breaking news
sankaranti
-
సంక్రాంతి సంబరాల్లో ఆకర్షణగా గుర్రపు స్వారీలు..
సాక్షి. విజయవాడ: జిల్లాలోని అంపాపురంలో యార్లగడ్డ యూత్ ఆధ్వర్యంలో మన ఊరు-మన సంక్రాంతి పేరుతో పండుగ సంబరాలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నృత్యాలు, కోలాటాలు, ముగ్గుల పోటీలతో పాటు గ్రామీణ క్రీడలు, గుర్రపు బండ్ల స్వారీ పోటీలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. అదేవిధంగా యజమాని పరువు నిలిపేందుకు కదనరంగంలో కాలుదువ్విన కోడిపందాలు ఉత్కంఠభరితంగా సాగాయి. అనంతరం పోటీలో గెలిచిన వారికి నిర్వాహకులు బహుమతులను అందజేశారు. ఈ సాంప్రదాయ సక్రాంతి పండుగ సంబరాలను తిలకించేందుకు వివిధ ప్రాంతాల నుంచి జనం తరలివచ్చారు. కృష్ణా: జిల్లాలోని గన్నవరంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అనుచరుల ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు కనులపండుగగా జరిగాయి. పౌరుషానికి ప్రతీకగా సాగిన కోడిపందాలు ఆకర్షణగా నిలిచాయి. కోడిపందాలను తిలకించేందుకు మహిళలు ఎంతో ఆసక్తిని కనబరచగా.. వివిధ జిల్లాల నుంచి పందెం ప్రియులు తరలివచ్చారు. ఉత్కంఠభరితంగా సాగిన కాక్ ఫైట్‌ను తిలకించడానికి రైతులు ఉత్సాహాన్ని చూపారు. ఈ కార్యక్రమంలో రైతులు పాల్గొనడంతో సంక్రాంతి సంబరాలకు కొత్త కళ వచ్చిందని నిర్వాహకులు హర్షం వ్యక్తం చేశారు. తూర్పుగోదావరి: జిల్లాలోని అయినవిల్లి, అంబాజీపేట, మామిడికుదురు, గన్నవరం నియోజకవర్గంలో కోడింపందాలు, గుండాటలు జోరు సాగాయి. ఈ క్రమంలో కోడిపందాళ్లలో పోలీసుల ఆంక్షల్ని పందెం రాయుళ్లు బేఖాతరు చేశారు. -
సంక్రాంతి సెలవులపై సందిగ్ధత
గుంటూరు ఎడ్యుకేషన్, న్యూస్‌లైన్: ప్రభుత్వ పాఠశాలలకు సంక్రాంతి పండుగ సెలవులపై సందిగ్ధత నెలకొంది. ప్రభుత్వ అకడమిక్ కేలండర్ ప్రకారం ఏటా ఇస్తున్న విధంగానే ఈసారి 10 రోజులు సెలవులుగా పరిగణించాలని ఉపాధ్యాయ సంఘాలు డిమాండ్ చేస్తుండగా, ప్రభుత్వం ఇందుకు భిన్నంగా ఉత్తర్వులు జారీ చేసింది. సమైక్యాంధ్ర ఉద్యమ ప్రభావంతో పాఠశాలలు మూతబడిన కారణంగా సెలవుదినాలు, ఆదివారాల్లోనూ పాఠశాలలను నిర్వహిస్తున్న నేపథ్యంలో సంక్రాంతికి మూడురోజుల సెలవులు మంజూరు చేస్తూ పాఠశాల విద్యాశాఖ డెరైక్టరేట్ మంగళవారం జారీ చేసిన ఉత్తర్వులే ఇందుకు నిదర్శనం. సమైక్యాంధ్ర ఉద్యమం సీమాంధ్రలోని 13 జిల్లాల్లో ఒక్కో జిల్లాలో ఒక్కో విధంగా పాఠశాలలు మూతబడగా, జిల్లాలో 50 రోజుల పాటు పాఠశాలలు తెరుచుకోలేదు. సెలవు లు పోనూ జిల్లాలో నికరంగా 33 పనిదినాల నష్టం జరిగింది. తెలంగాణా ప్రాంతంలోని పాఠశాలలకు ఈనెల 9వ తేదీ నుంచి 18వ తేదీ వరకూ సెలవులివ్వగా, సీమాంధ్రలో మాత్రం ఈనెల 13, 14, 15 తేదీల్లో సెలవులుగా పరిగణించాలని ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. ఉద్యమ సమయంలో జిల్లాలో సమ్మెలోకి వెళ్లని ఉపాధ్యాయులు దీనిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పుబడుతున్నారు. దీనిపై జిల్లా విద్యాశాఖాధికారి దొంతు ఆంజనేయులును ‘న్యూస్‌లైన్’ వివరణ కోరగా పాఠశాల విద్య డెరైక్టరేట్ ఇచ్చిన ఉత్తర్వుల ప్రకారమే జిల్లాలోని పాఠశాలలకు సంక్రాంతి సెలవులుగా పరిగణిస్తామని, దీనిపై ఎటువంటి సందేహాలకు తావులేదని స్పష్టం చేశారు.