breaking news
shyamprasad mukharjee scheme
-
దేశ సమైక్యతకు కృషి చేసిన వ్యక్తి శ్యాంప్రసాద్ ముఖర్జీ
సాక్షి, హైదరాబాద్: దేశ సమైక్యత కోసం కృషి చేసిన వ్యక్తి శ్యాంప్రసాద్ ముఖర్జీ అని, జమ్మూ కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించాల్సిన అవసరం లేదని నెహ్రూతో విభేదించి ప్రభుత్వంలో నుంచి ముఖర్జీ బయటకు వచ్చేశారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్ పేర్కొన్నారు. శ్యాంప్రసాద్ ముఖర్జీ బలిదాన్ దివస్ కార్యక్రమంలో భాగంగా ఆదివారం బీజేపీ కార్యాలయంలో ఆయనకు పార్టీ నేతలు నివాళులర్పించారు. ఈ సందర్భంగా లక్ష్మణ్ మాట్లాడుతూ.. దేశంలో అంతర్భాగమైన కశ్మీర్‌కు ప్రత్యేక ప్రధాని, ప్రత్యేక రాజ్యాంగం వద్దని సూచించారన్నారు. ప్రస్తుతం రగులుతున్న రావణ కాష్టానికి కాంగ్రెస్ పార్టీనే కారణమన్నారు. 1951లో జనసంఘ్‌ను స్థాపించి కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా పోరాడారన్నారు. చివరి ఊపిరి వరకు కశ్మీర్ దేశంలో అంతర్భాగంగా ఉండాలని పోరాటం చేసినందునే ఆయన వర్ధంతి రోజును బలిదాన్ దివస్‌గా నిర్వహిస్తున్నామన్నారు. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్‌రావు మాట్లాడుతూ స్వాతంత్య్రం వచ్చాక గాంధీజీ పిలుపు మేరకు సమైక్య ప్రభుత్వం కోసం కృషి చేశారన్నారు. అందులో భాగంగానే నెహ్రూ నేతృత్వంలోని ప్రభుత్వంలో చేరారని, కశ్మీర్ అంశంలో విభేదించి ప్రభుత్వం నుంచి బయటకువచ్చేశారని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ, మాజీమంత్రి విజయరామారావు తదితరులు పాల్గొన్నారు. -
‘రూర్బన్’కు గ్రహణం
శ్యాంప్రసాద్ ముఖర్జీ పథకానికి ఎంపికైన కంబదూరు ఆరునెలల క్రితమే రూ.8.82 కోట్లు నిధులు విడుదల చినబాబు రాక... ప్రారంభం కాని పనులు గ్రామీణ ప్రాంతాల్లోని వారికి పట్టణాల్లోలాగా మెరుగైన మౌలిక వసతులు కల్పించాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన శ్యాంప్రసాద్ ముఖర్జీ రూర్బన్ మిషన్ (ఎస్పీఎంఆర్ఎం)పథకానికి రాజకీయ గ్రహణం పట్టుకుంది. ఈ పథకం కింద ఎంపికైన కంబదూరు మండలానికి ఆరు నెలల క్రితమే రూ.8.82 కోట్లు మంజూరైనా కేవలం మంత్రి లోకేష్ పర్యటన ఖరారు కాలేదన్న సాకుతో ఏ ఒక్క పనీ ఇంతవరకూ ప్రారంభించలేదు. - కంబదూరు: శ్యాంప్రసాద్ ముఖర్జీ రూర్బన్ మిషన్ (ఎస్పీఎంఆర్ఎం)పథకానికి కంబదూరు మండలాన్ని 2015లో ఎంపిక చేశారు. ఈ పథకం ద్వారా మండలంలో రూ.100 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టాల్సి ఉంటుంది. దీంతో తమ గ్రామాల రూపురేఖలు మారిపోతాయని మండలవాసులంతా ఆనందపడ్డారు. ఈ ప«థకం కింద ఈ ఏడాది ఏప్రిల్ రూ.8.82 కోట్ల నిధులు మంజూరు కూడా చేశారు. కానీ పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి నారా లోకేశ్ పర్యటన ఖరారు కాకపోవడంతో అధికారులు ఇంతవరకు పనులు ప్రారంభించలేదు. మూడేళ్లలో రూ.వంద కోట్లతో అభివృద్ధి మూడేళ్లలో రూ.వంద కోట్లతో అభివృద్ధి చేయడానికి అధికారులు ప్రణాళికలు సిద్ధం చేశారు. మండలంలో 12 పంచాయతీలు 42 గ్రామాలుండగా 51 వేల మంది జనాభా ఉంది. పథకం అమలైతే వీరి జీవన స్థితిగతులు మారే అవకాశం ఉంది. పథకం ముఖ్య ఉద్దేశం ప్రస్తుతం పట్టణ ప్రాంతాల్లో ఎలాంటి మౌలిక వసతులు ఉన్నాయో...అలాంటివన్నీ శ్యాంప్రసాద్ ముఖర్జీ రూర్బన్ మిషన్ (ఎస్పీఎంఆర్ఎం)కింద గ్రామీణ ప్రాంతాల్లో కూడా కల్పించడానికి కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా రాష్ట్రంలో చిత్తూరు జిల్లాలోని కుప్పం, విశాఖపట్నంలోని అరకులోయ, ప్రకాశంలోని సింగరాయకొండ, నెల్లూరులోని వెంకటచలం మండలాలతో పాటు మన జిల్లాలోని కంబదూరు మండలాన్ని ఎంపిక చేసింది. ఈ పథకం కింద కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాలు మూడేళ్ల పాటు రూ.100 కోట్ల నిధులను మంజూరు చేయనున్నాయి. ప్రతిపాదనలు సిద్ధం రూర్బన్ పథకానికి ఎంపికైన కంబదూరు మండలంలోని వివిధ గ్రామాలను అభివృద్ధి చేసేందుకు అధికారులు ఆయా గ్రామాల్లో పర్యటించి సమస్యలను గుర్తించారు. మౌలిక వసతుల కల్పనకు రూ.127 కోట్లతో ప్రతిపాదనలు తయారు చేసి ఉన్నతాధికారులకు పంపారు. అనేకసార్లు స్థానిక మండల పరిషత్ సిబ్బందికి శిక్షణ ఇవ్వడంతో పాటు జిల్లా స్థాయి అధికారులు కూడ పథకంపై సమీక్షించారు. సౌకర్యాల కల్పన ఇలా... శ్యాంప్రసాద్ ముఖర్జీ రూర్బన్ మిషన్ కింద గ్రామాల్లో మెరుగైన పారిశుద్ధ్యం, అండర్ డ్రైనేజీ, సీసీ రోడ్లు నిర్మాణం, వీధిదీపాలు, పైపుల్లో తాగునీటి సరఫరా, ఘన వ్యర్థాల యాజమాన్యం, నిరుద్యోగులకు, మహిళలకు ఉపాధి కల్పించేలా నైపుణ్యాల శిక్షణ కేంద్రాల ఏర్పాటు, అందరికీ వంట గ్యాస్, ప్రభుత్వ పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాలకు పక్కాభవనాల నిర్మాణం, విద్య, వైద్య పరంగా మెరుగైన సేవలు అందిస్తారు. ఇందులో 30 శాతం నిధులను కేంద్ర ప్రభుత్వం విడుదల చేయనుంఽడగా, 70 శాతం నిధులు రాష్ట్ర ప్రభుత్వం భరించాల్సి ఉంటుంది. మంత్రి పర్యటన ఖరారు కాలేదు మంత్రి నారా లోకేష్ చేతుల మీదుగా పథకాన్ని ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తున్నాం. అయితే మంత్రి పర్యటన తేదీలు ఖరారు కాకపోవడంతో ఆలస్యం జరుగుతోంది. ఈనెలలోపే పనులు ప్రారంభానికి ప్రయత్నిస్తున్నాం. ప్రస్తుతం విడుదలైన నిధులన్నీ ఎంపీడీఓ ఖాతాలోనే ఉన్నాయి. వాటికి ఎస్ట్మెంట్లు తయారు చేస్తున్నాం. – శివారెడ్డి, ఎంపీడీఓ, కంబదూరు