breaking news
Search Costs
-
బడ్జెట్... విశేషాలు
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కస్టమ్స్ సుంకాల లక్ష్యాన్ని రూ.2,01,819 కోట్లుగా కేంద్రం నిర్ణయించింది. గతేడాది కస్టమ్స్ వసూళ్లు రూ.1,75,056 కోట్ల కంటే ఇది రూ.26,763 కోట్లు అధికం. ఎగుమతుల వృద్ధికి మిషన్ ... ఎగుమతుల అభివృద్ధి మిషన్‌ను ఏర్పాటు చేస్తామని ఆర్థిక మంత్రి వెల్లడించారు. కస్టమ్స్ అనుమతులను 24 గంటలూ ఇస్తుండే సౌకర్యాన్ని దేశంలోని మరో 13 విమానాశ్రయాలకు విస్తరిస్తామని తెలిపారు. ఈ-బిజ్ ప్లాట్‌ఫాంతో ప్రభుత్వ విభాగాల అనుసంధానం వ్యాపారవర్గాలు, ఇన్వెస్టర్లకు ప్రభుత్వ విభాగాలను మరింత అందుబాటులోకి తెచ్చే దిశగా కేంద్రం కసరత్తు చేస్తోంది. ఇందులో భాగంగా డిసెంబర్ ఆఖరు నాటికల్లా కేంద్ర ప్రభుత్వంలోని అన్ని విభాగాలు, శాఖలు తమ సర్వీసులను ‘ఈ-బిజ్ ప్లాట్‌ఫాం’నకు అనుసంధానం చేయాలని ఆదేశించింది. ‘మినహాయింపు’ లేని పీఎఫ్ ట్రస్టులు పన్ను పరిధిలోకి? ఆదాయ పన్ను మినహాయింపు లేకుండా కార్యకలాపాలు నిర్వహిస్తున్న ప్రైవేట్ ప్రావిడెంట్ ఫండ్ (పీఎఫ్) ట్రస్టులు ఏప్రిల్ 1 నుంచి ట్యాక్స్ పరిధిలోకి వచ్చే అవకాశముంది. ఈ ట్రస్టులు మినహాయింపు సర్టిఫికెట్ పొందేందుకు గడువును తాజా బడ్జెట్లో పొడిగించకపోవడమే ఇందుకు కారణం. బొగ్గు సమస్యల పరిష్కారానికి చర్యలు విద్యుత్ ప్లాంట్లకు కావాల్సిన స్థాయిలో బొగ్గు ఉత్పత్తిని పెంచేందుకు, నాణ్యతను మెరుగుపర్చేందుకు తగు చర్యలు తీసుకుంటున్నామని కేంద్రం తెలిపింది. విద్యుత్ కంపెనీలు, బొగ్గు సంస్థల మధ్య వివాదాల పరిష్కారిస్తామని ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ చెప్పారు.ఇనుప ఖనిజం సహా మైనింగ్ రంగంలో నెలకొన్న ప్రతిష్టంభనను తొలగించేందుకు చర్యలు తీసుకుంటున్నామని జైట్లీ వివరించారు. సెజ్‌లకు పునరుజ్జీవం... ప్రత్యేక ఆర్థిక మండళ్ల (సెజ్‌లు) పునరుద్ధరణకు కట్టుబడి ఉన్నామని కేంద్రం స్పష్టంచేసింది. పారిశ్రామిక ఉత్పత్తి, ఆర్థిక ప్రగతి, ఎగుమతుల వృద్ధి, ఉపాధి అవకాశాల కల్పనకు కీలక సాధనాలుగా సెజ్‌లను తీర్చిదిద్దేందుకు గట్టి చర్యలు చేపడతామని బడ్జెట్ ప్రసంగంలో ఆర్థిక మంత్రి జైట్లీ తెలిపారు. -
ఫండ్స్ పథకాలపట్లా ఆసక్తి చూపాలి
న్యూఢిల్లీ: బ్యాంకింగ్ నెట్‌వర్క్‌ను వినియోగించుకోవడంలో విజయవంతమైన బీమా రంగ కంపెనీల బాటలో మ్యూచువల్ ఫండ్స్ కూడా ప్రయాణించాలని క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ సూచించింది. అయితే ఇందుకు ప్రధానంగా ప్రభుత్వ రంగ దిగ్గజ బ్యాంకులు సహకరించాలని పేర్కొంది. తద్వారా ఫండ్ పథకాల విక్రయంలో పీఎస్‌యూ బ్యాంకులు ప్రముఖ పాత్రను పోషించేందుకు వీలుచిక్కుతుందని అభిప్రాయపడింది. బీమా పథకాల పంపిణీలో బ్యాంకింగ్ నెట్వర్క్ విజయవంతమైన నేపథ్యంలో సెబీ సూచనలకు ప్రాధాన్యత ఏర్పడింది. సంప్రదాయ బ్యాంకింగ్ ప్రొడక్ట్లకుతోడు థర్డ్‌పార్టీ బీమా పథకాల విక్రయంలో బ్యాంకులు భారీ విజయాలను సొంతం చేసుకుంటున్న సంగతి తెలిసిందే. అయితే మ్యూచువల్ ఫండ్స్ పథకాల విషయంలో ఇది ప్రతిబింబించడంలేదని సెబీ వ్యాఖ్యానించింది. బ్యాంకుల ద్వారా ఫండ్ పథకాల విక్రయం పుంజుకోవాలంటే పీఎస్‌యూ బ్యాంకులే చొరవ చూపాల్సి ఉంటుందని సూచించింది. భారీగా విస్తరించిన బ్రాంచీల ద్వారా బ్యాంకులు ఫండ్ పథకాల పంపిణీకి జోష్ తీసుకురాగలవని సెబీ ప్రతిపాదనలలో పేర్కొంది. ఈ ప్రతిపాదనలను సెబీ బోర్డు ఇటీవల ఆమోదించిన సంగతి తెలిసిందే.