breaking news
Siddardha Jain
-
ఓట్ల లెక్కింపునకు ఏర్పాట్లు పూర్తి
ఏలూరు, న్యూస్‌లైన్ : జిల్లాలో ఈ నెల 16న ఉదయం 8 గంటలకు మూడు ప్రాంతాల్లో అసెంబ్లీ, లోక్‌సభ ఓట్ల లెక్కింపును మొదలుపెట్టాలని నిర్ణయించినట్లు కలెక్టర్ సిద్ధార్థజైన్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. వట్లూరులోని సీఆర్ఆర్ ఇంజినీరింగ్ కళాశాలలో రాజమండ్రి పార్లమెంటరీ నియోజకవర్గానికి సంబంధించిన కొవ్వూరు, నిడదవోలు, గోపాలపురం అసెంబ్లీ నియోజకవర్గాల ఓట్ల లెక్కింపును నిర్వహిస్తారు. సీఆర్ఆర్ ఇంజినీరింగ్ కళాశాల మొదటి అంతస్తులో కొవ్వూరు, రెండో అంతస్తులో నిడదవోలు, గోపాలపురం అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో అసెంబ్లీ, లోక్‌సభ ఓట్ల లెక్కింపు జరుగుతుందన్నారు. వట్లూరులోని రామచంద్ర ఇంజినీరింగ్ కళాశాలలో ఏలూరు పార్లమెంట్ పరిధిలోని ఉంగుటూరు, దెందులూరు, ఏలూరు, పోలవరం, చింతల పూడి అసెంబ్లీ నియోజకవర్గాల ఓట్ల లెక్కింపుతో పాటు లోక్‌సభ ఓట్ల లెక్కింపు ప్రక్రియ నిర్వహిస్తామని పేర్కొన్నారు. నరసాపురం లోక్‌సభ నియోజకవర్గ పరిధిలోని ఆచంట, పాలకొల్లు, నరసాపురం, భీమవరం అసెంబ్లీ నియోజకవర్గ లోక్‌సభ ఓట్ల లెక్కింపును భీమవరంలోని విష్ణు కళాశాలలో చేపట్టనున్నామన్నారు. అలాగే ఇదే కళాశాల ప్రాంగణంలోని బి.సీత పాలిటెక్నిక్ కళాశాలలో ఉండి, తణుకు, తాడేపల్లిగూడెం అసెంబ్లీ, లోక్‌సభ ఓట్ల లెక్కింపు నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ వివరించారు. పరిషత్ ఓట్ల లెక్కింపు ఈ పట్టణాల్లో.. జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఓట్ల లెక్కింపును ఏలూరు, తాడేపల్లిగూడెం, జంగారెడ్డిగూడెం, తణుకు, భీమవరంలలో నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు చేశామని కలెక్టర్ సిద్ధార్థజైన్ తెలిపారు. ఏలూరులో టి.నరసాపురం, కామవరపుకోట, లింగపాలెం, ఉంగుటూరు, గణపవరం, పెదపాడు, పెదవేగి, దెందులూరు, భీమడోలు, టి.నరసాపురం, చింతలపూడి, ద్వారకాతిరుమల, ఏలూరు మండలాల ఓట్లను లెక్కిస్తామన్నారు. అలాగే తాడేపల్లిగూడెంలో పెంటపాడు, నల్లజర్ల, తాడేపల్లిగూడెం మండలాలకు సంబంధించినవి, జంగారెడ్డిగూడెంలో పోలవరం, బుట్టాయిగూడెం, జీలుగుమిల్లి, గోపాలపురం, కొయ్యలగూడెం, తాడేపల్లిగూడెం, జంగారెడ్డిగూడెం మండలాలివి, తణుకులో ఉండ్రాజవరం, అత్తిలి, పెనుమంట్ర, పెనుగొండ, కొవ్వూరు, చాగల్లు, దేవరపల్లి, నిడదవోలు, ఇరగవరం, తాళ్లపూడి, పెరవలి, తణుకు, మండలాలు, భీమవరంలో నరసాపురం, పాలకొల్లు, మొగల్తూరు, యలమంచిలి, ఆచంట, పోడూరు, వీరవాసరం, ఆకివీడు, ఉండి, కాళ్ల, పాలకోడేరు, భీమవరం, మండలాలకు సంబంధించిన ఓట్లను లెక్కిస్తారని పేర్కొన్నారు. పెయిడ్ న్యూస్‌పై 97 నోటీసులు జారీ ఎన్నికల నేపథ్యంలో పెయిడ్ న్యూస్‌పై జిల్లాలోని వివిధ రాజకీయ పార్టీల నేతలకు 97 నోటీసులు జారీ చేశామని కలెక్టర్ సిద్ధార్థజైన్ చెప్పారు. రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి భన్వర్‌లాల్ హైదరాబాద్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కలెక్టర్లతో సమీక్షా సమావేశం నిర్వహించారు. సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపును ఈ నెల 16న ఉదయం 8 గంటలకు ప్రారంభించడానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని తెలిపారు. 15 అసెంబ్లీ నియోజకవర్గాలకు 17,883 పోస్టల్ బ్యాలెట్లు, పార్లమెంట్ నియోజకవర్గాలకు 16,882 పోస్టల్ బ్యాలెట్లు ఇప్పటివరకు అందాయన్నారు. ఈవీఎంలు భద్రపరిచిన స్ట్రాంగ్ రూమ్‌లకు మూడంచెల భద్రతా వ్యవస్థ ఏర్పాటు చేశామన్నారు. భన్వర్‌లాల్ మాట్లాడుతూ 16న ఉదయం 7 గంటలకు అందిన పోస్టల్ బ్యాలెట్లను పరిగణన లోకి తీసుకుని లెక్కించాలని కలెక్టర్లకు సూచించారు. ఎన్నికల నిర్వహణకు సంబధించిన అన్ని అంశాలకు సంబంధించిన ఫొటోలను పంపించాలని ఆదేశించారు. ఎన్నికల నిర్వహణకు మంజూరు చేసిన బడ్జెట్‌కు త్వరితగతిన చెల్లింపులు చేసి నివేదికలను అందజేయాలన్నారు. ఈ సమావేశంలో ఎస్పీ హరికృష్ణ, జాయింట్ కలెక్టర్ టి.బాబూరావునాయుడు, అదనపు జేసీ సీహెచ్ నరసింగరావు, డీఆర్వో కె.ప్రభాకర్‌రావు, జెడ్పీ సీఈవో డి.వెంకటరెడ్డి పాల్గొన్నారు. -
విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే తొలగింపు
ఏలూరు, న్యూస్‌లైన్ : ఎన్నికల విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే సస్పెండ్ చేయడంతో పాటు అరెస్ట్‌కు కూడా వెనుకాడబోమని జిల్లా జాయింట్ క లెక్టర్ టి.బాబూరావునాయుడు సిబ్బందిని హెచ్చరించారు. కలెక్టరేట్లో శుక్రవారం పోలింగ్ కేంద్రాల్లో మౌలిక సదుపాయాల కల్పనపై అధికారులతో ఆయన సమీక్షించారు. ఈనెల 6న తొలి విడత జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల సందర్భంగా పోలింగ్ కేంద్రాల్లో తాగునీరు, విద్యుత్, మరుగుదొడ్లు తదితర కనీస సౌకర్యాలు కల్పించాలని కలెక్టర్ సిద్ధార్థజైన్ ఆదేశించినప్పటికీ, నేటికీ చర్యలు తీసుకోకపోవడంపై రాజీవ్ విద్యామిషన్ ఈఈ నౌజీనాల్పై జేసీ ఆగ్రహం వ్యక్తం చేశారు. 24 గంటల్లోగా నూరు శాతం పోలింగ్ కేంద్రాల్లో సౌకర్యాలు కల్పించకపోతే విధుల నుంచి తొలగించడమే కాక, ఎన్నికల నిబంధనల ప్రకారం అరెస్ట్ చే యిస్తామన్నారు.వేసవి తీవ్రత పెరుగుతున్న దృష్ట్యా పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లకు మంచినీరు, కేంద్రాల్లో విద్యుత్ సౌకర్యం విధిగా కల్పించాల్సిందేనని జేసీ స్పష్టం చేశారు. వెబ్‌కాస్టింగ్‌కు స్పందన జిల్లాలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు సంబంధించి ఈనెల 6,11 తేదీల్లో పోలింగ్ ప్రక్రియను చిత్రీకరించడానికి విద్యార్థులు స్వచ్ఛందంగా ముందుకు వస్తున్నారని బాబూరావునాయుడు చెప్పారు. జిల్లాలోని విద్యార్థులే కాక ఆసక్తి, సొంత ల్యాప్‌టాప్ ఉన్నవారు తమ పేర్లు, ఫోన్ నెంబర్ల వివరాలతో జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని నిక్నెట్ సెంటర్లో సంప్రదించాలని లేదా ఎన్ఐసీ అధికారి శర్మ సెల్ నంబర్ : 98856 32251కు ఫోన్‌చేసి పేర్లను నమోదు చేసుకోవాలని ఆయన కోరారు. వెబ్‌కాస్టింగ్‌కు ఎంతమంది ముందుకు వచ్చినా అందరి సేవలను వినియోగించుకుంటామని, భోజన వసతి సౌకర్యాలతో పాటు రూ.500 నగదు పారితోషికం, ప్రశంసా పత్రం కూడా అందిస్తామని జేసీ చెప్పారు. తొలిదశ పోలింగ్ జరిగే ఏలూరు, జంగారెడ్డిగూడెం డివిజన్ల పరిధిలోని అన్ని పోలింగ్ కేంద్రాలకు యుద్ధప్రాతిపదికన విద్యుత్ సౌకర్యం కల్పించాలని ట్రాన్స్‌కో ఎస్ఈ సూర్యప్రకాష్‌రావును జేసీ ఆదేశించారు. సమావేశంలో డీఆర్వో కె.ప్రభాకరరావు, రాజీవ్ విద్యామిషన్ పీవో ఎం.విశ్వనాథ్, ఈఈ నౌజీనాల్ పాల్గొన్నారు. -
వరదల పరిస్థితిని సమీక్షించిన కలెక్టర్
ఏలూరు: జిల్లా అధికారులతో వరదల పరిస్థితిని కలెక్టర్ సిద్ధార్థ్ జైన్ సమీక్షించారు. రాగల 48 గంటల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు చేసింది. ఈ పరిస్థితిలో అప్రమత్తంగా ఉండాలని ముంపు ప్రాంతాల ప్రజలను కలెక్టర్ కోరారు. ముంపు ప్రాంతాల్లో సహాయక చర్యలను 600 మంది సిబ్బంది పర్యవేక్షిస్తున్నట్లు తెలిపారు. అత్యవసర సేవల కోసం 50 పడవలను సిద్ధంగా ఉంచామని కలెక్టర్ తెలిపారు. పోలవరం మండలంలోని ముంపు గ్రామాలను రేపు కలెక్టర్ సందర్శించనున్నారు. వరద బాధితులకు 25 కిలోల బియ్యం, ఐదు లీటర్ల కిరోసిన్ పంపిణీ చేయనున్నట్లు తెలిపారు.