breaking news
saduddin Owaisi
-
అసదుద్దీన్‌కు ఐఎస్ బెదిరింపులు
సాక్షి, హైదరాబాద్: ‘‘నీవు భారతదేశ ముస్లింలను అవమానిస్తున్నావు. ఇస్లామిక్ రాజ్యాన్ని వ్యతిరేకించే నీకు నరకమే ప్రాప్తిస్తుంది. ప్రజాస్వామ వ్యవస్థ ముస్లింలకు వ్యతిరేకం. దానిని అమలు చేయకుండా నిషేధించాలి.. లేదా అంతం చేయాలి. షరియా ప్రకారం ముస్లింలందరూ ఒక్కటే. ముస్లింలు మీలాగా జాతీయవాదులు కారు. మీలాంటి వ్యక్తులే ముస్లింలను విభజించి చూస్తున్నారు. ఇస్లామిక్ రాజ్యానికి వ్యతిరేకంగా నోరు మెదపడం మానుకోవాలి’’ ఇదీ ట్విట్టర్లో మజ్లిస్ అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీకి ఇస్లామిక్ స్టేట్(ఐఎస్ఐఎస్) ఉగ్రవాదుల నుంచి వచ్చిన హెచ్చరిక. ఐఎస్ సానుభూతిపరుడు అబోతాలోత్ ట్విట్టర్ ఖాతా నుంచి అసదుద్దీన్‌కు ఈ బెదిరింపు వచ్చింది. దీనికి అసదుద్దీన్ తీవ్రంగానే స్పందించారు. ‘‘మీరు ముస్లిం వ్యతిరేకులు. రాక్షసంగా వ్యవహరిస్తున్నారు. ఐఎస్‌పై చర్చకు సిద్ధం. నేను లేవనెత్తిన ప్రశ్నలకు మీరు సమాధానం చెప్పలేరు’’ అంటూ రీట్వీట్ చేశారు. ఐఎస్ ఓ దెయ్యం సైన్యం: అసద్ ఐఎస్ఐఎస్ దెయ్యం సైన్యమని అసదుద్దీన్ అభివర్ణించారు. గురువారం పార్టీ కేంద్ర కార్యాలయమైన దారుస్సలాంలో విలేకరులతో మాట్లాడుతూ.. ఐఎస్ ట్విట్టర్ బెదిరింపులపై ఆయన స్పందించారు. స్వర్గం, నరకం దేవుడి చేతిలో ఉంటాయని, బెదిరింపులకు భయపడేది లేదన్నారు. ఐఎస్‌కు ఇస్లాంతో సంబంధం లేదని స్పష్టం చేశారు. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా ఇస్లామిక్ స్కాలర్స్ ఐఎస్‌కు వ్యతిరేకంగా ఫత్వా జారీ చేసి, వారి కార్యకలాపాలను ఖండించిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు. ఐఎస్ ఉగ్రవాదులు సుమారు 1.5 లక్షల మందిని హతమార్చారని, వారి ఆలోచనావిధానం మారాలని చెప్పారు. ఎక్కడో ఎలుక మాదిరిగా దాక్కొని బెదిరించడం సరికాదని సూచించారు. భారతదేశంవైపు కన్నెస్తే సహించేది లేదని ఐఎస్‌ను హెచ్చరించారు. రాజకీయపరంగా విభేదాలున్నా.. దేశం కోసం అందరూ ఏకమై సరైన గుణపాఠం చెప్పడం ఖాయమన్నారు. ఇక్కడి ముస్లింలు కరడుగట్టిన భారతీయులని, మాతృదేశం కోసం ప్రాణాలివ్వడానికి కూడా వారు సిద్ధంగా ఉంటారని చెప్పారు. -
మూడు పత్రికలపై ఒవైసీ ప్రైవేటు కేసు
హైదరాబాద్: తనకు వ్యతిరేకంగా దుష్ర్పచారం చేస్తున్న ప్రతికా సంస్థలపై హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ చట్ట పరమైన చర్యలను కోరుతూ న్యాయ స్థానాన్ని ఆశ్రయించారు. తన పరువుకు భంగం కలిగించేలా కథనాలు ప్రచురిస్తున్న ఆ మూడు సంస్థలపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని కోరుతూ సోమవారం నాంపల్లి కోర్టులో ప్రైవేటు ఫిర్యాదు దాఖలు చేశారు. పాకిస్థాన్‌పై భారత్ యుద్ధాన్ని ప్రకటిస్తే 25 లక్షల మంది ముస్లింలు పాక్ సైన్యంలో కలుస్తారని తాను వ్యాఖ్యానించినట్లు ఆ పత్రికలు తప్పుడు కథనాన్ని ప్రచురించాయుని ఆయన ఆరోపించారు. ‘కాశ్మీర్ అబ్జర్వర్’ ఎడిటర్ ఇన్ చీఫ్ సజ్జద్ హైదర్, బెంగళూరుకు చెందిన గ్రీనియం ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఎండీ బీజీ మహేశ్, ‘వన్ ఇండియా’ ఆన్లైన్ పోర్టల్, ముంబైకి చెందిన ‘సామ్నా’ పత్రిక అసోసియేట్ ఎడిటర్ ప్రేంశుక్లా తదితరులపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని కోరారు.