breaking news
Sarvepalli Radha Krishnan
-
సర్వేపల్లి రాధాకృష్ణన్ చిత్రపటానికి నివాళులర్పించిన వైఎస్ జగన్
-
ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు: సీఎం జగన్
సాక్షి, గుంటూరు: ఇవాళ(సెప్టెంబర్ 5న) జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా.. ఉపాధ్యాయులందరికీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు లండన్ పర్యటనలో ఉన్న ఆయన తన ట్విటర్(ఎక్స్) ద్వారా టీచర్స్ డే సందేశం ఉంచారు. ‘‘భవిష్యత్ తరాలను సమున్నతంగా తీర్చిదిద్దడంలో టీచర్లు నిర్వర్తిస్తున్న పాత్ర ప్రశంసనీయమైనది. విద్యారంగంలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన విప్లవాత్మక మార్పులను అమలు చేస్తూ.. ప్రపంచ స్థాయి పోటీని ఎదుర్కొనేలా మన పేదింటి పిల్లలను సుశిక్షితులుగా తయారు చేయడంలో.. ధృడసంకల్పంతో కృషి చేస్తున్న టీచర్లందరికీ ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా నా శుభాకాంక్షలు. ఉపాధ్యాయ వృత్తికే ఆదర్శంగా నిలిచిన ఆచార్యులు, మాజీ రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి జయంతి సందర్భంగా నివాళులు అని ట్వీట్ చేశారాయన. భవిష్యత్ తరాలను సమున్నతంగా తీర్చిదిద్దడంలో టీచర్లు నిర్వర్తిస్తున్న పాత్ర ప్రశంసనీయమైనది. విద్యారంగంలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన విప్లవాత్మక మార్పులను అమలు చేస్తూ, ప్రపంచ స్థాయి పోటీని ఎదుర్కొనేలా మన పేదింటి పిల్లలను సుశిక్షితులుగా తయారు చేయడంలో ధృడసంక… — YS Jagan Mohan Reddy (@ysjagan) September 5, 2023 -
Teachers Day 2022: ఆచార్య దేవోభవ!
ఆయన ఓ తత్వవేత్త.. ఓ రాజనీతిజ్ఞుడు... అన్నింటికీ మించి ఆదర్శవంతమైన ఉపాధ్యాయుడు. విద్యార్థులంటే ఆయనకు అంతులేని ప్రేమ.. ఆయన అంటే విద్యార్థులకు ఎనలేని గౌరవం. విద్యార్థుల్ని ఉత్తమపౌరులుగా తీర్చినప్పుడే భవిష్యత్తు భారతం బాగుంటుందని భావించిన ఉత్తమ టీచర్ ఆయన.. అందుకే ఆయన పుట్టిన రోజును ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకుంటాం. సెప్టెంబరు 5 అంటే వెంటనే గుర్తొచ్చే పేరు సర్వేపల్లి రాధాకృష్ణన్. ఆయన పుట్టిన రోజును ఏటా దేశవ్యాప్తంగా ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది. ఉన్నతమైన ఆదర్శాలు నెలకొల్పిన ఉపాధ్యాయుడిగా, విద్యావేత్తగా సర్వేపల్లికి అందించే నిజమైన నివాళిగా దీనిని అభివర్ణిస్తారు. ఆయనకు 77 ఏళ్లు వచ్చినప్పటి నుంచి అంటే 1962 సెప్టెంబరు 5 నుంచి ఉపాధ్యాయ దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. . ► సెప్టెంబరు 5న 1888లో జన్మించిన సర్వేపల్లి ... దేశం గర్వించదగ్గ మేధావిగా, బహుముఖ ప్రజ్ఞాశాలిగా గుర్తింపు పొందారు. ఉపాధ్యాయుడిగా జీవితాన్ని ప్రారంభించిన సర్వేపల్లికి విద్యార్థులంటే పంచప్రాణాలు. విద్యార్థులకు కూడా ఆ మాస్టరుగారంటే చెప్పలేంత గౌరవం. అలా విద్యార్థుల ఆదరాభిమానాలు పొందిన ఉత్తమ ఉపాధ్యాయుడు సర్వేపల్లి. ► విలువైన విద్యకు సర్వేపల్లి ప్రతిరూపం. విలువలున్న విద్యను ప్రోత్సహించాలన్నది ఆయన జీవితాశయం. అక్షరాశ్యతలో దేశం దూసుకుపోవాలన్నది ఆయన ఆకాంక్ష. యువతకు విద్యాబుద్ధులు నేర్పించడంలో... వారిని సరైన దిశలో పయనించేలా చేయడంలో పాటించిన నిబద్ధతకు గౌరవసూచికంగా ఆయనను గౌరవించుకుంటున్నాం. అందుకే ఉపాధ్యాయ దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. ► మైసూరు, కలకత్తా యూనివర్శిటీలో ఫిలాసఫీ ప్రొఫెసర్‌గా పనిచేసిన సర్వేపల్లి...ఆక్స్ఫర్డ్ యూనివర్శిటీలోనూ తత్వశాస్త్రాన్ని బోధించారు. బెనారస్, ఆంధ్రా యూనివర్శిటీలకు వైస్ చాన్సలర్‌గా పనిచేశారు. తత్వశాస్త్రంపై ఎన్నో పుస్తకాలు రాశారు. సాహిత్యంలో 16 సార్లు, శాంతి కేటగిరీలో 11 సార్లు... ఇలా 27 సార్లు ప్రతిష్ఠాత్మక నోబెల్ ప్రైజ్ కోసం సర్వేపల్లి పేరు నామినేట్ కావడం ఆయనకు దక్కిన అరుదైన గౌరవం. ► సోవియట్ యూనియన్‌కు రాయబారిగా కూడా ఆయన పనిచేశారు. అన్నింటికన్నా మిన్నగా దేశానికి తొలి ఉపరాష్ట్రపతిగా ...రెండో రాష్ట్రపతిగా పదవీబాధ్యతలు చేపట్టి ఆ పదవులకే వన్నెతెచ్చారు సర్వేపల్లి. దేశంలోనే అత్యున్నత పౌర పురస్కారమైన భారతరత్న అవార్డు అందుకున్న భారత రత్నం ఆయన. -బొబ్బిలి శ్రీధరరావు -
ఆచార్య దేవో భవ..!
ఒక వ్యక్తి జీవితం మీద ఉపాధ్యాయుని ప్రభావం ఈ బిందువు దగ్గర అంతమైందని ప్రకటించడం దాదాపు అసాధ్యం. మనిషి జీవితాన్ని శాసించేవి, మార్చేవి, ఉత్థానపతనాలకు దోహదపడేవి విద్య, విజ్ఞానం. నేటితరం బాలలకి విద్యలోని శక్తిని పరిచయం చేసేవారే ఉపాధ్యాయులు. అలా వ్యక్తుల జీవితాలనీ, తద్వారా రేపటి సమాజాన్నీ తేజోమయం చేస్తారు గురువులు. లేలేత మనసుల పాలిట నైరూప్యచిత్రాల్లా ఉండే పాఠ్యాంశాలను క్రమంగా సుందరచిత్రాల్లా దర్శించే విధంగా వారిని తీర్చిదిద్దుతారు. నేర్చుకోవడం, అభ్యసించడం అనేవి జీవితంలో ప్రధానంగా గురుముఖంగానే జరుగుతాయి. నాగరికత ఆరంభం నుంచి ఉన్న గురువుల వ్యవస్థ ఎప్పటికీ ఉంటుంది. దానికి ప్రత్యామ్నాయం లేదు. అందుకే నాగరికత అనే జ్యోతి ఆరిపోకుండా తన చేతులొడ్డి రక్షించేవారే గురువులు అంటారు ఆచార్య సర్వేపల్లి రాధాకృష్ణ. - డా. గోపరాజు నారాయణరావు మారుతున్న కాలాన్ని బట్టి, అవసరాల మేరకు విద్య కొత్త పుంతలు పడుతూనే ఉంటుంది. ఉపాధ్యాయులు కూడా కాలంతో పరుగులు పెట్టాలి. ఇప్పుడు ఉపాధ్యాయుడు అంటే తరగతిలో పాఠం చెప్పి, హోవ్వర్క్ ఇచ్చి ఇంటికి పంపేవారే కాదు, ఇంటి దగ్గర కూడా విద్యార్థి మెదడు పనిచేసే విధంగా చేయగలిగినవారే. ఇప్పుడు డిజిటల్ టీచర్ ఇవాళ్టి తరగతి గది అంటే రేపటి భారతదేశం. ఆ తరగతి గదికి నాయకుడు ఉపాధ్యాయుడు. విద్యార్థి స్వశక్తి ఏమిటో, అతడిలోని తృష్ణ ఎంతటిదో గుర్తించడం దగ్గర ఉపాధ్యాయుడు విఫలమైతే విద్యార్థి అతడి జీవితంలోనే విఫలమైపోతాడు. ఇలా ఎన్నయినా సంప్రదాయ చింతనతో చెప్పుకోవచ్చు. అలా అని అవి భ్రమలు కూడా కాదు. కానీ ఉపాధ్యాయుడి స్థానంలో వచ్చిన అతి పెద్ద మార్పు 21వ శతాబ్దంలో ఆయన డిజిటల్ టీచర్‌గా మారడమే. ఈ నేపథ్యంతో డిజిటల్ యుగంలో మారిన ఉపాధ్యాయుని బాధ్యతను ఒక్కసారి పరిశీలించాలి. 21వ శతాబ్దం పెనుమార్పుల వేదిక. నిన్నటి విద్యార్థికీ నేటి విద్యార్థికీ ఎంతో వైరుధ్యం ఉంది. ఇవాళ్టి విద్యార్థి నిన్నటి విద్యార్థి కంటే చాలా పరిణతిని ప్రదర్శిస్తున్నాడు. ప్రపంచ పరిస్థితులు, శాస్త్రసాంకేతిక రంగాలలో సంభవించిన విస్ఫోటం వీళ్లకి ఆ అవకాశాలని దోసిళ్ల నిండుగా అందించాయి. ఈ కాలాన్ని శాసిస్తున్నదే సాంకేతిక పరిజ్ఞానం. ఆ క్రమంలోనే ఉపాధ్యాయుడు అన్న వ్యవస్థ కొత్త అర్థాలను సంతరించుకునే పనిలో నిమగ్నమయింది. కేవలం రెండు దశాబ్దాల క్రితం ఉపాధ్యాయుని స్థానం నేటి ఉపాధ్యాయుని స్థానం ఒక్కటి కానే కావు. ఆ ఉద్యోగం పరిధి, దానికి ఉండవలసిన దృష్టి అంచనాకు అందనంత మార్పుకు లోనయ్యాయి. ఆలోచించే నైపుణ్యం, జీవించే నైపుణ్యాల మీద ఆధారపడి 21వ శతాబ్దంలో విద్య నిర్మితమవుతున్నది. తరగతి గది నుంచి బయటి ప్రపంచంలోకి అడుగుపెట్టిన విద్యార్థి, బయటి వ్యవస్థల అవసరాలకు ఆసరా కాగల తీరులోనే ఇవాళ్టి చదువు ఉండాలని చెబుతున్నారు. తరగతిలో నేర్చుకున్నది బయటి ప్రపంచంలో విద్యార్థి బతకడానికి ఉపయోగపడినప్పుడే దానికి సార్థకత అన్న దృష్టి ఈ పరిణామం నిండా కనిపిస్తుంది. కేవలం బోధకుడు కాదు ఇవాళ్టి ఉపాధ్యాయుడు కేవలం బోధకుడు కాదు. ఉద్యోగితా నైపుణ్యాలను పెంచే బాధ్యతతో పాటు విద్యార్థుల మేధావికాసం, విశ్లేషణాత్మకంగా ఆలోచించేటట్టు చేయడం, సృజనాత్మక దృష్టిని పెంపొందించడం, జీవితాంతం గుర్తుండే విద్యను అందించడం కూడా వారు నిర్వర్తించవలసిన గురుతర బాధ్యతలుగానే మారాయి. గ్లోబల్ యుగంలో డిజిటల్ ఆధారిత ఉద్యోగితా నైపుణ్యాల సాధనలో విద్యార్థికి నిర్దేశకులుగా ఉండవలసింది ఉపాధ్యాయులే. విద్యార్థుల నైపుణ్యాలు పెంచడానికి తమ నైపుణ్యాలను అవిశ్రాంతంగా పెంపొందించుకోవలసిన యుగంలో ఉపాధ్యాయులు ఉన్నారు. లేకపోతే ఎదురయ్యే ప్రమాదం తక్కువేమీ కాదు. ఇప్పుడు ఉపాధ్యాయునితో సమంగా విద్యార్థి కూడా పరిజ్ఞానం సంతరించుకో గలుగుతున్నాడు. కారణం ఇంటర్నెట్తో సాహచర్యం. తన నైపుణ్యానికి సృజనను కలిపి ఉపాధ్యాయుడు విద్యార్థికి జ్ఞానాన్ని అందించాలి. లేకపోతే డిజిటల్ యుగంలోను విద్యాధికులైన నిరుద్యోగులు పెరిగిపోతారు. ఇదే అసలు ప్రమాదం. కోటి మంది ఉపాధ్యాయులు ఎన్సీఈఆర్టీ ఏడో సర్వే, కేంద్ర మానవ వనరుల మంత్రిత్వ శాఖ లెక్కల ప్రకారం (2011–12) దేశంలో 10,31,000 పాఠశాలలు (గుర్తింపు కలిగినవి) ఉన్నాయి. 2019లో వచ్చిన ఒక నివేదిక ప్రకారం 900 విశ్వవిద్యాలయాలు, 40,000 కళాశాలలు ఉన్నాయి. ‘నో టీచర్ నో క్లాస్ భారత్‌లో విద్య పరిస్థితిపై నివేదిక 2021’ ప్రకారం ప్రస్తుతం దేశంలో 97 లక్షల మంది ఉపాధ్యాయులు పనిచేస్తున్నారు (ఈ నివేదిక ప్రకారం మరొక పది లక్షల మంది ఉపాధ్యాయులు అవసరం). టాటా ట్రస్ట్‌లలోని ది టీచర్స్ ఎడ్యుకేషన్ ఇనీషియేటివ్ (టీఈఐ) ఉపాధ్యాయుల బోధన నైపుణ్యాలను నిలబెడుతూ, ఆధునీకరించడానికి ప్రయత్నిస్తున్న సంస్థ. వీటి ఆధ్వర్యంలో 2018లో స్థాపించిన సంస్థ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఇన్ టీచర్ ఎడ్యుకేషన్. ముంబైలోని టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్ కేంద్రంగా ఇది పనిచేస్తున్నది. చిరకాలంగా నిర్లక్ష్యానికి గురైన ఉపాధ్యాయ ప్రతిభను మెరుగుపరచే పనిని ఈ సంస్థ యునెస్కో సహకారంతో చేపట్టింది. ‘నో టీచర్ నో క్లాస్ భారత్‌లో విద్య పరిస్థితిపై నివేదిక 2021’ ఇది ఇచ్చినదే. మంచి చెడు రెండింటి గురించి బేరీజు వేసుకుని ఈ సంస్థ తన పని సాగిస్తున్నది. 50 శాతం మహిళలతో ఉపాధ్యాయ వృత్తి స్త్రీపురుష నిష్పత్తిని సమంగా నిలబెట్టుకుంటున్నది. గ్రామీణ ప్రాంతం నుంచి యువత, స్త్రీలు ప్రధానంగా ఈ వృత్తిని ఇష్టపడుతున్నారు. ప్రస్తుత పరిస్థితులలో సామాజిక గౌరవం సాధారణంగానే ఉంది. దేశంలో ఎక్కువ పాఠశాలలు ప్రభుత్వ లేదా ప్రైవేటు పాఠశాలలు ఉపాధ్యాయుడే కేంద్రకంగా పనిచేస్తున్నాయి. వారి నమ్మకాలే బోధనను నిర్దేశిస్తున్నాయని ఆ నివేదిక తేల్చింది. విద్యారంగంలో సాంకేతిక పరిజ్ఞానం ప్రవేశం పట్ల ఎక్కువ మంది ఉపాధ్యాయులు సానుకూలంగానే ఉన్నారని ఆ నివేదిక చెప్పడం శుభవార్తే! వీరిలో 25 శాతం విధుల విషయంలో నిర్లక్ష్యంగా ఉన్నారనీ, 30 శాతం ఈ వృత్తి నుంచి తప్పించదగినవారే ఉన్నారనీ వెల్లడించడం ఆందోళన కలిగిస్తుంది. ఇందుకు కారణం ఇప్పటి వరకు ఉపాధ్యాయుల ప్రతిభకు పదును పెట్టే ప్రత్యేక ప్రయత్నమేదీ జరగలేదు. ప్రపంచ శక్తిగా ఎదగాలని ఆశిస్తున్న భారత్ ఈ అంశం మీద ఇక దృష్టి పెట్టక తప్పదు. ప్రోత్సాహమే సగం విద్య విద్యార్థి మరొక యుగానికి చెంది ఉంటాడు. కాబట్టి అతడి మీద మీ యుగపు పరిజ్ఞానం మేరకు పరిధులు విధించవద్దు అంటారు రవీంద్రనాథ్ టాగోర్. నిజమే, విద్యార్థులను ప్రభావితం చేసే శక్తి ఉన్న ఉపాధ్యాయులు నైపుణ్యాన్ని ఇచ్చే వనరుల మీద పరిమితులు విధించరు. ఆ దిశగా ప్రోత్సహిస్తారు కూడా. విద్యార్థిని ప్రభావితం చేయడానికి జ్ఞానాన్ని, కొత్త పరిజ్ఞానాన్ని ప్రయోగాత్మకంగా అభ్యసించే అవకాశం కల్పిస్తారు. అందుకే ఈ తరం ఉపాధ్యాయుని డిజిటల్ లీడర్‌గా కూడా చూస్తున్నారు. చేస్తున్న పనిని ఆస్వాదించడం, ఆస్వాదించే తీరులో పనిని తీర్చిదిద్దడం కూడా ఆయనకు తెలుసు. జ్ఞానం పంచే కొద్దీ పెరుగుతుంది. దీనితో విద్యార్థులు అలాంటి ఉపాధ్యాయులను మరింత గౌరవిస్తారు. నిజంగా విద్య అంటే పదింట తొమ్మిది వంతులు ప్రోత్సాహమే. నాలుగు ‘సి’లు ఇప్పుడు పోటీతత్వం మరింత పెరిగింది. అదే సమయంలో ఉద్యోగ జీవితానికి సంబంధించి ఎంపికలకు కూడా విద్యార్థులకు ఎన్నో కొత్తదారులు ఏర్పడ్డాయి. విద్యార్థి మనస్తత్వాన్ని బట్టి ఆ దారులకు మళ్లించే బాధ్యత ఉపాధ్యాయునిదే. భవిష్యత్తులో నాలుగు ‘సి’ల మీద విద్యార్థి భవితవ్యం ఆధారపడి ఉందని నిపుణులు చెబుతున్నారు.. క్రిటికల్ థింకింగ్, కమ్యూనికేషన్, కొలాబరేషన్, క్రియేటివిటీ. ఈ పదాలు, వాటి భావనలతో విద్యార్థిని మమేకం చేయవలసిన బాధ్యత కూడా ఉపాధ్యాయునిదే. వాటి గురించి నిజమైన అవగాహన ఏర్పడితే కాలానికి తగినట్టు పోటీ ప్రపంచంలో నెగ్గడానికి విద్యార్థిలో సంసిద్ధత వస్తుంది. డిజిటల్ యుగంలో అందుబాటులో ఉన్న పెద్ద జ్ఞానసాగరం ఇంటర్నెట్. యూట్యూబ్, ట్యుటోరియల్, ఈబుక్ , ముద్రిత పత్రాలు ఇప్పుడు అందుబాటు ఉన్నాయి. నేటి ఉపాధ్యాయుని కర్తవ్యం విద్యార్థి అభిరుచిని బట్టి ఆ నైపుణ్యాలకు వారిని చేరువ చేయాలి. ఉపాధ్యాయుల సామర్థ్యానికి కూడా పరిధులు ఉన్నా, ఆ నైపుణ్యాల దిశగా విద్యార్థిని మళ్లించే వెసులుబాటూ ఉంది. నేర్చుకోవడానికి తగిన వాతావరణంలోకి వారిని తీసుకువెళ్లే నైపుణ్యం ఈ తరం ఉపాధ్యాయులలో ఉండాలి. భావి భారతాన్ని నిర్మించే బాధ్యత ఉన్నవారు మొదట తమను తాము నిర్మించుకోవాలి. ప్రాథమిక పాఠశాల కావచ్చు, ప్రాథమికోన్నత పాఠశాల కావచ్చు, కళాశాల లేదా విశ్వవిద్యాలయం కావచ్చు. ఉపాధ్యాయుడు ఎక్కడ బోధిస్తున్నా ఆయన ఒక విద్యార్థిని తయారు చేసే బాధ్యతను నిర్వర్తిస్తున్నట్టే. నూతన విద్యావిధానం 2020: ఉపాధ్యాయుడు మారుతున్న విద్య, ఉపాధ్యాయ వ్యవస్థలు సమాజంలో పాక్షికంగానే అమలు కావడం సరికాదనే ‘నూతన విద్యావిధానం 2020’ భావిస్తున్నట్టు కనిపిస్తుంది. అంగన్వాడీలలో చదువుకునే బాలలు సహా మన దేశ విద్యార్థి జనాభా 40 కోట్లనీ, వీరందరికీ బోధిస్తున్న 1.5 కోట్ల మంది ఉపాధ్యాయులనీ దృష్టిలో ఉంచుకుని ‘నూతన విద్యావిధానం 2020’ ఆవిర్భవించిందని నివేదిక రూపకల్పనలో భాగస్వామి, ఆర్ఎస్ఎస్ అనుబంధ విద్యాభారతి జాతీయ అధ్యక్షుడు దూసి రామకృష్ణ చెప్పారు. రెండు కోట్లు డ్రాపౌట్స్ ఉన్నా, 38 కోట్లు ఎప్పుడూ తరగతులలో ఉంటారు. ప్రభుత్వం ఎంత ఆధునిక, విస్తృత విద్యా వ్యవస్థను ప్రవేశపెట్టినా దానిని అమలు చేయవలసింది ఉపాధ్యాయుడే. వచ్చే దశాబ్దం ఉపాధ్యాయ దశాబ్దం కావాలని ఈ నివేదిక లక్ష్యంగా నిర్దేశించుకుంది. ప్రపంచంలో బహుశా ఏ దేశంలోను కనిపించనంత భారతీయ అధ్యాపకశక్తిని సశాస్త్రీయంగా ఉపయోగించుకుంటే ఎంతో మార్పు తేవచ్చునన్న ఆలోచనతో విద్యా విధానం సూచనలు చేసింది. సమగ్ర బోధకుడు అనే భావనను ముందుకు తెచ్చిన ఆ నివేదిక ఉపాధ్యాయులకు నాలుగేళ్ల శిక్షణను సూచించింది. అంతేకాదు, వృత్తి నైపుణ్యం వృద్ధి చేసే ఒక నిరంతర శిక్షణను కూడా కొత్త విద్యా విధానం ముందుకు తెచ్చింది. ఉపాధ్యాయుడిగా జీవించాలి అన్న కోరిక ఉన్నవారే ఆ వృత్తిలోకి రావడం గురించి విద్యా విధానం చర్యలు తీసుకుంది. నేర్చుకుంటూనే నేర్పించాలి. ఇవాళ్టి మరొక పరిణామం కూడా ఉపాధ్యాయుల దృష్టిలో ఉంది. సాంకేతిక పరిజ్ఞానం గురించి ప్రస్తావన, వినియోగం లేకుండా ఇవాళ విద్యార్థి నేర్చుకోవడానికి సిద్ధం కాలేడు. మొదట ఉపాధ్యాయునికి ఈ పరిజ్ఞానం ఉండాలి. ఇంటర్నెట్ మీద, దానిని అన్వేషించడం మీద ఉపాధ్యాయుని పరిచయం లేకుంటే ఆయన విద్యార్థులకు చెప్పలేరు. విద్యార్థులను సదా ప్రభావితం చేయగలిన ఉపాధ్యాయుడంటే జీవిత కాలం నేర్చుకునే లక్షణం కలిగి ఉంటారు. తాము బోధించే పాఠ్యాంశంలో వచ్చిన మార్పులు, చేర్పుల పట్ల స్పృహ కలిగి ఉంటారు. అంటే వచ్చే దశాబ్దంలో ఎలాంటి ఉద్యోగాలు రాబోతున్నాయో వారు చెప్పగలిగి ఉంటారు. విషయ సేకరణ ఆధారంగా చేసే విద్యార్జన ప్రాధాన్యం తెలిసి ఉండడం 21వ శతాబ్దం ఉపాధ్యాయుడి ముఖ్య లక్షణాలలో ఒకటి. ఇప్పుడు నిపుణులు చెబుతున్న అద్భుతమైన ఒక సూత్రం గురించి ఉపాధ్యాయులతో పాటు తల్లిదండ్రులు కూడా తెలుసుకోవాలి. 21వ శతాబ్దంలో నిరక్షరాస్యుడని ఎవరిని చెప్పవచ్చునంటే చదవడం రాయడం చేతకాని వారిని కాదు. నేర్చుకోలేనివారిని, నేర్చుకొనే సంసిద్ధత లేనివారిని, మళ్లీ మళ్లీ నేర్చుకుంటూనే ఉండాలన్న స్పృహ లేనివారినే. నేర్పించడం అనే కళ, శాస్త్రీయతలను మిళితం చేసే బోధనా పద్ధతులను ఇవాళ ఎక్కువ మంది ఉపాధ్యాయులు అలవరచుకుంటున్నారు. ఉపాధ్యాయుడు నేర్పించడాన్ని ప్రేమించాలి. నేర్చుకునేవాళ్లను ప్రేమించాలి. ఈ రెండింటినీ సమన్వయం చేయడానికి ఇంకా ఇష్టపడాలి. వివిధ సాంస్కృతిక నేపథ్యాల నుంచి వచ్చిన విద్యార్థులతో నిండి ఉండే తరగతిలో బోధించే విధానానికి వారు అలవాటు పడాలి. ప్రతి విద్యార్థికి సంబంధించి విద్యావసరాలు, సామర్థ్యాలు, అభిరుచులపైన ఉపాధ్యాయులు దృష్టి పెడుతున్నారు. విద్యార్థుల ఐచ్ఛిక విద్యాభిరుచిని గమనించి సమాజంలో ఉత్పాదకతకు ఉపయోగపడే భాగస్వామిగా మలచడం ఇవాళ ఉపాధ్యాయుల ముందు ఉన్న ప్రథమ కర్తవ్యంగా అవతరించింది. స్మార్ట్ బోర్డ్ టెక్నాలజీతో తరగతిలో మరింత చురుకుగా ఉండేటట్టు చేయడం, విద్యా సంబంధ కార్యకలాపాలలో చేయూత నివ్వడం ఉపాధ్యాయులు ఇవాళ ఒక సవాలుగా తీసుకుంటున్నారు. ఎలా నేర్చుకోవాలో చెప్పగలిగితే పిల్లలు మరింత కష్టపడతారు. ఎడ్యుకేటర్ లేదా ఉపాధ్యాయుల ప్రధాన బాధ్యత ఏదీ అంటే సమాజం ఎదుర్కొంటున్న వాస్తవిక సమస్యలు పరిష్కరించడానికి ఉపకరించే విద్యా విధాన పద్ధతులను అన్వేషించాలి. మోతాదు మించుతున్నదా? ఇంతకీ విద్యారంగంలో సాంకేతిక పరిజ్ఞానం మోతాదుకు మించుతున్నదా? ఈ ప్రశ్న వేసుకోక తప్పదు. భారత సామాజిక నేపథ్యంలో ఈ ప్రశ్న మరింత అవసరం.అందుకు సంబంధించిన భయాలు ఇప్పుడు మొదలయినాయి కూడా. 2030 సంవత్సరానికి, అంటే కేవలం ఎనిమిదేళ్లలోనే గురువు అనే స్థానానికి సాంకేతిక పరిజ్ఞానం పంగనామం పెట్టబోతున్నదన్న భయాలు అవి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజన్స్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, బ్లాక్‌చైన్ తరగతి గదిని శాసిస్తాయన్న అంచనాలు ఉన్నాయి. ఈ భయాల వెనుక విపరీతంగా ప్రవేశిస్తున్న శాస్త్రసాంకేతిక రంగాలు ఒక్కటే కారణం కాదు. సాంకేతికతకు మోకరిల్లుతున్న నేటి తరాలు కూడా కారణమే. పాలకులు, నేతలు, రాజకీయ సంస్థలు దేశం పురోగమించడం గురించి, ప్రపంచపటంలో దివ్యమైన స్థానం గురించి తమకున్న కల్పనలో విద్య స్థానం ఎక్కడో ఇప్పటికీ చెప్పడం లేదు. దేశాభివృద్ధికి పునాదులు తరగతి గదులలో పడతాయన్న వాస్తవం గుర్తించడానికి వారికి ఇంకెంత కాలం పడుతుందో తెలియడం లేదు. ఇవన్నీ ఉన్నా కొన్ని వాస్తవాలను అంగీకరించాలి. ఉపాధ్యాయుడికి పరిమితులు ఉన్న మాట నిజం. కానీ ఆయన తరగతిలో బోధించినట్టు, ఆయన కంటే ఎంతో ఎక్కువ ‘డేటా’ కలిగి ఉండే రోబో ఆయనకు ఏనాటికీ ప్రత్యామ్నాయం కాదు, కాలేదు. కాబట్టి 22వ శతాబ్దంలోకి ప్రవేశించినా పాఠ్యాంశాలు మారవచ్చు. పాఠశాలలు, అందులోని తరగతుల రూపురేఖలు అసాధారణంగా ఉండవచ్చు. బోధనా పద్ధతులు మారిపోవచ్చు. బాలలు మరింత చురుకుగా ఉండవచ్చు. కానీ అక్కడ ఒక ఉపాధ్యాయుడు ఉండాలి. అప్పుడే విద్యార్థికి మార్గదర్శనం లభిస్తుంది. గురుస్థానం శాశ్వతం కావాలి. విద్య, విలువలు, ఉపాధ్యాయుడు పిల్లల మేధను విద్యతో ప్రకాశింపచేసే క్రమంలో వాళ్ల హృదయాలను కూడా విద్యతో గుబాళింపచేయడం మరవరాదని దలైలామా అంటారు. ఈ పని కుటుంబంలో జరగాలి. ఆపై ఆ బాధ్యత ఉపాధ్యాయులు స్వీకరించాలి. పురోగమిస్తున్న సమాజంలో విలువలకు స్థానం లేకుంటే విపరీతాలకు దారి తీస్తుంది. ఒక భావిపౌరుడి ప్రవర్తన అతడికి ఉన్న విలువలను బట్టే నిర్మితమవుతుంది. నీతి నిజాయతీలు, విచక్షణ, సామాజిక సేవ పట్ల అనురక్తి, జాతీయ సమైక్యత పట్ల గౌరవం, సామాజిక న్యాయం పట్ల అవగాహన ఇవన్నీ కూడా విలువల నుంచి సంక్రమించేవే. యువత కౌమారమంతా తరగతి గదిలోనే గడుస్తుంది కాబట్టి ఉపాధ్యాయులు ఈ విషయంలో ఎక్కువ బాధ్యత స్వీకరించాలి. విలువలంటే మానసిక ఆరోగ్యాన్ని కాపాడేవే. వీటన్నిటికీ మించినది క్రమశిక్షణ. అది విద్యార్థి జీవితం నుంచి మొదలు కావాలి. అదొక విలువ. గురుశిష్య బంధానికి అడ్డుకట్ట? గురుశిష్య బంధం అనివార్యం. కానీ ఈ బంధం తెగిపోతున్నదా అని ప్రశ్నించుకునే వాతావరణం ప్రస్తుతం కనిపించడం విషాదమే. చాలా కళాశాలలు, కొన్నిచోట్ల పాఠశాలలు కూడా మత్తు మందులకు చేరువ కావడం గురుశిష్య సంబంధం బలహీన పడుతున్నదని చెప్పడానికి ఉపకరించేదే! విద్యార్థులు వ్యసనాలకు బానిసలు కావడం సామాజిక ఉల్లంఘన. శిష్యులను అలాంటి వాటి జోలికి వెళ్లకుండా నిరోధించలేకపోవడం గురువుల సామాజిక ఉల్లంఘన. ఎన్ని చట్టాలు వచ్చినా ర్యాగింగ్ భూతం లొంగకపోవడం విద్యార్థి, ఉపాధ్యాయుడు ఇద్దరూ కూడా సామాజిక బాధ్యతను మరచిపోయిన ఫలితమే. అదుపు చేయాలని ఉపాధ్యాయులకు, ఒదిగి ఉండాలని విద్యార్థులకు లేకపోతే విపరీత పరిణామాలు తప్పవు. సాంకేతికత ప్రత్యామ్నాయం కాలేదు వెనువెంటనే కాకున్నా, సమీప భవిష్యత్తులో భారత్‌లో కూడా తరగతి గదిని సాంకేతికత శాసిస్తుంది. కరోనా ఈ అవసరాన్ని కాస్త ముందుకు తెచ్చింది కూడా. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో సాంకేతికతను ప్రవేశ పెట్టడం గురించి వస్తున్న ఒత్తిడి కూడా తక్కువగా లేదు. ఎల్కేజీ దగ్గర నుంచి పలకా బలపాలు మాయమవుతున్నాయి. అయితే ఒక ప్రశ్న. సాంకేతికత ఉపాధ్యాయునికి నిజంగానే ప్రత్యామ్నాయం కాగలదా? డిజిటల్ వ్యవస్థ ఎంత విస్తరించినా, బలపడినా అది ఉపాధ్యాయునికి ప్రత్యామ్నాయం కాలేదు. నేపథ్యాన్ని బట్టి భారతీయ సమాజంలో విద్యార్థులంతా ఒకే విద్యా ప్రమాణాలు ప్రదర్శించే పరిస్థితిలో లేరు. విద్యార్థులందరి అభిరుచిని ఉపాధ్యాయుడు మాత్రమే గమనించగలడు. గురుశిష్య సంబంధం పాతబడేది కాదు. జీవితానుభవాన్ని, సృజనాత్మక శక్తిని మేళవించి పాఠ్యాంశాలను చెప్పగలిగేది గురువు మాత్రమే. ఉపాధ్యాయుడు తేగలిన మార్పు సాంకేతికతతో సాధ్యంకాదని ఇప్పటికే కొన్ని పరిశోధనలు తేల్చాయి. ఎందుకంటే విద్య అంటే కేవలం కొన్ని వాస్తవాలు, ఇంకొన్ని సమీకరణల సమ్మేళనం కాదు. అభ్యాసానికి అనుగుణమైన వాతావరణం గురుశిష్య సంబంధం నుంచి జనిస్తుంది. అది యంత్రం ద్వారానో, కంప్యూటర్ తెరతోనో సాధ్యం కాదు. విద్యార్థిని స్వతంత్రంగా ఆలోచింప చేసేదే విద్య. ఆ పని ఉపాధ్యాయుని ద్వారా జరుగుతుంది. భావి తరాలను విశ్వమానవులుగా తీర్చిదిద్దే విధంగా ఉపాధ్యాయులు తయారు కావడం అవసరమే. ఆ క్రమంలో కొన్ని భ్రమలలో ఎవరూ కొట్టుకుపోరాదు. డిజిటల్ యుగంలో మనదైన చరిత్ర, మనదైన సాహిత్యం, కళ, సాంస్కృతిక వారసత్వం చిన్నబోయే పరిస్థితి ఏర్పడడం సరికాదు. మన ప్రాంతీయ భాషలకు గ్రహణం పట్టకూడదు. ఆధునిక విద్య, ఆధునిక విద్యారీతులు మత్తులో మళ్లీ వేరొక వ్యవస్థకు మన యుతరం బోయీలు కారాదు. విద్యావిధానం ఆధునికం కావాలి. అదే సమయంలో అందులో మట్టివాసన ఉండాలి. కంప్యూటర్‌కే, ప్రయోగశాలకే విద్యార్థిని పరిమితం చేయడమూ సరికాదు. విద్యావిధానంలో ఆధునికత సృజనాత్మకతకు, క్రీడాప్రతిభకు ఆస్కారం కల్పించాలి. డిజిటల్ విద్యావిధానానికి ఉపాధి కల్పన పునాదిగా ఉన్నప్పటికి, సామాజిక బాధ్యత పట్ల యువతకు నిరంతర స్పృహ అవసరమన్న విషయమూ గుర్తించాలి. కొత్త విద్యావిధానం విద్యార్థికీ, సమాజానికీ మధ్య అడ్డుగోడ కట్టేది కారాదు. ఎందుకంటే పాఠశాల అనేది సమాజానికి సుదూరంగా ఉండే వ్యవస్థ కాదు. కొత్తయుగంలో కొత్త తప్పిదాలకు చోటు లేకుండా చూడవలసిన బాధ్యత ఉపాధ్యాయులు తీసుకోగలరు. ఎందుకంటే పాఠ్యప్రణాళిక రూపకల్పనలో వారి పాత్ర వాస్తవం. డిజిటల్ యుగం పాత సమస్యలను గమనించకుండా సాగితే అది వైఫల్యానికే దారి తీస్తుంది. భారతదేశానికి సంబంధించినంత వరకు అంతరాలు ఒక వాస్తవం. డిజిటల్, శాస్త్రసాంకేతిక వినియోగం అందరికీ సమంగా అందాలంటే ప్రభుత్వ పాఠశాలలను అందుకు తగినట్టు రూపొందించాలి. డిజిటల్ లీడర్లు ఇటు వైపు చూడకపోతే సమాజంలో పెద్ద అగాధం ఏర్పడుతుంది. విద్యారంగంలో అంతరాలు నిరోధించడానికి కొన్ని దశాబ్దాల పాటు జరిగిన ప్రయత్నాలు నీరుకారాయన్న విమర్శ ఇప్పటికే ఉంది. ఒకప్పుడు అన్ని వర్గాల వారు ప్రభుత్వ పాఠశాలలకే వెళ్లి చదువుకునేవారు. సమాన అవకాశాలు అన్న సూత్రాన్ని వమ్ము చేసే విధంగా ఇప్పుడు ప్రభుత్వ పాఠశాలలు చతికిలపడ్డాయి. చదువు ‘కొనడం’ అన్న మాట కూడా ఇప్పుడు వినవలసి వస్తున్నది. చదువు ప్రాథమిక హక్కుగా అవతరించిన తరువాత కూడా అక్షరం గగన కుసుమం కావడం పురోగతికి దోహదం చేసే పరిణామం కాదు. ఉపాధ్యాయులు తాము నేర్చుకుంటూనే విద్యార్థులకు నేర్పుతారు. ఆ క్రమంలో సరైన నడత నేర్చుకోమని ఉపాధ్యాయునికి ఎవరో చెప్పే పరిస్థితి రావడం విషాదమే. ఇటీవల వస్తున్న వార్తలు కొందరు ఉపాధ్యాయుల పట్ల అసహనాన్ని పెంచేవిగా ఉన్నాయి. మద్యం సేవించి పర్యవేక్షకునిగా పరీక్ష హాలుకు వచ్చిన వారు, చిన్నారుల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించి అరెస్టయినవారు ఇంకా తీవ్రమైన అసాంఘిక చర్యలకు ఉపాధ్యాయులు పాల్పడుతున్న సంగతులు బయటపడుతున్నాయి. ఇక విద్యార్థులను తీవ్రంగా దండిస్తున్న సంఘటనలకు అంతేలేదు. బయటి సమాజంలోని బలహీనతలు, ప్రలోభాలకు ఉపాధ్యాయులు లోను కాకుండా చేయడానికి నూతన విద్యా విధానం 2020లో ప్రతిపాదించిన నాలుగేళ్ల ఉపాధ్యాయ శిక్షణతో సాధ్యం కాగలదని విశ్వసిద్దాం. మారుతున్న కాలంలో ఉపాధ్యాయ వృత్తి మీద పెరుగుతున్న ఒత్తిడికి విరుగుడుగా ఈ విధానం సాధికారత కల్పించడం ఒక వెసులుబాటు. -
సర్వేపల్లి రాధాకృష్ణన్‌కు సీఎం జగన్ నివాళి
-
గురువులకు వందనం: సీఎం జగన్
సాక్షి, అమరావతి: విద్యార్థులందరికీ సమాన అవకాశాలు కల్పిస్తూ విద్యా హక్కును అందించాలన్న తమ లక్ష్య సాధనలో ఉపాధ్యాయులే మార్గదర్శకులుగా తమ ప్రభుత్వం విశ్వసిస్తోందని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. మాజీ రాష్ట్రపతి, ప్రముఖ విద్యావేత్త సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి సందర్భంగా టీచర్లకు ఆయన ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. భావి పౌరులకు విద్య, విజ్ఞానాన్ని అందించి సరైన దిశానిర్దేశం చేయడం ద్వారా జాతి నిర్మాణంలో ఉపాధ్యాయులు కీలకపాత్ర పోషిస్తున్నారని సీఎం గుర్తు చేశారు. నైతిక విలువలే పునాదులుగా విద్యార్థుల జీవితాలను తీర్చిదిద్దేది ఉపాధ్యాయులేని అన్నారు. ‘గురువును దైవంగా పూజించే సంప్రదాయం భారతదేశానిది. విద్య, వివేకం, విలువలు నేర్పి ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దే గురువులకు వందనం’ అని సీఎం వైఎస్ జగన్ ట్విటర్లో పేర్కొన్నారు. (చదవండి: మన ఆచార్యుడు సర్వేపల్లి) -
గురువులను పూజించే గొప్ప సంస్కృతి మనది: సీఎం జగన్
సాక్షి, హైదరాబాద్ : భారత మాజీ రాష్ట్రపతి, విద్యావేత్త సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆయనకు నివాళులు అర్పించారు. ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకుని శుభాకాంక్షలు తెలియజేశారు. విద్య నేర్పిన గురువులను పూజించే గొప్ప సంస్కృతి భారతదేశంలో ఉందని శ్లాఘించారు. జాతి నిర్మాణంలో యువత పాత్రను తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయులు ఎనలేని కృషి చేస్తారని పేర్కొన్నారు. ఈ మేరకు సీఎం జగన్ ట్వీట్ చేశారు. కాగా గురువారం ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సీఎం వైఎస్ జగన్ నేతృత్వంలో గురుపూజోత్సవ వేడుకలు నిర్వహిస్తోంది. విజయవాడలోని మున్సిపల్ ఎంప్లాయిస్ కాలనీలో జరిగే ఈ వేడుకలకు ముఖ్యమంత్రి హాజరుకానున్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయులకు ఆయన పురస్కారాలు ప్రదానం చేస్తారు. India is endued with a great culture of worshipping teachers. Teachers are the ones who sculpt young minds and their role is paramount in nation building. Wishing you all a very #HappyTeachersDay. My tributes to Dr. Sarvepalli RadhaKrishnan on his Jayanti. 🙏 — YS Jagan Mohan Reddy (@ysjagan) September 5, 2019 -
వృత్తిని గౌరవించే మహోపాధ్యాయుడు
భారతీయ దార్శినిక చింతనాధోరణులను, సంస్కృతిని పాశ్యాత్య దేశాలకు తనదైన శైలిలో రచనలద్వారా తెలియజేసిన గొప్పరచయిత, విద్యావేత్త, వేదాంతి డా.సర్వేపల్లి రాధాకృష్ణన్‌గారు. సంస్కృత భాషలోని భవద్గీత, బ్రహ్మసూత్రాలు, ఉపనిషత్తులకు (ప్రస్థానత్రయ) ఆంగ్లంలో గొప్ప వ్యాఖ్యానాలు రాసి భారతీయ దర్శనానికి గల విశిష్టతను తాత్విక మూలాలను ఆవిష్కరించి భావవాద కోణంలో భారతీయదర్శనాన్ని రచించి పాశ్చాత్యులు ఆ దర్శనాన్ని ఆసక్తితో అధ్యాయనం చేసేలా కృషిచేసిన వేదాంతి రాధాకృష్ణన్. ఆయన వల్లనే భారతీయ దర్శనం ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిందనడంలో అతిశయోక్తిలేదు. వారి మేధోసంపత్తిని గుర్తించి ప్రపంచవ్యాప్తంగా వున్న వివిధ దేశాల్లోని విశ్వవిద్యాలయాలు 110 డాక్టరేట్ పురస్కారాలు అందజేశాయి. ఆయన సుమారు 150 గ్రంథాలు రచించారు. వీటిలో ముఖ్యమైనవి ‘ఇండియన్ ఫిలాసఫీ’, ‘ద హిందూ వ్యూ ఆఫ్ లైఫ్’, ‘ద ఐడియల్ వ్యూ ఆఫ్ లైఫ్’, ‘ఫ్రీడమ్ అండ్ కల్చర్’, ‘మహాత్మాగాంధీ’, ‘గ్రేట్ ఇండియన్’, ‘ది దమ్మపద గౌతమబుద్ద’, ప్రపంచవ్యాప్తంగా ఎంతో ప్రాచుర్యం పొందాయి. రాధాకృష్ణన్‌గారు మనదేశానికి 1952 నుండి 1962 వరకు ఉపరాష్ట్రపతిగా రెండు పర్యాయాలు పనిచేశారు. 1962లో దేశంలోనే అత్యున్నతమైన పదవి అయినటువంటి రాష్ట్రపతి పదవిని అలంకరించారు. ఆ సందర్భంలో దేశవిదేశాల్లో వున్న తనశిష్యులు శ్రేయోభిలాషులు ఆయనను కలిసి మనసారా అభినందించి తన జన్మదినమైన సెప్టెంబర్ 5ను ఆ సంవత్సరం ఘనంగా జరిపేందుకు నిర్ణయించుకున్నట్లు తెలిపారు. కానీ తన పుట్టినరోజును ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకుంటే తాను ఆనందిస్తానని రాధాకృష్ణన్ అన్నారు. దాంతో నాటినుండి సెప్టెంబర్ 5ను ఉపాధ్యాయదినోత్సవంగా దేశవ్యాప్తంగా జరుపుకోవటం ప్రారంభమైంది. రాధాకృష్ణన్ 1888 సెప్టెంబర్ 5న మద్రాసు ప్రెసిడెన్సీలోని తిరుత్తణి పట్టణంలో జన్మించారు. ప్రాథమిక విద్యను తిరువళ్లూరులో, పాఠశాల, ఉన్నత విద్యను రేణిగుంటలో.. మద్రాసు క్రిస్టియన్ కాలేజీలో డిగ్రీ పూర్తిచేసుకొని మద్రాసు యూనివర్సిటీలో తన అభిమాన విషయమైన తత్వ శాస్త్రంలో ఎమ్మే పట్టా పొందారు. 1921లో ప్రతిష్ఠాత్మకమైన 5వ కింగ్‌జార్జ్ ఆచార్యపీఠాన్ని కలకత్తా విశ్వవిద్యాలయంలో అధిష్టించారు. 1929లో ఇంగ్లాండ్‌లోని మాంచెస్టర్ కాలేజి ప్రిన్సిపల్‌గా, ఆ పిదప ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో ఆచార్యుడుగా పనిచేశారు. 1931లో సర్వేపల్లికి ‘సర్’ బిరుదు లభించింది. ఆయన మైసూరు, కలకత్తా, మద్రాసు, ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలలో ఆచార్యుడుగా పనిచేసి 1931లో ఆంధ్రాయూనివర్సిటీ వైస్‌ఛాన్సలర్‌గా పదవీ బాధ్యతలు చేపట్టారు. 1954లోనే దేశంలో అత్యున్నత ప్రభుత్వ పురస్కారమైనటువంటి భారతరత్నను అందుకొని 1962లో రాష్ట్రపతిగా ఎన్నికయినప్పుడు.. ‘ప్లేటో కలలుగన్న ఫిలాసఫర్ కింగ్’ అనే ఊహ సాకారమైనట్లుగా పలువురు విద్యావేత్తలు అమితానందం పొందారు. ఉపాధ్యాయునికి ఉండాల్సిన లక్షణాలు, ఆశయాలు, విధులకు సంబంధించిన అంశాలన్నింటిని రాధాకృష్ణన్ తాను సమర్పించిన ‘విశ్వవిద్యాలయాలు విద్యావిధానం’ అనే నివేదికలో స్పష్టంగా వివరించారు. విద్యాబోధనలో మాతృభాషకు ప్రాధాన్యతనిచ్చి స్వేచ్ఛా, సమానత్వం, సౌభ్రాతృత్వం, సహజన్యాయం వంటి ప్రజాస్వామ్య విలువలను వర్సిటీలు సంరక్షించాలి. తద్భిన్నంగా నేడు పలువురు ఉపాధ్యాయులు ప్రపంచీకరణ, ప్రైవేటీకరణ ప్రభావాలతో స్వప్రయోజనాలకు అధిక ప్రాధాన్యతనివ్వడంతో ఉపాధ్యాయవృత్తి మసకబారుతుంది. బోధన ప్రమాణాలు, విద్యాప్రమాణాలతోపాటు సామాజిక, నైతిక విలువలు క్షీణించిపోతున్న ఈ తరుణంలో ఉపాధ్యాయదినోత్సవం ఉపాధ్యాయులకు తమ విధులను, బాధ్యతలను గుర్తు చేయడంలో స్ఫూర్తిదాయకంగా నిలవాలి. (నేడు ఉపాధ్యాయ దినోత్సవం) వ్యాసకర్త: ప్రొఫెసర్ జి. లక్ష్మణ్, తత్వశాస్త్ర విభాగాచార్యులు, ఓయూ మొబైల్ : 98491 36104 -
నేడు జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం
-
ఏదీ నన్ను చూడనీ...
పెద్ద స్థానాల్లో ఉన్నవారు మంచి చదువరులు అయితే ఎలా ఉంటుంది? ఇది 1958 నాటి సంగతి. అప్పుడు సర్వేపల్లి రాధాకృష్ణన్ ఉపరాష్ట్రపతిగా ఉన్నారు. సాహిత్య అకాడమీకి కూడా ఆయన ఉపాధ్యక్షుడు(జవాహర్ లాల్ నెహ్రూ అప్పుడు ప్రధాని, అకాడమీ అధ్యక్షుడు). అడవి బాపిరాజు సుప్రసిద్ధ నవల ‘నారాయణరావు’ను సాహిత్య అకాడమీ తరఫున అన్ని భాషల్లోకీ అనువదించాల్సిన పుస్తకంగా నిర్ణయించారు. అయితే– ఈ నవలలో ప్రధాన పాత్రధారి నారాయణరావు దేశంలోని భిన్న రాష్ట్రాల ప్రజలు, వారి ఆహారపుటలవాట్లు, వారి సంస్కృతుల మీద తన గమనింపుల్ని ప్రకటిస్తాడు. వీటిల్లో ఒరియా ప్రజల మీద చేసిన వ్యాఖ్యలు తమకు అభ్యంతరకరంగా ఉన్నాయనీ, కాబట్టి అనువాద కార్యక్రమం నుంచి ఆ పుస్తకాన్ని ఉపసంహరించుకోవాలనీ డిమాండ్లు వచ్చాయి. అప్పుడు రాధాకృష్ణన్ స్వయంగా ఆ పుస్తకం చదివి, ఆ వ్యాఖ్యలను తొలగించాల్సిన పనిలేదని తేల్చి అనువాదం అయ్యేలా చూశారు. (అయితే, 1972లో బెంగాలీ పాఠకుల నుంచి ఇదే రకమైన అభ్యంతరాలు వచ్చినప్పుడు అప్పటి సాహిత్య అకాడమీ అధ్యక్షుడు డాక్టర్ సునితి కుమార్ ఛటర్జీ నిరసనకారులకు తలొగ్గి ఆ వ్యాఖ్యలు తొలగింపజేశారు.) ఇక, 1958లోనే నోరి నరసింహశాస్త్రి ‘రుద్రమదేవి’ పుస్తకంపైనా కొన్ని అభ్యంతరాలు వచ్చాయి. అందులోని కొన్ని పరిశీలనలు జైనుల మనోభావాలను దెబ్బతీసేవిగా ఉన్నాయన్న అభిప్రాయం వెల్లడైనప్పుడు, రాధాకృష్ణన్ ఆ నవల చదివి ఆ అభ్యంతరాలను కొట్టిపారేశారు. (ఇన్పుట్: డాక్టర్ డి.ఎస్.రావు) -
వైభవంగా ‘గురు’ సంబరం
కల్చరల్(కాకినాడ) : మాజీ రాష్ట్రపతి దివంగత సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి సందర్భంగా శుక్రవారం జిల్లాలో గురుపూజోత్స వాలు ఘనంగా నిర్వహించారు. కాకినాడ అంబేద్కర్ భవన్లో 224 మందికి జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ నీతూ ప్రసాద్, జెడ్పీ చైర్మన్ నామన రాంబాబు, డీఈఓ కేవీ శ్రీనివాసులురెడ్డి తదితరులు సర్వేపల్లి విగ్రహానికి పూలమాలలు వేసి, ఘనంగా నివాళులర్పించారు. మాజీ రాష్ట్రపతి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ 126వ జయంతిని విద్యా శాఖ ఆధ్వర్యంలో నిర్వహించారు. కలెక్టర్‌తో పాటు జెడ్పీ చైర్మన్ నామన రాంబాబు ముఖ్యఅతిథులుగా హాజరయ్యారు. జిల్లా విద్యాశాఖాధికారి కేవీ శ్రీనివాసులురెడ్డి అధ్యక్షత వహించారు. పుట్టగొడుగుల్లా ప్రైవేట్ స్కూళ్లు అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్న ప్రైవేట్ పాఠశాలల్లో సరైన ఉపాధ్యాయులు లేరని వ్యాఖ్యానించారు. రాజీవ్ విద్యామిషన్, రాజీవ్ మాధ్యమిక విద్యా అభియాన్ వంటి పథకాల ద్వారా ప్రభుత్వ పాఠశాలల్లో అవసరమైన మౌలిక సదుపాయాలను కల్పించినట్టు వివరించారు. వాటికనుగుణంగా విద్యా ప్రమాణాలు కూడా మెరుగుపడాల్సిన అవసరం ఉందన్నారు. పదో తరగతి ఉత్తీర్ణతలో ఈ ఏడాది రాష్ట్రంలో జిల్లాకు ప్రథమ స్థానం రావడంపై ఆమె సంతోషం వెలిబుచ్చారు. ఉపాధ్యాయుల కృషితోనే ఇది సాధ్యమైందని ప్రశంసించారు. విద్యార్థులకు పాఠశాల స్థాయి నుంచే ప్రాపంచిక విజ్ఞానాన్ని అందించాలని సూచించారు. విలువలతో కూడిన విద్యను అందించినపుడే విద్యార్థులు భవిష్యత్తులో ఉత్తమ పౌరులుగా ఎదుగుతారని, తద్వారా దేశ మానవ వనరులు వృద్ధి చెందుతాయన్నారు. రానున్న రోజుల్లో కూడా విద్యాపరంగా జిల్లాను అగ్ర స్థానంలో ఉండేటట్టు ఉపాధ్యాయులు కృషి చేయాలని జెడ్పీ చైర్మన్ రాంబాబు అన్నారు. ఏజేసీ డి.మార్కండేయులు మాట్లాడుతూ మెరుగైన సమాజ నిర్మాణం, సమాజంలోని పరిస్థితులను మార్చగలిగే శక్తి ఉపాధ్యాయులకే ఉందన్నారు. ఆర్జేడీ ఎంఆర్ ప్రసన్నకుమార్ మాట్లాడుతూ అత్యున్నత స్థాయికి చేరుకున్న సర్వేపల్లి ప్రత్యేక వ్యక్తిత్వానికి, ఆలోచన ధోరణికి ప్రతీకగా నిలిచారన్నారు. 307 మంది ఐఐఐటీకి ఎంపిక డీఈఓ మాట్లాడుతూ జిల్లాలో ఉన్న 5,600 పాఠశాలల్లో 7.60 లక్షల మంది విద్యార్థులకు సుమారు 20 వేల మంది ఉపాధ్యాయులు విద్యాబోధన చేస్తున్నారని వివరించారు. ఈ ఏడాది టెన్త్ ఉత్తీర్ణతలో రాష్ట్రంలోనే జిల్లా ప్రథమ స్థానం నిలిచేందుకు ఉపాధ్యాయుల కృషే కారణమని అభినందించారు. ఈ ఏడాది జిల్లా నుంచి 307 మంది విద్యార్థులు ఐఐఐటీకి ఎంపికయ్యారని తెలిపారు. రానున్న డీఎస్సీలో 2100 ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేసేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. విశిష్ట అతిథులుగా ఏజేసీ, ఆర్జేడీలతో పాటు, డీవైఈఓలు వెంకటనర్సమ్మ, ఆర్ఎస్ గంగాభవాని, పీఆర్ఓ ఫ్రాన్సిస్ పాల్గొన్నారు. సాంస్కృతిక కార్యక్రమాలు అనంతరం ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికైన 224 మంది ఉపాధ్యాయులను అతిథులు ఘనంగా సత్కరించి, జ్ఞాపికలను అందజేశారు. తొలుత వివిధ పాఠశాలలకు చెందిన విద్యార్థులు అనేక సాంస్కృతిక కార్యక్రమాలతో సభికులను ఆకట్టుకున్నారు. సెయింట్ ఆన్స్ పాఠశాల విద్యార్థులు చేసిన నృత్య రూపకం ఆహూతులను అలరించింది. సంప్రదాయ వేషధారణలో గురువు ఔన్నత్యాన్ని తెలిపే పాటలకు, నృత్యాన్ని జోడించి ప్రదర్శించారు.