breaking news
shiver
-
రక్షణ మంత్రిగా ఆ రోజు వణికిపోయాను: పారికర్
పనాజీ: ఆయనలో దేశభక్తి మెండు. ముక్కుసూటిగా పనిచేసే తత్వం అని చెప్తారు. ఎలాంటి బాధ్యతలు అప్పగించినా అందులో ఓ నిబద్ధత కనబరుస్తారనే పేరు కూడా ఇప్పటికే ఉంది. ఓ రాష్ట్ర ముఖ్యమంత్రిగా విజయవంతంగా పనిచేశారు కూడా.. అలాంటి ఆయనకు దేశానికి సంబంధించిన బాధ్యతలు అప్పగించినప్పుడు మాత్రం కాస్తంత వణుకుపుట్టిందట.. నేనా.. ఆ బాధ్యతలు నిర్వర్తించగలనా అని అనుమానపడ్డారంట. ఆయన మరెవరో కాదు.. ప్రస్తుతం భారత రక్షణ శాఖ మంత్రిగా పనిచేస్తున్న మనోహర్ పారకర్.. గోవా ముఖ్యమంత్రిగా పనిచేసిన ఆయనకు బీజేపీ అధికారంలోకి వచ్చాక రక్షణశాఖ బాధ్యతలు కట్టబెట్టింది. దీంతో ఆ రోజు తనకు జరిగిన అనుభవాన్ని ఆయన సోమవారం పంచుకున్నారు. విజయ్ సంకల్ప్ ర్యాలీ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రక్షణ శాఖ బాధ్యతలు అప్పగించినప్పుడు తాను వణికిపోయానని, ఆ విషయం తెలియకుండా దాచేందుకు గంబీరంగా ముఖాన్ని చూపించడానికి ప్రయత్నించానని అన్నారు. ‘నేను ఢిల్లీకి వెళ్లినప్పుడు ఆ రోజు ఆ నగర అనుభవం ఎదురైంది. మీ అందరి ఆశీస్సులతో రక్షణ మంత్రి అయ్యాను. వాస్తవానికి నాకు అప్పుడు ఏమీ తెలియదు. ఆర్మీలో ఉండే ర్యాంకులపై కూడా నాకు అవగాహన లేదు. బాధ్యతలు తీసుకుంటున్న వణికి పోయాను. కానీ, ముఖాన్ని గంభీరంగా చూపించేందుకు ప్రయత్నించాను. వాస్తవానికి ఆర్మీలో అధికారులకు ఉండే ర్యాంకుల విధానం కూడా నాకు తెలియదు. గోవాకు 1961లో పోర్చుగీసు వారి నుంచి భారత సేన విముక్తి కలిగించింది. అలాగే, 1965, 71లో యుద్ధాలు చూశాం. కార్గిల్ యుద్ధ సమయంలో నేను నినాదాలు ఇచ్చేవాడిని. కానీ, ఇప్పుడు నాముందుకు యుద్ధ క్షేత్రం వచ్చింది. యుద్ధం అంటే ఏమిటో కూడా తెలియదు.. దానికి ఎలా సన్నద్ధమవుతారో కూడా తెలియదు. నేను మాత్రం మన సైన్యానికి ఒకటే చెప్పాను. ఎవరైన దాడికి దిగితే వారిపై ప్రతి దాడి చేసేందుకు మీకు పూర్తి స్వేచ్ఛ ఉందని’ అని పారికర్ అన్నారు. భారత సైన్యం చాలా గొప్పగా శత్రు సేనలను వెంటాడుతోందని చెప్పారు. -
నగరంలో డెంగీ భయం
మధురానగర్‌లో చిరుద్యోగి మృతి మధురానగర్: నగరంలో చాప కింద నీరులా డెంగీ విస్తరిస్తోంది. మధురానగర్ 45వ డివిజన్ సాయిబాబా కాలనీ నాలుగోలైనుకు చెందిన రంగాల రమేష్‌బాబు (49) అనే వ్యక్తి గురువారం డెంగీ జ్వరంతో ప్రాణాలొదిలారు. రమేష్ బాబు ఒక పాదరక్షల షోరూమ్‌లో చిరుద్యోగి. నాలుగు రోజుల క్రితం పుష్కరస్నానం చేశారు, వెంటనే జ్వరం రావడంతో ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. జ్వరం పెరగడంతో బుధవారం ఒక కార్పొరేట్ ఆసుపత్రికి తీసుకెళ్లగా, డాక్టర్లు డెంగీ గా నిర్ధరించారు. రక్తంలో ప్లేట్లెట్లు తగ్గిపోయాయని వైద్యులు చెప్పారు. గురువారం పరిస్థితి విషమించటంతో మృతిచెందారు. ఇతనికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. కుటుంబ పెద్దను కోల్పోవటంతో వారి ఆర్తనాదాలు చూపరులను కంటతడిపెట్టించాయి. అసలే దోమలకు నిలయమైన మధురానగర్‌లో డెంగీతో మృతిచెందటంతో స్థానికులు ఎప్పుడు ఏం జరుగుతుందోనని హడలిపోతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి డివిజన్లో విషజ్వరాలు, దోమల నివారణ చర్యలు చేపట్టాలని వారు కోరుతున్నారు.