప్పుడు తిరిగి చెప్పుల వ్యాపారం చేయడానికి పెట్టుబడి కోసం ఫైనాన్సర్‌ను సంప్రదించగా.. పరిచయం ఉన్న వ్యక్తితో ష్యూరిటీ ఇప్పించాలని చెప్పాడు. ‘రూ.లక్ష అప్పు ఇస్తా.. వాటిలో పది వేలు ముందే తగ్గించుకుంటా.. ప్రతి రోజూ వెయ్యి తిరిగి చెల్లించాలి’ అని షరతు పెట్టాడు. విధిలేని పరిస్థితిలో నజీర్ దీనికి ఒప్పుకొని డబ్బు తీసుకున్నాడు. 3 నెలలకోసారి వడ్డీ రేటు మార్పు... సుల్తాన్ బజార్‌కు చెందిన హన్మంతు అనే ఓ చిరువ్యాపారి చేతిలో ఉన్న డబ్బంతా లాక్డౌన్ నేపథ్యంలో వ్యాపారం లేక ఇంటి పోషణకు ఖర్చయి పోయింది. ప్రస్తుతం మార్కెట్ కాస్త పుంజుకోవడంతో మళ్లీ వ్యాపారం ప్రారంభించాలనుకున్నా డు. చేతిలోడబ్బులు లేకపోవడంతో వడ్డీ వ్యాపారిని కలిశాడు. రూ. 2 లక్షల అప్పు కావాలంటే.. రూ. 4 లక్షల విలువైన ఆస్తి ష్యూరిటీగా పెట్టి ఒరిజినల్ డాక్యుమెంట్లు సమర్పించాలన్నాడు. అలాగే ఖాళీ పేపర్‌పై సంతకాలు చేయడంతో పాటు ఖాళీ చెక్కులు ఇవ్వాలన్నాడు. ఇక మొదట 3 నెలలకూ నూటికి రూ. 2లు వడ్డీ ఉంటుందని, ఆ తర్వాత మూడు నెలలకు రూ. 4లు, ఆ తర్వాత 3 నెలలకు రూ. 8, ఏడాదికి రూ. 16 వడ్డీ చెల్లించాల్సి ఉంటుందని షరతు పెట్టాడు. గత్యంతరం లేక హన్మంతు డబ్బులు తీసుకున్నాడు. పేదరికం, అత్యవసరాన్ని ఆసరా చేసుకొని.. చిరువ్యాపారుల పేదరికం, అత్యవసరాన్ని వడ్డీ వ్యాపారులు క్యాష్ చేసుకుంటున్నారు. చోటా మోటా నేతల అండదండలతో పేదలను దోచుకుంటున్నారు. రూ.10 నుంచి రూ. 50 వరకు వడ్డీ వసూలు చేస్తున్నారు. వడ్డీ చెల్లించడం అలస్యమైతే చక్రవడ్డీ, బారువడ్డీ అంటూ సామాన్యుడి నడ్డి విరుస్తున్నారు. దీంతో చిరువ్యాపారులు అసలు తీర్చలేక ఆస్తులను, ఇళ్లను అమ్మి వడ్డీ చెల్లిస్తున్నారు. ఇంకొందరు వడ్డీ చెల్లించలేక చివరకు బలవన్మరణాలకు సైతం వెనుకాడటం లేదు. ఇప్పుడే పుట్టుకొచ్చిన దందా కాదు... ఈ దందా నగరంలో ఇప్పటికిప్పుడు పుట్టుకొచ్చిందేమీ కాదు..గత 50 ఏళ్లుగా పాతబస్తీతో పాటు నగరంలో మార్వాడీలు భూమి, ఇళ్ల పత్రాలను పెట్టుకొని వడ్డీపై డబ్బులు ఇస్తున్నాయి. కానీ ఈ మధ్య వడ్డీ జలగల బరితెగింపు వికృత రూపం దాల్చింది. నగరం, ప్రత్యేకంగా పాతబస్తీలో తోపుడు బండ్లపై పండ్లు, కూరగాయాలు, ఇడ్లీలు, బజ్జీలు అమ్ముకునే చిరు వ్యాపారులకు అప్పులిచ్చి వేధించుకొని తింటున్నారు. సాయంత్రానికి వడ్డీ ఇవ్వకుంటే బెదించడం, భౌతిక దాడులకు పాల్పడటం, మహిళలతో అసభ్యంగా ప్రవర్తించడం వంటివి చేస్తున్నారు. లాక్డౌన్ ఎత్తివేయడంతో ఇప్పుడిప్పుడే వ్యాపారాలు పుంజుకుంటున్నాయని, ఈ నేపథ్యంలో మళ్లీ వ్యాపారం ప్రారంభించాలనుకుంటున్న చిరువ్యాపారులకు ప్రభుత్వం తక్కువ వడ్డీకి రుణాలు మంజూరు చేసి ఆదుకోవాలని స్వచ్ఛంద సంస్థలు కోరుతున్నాయి. -
విజయ్‌సేతుపతి ఇంటి ముట్టడి
చెన్నై, పెరంబూరు: నటుడు విజయ్‌సేతుపతి ఇంటిని మంగళవారం చిరు వ్యాపారులు ముట్టడించి ఆందోళనకు దిగారు. విజయ్‌సేతుపతి ఇటీవల మండి ఆన్లైన్ వ్యాపార ప్రచార యాప్‌లో నటించారు. ఆన్లైన్ వ్యాపారంతో చిరు వ్యాపారులకు తీవ్ర నష్టం వాటిల్లే ప్రమాదం ఉందంటూ, ఆ మండి ఆన్లైన్ వ్యాపార ప్రకటన చిత్రంలో నటుడు విజయ్‌సేతుపతి నటించడాన్ని చిరు వ్యాపార సంఘాలు తీవ్రంగా వ్యతికేస్తున్నాయి. ఈ విషయంలో విజయ్‌సేతుపతి ఇంటిని ముట్టడించి ఆందోళనలకు దిగుతామని ఇంతకు ముందే హెచ్చరించారు. అన్నట్లుగానే మంగళవారం స్థానిక వలసరవాక్కం, అళ్వార్ తిరునగర్లోని విజయ్‌సేతుపతి ఇంటిని వందలాది మంది చిరు వ్యాపారలు ముట్టడించి ఆందోళనకు దిగారు. తమిళనాడు వ్యాపార సంఘాల అధ్యక్షుడు కొలత్తూర్ రవి ఆధ్వర్యంలో జరిగిన ఈ ఆందోళన కార్యక్రమంలో నటుడు విజయ్‌సేతుపతికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. చిరు వ్యాపారులకు తీవ్ర నష్టం కలిగించే ఆన్లైన్ వ్యాపారాలను ప్రోత్సహించరాదన్నారు. అయితే విజయ్‌సేతుపతి ఇంటిని ముట్టడి గురించి ముందస్తు సమాచారం ఉండడంతో పోలీసులు ఆయన ఇంటికి భద్రతను ఏర్పాటు చేశారు. ఆందోళన కారులను అరెస్ట్ చేసి సమీపంలోని ఒక కల్యాణ మంటపానికి తరలించారు. కాగా ఆన్లైన్ వ్యాపార విధానాన్ని నిషేధించాలంటూ రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేయనున్నట్లు కొలత్తూర్ రవి ఈ సందర్భంగా పేర్కొన్నారు. -
చిరు బతుకుల్లో..వెలుగు దివ్వె
కనీస సౌకర్యాల కల్పన ఏదీ? జిల్లాలోని కడప, ప్రొద్దుటూరు, రాజంపేట, రాయచోటి, మైదుకూరు, బద్వేలు, జమ్మలమడుగు, పులివెందులలో చిరు వ్యాపారులు, వీధి వ్యాపారులు ఎక్కువగా ఉన్నారు. వీధి వ్యాపారులను ఆదుకుంటామని మున్సిపల్ అధికారులు చెప్పినా.. కార్యరూపం దాల్చలేదు. ఎండా, వానను లెక్క చేయకుండా జీవనోపాధి కోసం వీధి పక్కన క్రయవిక్రయాలు చేసుకుంటూ కుటుంబాల్ని పోషించుకుంటున్న వీధి వ్యాపారులు, తోపుడు బండ్ల వ్యాపారుల బతుకులను రోడ్డు పాలు చేసిన వారే తప్ప.. వారికి ఆపన్న హస్తం అందించే వారు మాత్రం ఇన్నాళ్లూ కనిపించలేదు. కానీ వారి జీవితాల్లో వెలుగు రేఖలు ప్రసరించే హామీలతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి బీసీ డిక్లరేషన్ ప్రకటించారు. ఇందులో పొందుపరిచిన హామీలు వారిలో ఆత్మస్థైర్యం నింపింది. వీధి వ్యాపారులు, తోపుడు బండ్ల వ్యాపారులకు గుర్తింపు కార్డులు అందించి.. ఏటా సున్నా వడ్డీకే రూ.10 వేలు రుణం అందిస్తామన్న జగనన్న హామీ.. వారిలో ఆనందాన్ని నింపింది. వీధి వ్యాపారులపై నిర్లక్ష్యమేల? రోడ్లు, ఫుట్‌పాత్‌లను ఆధారంగా చేసుకొని వ్యాపారులు సాగించే వీధివ్యాపారుల పరిరక్షణ, సంక్షేమం కోసం చర్యలు చేపట్టాలని 2009లోనే సుప్రీంకోర్టు కేంద్రంతోపాటు రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో వీధి వ్యాపారుల సంరక్షణకు, వారి అభివృద్ధి కోసం పార్లమెంటు చట్టం తెచ్చింది. వీధి వ్యాపారుల కోసం ప్రత్యేక స్థలాలు కేటాయించడంతో పాటు గుర్తింపు కార్డులు జారీ చేసి.. స్వేచ్ఛగా వ్యాపారం కొనసాగించేందుకు వీలు కల్పించాలని ఆదేశాలు జారీ చేశారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం మాత్రం వాటిని బేఖాతరు చేస్తూ వీధి వ్యాపారుల సంక్షేమాన్ని విస్మరించింది. వీధి వ్యాపారులకు కనీస మౌలిక సదుపాయాలు కల్పించాల్సి ఉంది. సంక్షేమం కోసం బ్యాంకుల ద్వారా రుణ సహాయం అందిస్తే.. వడ్డీ వ్యాపారుల బారి నుంచి విముక్తి పొందవచ్చని సుప్రీంకోర్టు ఆదేశించినా తూతూ మంత్రంగా చర్యలున్నాయే తప్ప కనీసం పట్టించుకునే నాథుడే లేరు. ప్రత్యేక జోన్ ఏదీ? కడప నగరపాలక సంస్థలో వీధి వ్యాపారులకు ఇంత వరకూ ప్రత్యేక జోన్ ఏర్పాటు చేయలేదు. ప్రొద్దుటూరులో మడూరు కాలువ గట్టున ప్రత్యేకంగా షెడ్లు ఏర్పాటు చేస్తామని అధికారులు గతంలో చెప్పినా కార్యరూపం దాల్చలేదు. జిల్లాలోని మిగతా ప్రాంతాల్లోనూ వీరికి ప్రత్యేక జోన్ లేదు. దీంతో రోడ్లపై వ్యాపారం చేసుకుంటున్న వ్యాపారులకు పోలీసుల బెడద తప్పడం లేదు. ఒక వేళ మార్కెట్ పరిసర ప్రాంతంలో వ్యాపారాలు చేసుకున్నా రుసుం చెల్లించాలంటూ కాంట్రాక్టర్లు బెదిరిస్తున్నారు. దీంతో వారి వ్యాపారం దినదిన గండంలా మారింది. గుర్తింపు కార్డులు ఇవ్వడంలో అలసత్వం వీధి వ్యాపారుల చట్టం–2014 ప్రకారం దేశంలోని 2430 పట్టణాల్లో 18 లక్షల మంది వీధి వ్యాపారులు ఉన్నట్లు కేంద్ర ప్రభుత్వం గుర్తించింది. 2344 వీధి వ్యాపారుల కమిటీలు ఏర్పాటు చేయడంతోపాటు 9 లక్షల మందికి గుర్తింపు కార్డులు ఇచ్చింది. జిల్లాలో 25 వేల మంది వ్యాపారులు ఉన్నారు. వారిలో కొందరికి గుర్తింపు కార్డులు అందించారు. తర్వాత ఈ ప్రక్రియను నిలిపివేశారు. వీధి వ్యాపారుల చట్టం అమల్లో మన పక్క రాష్ట్రమైన తమిళనాడు ప్రథమ స్థానంలో ఉండగా, మన రాష్ట్రానికి మాత్రం టాప్–10లో చోటు లేదంటే .. ఇక్కడ పరిస్థితి ఎంత దయనీయంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. కుటుంబంలో ఒక్కరికి మాత్రమే కార్డు జారీ చేస్తామని ప్రభుత్వం ఆదేశాలు చేసింది. వీధి వ్యాపారుల్లో చాలా వరకు ఒక్కో కుటుంబంలో ఇద్దరు, ముగ్గురు ఉన్నారు. ఒక్కరికి మాత్రమే ఐడీ కార్డు జారీ చేస్తామని ప్రభుత్వం చెప్పడంతో వ్యాపారులు ఆందోళన చెందుతున్నారు. బ్యాంకులు రుణాలు ఇవ్వడం లేదు చిరు వ్యాపారులను నమ్మి బ్యాంకులు రుణాలు ఇవ్వడం లేదు. దీంతో ప్రైవేట్ వడ్డీ వ్యాపారులను ఆశ్రయించి ఎక్కువ వడ్డీకి డబ్బు తీసుకోవాల్సి వస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో వడ్డీ లేకుండా ఏటా రూ.10 వేలు ఇస్తానని వైఎస్ జగన్ ప్రకటించడం మా లాంటి వ్యాపారులకు ఎంతో మేలు జరుగుతుంది. మాకు మంచి చేయాలని చూస్తున్న జగన్‌కు అంతా మంచే జరుగుతుంది.– శ్రీనివాసులు, వ్యాపారి, ప్రొద్దుటూరు కొండంత ధైర్యం చిరు వ్యాపారులను ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది. కనీసం వారికి గుర్తింపు కార్డులు అయినా ఇచ్చి ఉంటే బ్యాంకు రుణాలు తీసుకునే వారు. సున్నా వడ్డీకే ఏటా రూ.10 వేలు ఇస్తామని వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రకటించారు. ఈ నిర్ణయం చిరువ్యాపారులకు కొండంత ధైర్యాన్ని ఇచ్చినట్లయింది. – సుభాష్‌బాబు, ప్రొద్దుటూరు బీసీ డిక్లరేషన్‌తో అన్ని వర్గాలకు మేలు వైఎస్ జగన్ ప్రకటించిన బీసీ డిక్లరేషన్ వల్ల అన్ని వర్గాల వారికీ న్యాయం జరుగుతుంది. తోపుడు బండ్లు, వీధి వ్యాపారులకు ప్రాధాన్యం కల్పిస్తూ.. వారి జీవితాల్లో వెలుగును నింపేందుకు వైఎస్ జగన్ ప్రకటించిన బీసీ డిక్లరేషన్ చాలా బాగుంది. లక్షలాది కుటుంబాలకు న్యాయం జరుగుతుంది. – నాగేంద్ర, టీచర్స్ కాలనీ, ప్రొద్దుటూరు ఒక్కో రోజు ఒక్కో ధర ఎన్నో ఏళ్ల నుంచి పూల వ్యాపారం చేస్తున్నాం. ఒక రోజు ధర ఎక్కువ ఉంటే, మరో రోజు తక్కువ ఉంటుంది. ఎప్పుడు ఎంత ఉంటుందో అర్థం కాని పరిస్థితి. ఒక్కోసారి మేం అధిక ధరలకు మండీ నుంచి పూలు కొన్నాక ఉన్నట్టుండి మార్కెట్లో ధర తగ్గుతుంది. ఇలా ఇబ్బందులు ఎదుర్కొంటున్న మాకు సున్నా వడ్డీకే రూ.10 వేలు ఇస్తామని జగనన్న ఇచ్చిన హామీ ఎంతో సంతోషాన్ని ఇచ్చింది. – మహబూబ్‌బీ, పూల వ్యాపారం, పాతబస్టాండు, ప్రొద్దుటూరు వడ్డీలేని రుణం ఓ వరం వైఎస్ జగన్మోహన్రెడ్డి చేసిన ప్రకటన వారికి కొత్త ఉత్సాహాన్ని ఇచ్చింది. ప్రతి ఒక్క వీధి విక్రయదారుడు, తోపుడు బండి వ్యాపారికి గుర్తింపు కార్డు ఇస్తామని ప్రకటించారు. దీనివల్ల అందరికీ రుణాలు పొందే అవకాశం లభిస్తుంది. వీధి వ్యాపారులకు రుణ సదుపాయం ఉన్నా ఎవరికీ పూర్తి స్థాయిలో అందడం లేదు. ఇటీవల కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ముద్రరుణాలు కొందరికి మాత్రమే అందాయి. చాలా మందికి గుర్తింపు కార్డులు లేకపోవడంతో.. ఈ పరిస్థితి ఎదురైంది. ఇక్కట్లు తీరుతాయి వైఎస్ జగన్మోహన్రెడ్డి తోపుడు బండ్ల వ్యాపారులకు చేయూతనిస్తారనే నమ్మకం ఉంది. సున్నా వడ్డీతో రూ.10 వేలు ఇస్తే దాన్నే పెట్టుబడిగా పెట్టుకుని వ్యాపారం చేసుకోవచ్చు. దీంతో వడ్డీ వ్యాపారులను ఆశ్రయించే ఇబ్బందులు తప్పుతాయి. మాకు జగనన్న ఆశాదీపంగా కనిపిస్తున్నారు. ఆయనతోనే మాకు బంగారు భవిష్యత్తు లభిస్తుంది.- మౌలాలి, పండ్ల వ్యాపారి, బద్వేలు మా కష్టాలు తెలుసుకున్నారు తోపుడు బండ్లలో వ్యాపారం చేయాలంటే పలు ఇబ్బందులు ఉన్నాయి. పెట్టుబడికీ కష్టమే. బండి పెట్టుకునే స్థలానికీ ఇక్కట్లే. ఎండ, వాన, చలి లెక్క చేయకుండా వ్యాపారం చేసుకుంటేనే కుటుంబం గడిచేది. ఇలాంటి పరిస్థితుల్లో గుర్తింపు కార్డులు, వడ్డీలేని రుణం ఇస్తామనడం చాలా సంతోషాన్ని ఇస్తుంది. – గౌస్‌పీర్, పండ్ల వ్యాపారి, బద్వేలు -
మంత్రి కార్యాలయం ముట్టడి
విశాఖపట్నం: విశాఖపట్నంలోని పుట్ పాత్లపై వ్యాపారుల తోపుడు బళ్లను జీహెచ్ఎంసీ అధికారులు తొలగించడంపై చిరు వ్యాపారులు ఏఐటీయూసీ ఆధ్వర్యంలో శుక్రవారం ఆందోళన చేపట్టారు. న్యాయం చేయాలని కోరుతూ ఏపీ మంత్రి మంత్రి గంటా శ్రీనివాసరావు కార్యాలయాన్ని ఆందోళనకారులు ముట్టడించారు. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుకు విరుద్ధంగా అధికారులు బళ్లను తొలగించారని వారు మండిపడ్డారు. తమకు వెంటనే న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. దీనిపై స్పందించిన మంత్రి అధికారులతో మాట్లాడి న్యాయం చేస్తామని హామి ఇచ్చారు. ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా వ్యాపారం చేసుకోవాలని ఈ సందర్భంగా ఆయన వ్యాపారులకు సూచించారు.