breaking news
sangareddy mandal
-
ఉద్యమంలా హరితహారం చేపట్టాలి
సంగారెడ్డి రూరల్: మానవ మనుగడకు చెట్లు ఎంతో అవసరమని స్థానిక ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ అన్నారు. ప్రభుత్వం చేపట్టిన హరితహారం కార్యక్రమాన్ని ఉద్యమంలా చేపట్టి ప్రతి ఒక్కరు మొక్కలు నాటాలన్నారు. మంగళవారం సంగారెడ్డి మండలం చింతలపల్లి గ్రామంలో నిర్వహించిన హరితహారం కార్యక్రమానికి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గ్రామానికి 40 వేల మొక్కలు తప్పకుండా నాటేలా ప్రణాళిక రూపొందించుకుని అమలు చేయాలన్నారు. మొక్కలు నాటడమే కాకుండా వాటి సంరక్షణకు అవసరైమన చర్యలు తీసుకోవాలని సూచించారు. ఉపాధి హామీ పథకం కూలీలతో నాటిన మొక్కలకు కంచె ఏర్పాటు చేసేలా చూడాలన్నారు. వాతావరణ కాలుష్యంతో మానవ మనుగడకు ప్రమాదం ఏర్పడిన నేపథ్యంలో ప్రాణవాయువును ఇచ్చే చెట్టు ఎంతో అవసరమని తెలిపారు. దీనిని గుర్తించుకుని ప్రతి ఒక్కరు మొక్కలు నాటాలని కోరారు. రోజురోజుకు అటవీప్రాంతాలు తగ్గుముఖం పట్టడం వల్ల వాతావరణ సమత్యులత దెబ్బతింటుందన్నారు. అలాగే వర్షాలు సకాలంలో కురవటంలేదని చెప్పారు. చెట్టు అధికంగా ఉంటే వర్షాలు సమృద్దిగా కురవటంతోపాటు వాతావరణం చల్లగా ఉంటుందన్నారు. రహదారులకు ఇరువైపులా మొక్కలు నాటాలన్నారు. అలాగే గ్రామంలోని ప్రభుత్వ భూములు, దేవాలయ భూములు, ప్రభుత్వ పాఠశాలల్లో విరివిగా మొక్కలు నాటాలని సూచించారు. ప్రభుత్వం హరితహారం కార్యక్రమానికి అధిక ప్రాధాన్యత ఇస్తుందని ప్రజాప్రతినిధులతోపాటు అధికారులు, ఉద్యోగులు సైతం హరితహారం అమలుపై ప్రత్యేక శ్రద్ద చూపాలన్నారు. హరితహారంలో భాగంగా ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ విద్యార్థులతో కలిసి గ్రామంలోని రోడ్డుకు ఇరువైపులా మొక్కలు నాటించారు. నాటిన మొక్కలను కాపాడతామని విద్యార్థులతో ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ మనోహర్‌గౌడ్, మార్కెట్ కమిటీ చైర్మన్ కొండల్‌రెడ్డి, సర్పంచ్ పావని వెంకటేశ్, టీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు చిల్వెరి ప్రభాకర్, ఎంపీడీఓ సంథ్య, ఎంపీఓ ప్రవీణ్‌కుమార్, టీఆర్ఎస్ నాయకులు ఎం.ఎ.హకీం, మైనార్టీ సంక్షేమశాఖ అధికారి యూసుఫ్ అలీ తదితరులు పాల్గొన్నారు. -
వేధింపులు తాళలేక..వివాహిత ఆత్మహత్య
సంగారెడ్డి మండలం కర్దనూరు గ్రామానికి చెందిన జుట్టు సునీత (25)కు నాలుగేళ్ల క్రితం జిన్నారం మండలం దోమడుగుకు చెందిన పాండుతో వివాహం జరిగింది. వీరికి మూడేళ్ల బాబు ఉన్నాడు. అయితే ఏడాదిగా పాండు అదనపు కట్నం కోసం సునీతను వేధిస్తున్నాడు. అంతే కాకుండా గుమ్మడిదలకు చెందిన ఓ మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. ఈ విషయమై సునీత తరచూ పాండును అడ్డుకునే ప్రయత్నాలు చేసింది. అయినా అతను వినలేదు. పాండు వివాహేతర సంబంధం విషయం సునీతకు తెలియడంతో అదనపు కట్నం తీసుకురావాలని వేధించసాగాడు. దీనిపై శనివారం రాత్రి ఇద్దరి మధ్య గొడవ జరిగింది. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన సునీత ఆదివారం తెల్లవారుజామున ఇంట్లోని కిరోసిన్‌ను ఒంటిపై పోసుకుని నిప్పంటించుకుంది. సునీతను కాపాడేందుకు భర్త, చుట్టు పక్కల వారు చేసిన ప్రయత్నాలేవీ ఫలించలేదు. కాలిన గాయాలతో సునీత అక్కడికక్కడే మృతి చెందింది. ఈ విషం తెలుసుకున్న మృతురాలి బంధువులు గ్రామానికి చేరుకున్నారు. సునీత మృతికి కారణమైన పండుపై స్థానికులు మండిపడ్డారు. సంఘటనకు కారణమైన వారిని కఠినంగా శిక్షిస్తామని ఎస్ఐ హామీ ఇవ్వడంతో ఆందోళనకారులు శాంతించారు. మృతురాలి తమ్ముడు ఎల్లయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నామని ఎస్ఐ లాలూనాయక్ తెలిపారు. అదనపు కట్నం కోసం వేధిస్తున్న పాండుతో పాటు అతని తమ్ముడు కూడా పోలీసులు అదుపులో ఉన్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నర్సాపూర్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ సంఘటన దోమడుగులో సంచలనం రేపింది. మృతురాలి బంధువులు, తల్లిదండ్రుల రోదనలతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.