breaking news
Santosh Kumar temple
-
Telangana: సంవత్సరాంతంలో రాజకీయ ఒడిదుడుకులు
సాక్షి, హైదరాబాద్: ‘ఈ సంవత్సరం అక్టోబర్, నవంబర్, డిసెంబర్ నెలల్లో రాష్ట్ర రాజకీయాల్లో ఆశ్చర్యకర ఘటనలు చోటుచేసుకుంటాయి. ఈ పరిణామాలు విపరీతమైన రాజకీయ ఒడిదుడుకులకు కారణమవుతాయి. అక్టోబర్ 31కి రాహువు, కేతు గ్రహాలు మారుతున్నందున.. ఈ ప్రభావం రాష్ట్ర రాజకీయాలపై ఉంటుంది’అని శృంగేరీ ఆస్థాన పండితుడు బాచంపల్లి సంతోష్ కుమార్ శాస్త్రి పేర్కొన్నారు. అధికార పక్షంలోని కొందరినుంచి వ్యతిరేకత ఎదుర్కోవాల్సి వస్తుందని, ఈ నేపథ్యంలో అధికారంలోని పెద్దలు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుందని సూచించారు. ఈ ఏడాది బుధుడు రాజుగా ఉన్నందున.. ఈ పరిణామాలను ప్రభుత్వం నిలువరించగలదన్నారు. సప్తమాధిపతి అయిన గురువు అష్ట్టమంలో మౌఢ్య స్థితిలో ఉన్నందున ప్రతిపక్షాలు తమ ఉనికి కోసం బాగా కష్టపడాల్సి వస్తుందని వెల్లడించారు. శోభకృత్ నామ సంవత్సర ఉగాది వేడుకలు బుధవారం ఉదయం రవీంద్రభారతిలో ఘనంగా జరిగాయి. దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి ఆధ్వర్యంలో ప్రభుత్వ పక్షాన ఈ వేడుకలను నిర్వహించారు. కార్యక్రమంలో బాచంపల్లి సంతోష్‌కుమార్ శాస్త్రి పంచాంగాన్ని పఠించారు. కొన్నేళ్లుగా దేశంలో, రాష్ట్రంలో శాంతిభద్రతలు మెరుగ్గా ఉన్నా..సామాజిక అశాంతి నెలకొంటుందని వెల్లడించారు. అశాంతి ఏర్పడ్డా, పోలీసు శాఖ సమర్థంగా ఎదుర్కొంటుందన్నారు. మరిన్ని వివరాలు ఆయన మాటల్లోనే.. ‘గురుడు జలాశయ కారకుడు అయినందున రాష్ట్రంలోని జలాశయాలన్నీ నిండుకుండలుగా మారతాయి. కేంద్ర, రాష్ట్రాలు విద్యారంగంలో కీలక నిర్ణయాలు తీసుకునేందుకు అవకాశం కలుగుతుంది. వర్సిటీల్లోనూ, ప్రభుత్వ ఉద్యోగ నియామకాల్లో కూడా అక్రమాలకు అవకాశం ఉంది. ఉన్నత న్యాయస్థానాలు కీలక తీర్పులు ఇవ్వబోతున్నాయి. వచ్చే మార్చిలో ప్రకృతి ఉపద్రవాలు, మత ఘర్షణలు, సామాజిక అశాంతికర పరిస్థితులు ఉత్పన్నమయ్యే ప్రమాదం ఉంది. బుధుడు భాగ్యమందు మంచి స్థితిలో ఉన్నందున రాష్ట్రంలో సుస్థిర పాలన కొనసాగుతుంది. ధన భాగ్యాధిపతి శుక్రుడు కావటంతో ఆర్థిక రంగం కొంత పురోగమిస్తుంది. కీలక పథకాలను కొనసాగించాలంటే అప్పులు చేయక తప్పని పరిస్థితి. మహిళలు అన్నిరంగాల్లో రాణిస్తారు. విద్య, వైజ్ఞానిక రంగాల్లో పరిశోధనలు సాగుతాయి. ఏప్రిల్, మే నెలల్లో విపరీతమైన ఎండలు కాసే అవకాశం ఉంది. ఆగస్టు, సెప్టెంబర్లలో భారీ వర్షాలు కురుస్తాయి. మంచి పంటలు పండుతాయి. గురు, శుక్ర మౌఢ్యాలు 40 రోజులు మాత్రమే ఉన్నందున రాష్ట్రంలో శుభకార్యాలు విపరీతంగా జరుగుతాయి. పాల ఉత్పత్తి బాగా పెరగనున్నా.. పాలల్లో, ఆహారపదార్థాల్లో కల్తీ సమస్య కూడా పెరుగుతుంది. ఆగస్టు, సెప్టెంబర్‌లో తుపానులు ఏర్పడతాయి. ఏప్రిల్ 22 నుంచి మే 3 వరకు గంగా పుష్కరాలు ఉంటాయి’ అని పేర్కొన్నారు. సీఎం దైవ బలాన్ని సంపాదించుకోవాలి.. ముఖ్యమంత్రి కేసీఆర్‌కు సంబంధించిన కర్కాటక రాశికి ఈ సంవత్సరం మిశ్రమ ఫలితాలే ఉన్నా యని సంతోష్ కుమార్ శాస్త్రి పేర్కొన్నారు. ఆదా యం 11 వ్యయం 8 రాజపూజ్యం 5, అవమానం 4గా ఉంటుందని, రాహువులో రవి దశ ముగిసి చంద్ర దశ నడుస్తోందని, జనవరి 17న అష్టమ శని దోశం ఏర్పడినందున జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుందని వెల్లడించారు. సీఎం దైవ బలాన్ని సంపాదించుకోగలిగితే అవాంతరాలను అధిగమించే వీలుంటుందన్నారు. కాగా, మంచి వానలతో రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందని పంచాంగం సూచించటం పట్ల ఆనందంగా ఉందని మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి పేర్కొన్నారు. కార్యక్రమంలో మంత్రులు మల్లారెడ్డి, తలసాని శ్రీనివాస్‌యాదవ్, పలువురు ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. అనంతరం పండితులను సన్మానించారు. -
కుతూహలం రేపే దేవ రహ్యస్యం
దేవతల గురించి తెలుసుకోవాలని ప్రతి ఒక్కరికీ ఉంటుంది. రాముడు, కృష్ణుడు, గణపతి, శివుడు... వీరంతా ఎవరు, ఎక్కడ ఉంటారు, అసలు ఉన్నారా లేరా, ఉంటే ఆధారాలేమైనా ఉన్నాయా అనే కుతూహలం ఉండని మనిషి ఉండడు. పురాణాల్లోను ఇతిహాసాల్లోనూ ఉండే దేవతలకు ఆధారాలు నేరుగా కనిపించవు. కాని వాటినే చారిత్రక ఆధారాలతో, శాస్త్రీయ దృక్పథంతో పరిశీలించినప్పుడు దేవతల ఉనికికి సంబంధించిన ఆనవాళ్లు కనిపిస్తాయి. ఆ అద్భుత శక్తులు మన కంటికి కనిపించకపోయినా ఇక్కడే ఎక్కడో నడయాడుతూనే ఉన్నాయి అనిపిస్తుంది. ‘దేవ రహస్యం’ పుస్తకంలో కోవెల సంతోష్ కుమార్ తన పరిశోధనలతో, ఇతరులు చేసిన పరిశోధనల ఆధారంతో అన్నింటికి మించి జ్ఞానంతో కాకుండా ఇంగితజ్ఞానంతో దేవతల సంభావ్యతనూ, వారి ఆకారాలూ వాహనాలూ నివాసాల వెనక ఉన్న సంకేతాల అర్థాలను, ఇతిహాసాలను రూఢీ పరిచే అనేక ఆసక్తికరమైన అంశాలను సామాన్య పాఠకునికి అర్థమయ్యే భాషలో చెప్పే ప్రయత్నం చేస్తారు. ఉదాహరణకు శివుడి మూడో కన్నుకు మన మెదడులో ఉండే ఒక ప్రత్యేకమైన గ్రంధిని సంకేతంగా చూపుతూ సంతోష్ చేసిన వాదన ఆలోచింప చేస్తుంది. మహాభారత యుద్ధంలో అణ్వస్త్రాల ప్రయోగం జరిగింది అనీ, ఆ రోజులలో ఆ యుద్ధంలో 36 లక్షల మంది చనిపోయారని ఆయన వివరిస్తారు. రావణుడు పెద్ద ఇంజనీరు అనీ ఆ రోజులలో లంకలో అతడికి నాలుగు విమానాశ్రయాలు ఉన్నాయనీ అందుకు ఆధారంగా నేటికీ ఆ విమానాశ్రయ మైదానాలు కనిపిస్తాయని అంటారాయన. పుష్పక విమానం ఒక మిత్ కాదని నిజంగానే ఆ విమానం ఉండేదని చెప్తారు. విఘ్నేశ్వరుడు వ్యవసాయానికి సంబంధించిన దేవుడని నిరూపించే ఆయన వాదనతో దాదాపుగా ఏకీభవిస్తాం. శివుడి గురించి రాసిన వ్యాసాలు తప్పక పరిశీలించదగ్గవి. దేవతలను వాస్తవిక దృష్టితో పరిశీలిం చాలనుకునేవారు ఈ పుస్తకం చదివితే కొత్త ఆలోచనలు వచ్చే అవకాశం తప్పనిసరిగా ఉంది. సంతోష్ ఈ కృషిని కొనసాగించాలి. దేవ రహస్యం- కోవెల సంతోష్ కుమార్ వెల: రూ.150 ప్రతులకు: 9052116463