ఢిల్లీలో పేలుళ్లు: ఏడుగురికి గాయాలు
దేశ రాజధాని హస్తినలోని వేర్వేరు ప్రాంతాలలో పేలుళ్లు సంభవించి ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారని పోలీసులు శుక్రవారం ఇక్కడ వెల్లడించారు. గాయపడని వారిలో ఇద్దరు చిన్నారులు కూడా ఉన్నారని తెలిపారు. గాయపడిన వారిని సమీపంలోని ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నట్లు చెప్పారు. వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారని తెలిపారు.
దక్షిణ ఢిల్లీలోని సరాయి కలె ఖాన్‌లోని ఓ ఇంట్లో వంటగ్యాస్ సిలండర్ పేలి భార్య, భర్తతోపాటు ఇద్దరు చిన్నారులు, అలాగే రాణి బాగ్‌లోని ఇంజనీర్ ఎన్‌క్లేవ్‌లో ఎల్పీజీ సిలండర్ పేలి ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారని చెప్పారు. మరో పేలుడు రిఫ్రిజరేటర్ షాపులో సంభవించిందని, అయితే ఆ ఘటనలో ఎవరు గాయపడలేదని తెలిపారు. పేలుళ్లు సంభవించిన వెంటనే స్థానికులు అగ్నిమాపక సిబ్బంది సమాచారం అందించగానే వెంటనే మంటలను అదుపులోకి తీసుకువచ్చారని చెప్పారు.