breaking news
shot put player
-
మన్‌ప్రీత్ కౌర్‌కు భారీ షాక్
న్యూఢిల్లీ : ఆసియా చాంపియన్‌గా నిలిచిన షాట్‌పుటర్ మన్‌ప్రీత్ కౌర్‌పై వేటు పడింది. డోపింగ్‌కు పాల్పడినందుకు ఆమెపై జాతీయ డోపింగ్ వ్యతిరేక సంస్థ (నాడా) నాలుగు సంవత్సరాల పాటు నిషేధం విధించింది. ఈ విషయాన్ని ‘నాడా’ డైరెక్టర్ జనరల్ నవీన్ అగర్వాల్ నిర్ధారించారు. 2017లో మన్‌ప్రీత్ నాలుగు సార్లు డోపింగ్ పరీక్షల్లో విఫలమైంది. ఆమెపై తాత్కాలిక నిషేధం విధించిన జూలై 20, 2017నుంచి తాజా శిక్ష అమల్లోకి వస్తుంది. అయితే తనపై విధించిన నిషేధాన్ని సవాల్ చేస్తూ యాంటీ డోపింగ్ అప్పీల్ ప్యానెల్‌కు ఆమె అప్పీల్ చేసుకునే అవకాశం కల్పించారు. కాగా శాంపుల్ సేకరించిన నాటి నుంచి ఆమె అన్ని ఫలితాలు చెల్లవంటూ ‘నాడా’ ప్యానెల్ తీర్పునివ్వడంతో 2017లో గెలుచుకున్న ఆసియా చాంపియన్‌షిప్ స్వర్ణంతో పాటు జాతీయ రికార్డును కూడా మన్‌ప్రీత్ కోల్పోనుంది. షాట్‌పుట్‌లో 18.86 మీటర్ల రికార్డు మన్‌ప్రీత్ పేరిటే ఉంది. 2017లో ఆసియా గ్రాండ్‌ప్రి, ఫెడరేషన్ కప్, ఆసియా అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్, ఇంటర్ స్టేట్ చాంపియన్‌షిప్‌లలో ఆమె ఏకంగా నాలుగు సార్లు ‘పాజిటివ్’గా తేలింది. వీటిలో ఒక సారి మెటనొలోన్, మరో మూడు సార్లు డైమిథైల్‌బుటిలమైన్ వంటి నిషేధిక ఉత్ప్రేరకాలు తీసుకున్నట్లు బయటపడింది. -
ఉద్యోగిని... క్రీడల్లో పతకాల గని
తూర్పుగోదావరి , అన్నవరం (ప్రత్తిపాడు): ఏ ఆటల పోటీల్లో పాల్గొన్నా పతకాలు సాధించకుండా వెనుతిరగని అన్నవరం దేవస్థానం ఉద్యోగిని వల్లూరి మాధవి కర్నూలులో జరిగిన 38వ రాష్ట్రస్థాయి మాస్టర్స్ అథ్లెటిక్ పోటీల్లో కూడా మూడు స్వర్ణ పతకాలు సాధించి తన సత్తా చాటారు. వచ్చే నెల ఐదో తేదీ నుంచి పదో తేదీ వరకూ గుంటూరులోని ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో జరిగే జాతీయస్థాయి మాస్టర్స్ అధ్లెటిక్ పోటీలకు ఈమె ఎంపికయ్యారు. విద్యార్థి దశలోనే కాదు, ఉద్యోగం చేస్తూ కూడా తన ప్రతిభను చాటుతున్నారు అన్నవరం దేవస్థానం వైద్యశాల ఫార్మసీ సూపర్వైజర్ వల్లూరి మాధవి. గతంలో జిల్లా స్థాయి నుంచి జాతీయస్థాయి వరకూ ఎన్నో ఆటల పోటీల్లో పాల్గొని పతకాలు సాధించిన ఆమె ఈ నెల 15వ తేదీ నుంచి 17వ తేదీ వరకూ కర్నూలులో జరిగిన 38వ రాష్ట్రస్థాయి మాస్టర్స్ అ«థ్లెటిక్స్ పోటీల్లో డిస్క్స్ త్రో, షాట్‌ఫుట్, జావిలిన్ త్రోలో ప్రథమస్థానం పొంది స్వర్ణ పతకాలు సాధించి అందరి ప్రశంసలు అందుకున్నారు. గతంలోనూ పతకాల పంట... ♦ గత డిసెంబర్ ఎనిమిదో తేదీన రాజమహేంద్రవరంలో జరిగిన జిల్లా స్థాయి మాస్టర్స్ అథ్లెటిక్స్ పోటీల్లో పాల్గొని షార్ట్‌పుట్, జావలిన్‌త్రో, డిస్క్‌స్‌త్రోలో ప్రథమస్థానం పొంది, కర్నూలులో జరిగే రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యారు. ♦ కర్నూలులో ఈ నెల 15–17 తేదీల మధ్య జరిగిన పోటీలో షాట్‌ఫుట్‌లో 7.17 మీటర్లు, డిస్క్‌స్‌త్రోలో 16.91 మీటర్లు, జావలిన్‌త్రోలో 16.51 మీటర్లు విసిరి ప్రథమస్థానంలో నిలిచి స్వర్ణ పతకాలు సాధించారు. ♦ 2018 జనవరిలో ఏడు, ఎనిమిది, తొమ్మిది తేదీల్లో గుంటూరులో జరిగిన 36వ ఏపీ మాస్టర్స్ అథ్లెటిక్ మీట్లో మూడు పతకాలు సాధించారు. షార్ట్ఫుట్, జావలిన్‌త్రో క్రీడాంశాలలో స్వర్ణ, డిస్క్‌త్రోలో రజత పతకాలు సాధించారు. ♦ 2015లో కడప జిల్లా పొద్దుటూరులో జరిగిన 35వ మాస్టర్ అథ్లెటిక్స్ మీట్లో మూడు స్వర్ణ పతకాలు సాధించారు. అనంతరం ఒంగోలులో జరిగిన ఎన్జీఓ ఆటల పోటీల్లో కూడా నాలుగు పతకాలు సాధించారు. ♦ విద్యార్ధి దశలో సుమారు 30 సార్లు రాష్ట్ర, జాతీయ స్ధాయి ఆటల పోటీల్లో పాల్గొని పతకాలు సాధించానని తెలిపారు. ఫార్మసీ విద్యార్థినిగా వాలీబాల్ జాతీయ పోటీల్లో వరుసగా మూడేళ్లు ఆడానని తెలిపారు. 1991లో బరంపురం, 1992లో భోపాల్, 1993లో బీహార్‌లోని పాట్నాలో ఆడానని తెలిపారు. ♦ 2017 మార్చిలో మైసూర్లో జరిగిన జాతీయస్ధాయి ఎన్జీఓ ఆటల పోటీలో కూడా పాల్గొన్నానని, ఇంతవరకూ వివిధ పోటీల్లో 60కిపైగా పతకాలు సాధించానని వివరించారు. దేవస్థానం ఛైర్మన్ ఐవీ రోహిత్, ఈఓ ఎంవీ త్రినాధరావు, ఇతర దేవస్థానం సిబ్బంది ప్రోత్సాహంతో ఈ విజయాలు సాధించగలుగుతున్నానని వివరించారు. 38వ రాష్ట్రస్థాయి మాస్టర్స్ అథ్లెటిక్స్ పోటీల్లో విజేతగా నిలిచి మూడు పతకాలు సాధించిన మా«ధవిని పలువురు అభినందించారు.