breaking news
shruti Hassan
-
టింగ్... టింగ్... ఎగ్జైటింగ్!
ఇప్పటివరకూ కథానాయికగా శ్రుతీహాసన్ దగ్గర దగ్గర పాతిక సినిమాలు చేశారు. అవన్నీ ఒక ఎత్తై ఇప్పుడు చేస్తున్న ‘శభాష్ నాయుడు’ మరో ఎత్తు అనేంతగా ఆమె ఆనందపడి పోతున్నారు. దానికి కారణం తొలిసారి తండ్రి కమల్‌హాసన్‌తో కలిసి ఆమె నటిస్తున్న చిత్రం ఇది. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఈ చిత్రం రూపొందుతోంది. ఈ చిత్రంలో కమల్-శ్రుతి తమ రియల్ లైఫ్ పాత్రలు పోషిస్తున్నారు. అంటే.. తండ్రీకూతుళ్లుగా నటిస్తున్నారు. ‘దశావతారం’లో ఓ పాత్ర అయిన బలరామ్ నాయుడి పాత్రతో ఈ చిత్రం సాగుతుంది. టైటిల్ రోల్‌ను కమల్ చేస్తుండగా, బలరామ్ నాయుడి అసిస్టెంట్ పాత్రను బ్రహ్మానందం చేస్తున్నారు. ఇందులో కమల్ భార్య పాత్రను రమ్యకృష్ణ పోషిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన భారీ షెడ్యూల్‌ను యూఎస్‌లో ప్లాన్ చేశారు. ఈ షూటింగ్లో పాల్గొనడానికి శ్రుతి అక్కడకు వెళ్లారు. ‘‘మా నాన్నగారితో యాక్ట్ చేయబోతున్నందుకు చాలా ఆనందంగా, ఎగ్జైటింగ్‌గా ఉంది’’ అని శ్రుతి పేర్కొన్నారు. ఈ బ్యూటీ ఎగ్జైట్ అవుతున్న తీరు చూస్తుంటే... ‘సుప్రీమ్’ చిత్రంలో ‘జింగ్... జింగ్.. అమేజింగ్’ అనే డైలాగ్‌ని కాస్త మార్చి ‘టింగ్... టింగ్.. ఎగ్జయిటింగ్’ అనాలేమో. -
అభిమానులకు డబుల్ ధమాకా!
ఇప్పటి వరకు దక్షిణ, ఉత్తరాది భాషల్లో శ్రుతీ హాసన్ దాదాపు ఇరవై చిత్రాలు చేస్తే, వాటిలో ఆమె తన మాతృభాష తమిళంలో చేసినవి మాత్రం రెండే రెండు. ఎప్పటికప్పుడు తమిళంలో ఎక్కువ సినిమాలు అంగీకరించాలని శ్రుతికి ఉన్నప్పటికీ డేట్స్ ఖాళీ లేక చేయలేకపోతున్నారట. కానీ, ఈ ఏడాది తన తమిళ అభిమానులను ఆనందపరిచేలా ఏకంగా రెండు సినిమాలు అంగీకరించారు. ఒకటి విశాల్ సరసన చేస్తున్న ‘పూజై’. గత కొన్నాళ్లుగా ఈ చిత్రం షూటింగ్ జరుగుతోంది. తాజాగా, తమిళంలో ఓ భారీ చిత్రానికి పచ్చజెండా ఊపారు శ్రుతి. ‘తమిళంలో నేను చేయనున్న భారీ సినిమా గురించి త్వరలో ప్రకటిస్తా’ అంటూ రెండు రోజుల క్రితం ఆమె తన అభిమానులను ఊరించారు. ‘అది ఏ సినిమా అయ్యుంటుంది? ఏ హీరో సరసన శ్రుతి నటించనుంది?’ అని పలువురు చర్చించుకున్నారు. ఇప్పుడా సీక్రెట్‌ను బయటపెట్టేశారు శ్రుతి. విజయ్ హీరోగా శింబుదేవన్ దర్శకత్వం వహించనున్న ఓ చారిత్రక చిత్రంలో కథానాయికగా నటించనున్నట్లు ఆమె ప్రకటించారు. విజయ్ లాంటి పెద్ద హీరో సరసన సినిమా చేయనుండటం ఆనందంగా ఉందని అన్నారు. అత్యంత భారీ నిర్మాణ వ్యయంతో రూపొందనున్న ఈ చిత్రంలో జగదేక సుందరి శ్రీదేవి, సుదీప్ కీలక పాత్రలు చేయనున్నారు. విజయ్‌కి ఇది 58వ చిత్రం కావడంతో ప్రస్తుతానికి వర్కింగ్ టైటిల్‌గా ‘విజయ్ 58’ అని నిర్ణయించారు. ఏది ఏమైనా శ్రుతి ఇలా తమిళంలో ఒకేసారి రెండు సినిమాలు అంగీకరించడం, అందులోనూ ఒకటి పెద్ద హీరో సరసన భారీ చిత్రం కావడం అక్కడి అభిమానులకు డబుల్ ధమాకా అనే చెప్పాలి.