breaking news
sarakka
-
కిరాతకంగా చంపి.. ఆపై దహనం చేసి..
వెంకటాపురం(ఎం): చీపురు పుల్లల సేకరణకు వెళ్లిన ఓ మహిళ కానరాని లోకాలకు చేరింది. భూతగాదాల నేపథ్యంలో ప్రత్యర్థులు ఆమెపై దాడి చేసి, హత్యకు పాల్పడ్డారు. అనంతరం అడవిలోనే కాల్చి బూడిద చేశారు. ఈ సంఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లా వెంకటాపురం(ఎం) మండలంలోని పెద్దాపురంలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గ్రామస్తులు, విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. పెద్దాపురం గ్రామానికి చెందిన ఏదుల సారక్క(38)కు గతంలో వివాహం కాగా భర్తకు దూరంగా ఉంటోంది. ప్రస్తుతం తెలంగాణ జాగృతి జిల్లా మహిళా అధ్యక్షురాలిగా పనిచేస్తోంది. రెండేళ్లుగా ఆమె అన్న ఎల్లయ్యతో భూమి విషయంలో వివాదం నెలకొంది. ఈ క్రమంలోనే ఆమె 2017, డిసెంబర్ 30న ఇదే గ్రామానికి చెందిన మచ్చల మల్లమ్మతో కలిసి చీపురు పుల్లలను సేకరించేందుకు ఎర్ర చెరువు సమీపంలోని అటవీ ప్రాంతంలోకి వెళ్లింది. తిరిగి ఇద్దరు కలిసి ఇంటికి తిరిగొస్తుండగా ఎర్రచెరువు సమీపంలో ఆమె అన్న ఎల్లయ్యతోపాటు అతడి కుమారుడు స్వామి అడ్డగించి సారక్కపై కర్రలతో దాడి చేశారు. మల్లమ్మను హెచ్చరించి వదిలేయడంతో భయంతో ఇంటికి చేరుకుంది. అనంతరం స్పృహ కోల్పోయిన సారక్కను వారు ఎడ్లబండ్లపై గట్టమ్మ అటవీ ప్రాంతంలోకి తీసుకెళ్లి అక్కడ కట్టెలు పేర్చి సజీవ దహనం చేశారు. శనివారం అదృశ్యమైన సారక్క కోసం ఆమె సోదరి లక్ష్మి ఆరా తీయగా మల్లమ్మ నుంచి సరైన సమాధానం రాలేదు. దీంతో సోమవారం వరకు వేచి చూసిన ఆమె మంగళవారం ఉదయం స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. దీంతో వెంకటాపురం పోలీసులు రంగంలోకి దిగి గ్రామస్తుల సహకారంతో మల్లమ్మను, నిందితుడిగా భావిస్తున్న ఎల్లయ్యను అదుపులోకి తీసుకొని విచారించగా జరిగిన విషయం వెల్లడించినట్లు తెలిసింది. అనంతరం ఎర్రచెరువు మీదుగా సుమారు 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న గట్టమ్మ అటవీ ప్రాంతంలోకి పోలీసులను తీసుకెళ్లి సారక్కను దహనం చేసిన స్థలాన్ని ఎల్లయ్య చూపించినట్లు గ్రామస్తులు తెలిపారు. తన కుమారుడితో కలిసి సారక్కను హత్య చేసినట్లు ఎల్లయ్య పోలీసుల విచారణలో వెల్లడించినట్లు తెలిసింది. ఈ విషయమై వెంకటాపురం ఎస్సై పోగుల శ్రీకాంత్‌ను వివరణ కోరగా సారక్క బంధువు లక్ష్మి ఇచ్చిన ఫిర్యాదు మేరకు అదృశ్యం కేసు నమోదు చేశామన్నారు. మంగళవారం విచారణ చేపట్టగా పెద్దాపురం అటవీ ప్రాంతంలో సారక్కను చంపి కాల్చివేసినట్లు ప్రాథమికంగా తెలిసిందన్నారు. అయితే నిందితుల వివరాలు పూర్తిగా తెలియాల్సి ఉందన్నారు. -
ఇప్పటినుంచే భక్తులు పోటెత్తుతున్నారు!
వరంగల్: ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతరగా ప్రసిద్ధి చెందిన మేడారం సమ్మక్క సారక్కలను దర్శించుకోవడానికి ఇప్పటినుంచే భక్తులు పోటెత్తుతున్నారు. సమ్మక్క, సారక్క అమ్మవార్లను దర్శించుకోవడానికి ఆదివారం భక్తులు భారీగా తరలివచ్చారు. మరో నెలరోజుల్లో ప్రధాన జతర జరగనున్న నేపథ్యంలో మొక్కులు తీర్చుకోవడానికి ప్రతి ఆదివారం భక్తులు పెద్ద ఎత్తున వస్తున్నారు. ప్రధాన జాతర సమయంలో మొక్కులు తీర్చుకోవడం కష్టతరంగా మారడంతో భక్తులు ఇప్పుటినుంచే పెద్ద ఎత్తున వస్తుండటంతో భారీగా ట్రాఫిక్ జామ్ అవుతోంది. ఆదివారం వాహనాల రద్దీ వల్ల కన్నెపల్లి-కొత్తూరు మధ్య భారీగా ట్రాఫిక్ స్తంభించిపోయింది. దాదాపు మూడు కిలోమీటర్ల మేరా వాహనాలు నిలిచిపోయి.. భక్తులు అవస్థలు పడుతున్నారు. -
మేడారంలో భక్తుల సందడి
వరంగల్ జిల్లా తాడ్వాయి మండలంలో అటవీ ప్రాంతంలో కొలువైన సమ్మక్మ, సారక్క ఆలయం వద్ద ఆదివారం భక్తుల సందడి నెలకొంది. సుమారు 4 వేల మంది భక్తులు ఆలయానికి తరలివచ్చారు. అమ్మవార్లకు మొక్కులు చెల్లించుకున్నారు. గద్దెల వద్ద కుంకుమ పూజలు చేసి మేకలు, కోళ్లను బలి ఇచ్చారు.