breaking news
Salt dealers
-
తళుకులు కోల్పోతున్న ‘తెల్లబంగారం’
తెల్లబంగారం ఉప్పు ఉత్పత్తిలో ఓ వెలుగు వెలిగిన గోపాలపురం ప్రస్తుతం గత వైభవానికి చిహ్నంగా మిగిలిపోయి కుమిలిపోతోంది. తెల్లదొరల కాలం నుంచి ఉప్పు ఉత్పత్తికి, రవాణా అనుమతులకు కేంద్ర కార్యాలయంగా భాసిల్లిన ఆ పల్లె ఇప్పుడు బతుకుతెరువు కోల్పోయి గోడుమంటోంది. వేలాది మందికి ఉపాధి కల్పించిన ఆ ఊరు ప్రస్తుతం అటు ఉపాధి లేక.. ఇటు భూములు పనికి రాక దారిద్య్రాన్ని అనుభవిస్తోంది. ఆదుకోవాల్సిన ప్రభుత్వం ప్రత్యామ్నాయం చూపించక ముఖం చాటేసింది. కనీసం భూములు సేకరించి పరిహారం ఇస్తారనుకుంటే ఆ ప్రతిపాదనలు ముందుకు కదలించలేదు. ముత్తుకూరు: జిల్లాలోని ముత్తుకూరు మండలంలో తెల్లదొరల పాలనా వైభవానికి, సాధారణ ఉప్పు తయారీ ప్రాభవానికి కేంద్రంగా ఉన్న గోపాలపురంలో సాల్ట్ ఫ్యాక్టరీ దాదాపు మూతపడింది. ఉప్పు ఉత్పత్తి, అమ్మకాలు, రవాణాతో కళకళలాడిన ఆ గ్రామం ప్రగతికి దూరమై బోసిపోయింది. ఉప్పు ఉత్పత్తి లేక లైసెన్సీదారులు చెట్టుకొకరుగా చెదిరిపోయారు. ఊరినే నమ్ముకొన్న లైసెన్సీ సాగుదారులు దారిద్య్ర భారంతో కొట్టుమిట్టాడుతున్నారు. భూములు తీసుకుని పరిహారం ఇస్తారని ఏళ్ల తరబడి నిరీక్షిస్తున్నారు. పరిహారం కళ్ల చూడకుండానే కొందరు కాలం చేస్తున్నారు. సంప్రదాయ పద్ధతిలో సాధారణ ఉప్పు ఉత్పత్తికి గోపాలపురం పెట్టింది పేరు. 1870లోనే తెల్లదొరల పాలనలో ఇక్కడ ఉప్పు తెల్లబంగారంగా రైతులను ఆదుకుంది. కేంద్ర ప్రభుత్వం అధీనంలోని 770 ఎకరాల్లో ఏటా 20 వేల టన్నుల ఉప్పు ఉత్పత్తి జరిగింది. లీజు పద్ధతిలో 110 మంది లైసెన్సీదారులు తరతరాలుగా ఇక్కడ ఉప్పు ఉత్పత్తి చేసి, పడవలు, లారీలు, ఎద్దుల బండ్ల ద్వారా అమ్మకాలు, రవాణా జరిపారు. గోపాలపురం సాల్ట్ ఫ్యాక్టరీ పరిధిలో ఉప్పు ఉత్పత్తి ద్వారా 2,000 మందికి పైగా కార్మికులు ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి పొందారు. కరిగిపోయిన ఉప్పు వైభవం సముద్రనీటితో నేరుగా ఉప్పు తయారు చేసి, శుద్ధి చేసే ఫ్యాక్టరీలు నిర్మితం కావడంతో సంప్రదాయ సేద్యం ద్వారా ఉత్పత్తి చేసే ఉప్పునకు మార్కెట్లో డిమాండ్ తగ్గిపోవడం మొదలైంది. జిల్లాకే తలమానికంగా ఏర్పడిన కృష్ణపట్నంపోర్టులో ఐరన్‌ఓర్, బొగ్గు ఎగుమతి, దిగుమతులు ఉప్పు ఉత్పత్తికి శాపంగా మారాయి. పోర్టు నుంచి ఎగసిపడే దుమ్ము, ధూళి సాధారణ ఉప్పు ఉత్పత్తి, నాణ్యతను దెబ్బతీశాయి. కయ్యలను కలుషితం చేశాయి. క్రమంగా ఉత్పత్తి, ధరలు పడిపోయి, సాగు విస్తీర్ణం తరిగిపోయింది. 2009తో మొదలై 2012 నాటికి ఉత్పత్తి పూర్తిగా నిలిచిపోయింది. పోర్టు విస్తరణకు ఉప్పు భూములు కృష్ణపట్నంపోర్టు విస్తరణకు ఉప్పు భూములు సేకరించే ప్రతిపాదన వెలుగులోకి వచ్చింది. లైసెన్సీదారులకు పరిహారం ఇచ్చి, భూములు సేకరిస్తారన్న ప్రచారం మొదలైంది. ఈ క్రమంలో లైసెన్సీలు రద్దయ్యాయి. కయ్యలు బీడు పడ్డాయి. ముళ్ల చెట్లతో సాల్ట్ భూములు అడవుల్లా మారాయి. నిల్వ చేసిన ఉప్పు కుప్పలు మట్టిపాలయ్యాయి. నలుగురు జిల్లా కలెక్టర్లు ఇక్కడి పరిస్థితిని పరిశీలించి వెళ్లారు. గోపాలపురం సాల్ట్ కార్యాలయం శిథిలమై, కూలిపోయే దశకు చేరింది. ఒకే ఒక్కడు ఈ కార్యాలయాన్ని సంరక్షిస్తున్నాడు. రెండు సార్లు సీఎంను కలిశారు రాష్ట్ర ప్రభుత్వం, జిల్లా కలెక్టర్, కృష్ణపట్నంపోర్టు చుట్టూ భూముల పరిహారం ఫైళ్లు అనేక మార్లు ప్రయాణం చేశాయి. ఎకరాకు రూ.15 లక్షల పరిహారం నిర్ణయిస్తూ టీడీపీ ప్రభుత్వం 2015 డిసెంబరు 2వ తేదీన ఉత్తర్వులు జారీ చేసింది. పరిహారం మొత్తం జిల్లా కలెక్టర్ ఖాతాకు జమ చేయాలని పోర్టును సూచించింది. లైసెన్సీదారుల కష్టాలు ఇక్కడ నుంచి మొదలయ్యాయి. పోర్టు నిర్వాహకులు, ఉన్నతాధికారులు, అధికార పార్టీ నాయకుల చుట్టూ కాళ్ల చెప్పులు అరిగిపోయేలా తిరిగారు. మంత్రి సోమిరెడ్డి ద్వారా సాల్ట్ లైసెన్సీలు ప్రత్యేక వాహనాల్లో వెళ్లి రెండు సార్లు సీఎం చంద్రబాబును కలిసి, తమ గోడు వెళ్లబోసుకొన్నారు. పరిహారం చెల్లిస్తామని హామీ ఇవ్వకపోవడంతో లైసెన్సీలు నీరసించిపోయారు. సంపాదనకు దూరమై దారిద్య్రంలో మునిగిపోయారు. ఉప్పు వైభవం ముగిసిపోవడంతో గోపాలపురం కూడా అభివృద్ధికి దూరమై, కళావిహీనమైంది. 14 మంది లైసెన్సీదారులు కాలం చేశారు ఉప్పు ఉత్పత్తిలో పేరుపడిన 14 మంది లైసెన్సీలు తమ భూముల పరిహారం కళ్ల చూడకుండానే కాలం చేశారు. వీరిలో వాడా వేణుగోపాలరెడ్డి, వాడా వెంకటశేషమ్మ, ఈదూరు రామచంద్రారెడ్డి, కలిసెట్టి దామోదరం, బండి శ్రీనివాసులు, ఆలపాక వీరమ్మ, నరహరి సత్యనారాయణ, మోహనరావు, అనిసెట్టి శేషమ్మ, సిద్ధవరపు భాస్కర్‌రెడ్డి, కరణం రాధయ్య, గాలి దామోదరం, మారుబోయిన బాలకోటయ్య, రమణయ్య పరిహారం దక్కకుండానే గతించిపోయారు. తిరిగి తిరిగి అలిసిపోయాం – చేవూరు కృష్ణయ్య, లైసెన్స్‌దారుడు 4 ఎకరాల్లో ఉప్పు సాగు చేశాను. సాగు నిలిచిపోవడంతో దిక్కుతోచని స్థితికి గురయ్యాము. పరిహారం కోసం కాళ్లు అరిగిపోయేలా తిరిగాము. అటు నాయకులు, ఇటు అధికారులు సాయం చేయకపోవడంతో దిక్కుతోచక నీరసించిపోయాము. ఉప్పు తప్ప మరో వ్యాపకం లేదు – కలిచేటి సుబ్బారావు, లైసెన్స్‌దారుడు 3 ఎకరాల్లో ఉప్పు సాగును మాత్రమే నమ్ముకొని జీవనం సాగించాము. సాగుకు దూరమై, పరిహారం దక్కని దుస్థితి వస్తుందని కలలో కూడా ఊహించనేలేదు. చాలా మంది లైసెన్సీలు దివంగతులయ్యారు. అయినప్పటికీ పరిహారం మాత్రం దక్కలేదు. దారిద్య్రంతో కొట్టుమిట్టాడుతున్నా – కలిచేటి చంద్రశేఖర్, లైసెన్స్‌దారుడు నేను గతంలో 10 ఎకరాలు ఉప్పు సాగు చేసే వాడిని. ప్రస్తుతం ఉప్పు సాగు జరగడం లేదు. భూముల పరిహారం పంపిణీ చేయాలంటూ ప్రభుత్వం మూడేళ్ల క్రితమే ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటి వరకు అందలేదు. లైసెన్సీదారులు చాలా మంది దారిద్య్రంతో కొట్టుమిట్టాడుతున్నారు. పరిహారం చెల్లించకపోగా ఉప్పు భూముల్లో నిర్మాణాలు చేస్తున్నారు. -
ఉప్పు దుకాణాలపై తనిఖీలు
నెల్లూరు(పొగతోట): ఇతర జిల్లాల్లో ఉప్పు కొరత ఉండడంతో జిల్లాలోని వ్యాపారులు కృత్రిమ కొరత సృష్టించి ఉప్పును అధిక ధరలకు విక్రయిస్తున్నారు. కలెక్టర్ ఆర్.ముత్యాలరాజు, జాయింట్ కలెక్టర్ ఇంతియాజ్ ఉప్పు ధరలు, నిల్వలపై ప్రత్యేక దృష్టి సారించారు. జిల్లాలో హోల్‌సేల్ వ్యాపారుల వద్ద ఉన్న ఉప్పు నిల్వలు, విక్రయాలు, ధరలు తదితర వివరాలు సేకరించాలని సివిల్ సప్లై అధికారులను ఆదేశించారు. కలెక్టర్, జేసీ ఆదేశాలతో జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారులు నగరంలోని ఉప్పు హోల్‌సేల్ దుకాణాల్లో తనిఖీలు నిర్వహించారు. తనిఖీల్లో ఏఎస్ఓ చాల్లా లక్ష్మినారాయణరెడ్డి, సీఎస్డీటీలు రవి, యువరాజ్, శేఖర్‌బాబు పాల్గొన్నారు.